Pages

Thursday, July 19, 2012

బీర్బల్ కథలు : మణిహారం దొంగ

అక్బర్ చక్రవర్తికి ఒక రోజు ఉన్నట్టుండి... బీర్బల్‌ను ఏడిపించాలని ఓ సరదా ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించిన ఆయన తన మెడలోని హారాన్ని ఒకదాన్ని తీసి చేతబట్టుకుని, తన సేవకుడిని పిలిచి దాచిపెట్టమని చెప్పాడు. రాజాజ్ఞను శిరసావహించిన ఆ సేవకుడు హారాన్ని తీసుకుని దాచిపెట్టాడు.

ఈ విషయాలేమీ తెలియని బీర్బల్ ఎప్పట్లాగే ఆరోజు కూడా సభకు విచ్చేశాడు. బీర్బల్‌ను చూసిన రాజు తాను వేసిన పథకాన్ని గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాడు. అంతేగాకుండా... బీర్బల్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడోనన్న కుతూహలం కూడా ఆయన కలిగింది.

బీర్బల్‌తో అక్బర్ ఇలా అన్నాడు. "బీర్బల్ ఈ రోజు నామనసు ఏమి బాగాలేదు." అన్నాడు. ఈ మాట విన్న బీర్బల్ కంగారుతో.. చెప్పండి మహాప్రభూ.. ఏమైంది? మీ మనస్సు ఎందుకు బాగుండటం లేదు? అని అడిగాడు. ఏం లేదు బీర్బల్...! మహారాణి ప్రేమగా బహూకరించిన నా మణిహారాన్ని ఎవరో తస్కరించారు అని చెప్పాడు మహారాజు.

"స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడైనా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!" అని అన్నాడు బీర్బల్. స్నానానికి వెళుతూ హారం తీసి పక్కన పెట్టాను. తిరిగి వచ్చి చూస్తే, హారం మాయమైపోయింది... అంటూ చెప్పసాగాడు రాజు. మహారాజు చెబుతున్నదంతా మౌనంగా విన్నాడు బీర్బల్.



అంతా విన్న బీర్బల్... "ఆ హారం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ హారం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. "మహారాజా! మీకు ఎవరి మీదనైన అనుమానం ఉంటే చెప్పండి" అని అడిగాడు. లేదు బీర్బల్! నాకు ఎవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు అన్నాడు రాజు. సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెబుతూ ఉండే బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత మహారాజు ఇలా అన్నాడు.. "బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది... నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి ఆ హారం దొంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి" అని అన్నాడు. రాజు చెప్పిన దానికి బీర్బల్ ఒప్పుకుంటూ... మహారాజా మీరు స్నానానికి వెళుతూ హారం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు. వెంటనే చక్రవర్తి ఓ అల్మరా వద్దకు తీసుకెళ్లి ఇక్కడే పెట్టానని చెప్పాడు.

అల్మరా వద్దకు వెళ్ళిన బీర్బల్... "ఆహా...! అలాగా...! సరి సరే....!!" అని అన్నాడు. దీంతో బీర్బల్ ఏం చేస్తున్నాడో అక్కడున్న వారందరికీ అర్థం కాలేదు. అల్మరానే ఆయనకు ఏదో చెబుతోంది అన్నట్లుగా ఆశ్చర్యపోయి చూస్తుంటారు వాళ్ళు. వెంటనే బీర్బల్ మహారాజా హారం దొంగెవరో దొరికిపోయాడు అన్నాడు. రాజు హారాన్నే దొంగిలించే ధైర్యం ఎవరికుంది? ఎవరు వాడు చెప్ప బీర్బల్...! అన్నాడు అక్బర్.

ప్రభూ...! ఈ అల్మారా ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు స్నానం చేసి త్వరగా వచ్చేస్తారోనన్న కంగారుతో ఉన్న దొంగ గడ్డం అల్మరాలో ఇరుక్కుపోయిందట! అని చెప్పాడు. కావాలంటే మీరు అల్మరా తెరిపించండి... తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి. అన్నాడు.



దీంతో రాజు ఎవరికైతే తన ఉంగరాన్ని దాచి పెట్టమని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే బీర్బల్ దొంగను పట్టుకుని, మహారాజా ఇతడే దొంగ అని చూపించాడు. పట్టుబడ్డ రాజు సేవకుడు భయంతో వణుకుతూ అక్బర్ వద్దకు వెళ్ళగా... ఆయన జరిగిందంతా బీర్బల్‌కు వివరించాడు. దీంతో బీర్బల్ శాంతించి, నవ్వుకున్నాడు.

అయితే సభలో ఉన్న వారందరితో సహా మహారాజుకు కూడా.. అసలు బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో ఎవ్వరికీ అర్ధంకాలేదు. అదే విషయం బీర్బల్‌ను అడిగాడు. అప్పుడు అసలు విషయం వివరించాడు బీర్బల్. మరేం లేదు మహారాజా..! మీరు అల్మరాలో హారం పెట్టానని చెప్పారు. మీరు చెప్పింది నిజమే అనుకున్నాను నేను.

అంతేగాకుండా మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకో ఉపాయం తోచింది. అల్మరా దగ్గరికెళ్ళి చెవి ఆనించి ఏదో విన్నట్టుగానే నటించాను. దొంగ గడ్డం అల్మరాలో చిక్కుకుపోయిందని కల్పించి చెప్పాను. నేను అలా చెప్తే నిజంగా హారం దొంగిలించిన దొంగ గడ్డం సవరించుకుంటాడని అనుకున్నాను.

అనుకున్నట్టుగానే ఆ సేవకుడు మీరు దాచిపెట్టమని చెప్పిన విషయాన్ని మర్చిపోయి గడ్డం సవరించుకున్నాడు. అంతే దొంగ దొరికిపోయాడు అని చెప్పాడు బీర్బల్. బీర్బల్ తెలివితేటలను రాజు, ప్రజానీకం మెచ్చుకుని ప్రశంసలు, పొగడ్తలతో ముంచెత్తారు.

రెండు గింజల కథ..!

పొలం గట్టుపైన ఉన్న చెట్లలోంచి రెండు గింజలు కిందపడి దొర్లుకుంటూ పొలంలోకి వచ్చాయి. భూమి పొరల్లో దాక్కున్నాయి. మరికొన్ని రోజులకు చినుకులు పడటంతో గింజల్లో కదలిక వచ్చింది. అప్పుడు ఒకదానితో ఒకటి మాట్లాడుతూ... "మనం ఇంకా ఈ భూమిలో దాక్కోవడంలో అర్థం లేదు. మొలకెత్తి, మొక్కలుగా, వృక్షాలుగా మారి మన బాధ్యతలను నిర్వర్తించాలి" అని చెప్పింది మొదటి గింజ.

"నీకెందుకు అంత తొందర. మొలకెత్తినప్పట్నించీ మనకు అన్నీ కష్టాలే కదా. చిగుర్లు వేసినప్పటినుంచీ కష్టాల పరంపర మొదలవుతుంది" అని వాపోయింది రెండో గింజ. ఇంకా... చిగుర్లెత్తగానే పశువులు తినేస్తాయని భయం, పెద్దయ్యేదాకా అదే బాధ, పండ్లు కాస్తే ఫర్వాలేదుగానీ, లేకపోతే నరికి పారేస్తారు. ఆ గుండెకోతను నేను భరించలేనంటూ చెప్పుకుపోయింది.

కాబట్టి... ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే మనం భూమిలోనే ఉండిపోతే మంచిది. లేకపోతే కష్టాలు తప్పవని చెప్పింది రెండో గింజ. అయితే... వీటన్నింటినీ ఓపిగ్గా విన్న మొదటి గింజ విత్తనాలుగా మొలకెత్తడం మన బాధ్యత. మనదగ్గరకు వచ్చి సేదతీరే వారికి చల్లని నీడను, పండ్లను ఇవ్వడంలోనే మన జీవితానికి అర్థం దాగి ఉందని చెప్పింది.

ఇతరులకు సహాయపడటం ద్వారా వచ్చే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇతరులకు అన్నివిధాలా సహాయపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ తృప్తి, ఆనందం అనుభవిస్తేగానీ తెలియదు. నీ సంగతి సరే...! కానీ.. నేను మాత్రం మొలకెత్తి తీరుతాను అని తేల్చి చెప్పింది మొదటి గింజ.

"ఎంత చెప్పినా వినకుండా కోరి కోరి కష్టాల్లో పడతానంటే నేను మాత్రం ఏం చేయగలను. నీ ఖర్మ అంటూ" భూమిలోనే ఉండిపోయింది రెండో గింజ. అలా కొన్ని రోజులు గడిచాయి.



మొదటి గింజ మొలకెత్తి ఒక మోస్తరుగా తయారయ్యి నునులేత చిగుళ్లతో ఆకర్షణీయంగా తయారైంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ రైతు ముళ్లకంచె వేసి దానికి రక్షణ కల్పించాడు. రెండో గింజ మాత్రం భూమిలోపల వెచ్చగా దాక్కుంది.

అలా గడుస్తుండగా... ఒకరోజు గింజ దాక్కున్న చోటికే ఓ కోడిపుంజుల గుంపు భూమి పొరను కాళ్లతో తవ్వుకుంటూ వచ్చాయి. అలా తవ్వుతుండగా బయటపడ్డ రెండో గింజనుచూసిన కోడిపుంజు గబుక్కున మింగేసింది.

ఇంకేముందీ... "అయ్యో...! తన స్నేహితుడు చెప్పినట్టు చేసిఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు గదా. ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే నాలాంటి గతే పడుతుందని" ఏడుస్తూ... కోడిపుంజుకు ఆహారమైంది రెండో గింజ.

కాబట్టి పిల్లలూ..! ఎవరు చేయాల్సిన పనిని వారే చేయాలని, అలా చేయని పక్షంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ గింజల కథ ద్వారా అర్థమైంది కదూ...!

పెద్దపులితో ఆడుకునే సూరయ్య...!

పేదవాడైన తిమ్మయ్య కామందు దగ్గర అప్పుచేసి, జీవితమంతా ఆ అప్పు తీరకపోవడంతో మంచపట్టాడు. మనోవ్యాధి ఎక్కువైన తిమ్మయ్య కొడుకు సూరయ్యను కామందు దగ్గర పనికి అప్పగించి కన్నుమూస్తాడు. ఎలాంటి జాలీ, దయా, కరుణా లేని కామందు చిన్నవాడైన సూరయ్యను చిత్రహింసలు పెడుతుంటాడు.

ప్రతిరోజూ చాకిరి చేస్తున్నప్పటికీ, కడుపునిండా తిండి పెట్టకపోవడమే గాకుండా... పసివాడని చూడకుండా సూరయ్యను రాచిరంపాన పెడుతుంటాడు కామందు. కామందు హింసను తట్టుకోలేని సూరయ్య చెప్పా పెట్టకుండా ఊరు వదలి పారిపోతాడు. ఎన్నో చిత్రహింసలను అనుభవించిన సూరయ్యకు మనుషులంటే తీవ్రమైన అసహ్యం ఏర్పడింది.


కామందు ఇంటినుంచి బయటపడ్డ సూరయ్య ఎటుబడితే అటు కొండలు, కోనలూ దాటుకుంటూ ఓ పెద్ద కారడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక జలపాతం కింద కొండ గుహ కనిపిస్తే అక్కడే ఆగిపోయి ఉండసాగాడు. అడవిలో దొరికే పండ్లూ, ఫలాలలను తింటూ జీవనం సాగించాడు.

అలా ఏడు సంవత్సరాలు గడిచాయి. గడ్డమూ, మీసాలూ పెరిగాయి. మౌనంలో మాటలే మరిచిపోయాడు సూరయ్య. పులులు, తోడేళ్ళు లాంటి క్రూరమృగాలు సైతం అతడితో సఖ్యంగా ఉండసాగాయి.

ఇలా ఉంటే... ఒకసారి శివయ్య అనే అతను ఆ దారిలో తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా... పెద్దపులితో ఆడుకుంటున్న సూరయ్యను చూశాడు. ఆశ్చర్యపోయిన శివయ్య వెంటనే సూరయ్య దగ్గరికి వచ్చి కాళ్లపై పడి... "ఇంత పెద్ద అడవిలో తమరు ఏం చేస్తున్నారు మహాత్మా...!" అని అడిగాడు.



సూరయ్య బదులు చెప్పకపోయే సరికి, భయంతో... "స్వామీ...! నేను రాజ దర్శనానికి వెళుతున్నాను. మంచి జరిగేలా దీవించండి" అని వేడుకున్నాడు శివయ్య. తరువాత స్నేహితులతో కలిసి రాజదర్శనానికి సాగిపోయాడు.

తిరుగు ప్రయాణంలో మళ్ళీ సూరయ్య దగ్గరికి వచ్చిన శివయ్య బోర్లాపడి, సూరయ్య కాళ్లకు నమస్కరిస్తూ... "మీ ఆశీర్వాద బలం వల్లనే నాకు రాజానుగ్రహం లభించింది. ఈ చిరుకానుక స్వీకరించండి" అంటూ బంగారు నాణేలను అతడిముందు పోశాడు. వాటిని తీసుకున్న సూరయ్య విసిరి పారేయగా ఆశ్చర్యపోయిన శివయ్య "నిజంగా తమరు దేవుడికి ప్రతిరూపమే..." అంటూ పాదధూళిని తీసుకుని బొట్టు పెట్టుకున్నాడు.

ఇంకేముంది కొన్నిరోజులకే ఆ అడవిలో సూరయ్య పేరుతో శివయ్య ఒక ఆలయాన్ని కట్టించాడు. భక్తుల రాకపోకలు కూడా మొదలయ్యాయి. సత్రాలూ, దుకాణాలు వెలశాయి. వ్యాపారాలు కూడా మంచిగా ఊపందుకున్నాయి. అడుగడుగునా హుండీలు, నౌకర్లు, సేవకులు ఎందరో తయారయ్యారు.

మొక్కుబళ్లతో నానాటికీ పెరిగిపోతున్న భక్తులతో ఆ మహారణ్యమంతా జనసముద్రమైంది. దీంతో సూరయ్యకు క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. అతడికున్న ప్రశాంతత అంతా మటుమాయమైపోయింది. మనుషుల అంతరాలు, అత్యాశలు, కోరికలను చూసిన అతడికి మనుషులంటే వెగటు పుట్టింది. అంతే... ఒకరోజున అక్కడ్నించీ కూడా చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు.

బంగారు పాత్ర... రామానుజులు..!

యువకుడైన రామానుజులు పాత సామగ్రిని అమ్ముతూ జీవనం గడిపేవాడు. ఇతను పాత పాత్రలు కొంటూ, కొత్త పాత్రలను అమ్ముతూ న్యాయమైన వ్యాపారిగా మంచి పేరుగడించాడు.

రామానుజులు నివసించే ఊర్లోనే పాత సామగ్రిని కొని అమ్మే మరో వ్యాపారైన శీనయ్య కూడా ఉండేవాడు. ఇతను చాలా పిసినారి. అయినప్పటికీ రామానుజులు, శీనయ్యలు ఇద్దరూ కలసి ఊర్లు తిరుగుతూ... వ్యాపారం చేసేవారు. అలా ఒకరోజు వ్యాపారం కోసం సీతాపురం అనే ఊరికి చేరుకుని చెరో వీధికి వెళ్లారు.


ఆ ఊర్లోని ఒక వీధిలో సూరయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సూరయ్య వాళ్ళు ఒకప్పుడు బాగా ధనికులే అయినా ప్రస్తుతం బాగా చితికిపోయారు. ఆ కుటుంబానికి చెందిన కొడుకులు, అన్నదమ్ములు సంపద అంతా ఖాళీ అవడంతో, కటిక దారిద్ర్యంలో మునిగిపోయి చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవిక గడిపేస్తుంటారు.

అయితే... వారి వద్ద అనేక పాత్రలున్నాయి. వాటిలో ఒకటి బంగారు పాత్ర, బాగా బతికిన రోజుల్లో సూరయ్య దాన్ని ఉపయోగించి ఉంటాడు. పేదవారు అవడంతో దాన్ని వాడకుండా పక్కన పెట్టేయడంతో అది మరకలు పట్టి ఉండటం వల్ల దాన్ని ఎవరూ బంగారు పాత్ర అనుకోరు. ఆ ఇంటి ఆడవాళ్లకు కూడా అది బంగారు పాత్ర అని తెలియదు.

అదే వీధిలోకి వ్యాపారం కోసం వచ్చిన శీనయ్య, పాత పాత్రలు తీసుకుని కొత్తవి ఇస్తామంటూ అరుస్తూ... వస్తుంటాడు. దీన్ని చూసిన సూరయ్య కుటుంబంలోని పెద్దావిడ అతడిని పిలిచింది. కూర్చోమని చెప్పి, అతడి చేతికి బంగారు పాత్రను ఇచ్చి... "బాబూ దీన్ని తీసుకుని మా అమ్మాయికి ఏమైనా ఇవ్వు" అని అడిగింది.



లోభివర్తకుడైన శీనయ్యకు ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చునని తోచింది. అతను దాన్ని తిరగేసి, బోర్లవేసి, తిప్పి తిప్పి చూసి, కడ్డీతో గీరి, అది బంగారమేనని రూఢి చేసుకున్నాడు. వెంటనే దాన్ని కాజేసేందుకు పథకం వేసి... "దీనికి ఏం వస్తుందమ్మా? ఇదేం అంత వెల చేయదు" అంటూ ఆ పాత్రను విసిరేసి, లేచి వెళ్ళిపోయాడు.

మరి కాసేపటికి ఈ ఇంటి దార్లోనే రామానుజులు పాత్రలు అమ్ముతూ వస్తాడు. అది చూసిన సూరయ్య ఇంట్లోని పెద్దావిడ రామానుజులును పిలిచింది. కూర్చోబెట్టి.. లోనికెళ్లి బంగారు పాత్రను తీసుకొచ్చి ఇచ్చి మారుకు ఏమైనా ఇవ్వమని అడిగింది.

ఆ పాత్రను చేతిలోకి తీసుకున్న రామానుజులు పరీక్షగా చూసి... "అమ్మా ఇది చాలా లక్షలు విలువచేసే పాత్ర. దీనికి సమానమైన విలువగల వస్తువులు నా వద్ద లేవు" అని చెప్పాడు. దీంతో ఆ పెద్దావిడ "నాయనా...! ఇంకో వ్యాపారి ఇది చాలా తక్కువ విలువ చేస్తుందని విసిరి పారేసి వెళ్లిపోయాడు. ఒకవేళ ఇది మంచి విలువైనదే అయి ఉండవచ్చు కదా..! దీన్ని తీసుకుని మారుకు ఏదైనా ఇచ్చివెళ్ళు" అని చెప్పింది.

దీంతో రామానుజులు తన వద్దనున్న పాత, కొత్త సామగ్రినంతటినీ ఆమెకు ఇచ్చి... "అమ్మా..! ఇవి తప్ప నా వద్ద ఇంకేవీ లేవు" అని నిజాయితీగా చెప్పి, ఆమెకు నమస్కరించి అక్కడ్నించీ వెళ్లిపోయాడు.



ఇంతలో లోభి అయిన శీనయ్య తాను వేసుకున్న పథకం ప్రకారం తిరిగీ ఆ ఇంటికి వచ్చి... "ఆ పాత్ర ఇలా పారేసి, ఏదో ఒకటి తీసుకుని వెళ్లండి" అని పిలిచాడు. అంతా విన్న పెద్దావిడ కోపంతో ఊగిపోతూ... "ఏం నాయనా..! లక్షలు విలువచేసే పాత్ర ఏ విలువా చెయ్యదన్నావుగా..! నువ్వు వెళ్లగానే ఇంకో పుణ్యాత్ముడు వచ్చి, తనవద్దనున్న వాటినన్నింటినీ ఇచ్చి ఆ పాత్రను తీసుకెళ్లిపోయాడు" అంటూ కసిగా చెప్పింది.

ఆ మాట విన్న శీనయ్య మతిపోయినట్లైంది. అంత విలువైన పాత్రను వాడు కాజేశాడా? నాకు ఇంత నష్టం చేస్తాడా? అంటూ ఆవేశంతో నదీ తీరానికి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. పెద్దావిడ మాట విన్న శీనయ్యకు నిజంగా మతి భ్రమించినట్లై తన వద్దనున్న డబ్బూ, సరుకులూ అన్నింటినీ అలాగే విడిచి పరుగులెత్తాడు.

అతడు నదీతీరాన్ని సమీపించగానే రామానుజులు పడవలో అవతలివైపుకు దాటుతుండటం కనపించింది. అది చూసిన శీనయ్యకు ఆవేశం కట్టలు తెంచుకురాగా, గుండె వేగంగా కొట్టుకుసాగింది. అంతే ఒక్కసారిగా నోటివెంట రక్తం కూడా కారసాగింది. తనకంటే బాగా లాభపడ్డ రామానుజంపై తీవ్రమైన ద్వేషంతో శీనయ్య గుండెపగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. నిజాయితీగా ఉన్న రామానుజులు మాత్రం దానదర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ.. తనకున్న మంచిపేరును నిలబెట్టుకున్నాడు.

అసూయ, ఆవేశం అనేది మనిషిని ఎంతటి ప్రమాదానికి గురిచేస్తాయో శీనయ్య కథను చదివితే అర్థమైందా పిల్లలూ...! ఎప్పుడూ కూడా నిజాయితీ, కష్టపడేతత్వమే మనిషిని విజయంవైపు నడిపిస్తాయి. రామానుజులు నిజాయితీగా నడుచుకోవడం వల్ల జీవితంలో సుఖపడ్డాడు.

కట్టెలు కొట్టే రంగయ్య.. వనదేవత..!

రామాపురం గ్రామంలో ఊరికి కాస్తంత దూరంగా రంగయ్య, సూరమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. రంగయ్య ప్రతిరోజూ దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చి, పట్టణానికి వెళ్ళి అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో భార్యాభర్తలు జీవనం సాగించేవారు.

ఒకరోజు ఎప్పట్లాగే కట్టెల కోసం అడవికి వెళ్లాడు రంగయ్య. ఒక చెట్టును నరికేందుకు ఉపక్రమించాడు. అంతే...! చెట్టు చాటునుంచి ఒక స్త్రీ ఆకారం ఎదురుగా వచ్చి నిలిచింది. భయపడ్డ రంగయ్య దూరం జరగబోయాడు. అది గమనించిన ఆ స్త్రీమూర్తి తనను తాను వనదేవతగా పరిచయం చేసుకుంది.


"మీ మనుషులకు మల్లే ఈ చెట్టూ చేమలకు కూడా ప్రాణం ఉంటుంది కదా..! రంగయ్యా..! అంతేగాకుండా చెట్లను విపరీతంగా నరికడం వల్ల అడవి పాడవుతుంది కాబట్టి వాటిని నరకవద్దు" అని చెప్పింది వనదేవత. "అది సరే తల్లీ...! కట్టెలు కొట్టి అమ్మకపోతే నేనూ, నా భార్య ఎలా బ్రతుకుతాము. మాకు తిండి ఎలా వస్తుంది?" అని ప్రశ్నించాడు రంగయ్య.

అవును నిజమే కదా..! అనుకున్న వనదేవత, సరే... నేను నీకో పాడి ఆవును ఇస్తాను దాని పాలు అమ్ముకుని సుఖంగా బ్రతుకు అని చెప్పి పాడి ఆవును ఇచ్చి మాయమైంది. ఆవును తోలుకుని ఇంటికి వచ్చిన రంగయ్య భార్యకు జరిగిన కథనంతా చెప్పగా, ఆమె కూడా చాలా సంతోషించింది.



రోజులిలా గడుస్తుండగా... రోజూ ఆవుకి మేత వేస్తూ, పాలు పితుకుతూ ఉన్న సూరమ్మకు విసుగొచ్చి కష్టపడకుండా డబ్బు సంపాదించే వరం తీసుకురమ్మని మళ్ళీ భర్తను అడవికి పంపించింది. అడవికి వెళ్ళిన రంగయ్య చెట్టును నరకబోగా, తిరిగీ వనదేవత ప్రత్యక్షమై మళ్ళీ ఎందుకు చెట్టును నరుకుతున్నావని ప్రశ్నించింది.

అప్పుడు రంగయ్య ఈ ఆవు నాకు వద్దుగానీ, ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పుమని అడిగాడు. సరే అన్న వనదేవత ఆవును తీసుకొని ఒక బాతుని ఇస్తూ... ప్రతీ రోజు అది ఒక బంగారు గుడ్డు పెడుతుందని, దాన్ని అమ్ముకొని సుఖంగా జీవించమని చెప్పి ఎప్పట్లాగే మాయమైంది.

రంగయ్య బాతుతో ఇల్లు చేరాడు. అది ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి, వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు సూరమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా షావుకార్లు కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అది అడిగి తీసుకురా అంటూ భర్తను మళ్ళీ అడవికి పంపింది.

బాతుని తీసుకొని అడవికి వెళ్ళిన రంగయ్య చెట్టు నరకబోగా... వనదేవత ప్రత్యక్షమయింది. "ఏం రంగయ్యా...! మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్దు మాత్రమే పెడుతుంది. అది మాకు వద్దు... ధనం ఇచ్చే సంచి ఇవ్వు' అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు విపరీతమైన కోపం వచ్చి... బాతుతో పాటు మాయమైపోయింది.



దీంతో డీలా పడ్డ రంగయ్య కోపంగా... చెట్టుకొమ్మను గొడ్డలితో బలంగా నరికేశాడు. కొమ్మ తెగి రంగయ్య కాళ్ళపై పడగా, కాళ్ళు విరిగి కూలబడిపోయాడు. భర్త ఎంతసేపటికీ రాకపోయేసరికి రంగయ్యను వెతుక్కుంటూ అడవికి వస్తుంది. కాళ్ళు విరిగిపోయిన భర్తను చూసి భోరుమంటూ ఇంటికి తీసుకొచ్చింది.

భర్త ఏపని చేయలేడు. కాబట్టి, సూరమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగుపండ్లు ఏరుకుని వచ్చేది. వాటిని తిని భార్యాభర్తలు బ్రతికేవారు. పండ్లు తినగా వచ్చిన గింజలను ఇంటివెనుక ఖాళీ స్థలంలో పారవేయగా అవి కొన్నాళ్ళకు మొలకలెత్తి పెరిగి పెద్దవై, కాయలు కాసాయి.

సూరమ్మకు కూడా అడవికి వెళ్లే బాధ తప్పింది. వారు తినగా మిగిలిన పండ్లను సంతలో అమ్మి డబ్బులు సంపాదించేవారు. దీంతో చెట్లను కొట్టి బ్రతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగింగిచవచ్చని రంగయ్య, సూరమ్మలకు అర్థమైంది. అప్పటిదాకా తాము చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇకపై ఎప్పుడూ అలా చేయకూడదని తీర్మానించుకున్నారు.

అంతేగాకుండా... ఇంటివెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని అంతటినీ చదును చేసిన సూరమ్మ రకరకాల పండ్ల మొక్కలను నాటింది. వాటికి ప్రతిరోజూ నీటిని పోసి పెంచేది. అలా ఒక రోజు వనదేవత ప్రత్యక్షమై మంచిపని చేస్తున్నారంటూ భార్యాభర్తలిద్దరినీ దీవించింది. మొక్కల పెంపకం విలువ తెలిసిన రంగయ్య దంపతులు ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతూ, నలుగురి సాయపడుతూ.. ఆనందంగా జీవనం గడపసాగారు.

కుందేలు ఉపాయం...

పిల్లలూ..! తెలివితేటలు, ఆలోచన, సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్పతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు త్రాగించవచ్చని నిరూపించే ఓ చిన్న కుందేలు కథను ఇప్పుడు మనం చదువుకుందాం...!

ఒకానొక కాలంలో పెద్ద కీకారణ్యంలో రకరకాల జంతువులన్నీ అన్యోన్యంగా ఉంటూ కలసిమెలసి జీవనం సాగించేవి. ఆ అడవికి, జంతువులన్నింటికి రారాజు సింహం. చాలా పౌరుషం కలిగిన ఆ సింహం ఎప్పుడూ తన పంతం చెల్లాలనే పట్టుదల... చాలా క్రూర స్వభావం కలిగి ఉంటుంది.


దీంతో ఆ సింహం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతుంటుంది. అది ఇష్టము వచ్చినట్లుగా అడవిలోని జంతువులను వేటాడి, చంపి తినేసేది. సింహం వేటకు బయలుదేరిదంటే చాలు... అడవిలోని జంతువులన్నీ భయంతో, ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీసేవి.

ఇలా లాభం లేదనుకున్న జంతువులన్నీ ఒకరోజు సమావేశమై... రోజుకొకరు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్లాలని తీర్మానించుకున్నాయి. అన్నీ కలసి సింహం దగ్గరకు వెళ్లి తమ నిర్ణయాన్ని తెలియజేశాయి. ఎలాగైతేనేం తన ఆహారానికి డోకా లేదనుకున్న సింహం జంతువుల ప్రతిపాదనకు ఒప్పుకుంది.

ఎలాంటి కష్టం లేకుండా పడుకున్న చోటికే ఆహారం రావడంతో సింహం చాలా సంతోషంగా వాటిని ఆరగిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం జంతువులు తమ వంతు ప్రకారం సింహానికి ఆహారంగా వెళుతుంటాయి. ఇలా జరుగుతుండగా.. ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది.

చాలా చిన్నదాన్నయిన తనకు అప్పుడే నిండు నూరేళ్లు నిండనున్నాయా అంటూ ఏడ్చింది కుందేలు. అయితే ఎలాగైనా సరే సింహం బారి నుండి తప్పించుకోవాలని ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. తాను అనుకున్నది గనుక జరిగితే తనకే కాదు, అడవిలోని జంతువులన్నింటికీ స్వేచ్ఛ దొరికినట్లవుతుందని ఆలోచిస్తూ... సింహం దగ్గరకు కాస్తంత ఆలస్యంగా వెళ్ళింది.



అప్పటికే కుందేలు ఆలస్యానికి మండిపడుతూ వేచిచూస్తున్న సింహం... కుందేలును చూడగానే మండిపడుతూ... ఇంత ఆలస్యం ఎందుకైంది? అని ప్రశ్నించింది.

అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో సింహానికి నమస్కరిస్తూ... "మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజునని, మరొకడు రాజు కాలేడు కాబట్టి, నేనే నిన్ను ఆహారంగా తినేస్తానని అంది. అయితే నేను దాని మాటలను ఒప్పుకోక, ఎలాగోలా తప్పించుకుని మీ దగ్గరికి చేరుకునేసరికి ఆలస్యమైంది ప్రభూ...!" అని చెప్పింది.

అంతేగాకుండా... ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో తిట్టిందని, మీకు పౌరుషం లేదని వెక్కిరించిందని కుందేలు రాజు సింహానికి చెప్పింది. ఇవన్నీ విన్న సింహం కోపంతో ఊగిపోతూ... "నేనేఈ అడవికి రాజునని, అసలు అదెక్కడుందో చూపించు దానిని నా పంజాతో కొట్టి చంపి పారేస్తాను" అని అంది.

అలాగే ప్రభూ...! రండి చూపిస్తానంటూ సింహాన్ని తీసుకుని ఓ పాడుబడ్డ బావిదగ్గరకు తీసుకొస్తుంది కుందేలు. సింహం తన శత్రువు కోసం వెదక సాగింది. ఎక్కడా కనిపించలేదు. దీంతో... " మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆ బావిలో ఉంది. వెళ్ళి చంపండి" అని చెప్పింది కుందేలు.

కుందేలు మాటలకి గర్జించిన సింహం నూతి గట్టుపైకి దూకి లోపలి చూసింది... ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పై కెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది ఈ సింహం ఏంచేస్తే అది అలాగే చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతి గట్టు మీద నుండి ఒక్కసారిగా బావిలోకి దూకింది. అంతే... బాగా పైనుంచి నీటిలో పడటంతో సింహం ఊపిరాడక చచ్చిపోయింది.

చూశారా.. పిల్లలూ...! తెలివితక్కువదైన సింహం, బావిలోని నీటిలో పడిన తన నీడనే మరో సింహంగా భావించి దూకేసి ఎలా చావును కొనితెచ్చుకుందో...! చిన్నదైనప్పటికీ.. కుందేలు "అపాయానికి తగిన ఉపాయం" పన్ని తన ప్రాణాలను కాపాడుకుంది. అంతేగాకుండా, అడవిలోని జంతువులన్నీ భయంలేకుండా బ్రతికే అవకాశం కల్పించింది.

కోతి బావ...తేనెటీగల పెళ్లి..!

ఒకానొక అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టుమీద రకరకాల పక్షులు నివాసం ఏర్పర్చుకుని, ఎప్పుడూ పోట్లాడుకోకుండా కలసిమెలసి హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక కోతి వచ్చింది. అనుకోని అతిథి రావడంతో సంతోషించిన చిలుకలు, పావురాలు, మిగిలిన పక్షులన్నీ... జామపళ్లు, పాలపళ్లు, రకరకాల పండ్లను తెచ్చి, ఇచ్చి సత్కరించాయి.

ఆ పళ్లన్నింటినీ సుష్టుగా భోంచేసిన కోతిబావకు ఆ పళ్ల రుచి చాలా బాగా నచ్చేసింది. ఎంచక్కా ఇక్కడే ఉంటే... కష్టపడకుండానే రోజూ ఇలా రకరకల పళ్లు తినొచ్చు అని మనసులో అనుకుంది. మీరంతా నాకు బాగా నచ్చేశారని, ఇకపై మీతోనే ఉంటానని నమ్మబలికింది. పగలంతా పక్షులు కష్టపడి పళ్లను తెచ్చి ఇస్తే... తినేసి సోమరిపోతులాగా హాయిగా ఆ చెట్టుపైనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది కోతిబావ.

కాలం అలా గడుస్తూ ఉంటుంది. ఏ రోజుకారోజు హాయిగా కాలం గడిపేస్తున్న కోతి వాలకం ఓ ముసలి పక్షికి అర్థమైపోయింది. మిగతా పక్షులన్నీ కూడా రోజూ పళ్లు తెచ్చి కోతికి ఇస్తూ.. విసిగిపోయి ఉన్నాయి. దీంతో పక్షులన్నీ కలసి సమావేశమై... కోతిని ఎలాగైనా సరే అక్కడ్నించీ వెళ్లగొట్టాలని నిర్ణయానికి వచ్చాయి.



ఉపాయం కోసం ముసలి పక్షి దగ్గరికి వెళ్ళి అభ్యర్థించాయి. ఆ పక్షి ఒక ఉపాయం చెప్పగా అన్నింటికీ నచ్చడంతో... వెంటనే రంగంలోకి దిగిపోయాయి. తరువాతి రోజు పావురం కొంచెం తేనె తెచ్చి కోతికి ఇచ్చింది. తేనె రుచి చూసిన కోతికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చాలా బాగుందంటూ తినడం మొదలెట్టింది. అలా నాలుగు రోజులు గడిచింది.

ఒకరోజు పావురం ఎంతసేపటికీ రాకపోవడంతో.. తేనె కోసం ఎదురుచూస్తోన్న కోతి పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. ఇంక లాభం లేదు పావురం వచ్చేలా లేదుగానీ... తానే వెళ్లి తేనె తాగి రావాలి అనుకుని తేనెపట్టు ఉండే చెట్టుపైకి వెళ్లింది. అంతకుముందు ఎప్పుడూ కూడా తేనెపట్టుని చూడని కోతి, తేనెపట్టున్న కొమ్మని చూసి పట్టుకుని గట్టిగా ఊపింది.

అంతే... ఒక్కసారిగా తేనెటీగలన్నీ కోతిబావను చుట్టిముట్టి కసితీరా కుట్టేశాయి. దీంతో తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో పరుగెత్తి చివరికి అడవిలోకి పారిపోయింది. మళ్లీ ఎప్పుడూ కూడా ఆ మర్రిచెట్టువైపు కన్నెత్తి చూడలేదు కోతిబావ. అర్థమైందా పిల్లలూ..! సోమరితనంతో ఉన్న కోతిబావకు, తేనెటీగలతో పక్షులన్నీ ఎలా పెళ్లి చేయించి, వెళ్లగొట్టాయో...!!

తెనాలి రామలింగడు... నారింజపండ్లు!

శ్రీకృష్ణ దేవరాయులుకు ఒకసారి చైనా చక్రవర్తి కొన్ని నారింజపండ్లను కానుకగా పంపించాడు. పండ్లను తమ సేవకులతో పంపిస్తూ... ఇవి చాలా ప్రత్యేకమైన నారింజపండ్లనీ, వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులు అవుతారని రాసిన చిన్న లేఖను కూడా పెట్టి పంపుతాడు చైనా చక్రవర్తి.

వాటిని ఎంతో భక్తితో తీసుకువచ్చిన రాజ ప్రతినిధి శ్రీకృష్ణ దేవరాయులు ఆస్థానానికి విచ్చేసి, ప్రభువుకు సగర్వంగా అందజేస్తాడు. పండ్ల బుట్టలో నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఆ నారింజ పండ్లను చూసే సరికి దేవరాయులతో పాటు, సభలోని సభికులందరూ ఎంతో కుతూహలంతో చూడసాగారు.

అందరూ అలా చూస్తుండగానే... సభలో ఉన్న తెనాలిరామలింగడు ఒక్క ఉదుటున లేచి, టక్కున ఒక పండు తీసుకుని, ఒలిచి నోట్లో వేసుకుని..."అబ్బా...! చాలా బాగుంది. అద్భుతమైన రుచి" అంటూ పొగడసాగాడు. దీంతో సభికులందరూ హతాశులై చూస్తుండగా... రాయలవారికైతే రామలింగడిపైన పట్టరాని కోపం వచ్చింది.

వెంటనే తమాయించుకుని... "చైనా చక్రవర్తి నాకోసం పంపించిన పండ్లు అవి. నా అనుమతి లేకుండా తీసుకున్నావు. కాబట్టి నీకు మరణదండన తప్పదు" అని హెచ్చరించాడు. చక్రవర్తి మాటలను విన్న రామలింగడు మరణదండన గురించి బాధపడకుండా... పకపకా నవ్వడం ప్రారంభించాడు.

సభికులందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా... రామలింగడు నవ్వు చూసిన రాయలవారికి కోపం ఇంకా తీవ్రస్థాయికి చేరుకుంది. "ఎందుకు రామలింగా...? నవ్వుతున్నావు?" అని ప్రశ్నించాడు.

"నవ్వక ఏం చేయమంటారు ప్రభూ...! ఏ పండ్లు తింటే మృత్యువు దగ్గరికి రాదో... ఆ పండును నోట్లో వేసుకోగానే మీరు నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా..? లేనట్టా? మీరే ఆలోచించుకోండి" అన్నాడు నవ్వుతూ రామలింగడు.

దీంతో విషయం అర్థమైన రాయలవారు కోపం తగ్గించుకుని రామలింగడితో జతకలిసి నవ్వసాగాడు. దీంతో సభికులందరూ కూడా... మృత్యువును దూరంచేసే శక్తి ఆ పండ్లకు లేదని అర్థం చేసుకుని నవ్వసాగారు. అంతేగాకుండా... రామలింగడి తెలివితేటలను మెచ్చుకుంటూ... మహిమ లేకపోయినా తియ్య తియ్యగా ఉన్న ఆ పండ్లను అందరూ రుచిచూశారు.

పెద్దలమాట చద్దన్నం మూట

పిల్లలూ...! ఎక్కడికి వెళ్ళినా తోడు లేకుండా వెళ్ళవద్దని, ఒంటరిగా తిరగవద్దని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతుంటారు కదా..! పెద్దవాళ్ళు ఎప్పుడూ పిల్లల మంచిని కోరే జాగ్రత్తలు చెబుతారు. "పెద్దలమాట చద్దన్నం మూట" అని ఊరకే అనలేదని ఈ చిన్ని కథను చదివితే మీకే అనిపిస్తుంది... మరి కథలోకి వెళ్దామా...!

అన్నవరం అనే ఊళ్లో ఒక తల్లీ కొడుకులు ఉండేవాళ్ళు. చిన్న చిన్న పనులు చేసి తన తల్లికి ఏలోటూ రాకుండా చూసుకుంటూ ఉంటాడు కుమారుడైన బ్రహ్మం. ఒకరోజున ఏదో పనిమీద పొరుగూరుకు వెళ్ళాల్సి వస్తుంది. దీంతో తన ప్రయాణం గురించి తల్లితో చెప్పాడు బ్రహ్మం.


పొరుగూరికి వెళుతున్నావా...? సరే నాయనా...! ఒక్కడివే వెళుతున్నావా.. ఎవరైనా తోడు వస్తున్నారా..? అని అడిగింది బ్రహ్మం తల్లి. ఎవరూ రావట్లేదు... నేను ఒక్కడినే వెళుతున్నానమ్మా.. అని చెప్పాడు బ్రహ్మం. తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదని, ఎవరినైనా వెంటబెట్టుకెళ్లమని ఆమె కొడుక్కి సలహా ఇచ్చింది.

అయితే బ్రహ్మం మాత్రం.. మరేం ఫర్వాలేదు... నాకేమీ కాదు... నేను త్వరగా వచ్చేస్తానుగా...! అని తల్లికి నచ్చజెప్పి ఒంటరిగానే పొరుగూరికి బయలుదేరేందుకు సిద్ధపడ్డాడు. అయినా ఆ తల్లి మనసు ఊరుకోక వెంటనే ఇంటి పెరట్లోని బావిదగ్గరకి వెళ్లి... రోజూ తాను ఎంతో ఆప్యాయంగా పెంచుకునే ఎండ్రక్కాయను తెచ్చి కొడుకుకు ఇచ్చింది. నీకు ఏదైనా ఆపద వస్తే... ఇది ఎలాగైనా సరే నిన్ను కాపాడుతుందని అభయం ఇచ్చింది తల్లి.

తల్లి మనసును కష్టపెట్టడం ఇష్టంలేని బ్రహ్మం సరేనంటూ... ఎండ్రక్కాయను తీసుకుని తన గుడ్డ సంచిలో దానిని జాగ్రత్తగా పెట్టుకుని ఊరికి బయలుదేరాడు. అలా బయలుదేరిన బ్రహ్మం నడచి నడచి బాగా అలసిపోయాడు. కాస్త చల్లబడ్డ తరువాత మళ్లీ ప్రయాణం సాగించవచ్చని ఒక చెట్టుకింద నిద్రకు ఉపక్రమించాడు.



ఆ చెట్టుకు సమీపంలో నివసించే ఒక తాచుపాము బ్రహ్మం గుడ్డసంచిలోని కర్పూరపు సువాసనలకు ఆకర్షితమై మెల్లగా మూట దగ్గరకు వచ్చింది. అంతటితో ఆగకుండా గుడ్డ సంచిలోకి తలదూర్చగా.. అందులో ఉన్న ఎండ్రక్కాయ కసికొద్దీ ఒడుపుగా పామును తన రంపపు నోటితో కసికొద్దీ కొరికేసింది.

ఆదమరిచి నిద్రపోతున్న బ్రహ్మానికి జరిగిందేమీ తెలియదు. నిద్రలేచిన తరువాత చూస్తే.... గుడ్డ సంచి పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూశాడు. తనకు ఆపద జరుగకుండా తల్లి ప్రేమతో ఇచ్చిన ఎండ్రక్కాయే పామును చంపివేసిందని గ్రహించాడు. తన తల్లి ఎంతో ముందుచూపుతో తన మేలుకోరి ఎండ్రక్కాయను తన వెంట పంపిందని అర్థం చేసుకున్నాడు బ్రహ్మం.

కాబట్టి...! పెద్దల మాట చద్దన్నం మూట అనే వాస్తవాన్ని బ్రహ్మం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. పెద్దలమాటను చిన్నవారు విధిగా వినడమే కాకుండా, వాటిని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆరోజు నుండి బ్రహ్మం ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేదు. తల్లిమాటలను తూ.చ. తప్పకుండా పాటించటం నేర్చుకున్నాడు.

కాబట్టి... పిల్లలూ..! జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనకు నచ్చినా, నచ్చకపోయినా పెద్దవారు అనుభవపూర్వకంగా చెబుతున్న మాటలను వినితీరాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. పెద్దవాళ్ళు సంతోషిస్తారు.

ఉత్తమోత్తముడి అత్యాశ!

వైకుంఠపురం అనే ఊర్లో ఉత్తముడు, ఉత్తమోత్తముడు అనే పేర్లతో ఇద్దరు వ్యాపారులుండేవారు. వారిలో ఉత్తముడనేవాడు న్యాయంగా, నీతిగా వ్యాపారం చేసేవాడు. అయితే పేరు మాత్రం ఉత్తమోత్తముడని పెట్టుకున్న అతను మాత్రం మితిమీరిన అత్యాశతో ఉండేవాడు.

వీరు ఇద్దరూ కూడా ఉమ్మడిగా వ్యాపారం చేస్తూ... అందులో వచ్చిన లాభాలను సమానంగా పంచుకునేవారు. ఒకరోజు అలానే పిఠాపురం అనే ఊర్లో వ్యాపారం చేసి లాభంతో తిరిగివచ్చారు. ఎప్పట్లాగే లాభాన్ని సమాన భాగాలుగా చేసి పంచుతుండగా, ఉత్తమోత్తముడు తనకు రెండువంతుల లాభం కావాలి అని పట్టుబట్టాడు.


"ఇద్దరం సమానంగా కష్టపడ్డాం. లాభం కూడా ఇద్దరం సమానంగా పంచుకోవడం న్యాయం" అని అన్నాడు ఉత్తముడు. అయితే ఉత్తమోత్తముడు మాత్రం "నీకంటే నేనే ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి లాభం నాకు రెండు వంతులు రావాల్సిందే" అని భీష్మించుకు కూర్చున్నాడు.

"సరుకులూ... ఎద్దులూ... బళ్ళూ అన్నీ కూడా ఇద్దరివీ సమాన భాగాలు కదా? అలాంటప్పుడు నీకు మాత్రం రెండువంతులెందుకు రావాలి?" అంటూ మళ్ళీ నిలదీశాడు ఉత్తముడు. "నువ్వు ఉత్తముడివి మాత్రమే...! నేను ఉత్తమోత్తముడిని కాబట్టి రెండు భాగాలు ఇవ్వాల్సిందే" అన్నాడు ఉత్తమోత్తముడు. ఇలా ఒకరితో ఒకరు వాదించుకుంటూ గొడవ కాస్తా ముదిరింది.

ఇలా అయితే కుదరదని ఆలోచించిన ఉత్తమోత్తముడు ఒక మెట్టు దిగివచ్చి... "మన సమస్య తీరాలంటే ఒక ఉపాయం ఉంది. ఆ ప్రకారం నడుచుకుందామా...?!" అని ఉత్తముడిని అడిగాడు. "ఏంటది..?" అని ఉత్తముడు ప్రశ్నించగా... "ఎవరికి ఎంత వాటా చెందాలో ఆ వృక్ష దేవతనే అడుగుదాం. ఆ తల్లి ఎలా చెబితే అలా నడుచుకుందాం" అని చెప్పాడు ఉత్తమోత్తముడు. దీనికి ఉత్తముడు కూడా సరేనన్నాడు.

రాత్రికి రాత్రే ఉత్తమోత్తముడు తన తండ్రిని ఒక చెట్టు తొర్రలో ఎవరికీ కనబడకుండా కూర్చోబెట్టి తాను చెప్పినట్లుగా నడుచుకోమన్నాడు. మేము ఇద్దరం వచ్చి అడిగినప్పుడు "తనకే రెండు భాగాలు చెందుతాయని చెప్పమని తండ్రిని ఆజ్ఞాపించి"... ఇంటికొచ్చి ఏమీ తెలియనట్లు నిద్రపోయాడు.



మరుసటి రోజు ఉదయం ఒక చెట్టు దగ్గరకు ఉత్తముడిని తీసుకుపోయిన ఉత్తమోత్తముడు జరిగిన తతంగం అంతా వివరించి చెప్పి... "అమ్మా..! వృక్షదేవతా...! మాకు న్యాయం జరగాలంటే నువ్వే తగినదానవు కాబట్టి, ఎవరికి ఎక్కువ భాగం చెందాలో నువ్వే చెప్పు...?" అంటూ వేడుకున్నాడు.

అప్పుడు చెట్టు తొర్రలో నున్న ఉత్తమోత్తముడి తండ్రి గొంతు మార్చి... "ఉత్తమోత్తముడికే రెండు భాగాలు చెందాలి" అని తీర్పునిచ్చాడు. అయితే అప్పటికే ఉత్తమోత్తముడు చేసిన పనిని చాటుగా గమనించిన ఉత్తముడు... చెట్టు తొర్రలో నుండి వినిపించిన గొంతుక వృక్షదేవతతో, దయ్యాలదో... ఇప్పుడే తేలుస్తానంటూ.... ఎండుగడ్డి తీసుకొచ్చి చెట్టు తొర్రలో వేసి మంట పెట్టాడు.

చెట్టు తొర్రలో మంటల ధాటికి తట్టుకోలేని ఉత్తమోత్తముడి తండ్రి సగం కాలిన గాయాలతో అరుస్తూ... మెల్లిగా బయటపడ్డాడు. ఇద్దరూ సమానంగా కష్టపడినప్పటికీ అత్యాశకు పోయిన కొడుకును సమర్థిస్తూ... తాను కూడా తప్పు చేశానని... మన్నించమని వేడుకున్నాడు ఉత్తమోత్తముడి తండ్రి. తండ్రి గాయపడటంతో ప్రశ్చాత్తాపపడ్డ ఉత్తమోత్తముడు తాను చేసిన తప్పును అంగీకరించి... లాభాన్ని సమాన భాగాలుగా పంచుకుందామని ఉత్తముడిని కోరాడు.

పిల్లలూ...! ఈ కథలోని నీతి ఏంటంటే... కుటిలత్వం అనేది మంచిది కాదు. కుటిల ఎత్తులకు పాల్పడేవారు తామే కాకుండా తనకు చెందిన ఆత్మీయులను కూడా బలి పెట్టుకున్న వారవుతారని ఈ కథ హెచ్చరిస్తోంది.

ఐక్యమత్యం నేర్చవోయి..!

పూర్వం శాతవాహన నగరంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. తన తెలివితేటలతో వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, మంచి పేరు ప్రతిష్టలను సంపాదించాడు. అన్నీ ఉన్నప్పటికీ అతడికి ఒకటే దిగులుగా ఉండేది.

నలుగురు పిల్లల తండ్రి అయిన ఆ వ్యాపారికి దిగులంతా తన పిల్లలపైనే ఉండేది. పుట్టడంతోటే ధనవంతులు కావడం వల్లా వారందరినీ అల్లారు ముద్దుగా, ఏదీ లేదనకుండా పెంచాడు. అయితే మితిమీరిన గారాభం చేయడం వల్ల వారిలో ఎవరికీ విద్యాభ్యాసం అబ్బలేదు.


అంతేగాకుండా నలుగురు అన్నదమ్ముల్లోనూ ఒకరంటే ఒకరికి పడదు. వయసు పెరుగుతున్నా వారి బుద్ధులు, వారి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. అందుకనే పిల్లలపైన ఆ వ్యాపారి బాగా దిగులు పెట్టుకున్నాడు. ఆ దిగులుతోనే మంచపట్టాడు. చనిపోతానేమోనన్న బెంగపట్టుకుంది.

అయితే తాను చనిపోతే వారిలో వారే తగాదాలు పడుతున్న తన పిల్లలు ఎలా బ్రతుకుతారు అన్న దిగులుతో అతడికి వ్యాధి మరింత ముదిరింది. ఆ దిగులుతోనే ఆలోచించి వీరిని ఎలాగైనా సరే బాగుచేయాలని అనుకుంటుండగా మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది.

అనుకున్నదే తడవుగా ఆ వ్యాపారి తన నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలను తెప్పించాడు. ఒక్కొక్కడినీ ఒక్కొక్క కట్ట తీసుకుని విరవమని చెప్పాడు. నలుగురూ తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరమన్నాడు. అతి కష్టంమీదా ఆ కట్టెలను కూడా విరిచారు.



తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు వ్యాపారి. నాలుగేసి కట్టెలు విరవడం వారిలో ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు. నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు.

అప్పుడు వ్యాపారి తన కొడుకులను ఉద్దేశించి... "చూశారా... నాయనలారా..! మీరు నలుగురూ కలిసి కట్టుగా ఒక పని చేయం వల్ల సులభంగా ఆ కట్టెలను విరిచేయగలిగారు. ఎవరికి వారు విడిగా ప్రయత్నించినప్పుడు చేయలేకపోయారు. ఇప్పటికైనా నలుగురూ కలసిమెలసి ఉండటంలో ఎంత లాభముందో, ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి" అని అన్నాడు.

అంతేగాకుండా... "ఐకమత్యమే బలం" కాబట్టి నా తరువాత మీరందరూ ఐకమత్యంగా ఉంటామని నాకు ప్రమాణం చేయండి.. అని కొడుకులను కోరాడు ఆ వ్యాపారి. తండ్రి మాటల్లోని జీవిత సత్యాన్ని గ్రహించిన నలుగురు కొడుకులూ ఇకపైన కలసిమెలసి ఉంటామని తండ్రికి ప్రమాణం చేశారు.

కాబట్టి పిల్లలూ...! నలుగురూ కలసిమెలసి ఉండటం వల్ల ఎంత పెద్ద లక్ష్యాన్నయినా సునాయాసంగా ఛేదించవచ్చు. మీరు మీ స్నేహితులతోగానీ, మీ అన్న దమ్ములు, అక్కచెల్లెళ్లతోగానీ ఎప్పుడూ స్నేహంగా, సఖ్యంగా, ఐకమత్యంతో మెలుగుతారు కదూ...!

గురు శిష్యుల కథ

పిల్లలూ...! ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గురువులు, మరెంతోమంది గొప్ప శిష్యులు ఉన్నారు. గురు శిష్యుల అనుబంధం గురించి మీరు చాలా కథలు విని ఉంటారు. అలాంటి ఓ గొప్ప గురు శిష్యుల కథను ఇప్పుడు మనం చదువుకుందాం...!

పూర్వం వాల్మీకి మహాముని ఆశ్రమంలో అనేకమంది శిష్యులు పాఠాలు చదు


వుకుంటూ ఉండేవారు. ఆశ్రమంలోని శిష్యులంతా కలసిమెలసి చాలా సఖ్యంగా మెలిగేవారు. ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు. దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువు వాల్మీకికి ఫిర్యాదు చేశారు.

అయితే విషయం అంతా విన్న వాల్మీకి ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు. అలా కొన్నాళ్ళు గడిచాయి. మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు. ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరకు వెళ్లి... "అతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టండి. లేదా మేమే ఆశ్రమాన్ని వదలిపెట్టి వెళ్లపోతాం" అని అన్నారు.

అప్పుడు వాల్మీకి శిష్యులందరినీ సమావేశపరచి... "మీరంతా ఎంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో, చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది. మంచి విద్య లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి, చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు" అని అన్నాడు.



ఇంకా... ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికిగానూ నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమంలోకి తీసుకోరు. విద్య నేర్పించరు. అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు వాల్మీకి మహాముని.

అంతేగాకుండా... తప్పుచేసిన శిష్యుడిని సరి చేయాల్సిన బాధ్యత గురువుగా తనమీద ఉంది కాబట్టి, అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే... అతడికి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వాల్మీకి చెప్పాడు.

దొంగతనం చేసిన శిష్యుడు గురువుగారు చెప్పిన మాటలకు కళ్లలో నీళ్ళు గిర్రున తిరిగాయి. తనలోని అజ్ఞానాన్ని, చెడుబుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు ప్రశ్చాత్తాపంతో గురువు ముందు మోకరిల్లాడు. జీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు.

గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడూ తప్పు పనులు చేయలేదు. మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు.

మూడు కోతులూ... వేటగాడు...!

శేషాచలం అడవిలో ఒక పెద్ద కోతుల మంద ఉండేది. దానికి రామన్న అనే కోతి ఒకటి నాయకుడిగా ఉండేది. రామన్నకు ఒక సోదరుడు, గుడ్డిదైన తల్లి ఉండేది. తల్లిని ఒకచోట సురక్షితంగా ఉంచిన వీరు అడవిలో వేటకోసం వెళ్ళేవారు.

రామన్న, అతడి తమ్ముడు కలసి రోజూ అడవిలో దొరికే మంచి మంచి పండ్లను సేకరించి, మందలోని తమ సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు. ఐతే మంచివారు కాని సేవకులు వాటికి ఆమెకి ఇవ్వకుండా వాళ్ళే తినేసేవారు.


ఒకరోజున తల్లిని చూసేందుకు వచ్చిన రామన్న తల్లిని చూసి ఆశ్చర్యపోయి "ఏంటమ్మా ఇలా తయారయ్యావు" అని ప్రశ్నించాడు. రోజూ మేము పంపించే ఫలాలు తింటున్నావా? లేదా? అని అడిగాడు.

ఫలాలా...?! నాకెవరూ ఏమీ ఇవ్వలేదు నాయనా..?! అని చెప్పింది రామన్న తల్లి. అప్పుడు రామన్నకు విషయం అర్థమై వెంటనే తమ్ముడి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి... తమ్ముడూ...! ఇకపై నేను ఇంటిదగ్గరే ఉండి అమ్మ పోషణ చూసుకుంటాను. నువ్వు మంద బాధ్యతను తీసుకో...! అని చెప్పాడు రామన్న.

అందుకు రామన్న తమ్ముడు ఒప్పుకోలేదు. పైగా... ‘‘అన్నయ్యా! నేనూ నీతోపాటు ఇంటి దగ్గరనే ఉండి, అమ్మపోషణ చూస్తాను'' అని అన్నాడు. దీంతో వారిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఓ రావిచెట్టుపై బస ఏర్పాటు చేసుకుని, తల్లి ఆలనా పాలనా చూసుకోసాగారు.



కాలం అలా నడుస్తుండగా... మరోవైపు వేదముని అనే బ్రాహ్మణుడు గురువువద్ద విలువిద్య నేర్చుకుంటుంటాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు దగ్గరకు వెళ్ళి, ఇక తనకు సెలవిప్పించండి గురువుగారూ అని అడుగుతాడు.

అప్పుడు గురువు వేదముని ఉద్దేశించి... "నాయనా...! నువ్వు విద్య పూర్తి చేసుకున్నావు. సంతోషం. అయితే నీది దుడుకు స్వభావం. తొందరపడి ఎప్పుడూ క్రూరమైన పనులు చేయవద్దు. ఆ తరువాత ప్రశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదం. దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో...!" అని అన్నాడు.

అలాగే నంటూ ఊరికి బయలుదేరాడు వేదముని. కొన్ని రోజులకు పెళ్ళి చేసుకున్నాడు. ఒక పిల్లాడికి తండ్రి కూడా అయ్యాడు వేదముని. అయితే అతనికి ఏ పని దొరకక పోవడంతో జంతువులను, పక్షలను వేటాడి వాటి మాంసం అమ్మి జీవనం సాగించాడు.

ఒకరోజు ఎంత తిరిగినా ఏ ఒక్క జంతువును వేటాడలేకపోయాడు వేదముని. ఇక లాభం లేదు ఇంటికెళ్లిపోదాం అని అనుకుంటూ... రామన్న సోదరులు, గుడ్డితల్లి నివసిస్తోన్న రావిచెట్టు దగ్గరకు వచ్చాడు. అదే సమయంలో తల్లికి ఆహారం పెట్టి ఆమె పక్కనే కూర్చుని ఉన్నారు రామన్న సోదరులు.

ఉత్తి చేతులతో ఇంటికెళ్లడమేంటని ఆలోచించిన వేదముని తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. దీన్ని గమనించిన రామన్న... అదిగో ఆ వేటగాడు అమ్మకు బాణం గురిపెట్టాడు. ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను. ఆ తరువాత అమ్మను నువ్వే రక్షించాలి అంటూ తమ్ముడికి చెప్పి, చెట్టు దిగి కిందికి వచ్చాడు.



"ఓ వేటగాడా... మా అమ్మ ముసలిది, గుడ్డిది. ఆమెను చంపవద్దు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో...!" అంటూ బ్రతిమలాడాడు రామన్న. ఓహో... అలాగా..?! అంటూ వేదముని నిర్దాక్షిణ్యంగా బాణంతో ఒక్కదెబ్బకు నేలకూల్చాడు. ఐతే.. అతడు మాటమీద నిలబడక మళ్ళీ తల్లి కోతికి బాణం గురిపెట్టాడు. ఇది కనిపెట్టిన చిన్నవాడు బ్రతిమలాడినా కనికరం చూపలేదు వేటగాడు. అతడిని కూడా అన్నను చంపినట్లే చంపేశాడు.

ఈ రెండు కోతులతో ఈరోజుకు పొట్టపోసుకోవచ్చులే అనుకున్న వేటగాడు... కాసేపట్లోనే మళ్ళీ మనసు మార్చుకుని తల్లి కోతిని కూడా ఏ మాత్రం కనికరం లేకుండా చంపేసి... మూడు కోతులను భుజాన వేసుకుని ఇంటిదారిపట్టాడు.

వేటగాడు ఊరి పొలిమేరకు చేరుకున్నాడో లేదో... పిడుగులాంటి వార్త అతడి చెవినబడింది. అదేంటంటే.. ఇల్లు కాలిపోయి, అతడి భార్యాపిల్లలు సజీవదహనమైపోయారని. వార్త విన్న వేటగాడు పట్టరాని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ పొరలి పొరలి ఏడ్చాడు.

గురువుగారి మాటలను పెడచెవిన పెట్టి, పాపం...! అణ్యం పుణ్యం తెలియని ఆ మూగజీవాలను హతమార్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. తనకు విముక్తి లేదు. చావు తప్ప మరో మార్గం లేదంటూ వేటగాడు కూడా... ఇంకా ఆరని మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కాబట్టి పిల్లలూ...! గురువులు, తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలకించడమేకాదు.. తూ.చ. తప్పకుండా పాటిస్తే మంచిది. గురువులైనా, తల్లిదండ్రులైనా మనకు మంచి జరిగే విషయాలనే చెబుతారు కాబట్టి వాటిని ఎప్పుడూ పెడచెవిన పెట్టకూడదు. అలా చేసినట్లయితే వేదమునికి పట్టిన గతే పడుతుంది.

గాడిద తిక్క కుదిర్చిన కుక్క

సీతాపురం అనే ఊర్లో రామయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడి దగ్గర ఒక గాడిద, కుక్క ఉండేవి. అయితే ఈ రెండూ ఎప్పుడూ సఖ్యంగా ఉండేవి కావు. గాడిదకు కుక్క అంటే అంతగా సరిపడేది కాదు. యజమాని కోసం ఎలాగోలా కుక్కను భరిస్తూ ఉంటుంది.

వ్యాపారం కోసం సరుకులను గాడిదపై వేసుకుని రామయ్య ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లేవాడు. అలా వెళ్లేటప్పుడు కుక్కను కూడా వెంట తీసుకుని వెళ్లేవాడు. అలా ఒకరోజు వ్యాపారం కోసం వెళ్తూ... ఎండలు మండిపోతుండటంతో విశ్రాంతి కోసం ఓ చెట్టు దగ్గర ఆగుతాడు.


బాగా అలసటగా ఉండటంతో రామయ్య కూర్చున్న చోటనే నిద్రలోకి జారుకున్నాడు. గాడిద, కుక్క రెండూ కూడా యజమానిని కనిపెట్టుకుని చెట్టుకిందే ఆగిపోయాయి. అయితే, ఈ రెండింటికి బాగా ఆకలి వేస్తుంటుంది. బాగా నిద్రలో ఉన్న యజమానిని లేపితే కోప్పడతాడనుకుని చేసేదేంలేక అలాగే ఉండిపోతాయి.

దారిలో అక్కడక్కడా పచ్చగడ్డి కనిపించడంతో, దాంతో కడుపునింపుకున్న గాడిదకు మాత్రం అంతగా ఆకలి ఉండదు. కానీ కుక్కకు మాత్రం బాగా ఆకలిగా ఉండటంతో... "మిత్రమా.... నువ్వు కనీసం దారిలోనయినా పచ్చగడ్డి తిన్నావు. నాకు ఏమీ దొరకలేదు కదా...! బాగా ఆకలిగా ఉంది. నువ్వు ఇలా కూర్చుంటే నీ వీపుపైన ఉన్నరొట్టెముక్కలను తీసుకుని తింటాను." అంటూ గాడిదను బ్రతిమలాడింది.



అయితే గాడిద ససేమిరా అనటమే గాకుండా... "నేను కూర్చోను. యజమాని నిద్ర లేచేదాకా ఆగు. లేకుంటే నువ్వే వెళ్లి యజమానిని లేపు" అని అంది. నిద్రలోంచి లేపితే యజమాని కొడతాడు కాబట్టి... కుక్క మారు మాట్లాడకుండా ఆకలితో అలాగే కూర్చుంటుంది.

ఇలా ఉంటే... కాసేపటికి అక్కడికి ఒక తోడేలు వచ్చింది. బాగా కండపట్టి ఉన్న గాడిదను చూడగానే, ఒక్కసారిగా దూకి దాని గొంతు కొరికి రక్తం తాగాలన్న ఆశతో గమనించసాగింది. దీన్ని చూసిన గాడిదకు ఒళ్ళంతా చెమటలు పోశాయి. వెంటనే కుక్కను పిలిచి "వెళ్లి యజమానిని లేపు, లేకుంటే ఈ తోడేలు నా ప్రాణాలు తీసేస్తుంది" అని అరచింది.

కుక్క అసలే గాడిదపై గుర్రుగా ఉండటంతో... "ఏం ఫర్వాలేదులే... యజమాని లేచేదాకా ఊరుకో. ఆయన లేచాకే దాని సంగతి చూద్దాం.." అంది. అప్పటికిగానీ తిక్క కుదిరిన గాడిద తాను చేసిన పనికి కుక్కను క్షమాపణ అడిగింది.

దీంతో కాస్తంత మెత్తబడ్డ కుక్క... పెద్దగా మొరిగి తోడేలును తరిమి కొట్టింది. ఆ తరువాత నుండి గాడిద కుక్కతో చాలా స్నేహంగా మెలగసాగింది.

పంచతంత్రం కథలు... మిత్రలాభం

మగధ దేశంలో మందారవతి అనే వనం ఉంటుంది. ఆ వనంలో ఎప్పటినుంచో ఒక లేడిపిల్ల, ఒక కాకి ఎంతో స్నేహంగా ఉంటూ కాలం గడుపుతుంటాయి. ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది. ఆ అందమైన వనంలో సంతోషంతో అటూ, ఇటూ పరుగులు తీస్తున్న నక్కకు లేడిపిల్ల కనిపించింది.

బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడిపిల్లను చూడగానే దాని మాంసం ఎలాగైనా సరే తినాలని అనుకుంది నక్క. వెంటనే మెల్లగా లేడి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని కుళ్లును బయటకు పడనీయకుండా మాటలు కలిపింది. తనకు ఎవరూ తోడులేరని, తాను ఒంటరినని విలపించింది నక్క.

అంతేగాకుండా నిన్ను చూడగానే తనకు తనవారంతా గుర్తుకు వచ్చారని, చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల, దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి, తన నివాస స్థలానికి తీసుకెళ్లింది.

వనంలోని మందారం చెట్టుపైన కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి నక్కను గమనించింది. అతడెవరు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అంటూ లేడిపిల్లను ప్రశ్నించింది కాకి. అప్పుడు లేడిపిల్ల ఈనక్క దిక్కులేనివాడని, తనతో స్నేహంకోరి వచ్చాడని చెబుతుంది.

అంతా విన్న కాకి.... మంచీ చెడూ విచక్షణ లేకుండా, ఎవరుబడితే వారితో, కొత్తవారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ... తనకు తెలిసిన గద్ద, పిల్లి కథను చెబుతుంది. అయితే కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది.

అంతే...! నువ్వు మాత్రం లేడిపిల్లను కలుసుకునేటప్పటికి కొత్తదానివే కదా, మరి ఆ తరువాత మంచి స్నేహితులు కాలేదా...? అంటూ కోపాన్ని నిగ్రహించుకుని నిష్ఠూరమాడింది నక్క. కాకి, నక్క అలా వాదులాడుకుంటుండగా... లేడిపిల్ల కలుగజేసుకుని మనలో మనకు తగాదాలెందుకు, వ్యక్తిగత ప్రవర్తనను బట్టే, మిత్రుడైనా, శత్రువైనా ఏర్పడుతుంటారని సర్దిజెప్పింది.

ఇక అప్పటినుండి లేడి, కాకి, నక్క ఎంతో స్నేహంగా కాలం గడుపసాగాయి. కానీ నక్కకు మాత్రం లేడిపిల్ల మాంసం తినాలన్న కోరిక మాత్రం చావలేదు. దీనికి తగిన సమయం కోసం వేచిచూడసాగింది. ఇలా కొంతకాలం గడిచాక నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి తాను ఒకచోట పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూసివచ్చానని, తనతో వస్తే దాన్ని చూపిస్తానని చెప్పింది.

నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితోపాటు వెళ్లి బాగా ఏపుగా పెరిగిన పైరును చూసి ఎంతో సంతోషించింది. రోజూ ఆ ప్రాంతానికి వెళ్లి పైరును కడుపునిండా మేసి వచ్చేది. అయితే అది ఎంతో కాలం సాగలేదు. ఆ పైరు యజమాని లేడిపిల్ల ఇలా రోజూ వచ్చి పైరును తినేసి వెళ్లటం గమనించాడు.

దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని పొలంలో వలవేశాడు యజమాని. విషయం తెలియని లేడిపిల్ల మామూలుగానే పొలం మేసేందుకు వచ్చి, వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ అది వల నుంచి బయటపడలేక పోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన నక్క, మనసులో ఆనందిస్తూ... పైకి మాత్రం బాధను నటిస్తూ ఉంటుంది.

పొలం యజమాని రాకముందే, తనను ఎలాగైనా తప్పించమని నక్కను వేడుకుంటుంది లేడిపిల్ల. అయితే, ఆ వల మొత్తం నరాలతో అల్లి ఉందని, తాను నరాలను నోటితో కొరకలేనని చెప్పి, పక్కనే ఉన్న పొదచాటుకు వెళ్లి నక్కి కూర్చుంటుంది. నక్క ఇలా మోసం చేసినందుకు లేడిపిల్ల చాలా బాధపడుతుంది.

మేతకు వెళ్లని తన మిత్రుడు ఎంతసేపైనా తిరిగిరావడంతో అనుమానం వచ్చిన కాకి వెతుక్కుంటూ రాగా, వలలో చిక్కుకుపోయిన లేడిపిల్ల కనిపిస్తుంది. ఇదంతా ఎలా జరిగిందని కాకి ప్రశ్నించగా, నక్క మాటలను నమ్మినందుకు తనకు ఈ రకంగా కీడు జరిగిందని కన్నీళ్ళు పెట్టుకుంటుంది లేడిపిల్ల.

ఇవి రెండూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పొలం యజమాని చేతిలో దుడ్డుకర్రతో అటుగా రావడం గమనించాయి. జరగబోయే అపాయాన్ని గ్రహించిన కాకి, లేడితో వలలో చచ్చిపోయినట్లు నటిస్తూ పడుకోమని, తాను చచ్చిన నీ కళ్లను పొడుస్తున్నట్లుగా నటిస్తానని చెప్పింది.

అంతేగాకుండా... తాను సమయం చూసి కూత పెట్టగానే లేచి పరుగుతీయమని, అప్పటికి అంతకుమించిన ఉపాయం మరోటి లేదని లేడికి అభయం ఇచ్చింది కాకి. పొలం యజమాని లేడి చచ్చిపోయిందనుకొని మెల్లగా వలను విడదీశాడు. దీన్ని గమనించిన కాకి పెద్దగా కేక పెట్టడంతో, ఒక్క ఉదటున లేచి పరుగెత్తింది లేడిపిల్ల.

లేడి తనను మోసం చేసి పారిపోవడం భరించలేని పొలం యజమాని తన చేతిలోని బడితను లేడి మీదకు విసిరాడు. అయితే, అది గురితప్పి పక్కనే పొదలో దాగివున్న నక్కకు తగిలి కుక్కచావు చచ్చింది. లేడిపిల్లను కాపాడుకుని దాన్నే అనుసరిస్తూ... వనంలోకి వెళ్లిపోయింది కాకి.

కాబట్టి పిల్లలూ...! పంచతంత్రంలోని ఈ కథ సారాంశం ఏమిటంటే... కొత్తగా వచ్చినవారిని త్వరపడి నమ్మితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో చెబుతుంది. అంతేగాకుండా ఎవరికైనా అపకారం చేయాలనుకుంటే, అలా అనుకున్న వారికే అపకారం ఎదురౌతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.

మీరు చేసే పనే... నేనూ చేస్తున్నా..!

రైతు దంపతులైన కమలమ్మ, రాజయ్య దంపతులకు హరి ఒక్కగానొక్క సంతానం. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు హరిని చాలా గారాభంగా చూసుకునేవారు. హరి చిన్నతనం నుంచే... వయసుకు మించిన తెలివితేటలను ప్రదర్శించేవాడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ ఇతడికి తాత హనుమయ్య అంటే చాలా ఇష్టపడేవాడు.

హరి తాత చాలా ముసలివాడు. ఏ పనీ చేయలేడు. పైగా... ఆయనకు అన్ని పనులకు కోడలు సపర్యలు చేయాల్సి వచ్చేది. ఇలా పొద్దస్తమానం అతడికి పనులు చేసి పెట్టడానికి హరి తల్లికి చాలా కష్టంగా ఉండేది. దీంతో ఆమె అతడిపై కోపం పెంచుకుంది. ఎన్ని రోజులు తనకు ఈ కష్టాలు, ఈ ముసలాడు పోయే కాలమే రాదా...? అంటూ ఆమె చాలారోజులు ఎదురుచూసింది.


అయితే ఆయన గుండ్రాయిలా ఆరోగ్యంగా ఉండేవాడు. దీంతో ఓపిక నశించిన హరి తల్లి... తన భర్తతో, ‘‘మీ నాయినతో నాకు ప్రాణం విసిగిపోతోంది. ఇంట్లో చాకిరీ అంతా ఒక ఎత్తయితే, ఆ ముసలాడి చేసే చాకిరీ మరో ఎత్తుగా ఉంది అంటూ బాధపడింది.

బాధపడకు... ముసలాడైపోయాడు. ఇంకెంత కాలం బ్రతుకుతాడులే...! అంటూ భార్యను ఓదార్చాడు రాజయ్య. ఎంతమంది చచ్చిపోయినా ఆయన మాత్రం దుడ్డుకర్రలాగా ఉంటాడు. ఈ జన్మకు నేను సుఖపడే యోగమే లేనట్లుంది అంటూ కోప్పడింది ఆమె.

తనకు ఆయుష్షున్నన్ని రోజులు బ్రతకనీ... ఏం చేస్తాం? చేతులారా చంపుకుంటామా?'' అన్నాడు రాజయ్య. ‘‘ఏం చంపితే? బతికి ఆయన ఎవరిని ఉద్దరించాలి అంటూ విరుచుకుపడింది కమలమ్మ. ఎలాగైనా సరే ఆ ముసలాడి పీడ వదిలించమని భర్తను కోరింది. అయితే రాజయ్యకు, తన తండ్రిని చేతులారా చంపటమంటే మొదట్లో చాలా ఘోరంగా కనబడింది. 



అయితే... పెళ్ళాం చాలా రోజులు పోరిన మీదట, ఆమె మాటలు వినీవినీ అందులో ఏమీ తప్పులేదని భావించాడు రాజయ్య. తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపేసి, మాయం చేసేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు.

అంతే... అనుకున్నదే తడవుగా తండ్రి దగ్గిరికి వెళ్ళి, ‘‘నాయినా, పొరుగూళ్ళో అప్పు మాట్లాడాను. వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వమన్నారు. ఓపిక చేసుకుని బండి మీద బయలుదేరు,'' అన్నాడు. ముసలివాడు నిజమేననుకుని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం ఉండని హరి కూడా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా, తాతతోపాటే బండి ఎక్కి కూచున్నాడు. తప్పేది లేక రాజయ్య తండ్రినీ, కొడుకునూ వెంటపెట్టుకుని బయలుదేరాడు.

అలా వెళ్తూ.. వెళ్తూ దారిలో ఒక చోట రాజయ్య బండి ఆపి, ‘‘ఇప్పుడే వస్తా!'' అంటూ బండిలో ఉన్న పార ఒకటి తీసుకుని చెట్ల మధ్యకు వెళ్ళాడు. హరి కూడా... తాతతో, ‘‘ఇప్పుడే వస్తా!'' అని చెప్పి మరొక పార తీసుకుని తండ్రి వెనకే చప్పుడు కాకుండా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్క గొయ్యి తవ్వుతూ కనిపించాడు.

అదే పొద అవతలివైపు చేరి అక్కడ తాను కూడా ఒక గొయ్యి తవ్వనారంభించాడు హరి. ఆ చప్పుడు విన్న రాజయ్య... పని ఆపి, పొద అవతలికి వెళ్ళి, కొడుకును చూసి ఆశ్చర్యపోతూ, ‘‘ఎందుకక్కడ గొయ్యి తవ్వుతున్నావు?'' అని అడిగాడు.

‘‘నువ్వెందుకు తవ్వుతున్నావో నేనూ, అందుకే...!'' అన్నాడు హరి. ‘‘నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసా?'' కోపంగా అడిగాడు తండ్రి. ‘‘నాకు తెలీదు. నువ్వెందుకు తవ్వుతున్నావు?'' అన్నాడు. ‘‘నా తండ్రిని పూడ్చటానికి గొయ్యి తవ్వుతున్నాను!. నేను ఆయన కొడుకును కాబట్టి, ఆయన చస్తే పాతి పెట్టాలిసిన బాధ్యత నాకుంది" అని అన్నాడు.



‘‘ఆయన ఇంకా బతికే ఉన్నాడుగా?'' బాధగా ప్రశ్నించాడు హరి తండ్రిని. అవును. కానీ నేను ఇప్పుడు ఆయనను చంపేసి, ఆ తరువాత పాతిపెడతాను అని అన్నాడు. అంతే హరి కోపంతో.... ఓహో అలాగా...! అయితే నా తండ్రి చస్తే, నాకు కూడా పాతిపెట్టాల్సిన బాధ్యత ఉంది అన్నాడు.

కొడుకు మాటలకు శరాఘాతంగా గుచ్చుకోగా, అప్పటికిగానీ తాను చేస్తున్న తప్పేంటో తెలియని రాజయ్య సిగ్గుతో తలవంచుకున్నాడు. పార తీసుకుని కొడుకును పోదాం పదా...! అంటూ తండ్రితో పాటు తిరిగి ఇంటికెళ్లిపోయాడు.

ఈపాటికి ఆ ముసలాడి పీడ వదిలే ఉంటుందన్న సంతోషంతో కమలమ్మ, రకరకాల పిండివంటలు చేసి భర్తకోసం, కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బండిలోంచి ముగ్గురూ దిగటంతో నిరుత్సాహపడిన ఆమె ఏమయ్యింది అంటూ భర్తను ప్రశ్నించింది.

అప్పుడు రాజయ్య భార్యతో జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న కమలమ్మకు గుండె చివుక్కుమంది. ‘‘వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుతున్నాం! తండ్రికే గొయ్యి తవ్వుతాడా? ఇక వాడి ముఖంచూసేదెలా!" అంటూ విరుచుకుపడింది. అప్పుడు రాజయ్య "నా తండ్రి మాత్రం నన్ను గారాభంగా పెంచలేదా...! ఇకమీదటైనా బుద్ధిగా ఉండు..." అంటూ ఆమెని హెచ్చరించాడు.

సూర్యదేవుడిపై జమదగ్ని యుద్ధం

వేసవికాలం కావడంతో ఎండ భగభగా మండిపోతోంది. తన ఆశ్రమం నుండి ఓ పనిమీద బయలుదేరిన జమదగ్ని మహామునిని ఎండ చుర్రున తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పనిమీద తాను వెళ్తుంటాడాయన.

అలా నడుస్తుండగా... ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. జమదగ్ని మహాముని ఎండ తీవ్రంగా నిలువనీయడం లేదు. దీంతో ఆగ్రహించిన ఆయన "సూర్యుడా...! దూరంగా వెళ్ళు" అంటూ ఆజ్ఞాపించాడు.


అంతా విన్న సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు సరికదా, మరింత ఉగ్రరూపం దాల్చాడు. ఎండ వేడి ఇంకా ఎక్కువ కావడంతో భరించలేకపోయిన జమదగ్ని.... వెంటనే తన విల్లూ, బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలటం ప్రారంభించాడు. అయితే అవి సూర్యుణ్ణి తాకకుండానే నేలమీద పడిపోతుంటాయి.

అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా... జమదగ్ని మహాముని పట్టువిడవకుండా ఒక బాణానికి మరో బాణం గుచ్చుతూ ఇంకా పైపైకి సంధించటం మొదలుపెట్టాడు. దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడి ఇంకా ఇంకా పెంచుతున్నాడు.

అప్పుడే ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఈ తతంగాన్నంతా చూసిన జమదగ్ని శిష్యురాలు ఎండ వేడిని తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతుంది. దీంతో ఆమెను తీసుకెళ్లి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో.... తన అస్త్రాలన్నింటినీ తీసుకుని సూర్యుడిపై సంధించసాగాడు. 



ఇక సూర్యుడికి వాటిని తట్టుకోవడం కష్టమై, బాణాలు వచ్చి గుచ్చుకుంటుంటే విలవిలలాడిపోతూ.... ఇక లాభం లేదనుకుంటూ ఒక మనిషిరూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు.

"ఓ మహామునీ..! ఏంటి తమరు చేస్తున్న పని. సూర్యుడు అంత దూరంలో ఉన్నాడు. అతడిని నువ్వు గాయపరచడం సాధ్యం కాదని" హెచ్చరించాడు.

అప్పుడు జమదగ్ని మాట్లాడుతూ... "ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు కానీ... మధ్యాహ్నం సమయాన నా నడినెత్తికి చేరువవుతాడు కదా...! అప్పుడైనా నా బాణాలకు చిక్కకపోడు" అన్నాడు కసిగా...

జమదగ్ని అన్నంతపనీ చేసేలాగా ఉన్నాడని గ్రహించిన సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. "ఓ మహామునీ...! శాంతించు. నేను సూర్యుణ్ణి. నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా తీక్షణతో భూమిని వేడెక్కించటం నా వృత్తి ధర్మం" అని చెప్పుకొచ్చాడు.

అంతేగాకుండా... జమదగ్నికి వేడినుండి ఉపశమనం పొందేందుకు కొన్ని కానుకలను ప్రసాదించాడు సూర్య భగవానుడు. అవేంటంటే... పావుకోళ్ళు, ఒక పెద్ద గొడుగు. అలా... అలా ఈ లోకంలోకి గొడుగులు, పావుకోళ్ళు (చెప్పులు) వాడకంలోకి వచ్చాయని పెద్దలు చెబుతుంటారు.

ఇకనైనా హాయిగా నిద్రపో...!

అమలాపురం అనే ఊర్లో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను బాగా పిసినారితనంతో ఉండేవాడు. ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ తను తినకుండా, ఇతరులకు పెట్టకుండా పీనాసి సూరయ్య అనే పేరు కూడా తెచ్చుకున్నాడు.

సూరయ్య ఒట్టి పిసినారి అన్న సంగతి ఊర్లోని జనాలందరికీ తెలిసినప్పటికీ, ఏ కొంతైనా సాయం చేయకపోతాడా...? అన్న ఆశతో అతడి వద్దకు వచ్చేవారు. సాయం చేయమని వేడుకునేవారు. అయినా మనసు కరగని సూరయ్య ఏవేవో సాకులు చెప్పి పంపించేవాడే గానీ, గడ్డిపరకంత సాయం మాత్రం చేసేవాడు కాదు.


ప్రతిరోజూ ఆ సాయం చెయ్యి, ఈ సాయం చెయ్యి అంటూ బంధువులు, ఊర్లో వాళ్ళు అందరూ ఎక్కువగా సూరయ్య దగ్గరకు రావడంతో ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా సరే వీళ్ళందరి పోరు వదిలించుకోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన పొలాలు, నగలన్నింటినీ అమ్మేసి పెద్ద ఎత్తున బంగారం కొన్నాడు.

ఉరికి దగ్గర్లో గల ఒక పాడుబడ్డ బావిలో, ఎవరూ కనుక్కోలేని చోటులో ఆ బంగారాన్నంతా భద్రంగా దాచిపెట్టాడు సూరయ్య. ప్రతిరోజూ ఉదయంపూట లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం ఎవరికీ తెలియకుండా ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వచ్చి, తనివితీరా చూసుకుని వెళ్తుండేవాడు. కాలం అలా గడిచిపోసాగింది....

అయితే ప్రతిరోజూ సూరయ్య ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తూ, వస్తుండటం ఒక దొంగ గమనించాడు. రహస్యంగా సూరయ్యను అనుసరించి బంగారం పాత్ర ఉన్న ప్రాంతాన్ని కనుక్కున్నాడు. అంతే మరుసటి రోజు గుట్టుచాటుగా వచ్చి బావిలోని సూరయ్య బంగారం పాత్రను దొరకబుచ్చుకుని, తీసుకొని వెళ్ళిపోయాడు.



రోజులాగే ఆ రోజు కూడా సూరయ్య పాడుబడ్డ బావివద్దకు వచ్చాడు. తన బంగారం పాత్ర ఉన్న ప్రాంతాన్ని చూడగానే అతడి గుండె చెరువైంది. పాత్ర ఉండాల్సిన చోట ఖాళీగా కనబడింది. అంతే అతడి గుండె బద్ధలయినంతపని అయింది. తాను కష్టపడి సంపాదించి, కూడబెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగిలించుకుపోయారని పొరలి పొరలి ఏడ్చాడు.

నెత్తీ నోరూ బాదుకుంటూ ఊరు బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో ఏడుస్తూ కూలబడ్డాడు. అప్పుడు ఆ దారినే వెళ్తూన్న ఆ ఊర్లోని ఒక ముసలాయన సూరయ్య చూసి విషయమేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అని ప్రశ్నించాడు.

అంతే.... జరిగిన విషయాన్నంతా పూసగుచ్చినట్లు చెప్పాడు సూరయ్య.

అంతా విన్న ముసలాయన... "ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు! ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! నువ్వు అనుభవించలేని ఐశ్వర్యం నీ కెందుకు చెప్పు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నిఅవస్ధలు పడ్డావు. అది కాస్తా ఇప్పుడు పోయింది. నీ బాధా విరుగుడయింది. ఇకనైనా హాయిగా నిద్రపో...!" అంటూ బుద్ధి మాటలు చెప్పాడు.

దీంతో చేసేదేమీలేక ఏడుపు మానేసిన సూరయ్య.... నిజమే కదా...! అనుకుంటూ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి, పిల్లలూ...! ఎంత సంపద ఉన్నప్పటికీ అనుభవించలేకపోతే అది వృధా అని, అలాగే పిసినారితనం అనేక సమస్యలకు మూలకారణమని ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదూ...!

బీర్బల్ కథలు... దొంగ సాధువు

అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు.

ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది.


దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు.

మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్లను వెళ్లగొట్టించాడు.



అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బల్ మరుసటిరోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను, గుడ్డివాడైన సాధువును రాజు సభకు పిలిపించాడు.

నువ్వు ఈ అమ్మాయి అమ్మానాన్నలను చంపావా? అని గుడ్డి సాధువు ప్రశ్నించాడు బీర్బల్. "నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను?" అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా..?! అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే.... తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు దొంగసాధువు.

అసలు రూపాన్ని బయటపెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేగాకుండా అతడివల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయం కల్పించాడు.

పంచతంత్రం కథ... ఉత్తమ మిత్రుడు...!

అసలు మిత్రుడంటే ఎవరు? చెరువులో నీళ్ళున్నప్పుడు తెప్పలుగా వచ్చి చేరే కప్పలలాంటి వాడు కాదు. మిత్రుడంటే తన అవసరానికి మాత్రమే మన దగ్గరకొచ్చి పబ్బం గడుపునేవాడు అంతమాత్రం కాదు. మరి మిత్రుడంటే ఎవరు? పాపపు పనుల నుండి మరల్చేవాడు, మంచి పనులు చేసేలా ప్రోత్సహించేవాడు, ఏవైనా రహస్యాలుంటే దాచిపెట్టేవాడు బర్తృహరి అనే కవి ఎప్పుడో చెప్పాడు.

కాబట్టి... పిల్లలూ... నిజమైన స్నేహితుడు అంటే ఎవరు...? స్నేహితుడంటే ఎలా ఉండాలి...? అని తెలియజెప్పే "ఇంద్ర, శుక సంవాదం" అనే పంచతంత్ర కథను ఈరోజు చదువుకుందాం.


కాశీ రాజు చక్కగా రాజ్యపాలన చేస్తున్న రోజులవి. ఆ రాజ్యంలో రాజుతో పాటుగా ప్రజలు కూడా ఎవరి ధర్మాలను వారు నిర్వర్తిస్తూ ఉండేవారు. ఒకానొక రోజున ఓ వేటగాడు తన వృత్తిధర్మంగా విల్లు, బాణాలను అన్నింటినీ సిద్ధం చేసుకుని వేటకోసం అడవికి బయలుదేరాడు. తన బాణపు దెబ్బ తగిలిన మృగం త్వరగా చనిపోయేందుకు వీలుగా బాణపు మొనలకు విషం పూసి తీసుకెళ్లాడు వేటగాడు.

జంతు సంచారం ఎక్కువగా ఉండే ఓ ప్రాంతానికి వెళ్లిన వేటగాడు అక్కడ మాటువేశాడు. కాసేపట్లోనే అక్కడికి పెద్ద లేళ్ళ గుంపు ఒకటి వచ్చింది. వెంటనే తన బాణాన్ని ఓ లేడిపిల్లకేసి గురిచూశాడు వేటగాడు. అయితే ఆ బాణం గురితప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుకు గుచ్చుకుంది. విషపూరితమైన ఆ బాణపు తాకిడి అంతటి చెట్టు కూడా ఒక్కసారిగా కంపించిపోయింది.

విషమంతా చెట్టు వేర్లనుండి కొమ్మలదాకా వ్యాపించడంతో కాసేపట్లోనే ఆ చెట్టు ఆకులు, కాయలు అన్నీ రాలిపోయి ఆ వెంటనే చెట్టంతా ఎండిపోయింది. ఆ ఎండిపోయిన చెట్టు తొర్రలోనే ఎప్పటినుంచో ఒక చిలుక కాపురం ఉంటుంది. అది అక్కడే పుట్టి, అక్కడే పెరిగి ఉంటుంది. అందుచేత ఆ చెట్టుమీద దానికి చాలా ప్రేమ. అంతకుమించిన భక్తీ ఉన్నాయి. పాపం విషం దెబ్బకు ఆ చెట్టు ఎండిపోయినప్పటికీ చిలుక అక్కడినుంచి వెళ్లిపోలేదు.

చెట్టు పచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఉండి, ఆ తరువాత ఎటూ వెళ్ళకుండా, చెట్టు కష్టాలలో పడినప్పటికీ అది మళ్లీ బాగుపడితే బాగుండునని దేవున్ని ప్రార్థిస్తూ అక్కడే ఉండిపోతుంది చిలుక. చెట్టు మళ్ళీ బాగుపడాలన్న దీక్షతో దేవుణ్ణి ప్రార్థిస్తున్న చిలుక దేవేంద్రుడి దృష్టిని ఆకర్షించింది.



ఒకరోజున అటువైపుగా వెళ్తోన్న దేవేంద్రుడు ఆ చిలుకను చూసి ఒక విప్రుడి వేషంలో వచ్చి దాన్ని పలుకరించాడు. చెట్టు ఎలాగూ నాశమైపోయింది కదా...! నీవు ఇక్కడినుంచి వెళ్లిపోయి ఏదైనా మరో పచ్చని చెట్టులో నివాసం ఏర్పరచుకోవచ్చుకదా...! అని అన్నాడు.

అప్పుడు దేవేంద్రుడిని తనకున్న దైవభక్తితో గుర్తుపట్టిన చిలుక... ఓ దేవేంద్రుడా నేను ఈ చెట్టుమీదనే పుట్టానయ్యా...! ఈ చెట్టుపైనే ఆడుకుంటూ పెరిగాను కూడా. ఈ చెట్టునుండి ఎన్ని మంచి విషయాలు తెలుసుకున్నానో అలాగే ఈ చెట్టు కూడా నన్ను కన్నబిడ్డలా కాపాడిందయ్యా...! అందుకే నాకు ఈ చెట్టంటే అంత భక్తి, ప్రేమ అని చెప్పింది.

నన్ను ఇంతలా ఆదరించిన ఈ చెట్టుకు ఇప్పుడేదో కష్టకాలం వచ్చిందని నేను దీన్ని వదలిపెట్టి వెళితే కృతఘ్నతా పాపం చుట్టుకోదా...? అందుకే ఏమి జరిగినా నేను ఈ చెట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నానని దేవేంద్రుడికి చెప్పింది చిలుక. దేవేంద్రుడంతటివాడికి చిలుక చెప్పిన మాటలు మనసును ద్రవింపజేశాయి.

చిలుక మంచితనాన్ని మెచ్చుకున్న దేవేంద్రుడు ఏదైనా వరం కోరుకోమని అడుగగా... ఆ చెట్టు మళ్ళీ పచ్చపచ్చగా, ఆకులతో, పువ్వులతో, కాయలతో, పండ్లతో కలకాలం వర్ధిల్లేలా అనుగ్రహించమని కోరింది. చిలుక నిస్వార్ధబుద్ధికి దేవేంద్రుడు ఆనందపరవశుడై ఆ చెట్టుమీద అమృతాన్ని వర్షింపజేశాడు. మోడైన చెట్టు మళ్ళీ చిలుక కోరుకున్నట్లుగా పచ్చపచ్చగా కళకళలాడింది.

కాబట్టి పిల్లలూ....! మిత్రుడంటే సుఖాలలో ఉన్నప్పుడు మాత్రమే అంటిపెట్టుకునేవాడు కాదని, కష్టకాలంలో కూడా తోడూ నీడగా ఉంటాడని, అలాంటి వాడే ఉత్తమ మిత్రుడని ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...!

అబద్దం తెచ్చిన తంటాలు...!

రామనాథం, శారదాంబ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు రాజేష్. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు రాజేష్‌ను బాగా గారాభంగా పెంచుకున్నారు. తను చెప్పినట్లల్లా తల్లిదండ్రులు వింటుండటంతో అతడి గారాభం ఎక్కువైంది. అంతేగాకుండా అల్లర చిల్లపనులు చేస్తూ... అనేక సాకులు చెబుతూ స్కూలుకు ఎగనామం పెట్టేవాడు.

కానీ రాజేష్ తల్లిదండ్రులకు అతడు చేసే చిల్లరపనులన్నీ తెలిసేవి కావు. తమ బిడ్డ మంచివాడనుకుంటూ ఉండేవారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజు స్కూలు ఎగ్గొట్టి, అద్దె సైకిలు తెచ్చుకుని ఊరంతా బలాదూర్ తిరుగుతాడు రాజేష్. అలా తిరుగుతుండగా, సైకిలు రాయికి గుద్దుకుని కిందపడిపోయాడు. దీంతో సైకిల్ బ్రేకులు అతడికి గుచ్చుకుని రక్తం కారుతుంది.


ఎలాగోలా ఓపిక తెచ్చుకున్న రాజేష్ కుంటుకుంటూ వెళ్లి సైకిలును బాడుగ షాపు వాళ్ళకు ఇవ్వడానికి వెళతాడు. అక్కడ ఆ షాపు యజమాని అతడిని చూసి అయ్యో...! ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది. మీ అమ్మానాన్నలకు చెప్పి హాస్పిటల్‌కు వెళ్ళు అంటూ సానుభూతిగా చెప్పాడు.

ఇంటికి వెళ్ళగానే రాజేష్‌ని చూసిన తల్లిదండ్రులు అయ్యో...! ఏమయ్యింది నాన్నా...! ఎందుకు అలా కాలు కుంటుతున్నావు? అంటూ ఆదుర్దాగా అడిగారు. బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు. బడికి ఎగనామం పెట్టి సైకిల్‌పై తిరుగుతూ క్రింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అలా అబద్ధం చెప్పాడు రాజేష్.

అబ్బా...! ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ రాజేష్ కాలికి పసుపు రాసింది తల్లి. అలా రెండు రోజులు గడిచిపోయాయి. రాజేష్ కాలు బాగా వాచింది. కాలు కదపడానికి కూడా వీలు కావడం లేదు. అప్పుడు రాజేష్ తండ్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. దెబ్బను చూసిన డాక్టర్ ఎలా తగిలింది అంటూ రాజేష్‌ని ప్రశ్నించాడు.



బడి నుంచి వస్తుంటే జారి క్రిందపడ్డాను సార్...! రాయి గుచ్చుకుంది అంతే... అంటూ మళ్ళీ అబద్ధం చెప్పాడు రాజేష్. డాక్టర్‌కు రాజేష్ పరిస్థితి అర్థమై నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది అంటూ బెదిరించాడు. దీంతో చేసేదిలేక నిజం చెప్పేశాడు రాజేష్.

అంతా విన్న డాక్టర్ చూడండీ... మీ వాడు అందరితో అబద్ధం చెప్పాడు. ఇంకా రెండు మూడు రోజులు ఇలాగే ఉండిఉంటే... కాలు తీసేయాల్సి వచ్చేది అన్నాడు. వెంటనే టీటీ ఇంజక్షన్లు, యాంటీ సెప్టిక్ మందులు ఇచ్చాడు డాక్టర్. తరువాత రాజేష్ వైపు చూస్తూ... ఇకనైనా జాగ్రతగా ఉండాలని చెప్పాడు.

హాస్పిటల్ నుండి ఇంటికెళుతూ... రాజేష్ తండ్రి మొహంలోకి కూడా చూడటానికి ఇబ్బంది పడుతూ... అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరాడు. ఇకమీదట ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయనని ప్రామిస్ చేశాడు. అలాగే తన మనస్సులో ఇలా అనుకున్నాడు... కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది. నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది, ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అనుకున్నాడు.

ఆరోజు నుండి అబద్ధం చెప్పకుండా రాజేష్ బుద్ధిగా మసలుకున్నాడు. అంతేకాకుండా బడికి సక్రమంగా వెళుతూ, పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాసయ్యాడు. కాబట్టి పిల్లలూ...! అబద్ధాలు ఆడకూడదు. చేసిన తప్పును మొదట్లోనే సరిదిద్దుకున్నవారే భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారు.

రాజ్యవర్ధనుడు... ఏడు కూజాలు...!

అనగనగా రాజ్యవర్ధనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడి రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా, ఖజానా నిండా డబ్బులతో సుభిక్షంగా ఉండేది. పంటలు కూడా బాగా పండటం వల్ల రైతులు, రాజ్యం సుభిక్షంగా ఉండటంతో ప్రజలూ చాలా సంతృప్తితో జీవనం గడిపేవారు.

అయినప్పటికీ రాజు రాజ్యవర్ధనుడికి ఎదో తెలీని అసంతృప్తి. తాను ఇంకా ఏదో సాధించాలని, ఏదో కోల్పోతున్నానని భావిస్తూ ఎప్పుడూ అసంతృప్తితో రగిలిపోతుండేవాడు రాజు. అలా గడుస్తుండగా, ఒకరోజు ఆయన అడవికి వేటకు వెళ్లాడు. వేటలో జింకలు, బావురుపిల్లిలు, నెమళ్ళను వేటాడి, అలసిపోయి ఒక చెట్టు నీడన నిద్రించాడు. అప్పుడు ఆయన ఒక దివ్యమైన కల వస్తుంది.


ఆ కలలో ఒక పెద్దాయన కనపడి రాజా రాజ్యవర్ధనా....! "నేను నీకు ఎంతో అమూల్యమైన ధనం ఇస్తున్నాను. ఇకనైనా తృప్తిగా బ్రతకటం నేర్చుకో...!" అని అన్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన రాజు... ఏదీ ఆ అమూల్యమైన ధనం... అంటూ చేతులు చాచాడు. ఆ... ఆ.... ఆగు ఆగు.... అయితే నువ్వు నేను పెట్టే ఓ షరతుకు ఒప్పుకుంటేనే ఆ ధనం నీకు సొంతమవుతుందని చెప్పాడా పెద్దాయన.

సరే మీ షరతును ఒప్పుకుంటున్నానని పెద్దాయనకు చెప్పాడు రాజు. అంతేగాకుండా ఆ కండీషన్ ఏమిటో చెప్పమన్నాడు. అప్పుడు పెద్దాయన ఇలా చెప్పాడు. "నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను. వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలైనవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి, సగం ఖాళీగా ఉంటుంది. కాబట్టి, నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలలోని ధనం, వజ్ర వైఢూర్యాలన్నీ నీవేనని చెబుతూ మాయమైపోతాడు.

వెంటనే సంభ్రమాశ్చర్యాలతో ధిగ్గున మేల్కొన్నాడు రాజ్యవర్ధనుడు. పక్కన పరికించి చూస్తే.... ధగ ధగా మెరిచే ఏడు కూజాలు కనిపించాయి. అంతేగాకుండా వాటిలో పెద్దాయన చెప్పినట్లుగానే ధనం, వజ్ర వైఢూర్యాలను చూసిన రాజుకి మతి పోయినంత పనైంది. వెంటనే తన పరివారాన్ని రప్పించిన రాజు ఆ ఏడు కూజాలను తన రాజ భవనానికి తరలించాడు.



తరువాత తీరికగా పెద్దాయన చెప్పినట్లుగా... ఏడవ కూజా సగ భాగానికి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు, నగలు, వజ్ర వైఢూర్యాలన్నింటినీ అందులో వేశాడు. అయినా కూజా నిండలేదు ఇంకా సగం భాగానే ఖాళీగానే ఉంది. దీంతో ఎటూ పాలుబోని ఆయనఆలోచనలో పడ్డాడు.

అటు తరువాత తన రాజ్యపు ఒక్కరోజు ఆదాయం మొత్తాన్ని కూజాలో వేసినా కూజాలోని సగం భాగం అలానే ఖాళీగా ఉంది. ఆపై వారం రోజుల ఆదాయాన్ని, ఆ తరువాత నెలరోజుల ఆదాయాన్ని కూజాలో వేసినా అలాగే ఖాళీగానే అది దర్శనమిస్తోంది. ఇంక ఇలాగ కాదు అనుకుంటూ రాజు ఒక సంవత్సరం ఆదాయం మొత్తాన్ని అందులో వేసినా ఖాళీ ఏమాత్రం తగ్గలేదు.

అంతే.... పూర్తిగా ఆగ్రహావేశాలకు లోనైన రాజ్యవర్థనుడు పౌరుషంతో, పట్టరాని అసహనంతో రాజ్యంలోని మొత్తం ఖజానాను అందులో వేసేందుకు సిద్ధపడ్డాడు. దీంతో పెద్దాయన రాజు కళ్లముందు ప్రత్యక్షమై ఇలా మాట్లాడాడు.

రాజ్యవర్ధనా...! నేను ఇచ్చిన ఏడో కూజా నీ మనసు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు. పూర్తిగా సుభిక్షంగా, ఎలాంటి లోటులేని రాజ్యానికి రాజువై ఉండి, ఎప్పుడూ అసంతృప్తితో జీవిస్తున్నావు నువ్వు. నీకు కళ్లు తెరిపించేందుకే నేను ఆ ఏడో కూజాను నీకిచ్చాను. ఇకమీదటైనా బుద్ధి తెచ్చుకుని సంతృప్తిగా బ్రతకడం నేర్చుకో...! అంటూ హితబోధ చేసి మాయమయ్యాడు పెద్దాయన.

అప్పటికీగానీ కళ్లు తెరచుకోని రాజ్యవర్ధనుడికి తాను చేసిన తప్పేమిటో అర్థమై.... ఇకమీదట తాను ఆవేశాన్ని తగ్గించుకుని సంతృప్తిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి పిల్లలూ... మనకు లభించిన దానితో పూర్తిగా సంతృప్తికరమైన జీవితాన్ని గడపటం నేర్చుకోవాలని రాజ్యవర్ధనుడి కథ చదివితే మీకు అర్థమైంది కదూ...!

తెనాలి రామలింగడు... భలే శుంఠ...!

రాయలవారి ఆస్థానంలో ప్రతి ఏటా "భలే శుంఠ" అనే పోటీలు జరుగుతుండేవి. ఈ పోటీలలో అందరికంటే గొప్ప శుంఠను గుర్తించి 5 వేల బంగారు నాణాలతో రాజు సత్కరించేవారు. అయితే, ప్రతిసారీ ఈ బహుమతిని తెనాలి రామలింగడే తన తెలివితేటలతో గెలుచుకుంటుండేవాడు.

దీన్ని గమనించిన ఆ రాజ్యంలోని సేనాధిపతికి కోపంతో "ఎప్పుడూ రామలింగడే గెలుచుకుంటున్నాడు. ఈసారి వేరొకరికి ఈ బహుమతి వచ్చేలా చేయాలి" అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సరిగ్గా పోటీలు మొదలయిన రోజు రామలింగడి గదికి బయటినుండి గడియ పెట్టించాడు.

ఒకవైపు రామలింగడు ఆ గదిలోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడుతుంటే... మరోవైపు రాయలవారు పోటీలను తిలకిస్తూ, శుంఠ ఎవరో తేల్చే పనిలో మునిగిపోయి ఉన్నారు. చివరకు ఎలాగోలా రామలింగడు గదిలోంచి బయటపడి నేరుగా పోటీలు జరిగే చోటుకు చేరుకున్నాడు.



దీన్ని గమనించిన రాయలవారు "అదేంటి రామలింగా...! ఎందుకింత ఆలస్యంగా వచ్చావు...?" అంటూ ప్రశ్నించారు. సమాధానంగా రామలింగడు మాట్లాడుతూ... "ప్రభూ...! నాకు ఉన్నట్లుండి వంద బంగారు నాణేల అవసరం వచ్చింది. వాటిని ఏర్పాటు చేసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది" అని అన్నాడు.

"ఏంటీ... వంద బంగారు నాణేల కోసం ఇంత సమయం వృధా చేశావా...? ఈ పోటీకి వచ్చి, గెలిస్తే నీకు 5వేల బంగారు నాణేలు దక్కేవి కదా...! ఆ మాత్రం నీ బుర్రకు తట్టలేదా...? ఒట్టి శుంఠ లాగున్నావే...!" అంటూ నవ్వుతూ అన్నాడు రాయలవారు. "అవును ప్రభూ...! నేను శుంఠనే..!" అని అన్నాడు రామలింగడు రెట్టిస్తూ... "నిజంగా నువ్వు శుంఠవే...!" కోపంగా అన్నాడు శ్రీకృష్ణదేవరాయులు.

అప్పుడు రామలింగడు తెలివిగా... "ప్రభూ...! నిజంగా శుంఠను నేనే కదా...! అయితే ఈ పోటీ నేనే నెగ్గినట్లు కదా...!" అన్నాడు. దాంతో నాలిక్కరుచుకున్న రాయలవారు రామలింగడి తెలివికి మెచ్చి, 5వేల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చి, విజేతగా ప్రకటించాడు.

ఆత్మవిశ్వాసం ఉంటే గెలుపు తథ్యం!

కాకతీయ రాజులకు, మధురైకి చెందిన పాండ్య రాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే, అంగబలంలోనూ, అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయరాజు గణపతిదేవుడు పాండ్యరాజులను ఓడించి, వారిని తనకు సామంతులుగా చేసుకోవాలని అనుకుంటుండేవాడు.

ఒకరోజు గణపతిదేవుడికి ఆ అవకాశం రానే వచ్చింది. యుద్ధం కోసం తయారవమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు. అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు చెప్పాడు సేనాధిపతి. ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే అపజయం పాలవ్వాల్సి వస్తుందేమోనన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు.


అయితే పాండ్య రాజులను ఓడించేందుకు మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందనీ, దీన్ని పోగొట్టుకోదలచుకోలేదని చెప్పిన గణపతిదేవుడు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనని ఆజ్ఞాపించాడు. ఇలాగైతే తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి, రాజుకు అవమానం జరుగక తప్పదనుకుంటూ సైన్యం సేనాధిపతి వెంట యుద్ధానికి బయలుదేరింది.

సేనాధిపతి, సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరిన గణపతిదేవుడు దారిలో సైనికులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకోవటం గమనించాడు. గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూ లేదని గ్రహించిన ఆయన వారిలో ఆత్మ విశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు.

గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి నమస్కరించి బయటకు వచ్చిన రాజు "ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు ఈ యుద్ధంలో గెలవలేమని అనుకుంటున్నారు కదూ...! ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి...!" అంటూ పిలిచాడు.



ఒక నాణెము తీసి చూపించి "బొమ్మా... బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్లే...! విజయం మనదే...! అదే బొరుసు పడితే మనం వెనక్కి వెళ్ళిపోదాం" అంటూ నాణెం పైకి ఎగురవేశాడు. అంతే... నాణంపై రాజముద్రిక కనిపించింది.

నాణెముపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహము ఉరకలు వేసి, గంగా ప్రవాహంలా సైన్యము ముందుకుసాగింది. గెలుపుతమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రుసైనికులను చీల్చి చెండాడారు. రాజు గణపతిదేవుడు, మధురై పాండ్య రాజులతో తలపడి వారిని చిత్తుగా ఓడించి, వారి మిత్రరాజు కొప్పెరుజంగను తనకు దాసోహమయ్యేటట్లు చేసుకున్నాడు

యుద్ధంలో విజయానంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా... రాజు వద్దకు వచ్చిన సేనాధిపతి "యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం చేతనే యుద్ధం చేయించి, విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉంది ప్రభూ...!" అని అన్నాడు. అప్పుడు గణపతిదేవుడు నవ్వుతూ... తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మా బొరుసూ వెండి నాణేన్ని చూపించాడు. నాణెం రెండువైపులా రాజముద్రిక ఉండటం గమనించిన సేనాధిపతి రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు.

ఈ కథను బట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి పిల్లలూ...! అన్నింటికంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అర్థమైంది కదూ...! యుద్ధానికి ఏ మాత్రం సంసిద్ధంగా లేని సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండినాణెం రెండువైపులా రాజముద్రిక ఉన్నదాన్నే బొమ్మా బొరుసు వేశాడు. వారిలో ఉత్సాహం ఉరకలు వేసేలా చేశాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే... ఆత్మవిశ్వాసం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు.

జపం జపం...! కొంగ జపం...!

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు దానికి తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలి బాధతో విలవిలలాడుతూ... ఆహారం కోసం ఎంతగానో ప్రయత్నించింది నక్క. తిరిగి తిరిగీ నీరసం వచ్చి పడిపోయిన నక్క ఇలాగైతే ఆకలితో చనిపోవడం ఖాయం అనుకుంటూ ఏడ్వసాగింది. ఎలాగైనా సరే ఆహారం సంపాదించాలనుకున్నా, అప్పటికప్పుడు ఏంచేయాలో దానికి పాలుబోలేదు. చేసేదేమీ లేక దేవుడి వేడుకోసాగింది.

ఎక్కడ ఆహారం దొరుకుతుందా...? అంటూ తీవ్రంగా ఆలోచనలో పడ్డ నక్క, బాగా దాహం వేయడంతో కనీసం నీళ్లైనా తాగుదామనుకుంది. అసలే ఒంట్లో ఏ మాత్రం శక్తి లేని నక్క ఎక్కువ దూరం నడిచే ఓపిక లేక దగ్గర్లోని ఏదో ఒక చెరువు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా మెల్లగా నడుచుకుంటూ దగ్గర్లోని ఓ చెరువు దగ్గరకు వెళ్ళింది.


చెరువులో ఒక కొంగ చేపల్ని పట్టి తినడం గమనించింది నక్క. అసలే ఆకలి బాధతో ఉన్న నక్కకు ఆ దృశ్యం మరింత కోపం కలిగించింది. తనకు తిండిలేక అలమటిస్తోంటే, కొంగ ఎంచక్కా చేపల్ని తింటుండటం నక్కకు ఈర్ష్యని కలిగించింది. అంతేగాకుండా కొంగ ఒంటికాలిపై నిలబడి చేపల్ని తినే విధానం చూసిన నక్కకు, తాను కూడా అలా చేపల్ని పట్టి తినాలన్న కోరిక కలిగింది.

అనుకున్నదే తడవుగా నీళ్ళలోకి దిగింది నక్క. అయితే దానికి కొంగలా చాలాసేపు నిలబడి చేపల్ని పట్టాలంటే చేతకాలేదు. ఎలాగబ్బా... అని ఆలోచనలో పడింది నక్క. ఇదలా జరుగుతుండగానే కొంగ మళ్ళీ యథావిధిగా చెరువులోకి వచ్చి చేపలవేట ప్రారంభించింది. ఇదంతా గమనిస్తోన్న నక్క వెనుకనుండి వచ్చి కొంగ మెడ పట్టుకుంది.



హఠాత్ పరిణామానికి భయపడ్డ కొంగ వెంటనే తేరుకుని... "మిత్రమా...! నీకు కలిగిన కష్టమేమిటి? ఎందుకు నా మెడ అలా పట్టుకున్నావని" అడిగింది. దానికి నక్క కోపంగా.... నేను తిండిలేక అల్లాడుతుంటే... నీకేమో మంచి ఆహారం దొరుకుతోంది. అందుకే నీ మెడ పట్టుకున్నానని చెప్పింది.

ఎటూ పాలుబోని కొంగ ఒక ఉపాయాన్ని ఆలోచించింది. నీకు దొరకని ఆహారం నాకు దొరుకుతుండటానికి కారణం "జపం" చేయటమేనని నక్కతో చెప్పింది. అయితే ఆ జపం గురించి తనకు చెప్పమంది నక్క. నీవు కూడా ఒంటికాలిమీద నిల్చుని ఓం, హీం అంటూ జపం చేస్తూ రెండడుగులు ముందుకు వేయాలని చెప్పింది కొంగ.

కొంగ మాటలను నమ్మిన నక్క, దాని మెడను ఒక చేత్తో పట్టుకుని జపం కోసం చెరువులోకి దిగుతుంది. అలా రెండడుగులు నీళ్ళలోకి వెళ్లగానే నక్క మునిగిపోతుంది. దీంతో కొంగ మెడను వదలిపెడుతుంది. అపుడు కొంగ నక్కబారి నుంచి తప్పించుకుని ఒడ్డుమీదకు చేరి నక్కతో ఇలా అంటుంది. "నీకు చేపలు కావాలి కదా... చెరువులోని అన్నింటినీ నువ్వే బాగా తిను...!" అని నవ్వుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది కొంగ.

కాబట్టి పిల్లలూ...! కొంగ జపం అని ఊరికే అనలేదు పెద్దలు. ప్రాణాల మీదికి వచ్చినప్పటికీ తెలివిగా ఆలోచించి నక్క బారినుండి తప్పించుకున్న కొంగ కథను తెలుసుకున్నాం కదూ...! రేపు మరో కథను చదువుకుందాం...!

సంతృప్తే అన్నింటికన్నా మిన్న!

రమణ, కమల దంపతుల ఒక్కగానొక్క కొడుకు శీను అంటే పంచప్రాణాలు. శీనును చాలా గారాభంగా పెంచుకోవడమే గాకుండా ఏది అడిగినా వారు కాదనుకుండా తెచ్చి ఇచ్చేవారు. తల్లిదండ్రుల గారాభానికి బాగా అలవాటుపడిన శీను అవసరం ఉన్నా లేక పోయినా గొంతెమ్మ కోరికలు కోరసాగాడు.

అయితే... చిరుద్యోగి అయిన శీను తండ్రి రమణ వాడు కోరే కోరికలన్నింటినీ కాదనలేక... తన శక్తిమేరకు అప్ప సప్పో చేసి తంటాలు పడుతూ కొనిచ్చేవాడు.

ఇలా ఉంటే... ఒకరోజు శీను తనకు కొత్త సైకిల్ కావాలని పట్టుబట్టాడు. అసలే డబ్బుల్లేక అవస్థలు పడుతోన్న రమణకు అప్పటికప్పుడు కొత్త సైకిల్‌కు అవసరమైన రెండు వేల రూపాయలకు ఎక్కడికెళ్ళాలో అర్థం కాలేదు. ఇప్పుడు డబ్బులు లేవురా... వచ్చే నెల జీతం రాగానే కొనిస్తానని శీనుకు సర్దిజెప్పబోయాడు.



"అదేం కుదరదు. నాకు సైకిల్ ఇప్పుడే కావాలి. లేకుంటే నేను అన్నం తిననని" మొండికేశాడు శీను. తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడినా వినలేదు. చివరకు విసిగిపోయిన తండ్రి ఆఫీసుకు వెళ్లిపోయాడు. శీను స్కూల్ ఎగ్గొట్టి, అలిగి ఇంటిబయట అరుగుమీద ఏడుస్తూ కూర్చున్నాడు.

అలా కూర్చొని ఉండగా ఓ భిక్షగాడు భిక్షం కోసం వాళ్ల ఇంటికి వచ్చాడు. "అమ్మా...! భిక్షం వేయండి తల్లీ...!" అంటూ దీనంగా అడిగాడు. శీను భిక్షగాడిని పరిశీలించి చూశాడు. ఆ భిక్షగాడికి రెండు కాళ్లూ లేవు. చేతి కర్రల సాయంతో అతికష్టంమీద నడుస్తున్నాడు.

భిక్షగాడి పరిస్థితిని గమనించిన శీనుకు ఆ క్షణంలో కళ్లు తెరచుకున్నాయి. దేవుడు తనకు ఆరోగ్యకరమైన రెండు కాళ్లు ఇచ్చాడు. తన అవసరాలు చూసుకోవడానికి తల్లిదండ్రులను ఇచ్చాడు. వాళ్ల ప్రేమను ఇచ్చాడు. ఆ భిక్షగాడితో పోలిస్తే తను ఎంతో సంతోషంగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు తాను లేనిపోని కోరికలతో ఎందుకు దుఃఖపడుతున్నాను అని ఆలోచించాడు. వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు.

తల్లిదండ్రులపట్ల కృతజ్ఞతతో శీను కళ్లు చెమర్చాయి. ఇంకెప్పుడూ తన అమ్మానాన్నలను అనవసరమైన కోరికలు కోరకుండా ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బ్రతకాలి, సంతృప్తిని మించిన బలం ఏదీ లేదని అనుకున్నాడు.

జిత్తులమారి నక్క - ఏనుగు

పూర్వకాలంలో గోదావరి తీరంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రకరకాల క్రిమికీటకాదులు, జంతువులు ఎంతో సుఖంగా, సంతోషంగా జీవనం గడుపుతుండేవి. ఆ అడవిలో కనకం అనే పెద్ద మదపుటేనుగు కూడా ఉండేది. అది చాలా పెద్ద శరీరంతో చిన్న కొండ కదలివస్తోందా అన్నట్లుగా ఉండేది. దాని ఆకారాన్ని, శక్తిని చూసిన చిన్న చిన్న జీవులు భయంతో గజగజా వణికిపోయేవి.

మదపుటేనుగు పొడుగైన దంతాలు, అడుగుల బారినపడి జంతువులు చాలావరకు నశించిపోయాయి. ఏనుగు భయానికి భయపడ్డ మరికొన్ని ప్రాణులు అడవిని వదలి వేరే చోటికి వలసవెళ్ళి జీవనం సాగించాయి. అయితే అడవులోని జంతువులన్నీ సగం ఏనుగు ధాటికి చనిపోగా, మరికొన్ని అడవిని వదలి వెళ్లిపోవడంతో అక్కడ ఉండే నక్కలకు ఆహారం లేక క్రమంగా ఒక్కొక్కటిగా చనిపోతుంటాయి.


తమ జాతి ఇలా అంతరించి పోవడాన్ని చూసి భోరున విలపించిన నక్కలన్నీ ఓ రోజు సమావేశమయ్యాయి. ఎలాగైనా సరే మదపుటేనుగు పీడ వదిలించుకోవాలని అనుకున్నాయి. "ఈ ఏనుగు చచ్చిపోతే మనకు కొన్ని నెలలదాకా తిండికి లోటుండదు. ఇది చనిపోయిందని తెలిస్తే పారిపోయిన జంతువులన్నీ కూడా తిరిగి వస్తాయి. అప్పుడు ఎంచక్కా కడుపునిండా మనకు తిండి దొరుకుతుందని" అనుకున్నాయి.

అలా అనుకున్నదే తడవుగా ఓ పిల్ల నక్క లేచి నిలబడి "ఆ ఏనుగును నేను చంపుతాను" అని చెప్పింది. దాని మాటలు విన్న మిగతా నక్కలు ఫక్కున నవ్వాయి. ఇంతలో అన్నింట్లో పెద్దదైన నక్క ఒకటి, మిగిలిన నక్కలను ఊరకుండమని హెచ్చరిస్తూ..."ఇదేమైనా ఆడుకునే ఏనుగు అనుకుంటున్నావా..?! దీన్ని చంపటం మాకే చేతకాదు. నీవెళ్ళి ఏం చేస్తావు?" అంటూ పిల్లనక్కను బెదిరించింది.

అయితే పెద్దనక్క మాటలు విన్న పిల్లనక్క వస్తోన్న కోపాన్ని తమాయించుకుని "అయినా మీరు వయసును, శరీరాన్ని చూసి తెలివితేటలను లెక్కించటం సరికాదు. నాకు అవకాశం ఇస్తే తన ప్రతిభ ఏంటో నిరూపించుకుంటానని" సవాలు చేసింది. ఈ మాటలు విన్న పెద్ద నక్క "సరే.. చూద్దాం... కానీ...!" అన్నాడు.



మరుసటిరోజు ఉదయాన్నే పిల్ల నక్క ఏనుగు దగ్గరకు వెళ్ళి... నమస్కారం చేసి "మహారాజులవారికి జయము... జయము!" అంటూ పక్కన నిలుచుంది. ఆ పిల్లనక్క తనను మహారాజు అంటూ పిలవడంతో ఆశ్చర్యపోయిన ఏనుగు ఎవరు నువ్వు? అంటూ గట్టిగా నిలదీసింది.

"ప్రభూ...! నేను నక్క పిల్లను. అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలనపడి ఉంటోంది. మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని మహారాజా...! అని సంభోదించానని చెప్పింది. ఇకపై ఈ అడవికి రారాజు మీరేనని మేమందరం తీర్మానించుకున్నామని, మిమ్మల్ని రాజుని చేసేందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చానని వివరించి చెప్పింది పిల్లనక్క.

సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన మదపుటేనుగు గర్వంగా, రారాజు ఠీవితో నడుస్తూ... ఎక్కడికెళ్ళాలి? ఇంకా ఎంతదూరం వెళ్ళాలి..? అంటూ ప్రశ్నించింది. "దగ్గరే మహారాజా... నాతో రండి" అంటూ జిత్తులమారి నక్క మెల్లగా ఊబివైపు తీసుకెళ్ళింది. ఇకపై తానే రాజునన్న సంతోషంతో మునిగితేలుతున్న ఏనుగు ఎటు వెళ్తుందో గమనించకుండా నడువసాగింది. అలా వెళ్తుండగానే హఠాత్తుగా ఊబిలోకి దిగబడిపోయింది.

వెంటనే ఈ లోకంలోకి వచ్చిన ఏనుగు "కాపాడండి...! కాపాడండి...!" అంటూ అరవసాగింది. దీంతో... జిత్తుమారి నక్కనైన నన్ను నమ్మి వచ్చిన నువ్వు తగిన ఫలితమే అనుభవించావు మహారాజా...? అని వెకిలిగా నవ్వసాగింది పిల్లనక్క. ఏనుగు కేకలు విన్న మిగిలిన జంతువులన్నీ అక్కడికి వచ్చేసరికే అది పూర్తిగా ఊబిలో కూరుకుపోయింది. అది చూసిన మిగిలిన జంతువులన్నీ పిల్లనక్క తెలివితేటలను ప్రశంసించాయి. పెద్ద శరీరం, వయసు, అనుభవం లాంటి వాటికన్నా, బుద్ధిబలమే అన్నింటికంటే మిన్న జంతువులన్నీ గ్రహించాయి.

మహాదానశీలి శిబి చక్రవర్తి

పిల్లలూ...! ఈరోజు మనం శిబి చక్రవర్తి దానశీలతను తెలియజేసే ఓ కథను చదువుకుందాం. మీ రెప్పుడైనా శిబి చక్రవర్తి పేరు విన్నారా..? విని ఉంటే... ఆయనకు అంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయో తెలుసా...?

మహాదానశీలి అయిన శిబి చక్రవర్తి, తన సహాయం కోసం శరణుజొచ్చిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. ఆడిన మాట తప్పడం ఆయన జీవితంలో లేదు. అందుకనే ఆయన పేరు ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అలాంటి శిబి చక్రవర్తి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను గురించిన కథను తెలుసుకుందాం...!


ఒకసారి శిబి చక్రవర్తిని ఇంద్రుడు, అగ్నిదేవుడు పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడు డేగ రూపాన్ని, అగ్నిదేవుడు పావురం రూపాని ధరించి భూలోకానికి దిగివచ్చారు. రావడంతోటే డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి కాపాడమంటూ ప్రాదేయపడుతుంది. నీకేమీ భయంలేదు నేనున్నానంటూ ఆయన దానికి అభయమిస్తాడు.

అయితే డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చి... "ఈ పావురం నా ఆహారం. నువ్వు దానికి అభయమిచ్చి, నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. ఇది నీకు తగునా...?" అంటూ ప్రశ్నించాడు.



అప్పుడు శిబి చక్రవర్తి "ఈ పావురానికి ప్రాణాలు కాపాడతానని నేను అభయం ఇచ్చాను. నీకు కావాల్సింది ఆహారమే కదా..! ఈ పావురం కాక మరేదయినా ఆహారం కోరుకో ఇస్తాను..." అని చెప్పాడు.

దానికి డేగ మాట్లాడుతూ... "అయితే ఆ పావురమంత బరువు కలిగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వు" అని అంది.

దీనికి సరేనన్న శిబి చక్రవర్తి కొంచెం కూడా తడబడకుండా త్రాసు తెప్పించి పావురాన్ని ఓ వైపు కూర్చోబెట్టి, మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి పెట్టసాగాడు. ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసం కోసి పెట్టినప్పటికీ పావురమే ఎక్కువ బరువు తూగనారంభించింది.

సరే... ఇక ఇలాగ కాదు అనుకుంటూ... చివరకు శిబి చక్రవర్తి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇచ్చేందుకు సంసిద్ధుడయి త్రాసులో కూర్చున్నాడు. దీన్ని చూసిన అగ్నిదేవుడు, ఇంద్రుడు తమ నిజరూపాన్ని ధరించి ఆయన త్యాగబుద్ధిని కొనియాడి, శిబి చక్రవర్తి శరీరాన్ని తిరిగి అతడికే ఇచ్చివేశారు.

కాబట్టి పిల్లలూ...! ఆపదలో ఉండి శరణుజొచ్చిన వారిని కాపాడటం మన విధి. దాని కోసం మన ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ, అందుకు సంసిద్ధంగా ఉండాలి అని చెబుతున్న ఈ కథలోని నీతిని తెలుసుకున్నారు కదా...! ఇంకేముందీ... కథ కంచికి, మనం ఇంటికి... వెళ్ళండి మరి...!

అత్యాశతో ఆపదపాలైన సుందరం

సింగరాయగుంట అనే ఊర్లో నలుగురు మిత్రులు ఉండేవారు. రాము, సోము, చిన్నా, సుందరం వారి పేర్లు. ఒకేలాంటి అలవాట్లు లక్షణాలు కలిగిన వీరందరూ చాలా పేదవారు. నిలువ నీడలేని వీరు ఒక పూట తినీ మరోపూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తుండేవారు.

ఒకరోజు వీరందరూ ఒకచోట చేరి ఎలాగైనా సరే డబ్బు సాధించాలనే నిర్ణయానికి వచ్చి, ఊరు వదలి బయటపడ్డారు. అలా బయలుదేరిన వారు ఒక నది గట్టుమీద ప్రయాణం సాగిస్తుండగా... జడలు అట్టలు కట్టుకుపోయిన జట్టుతో ఒక సన్యాసి ఒకడు కనిపించాడు.


భక్తిశ్రద్ధలతో సన్యాసికి నమస్కరించిన నలుగురు స్నేహితులు తమ కష్ట నష్టాలను అతడికి విన్నవించారు. యోగశక్తి కలిగిన మీరు ఎలాగైనా తమను కరుణించాలని సన్యాసిని వేడుకున్నారు. వీరి బాధలను విన్న సన్యాసి కరుణతో వారికి ఒక జ్యోతిని ఇచ్చి... "ఈ జ్యోతిని పట్టుకుని మీరందరూ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. చేతిలో నుండి జ్యోతి ఎక్కడ కింద పడితే అక్కడ భూమిని త్రవ్వారంటే మీకు కావాల్సినంత ధనం లభిస్తుంది. దాంతో మీరందరూ సంతోషంగా జీవించండి" అంటూ దీవించాడు.

జ్యోతిని పట్టుకుని సంతోషంతో మునిగిపోతూ నలుగురు స్నేహితులూ దగ్గర్లోని పర్వతాల వైపుకు నడవటం ప్రారంభించారు. అలా వెళ్తుండగా వారి చేతిలోని జ్యోతి ఒకచోట కింద పడిపోయింది. దీంతో నడకను ఆపేసిన వారు అక్కడ త్రవ్వటం మొదలుపెట్టారు. త్రవ్వుతుండగా అక్కడో పెద్ద రాగి గని బయటపడింది. దీంతో నలుగురిలో మొదటి వాడైన రాము తనకు ఈ రాగిగని మాత్రం చాలునంటూ... తృప్తిగా వెనుకకు వెళ్ళిపోయాడు.

తరువాత మిగిలిన ముగ్గురూ మళ్ళీ జ్యోతిని పట్టుకుని యధాప్రకారం పర్వతాలవైపు నడక ప్రారంభించారు. అలా వెళ్తుండగా మరోచోట జ్యోతి జారి కింద పడిపోయింది. దీంతో అక్కడ కూడా త్రవ్వి చూడగా పెద్ద వెండిగని బయటపడింది. అప్పుడు రెండోవాడైన సోము తనకు ఈ వెండిగని చాలునంటూ తృప్తిపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.



మళ్ళీ మిగిలిన ఇద్దరూ ఇంకా మంచివి దొరుకుతాయన్న ఆశతో... జ్యోతిని పట్టుకుని పాటు పర్వాతాల వైపు నడక సాగించారు. వీరి ప్రయాణంలో జ్యోతి మళ్ళీ ఒకచోట జారి కింద పడిపోయింది. అక్కడ త్రవ్వి చూస్తే... పెద్ద బంగారం గని. దీన్ని చూసిన మూడోవాడైన చిన్నా బాగా తృప్తిపడి తనకు ఇది చాలునంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.

ఇక అందరిలో నాలుగోవాడైన సుందరం అత్యాశతో, ఇంకా గొప్ప గొప్ప వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు లాంటి వి సొంతం చేసుకోవాలన్న దురాశతో జ్యోతిని పట్టుకుని తిరిగీ నడక ప్రారంభించాడు. అలా చాలా దూరం నడుస్తూనే ఉన్నాడు సుందరం. ఒకచోట ఎప్పట్లాగే జ్యోతి కింద పడింది.

మొదటి మూడుసార్లుకంటే... ఇప్పుడు ఇంకా ఎక్కువ విలువైనవి దొరకవచ్చన్న ఆశతో సుందరం త్రవ్వసాగాడు. ఎంత త్రవ్వినప్పటికీ ఏమీ బయటపడలేదు. త్రవ్వి, త్రవ్వి నీరసం వచ్చిన సుందరం అలాగే ఆ గోతిలోనే పడిపోయాడు. తరువాత మెలకువ వచ్చి చూసేసరికి సుందరానికి జ్యోతి కనబడలేదు.

దొరికనదానితో సంతృప్తి పడకుండా... అత్యాశతో ప్రవర్తించిన సుందరానికి చివరికి ఏమీ మిగలలేదు. పైగా గోతిలో పడిపోయి, రక్షించేవారు లేక, తినడానికి ఏమీ లేక ఏడుస్తూ... ఎవరైనా కాపాడండి... అంటూ కేకలు వేస్తూ ఉండిపోయాడు. దొరికిన వాటితో సంతృప్తి పడిన అతడి ముగ్గురు స్నేహితులైన రాము, సోము, చిన్నాలు సంతోషంగా జీవితం గడపసాగారు.

కాబట్టి పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటన్న విషయం ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...! అలాగే, మీరందరూ ఈ కథలోని నీతిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.