Pages

Friday, July 20, 2012

శ్రీ మహాభారతంలో కథలు

చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి వుండేది. ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చెయ్యడమంటే చాలా కష్టంగా వుండేది. ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు, క్రూరజంతువులకు నిలయంగా వుండేవి.

దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో అన్నదమ్ములైన వాతాపి, ఇల్వలుడు, అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ ఉండేవారు. వీరు మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని, తన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు.

పాపం వాళ్ళు... ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాకా అతిధుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు.


ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్టిగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "తాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా" అని పిలిచేవాడు. అతిధుల కడుపులో మాంసరూపంలొ వున్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. పాపం...! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిధుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు, ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగే వాడు. అగస్త్యడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు యధాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజుకు తన అతిధిగా వుండమని కోరాడు. అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు. ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకుని, " మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా..! ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనుకున్నాడు. అది ఇల్వలుడికి వినపడలేదు.

మహర్షి చెయ్యి కడుక్కోడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు " వాతాపీ..! ఓ వాతాపీ...! బయటకు రా...!" అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది. అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ " ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమై పోయాడు" అన్నాడు.

తన ఎదుట వున్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్ధమయింది ఇల్వలుడికి. ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి " మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచి పెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు. మహర్షి దయతలచి సరే అన్నాడు.

ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలి పెట్టి వెళ్ళిపోయాడు. పిల్లలూ... "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అంటే ఏంటో అర్థమైంది కదూ..! "ఇల్వల" అంటే చెడునడత గలిగన మనసు అని అర్ధం. "వాతాపి" పేరు సర్వప్రాణుల్నీ హరించేవాడు అనే అర్ధాన్నిస్తుంది. అంటే 'మరణం' అన్నమాట. ఇల్వలుడనే చెడు మనసు గల వాని జిత్తులు, జ్ఞాని అయిన అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక పోయిన వైనాన్ని ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదూ..!

అబద్ధం ఆపదకు చేటు

అనగనగా శివపురం అనే గ్రామంలో ఒక గొర్రెల కాపరి, తన కొడుకుతో పాటు నివసిస్తుండేవాడు. ఒకరోజు గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్తూ కొడుకును కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. అదే అడవిలో పెద్దపులి ఒకటి ఉండేది. అది మేతకు వచ్చిన గొర్రెలను, మేకలను తినేస్తూ ఉంటుంది.

ఆరోజు గొర్రెలను తోలుకెళ్లిన గొర్రెల కాపరి... తాను పక్కనే ఉన్న చెట్ల నుంచి కట్టెలు కొడుతుంటానని, గొర్రెలకు కాపలా కాస్తూ... పులి వస్తున్నట్లు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే తనను గట్టిగా కేకేసి పిలవమని కొడుకుకు జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు.

అయితే అల్లరి పిల్లవాడైన కొడుకు ఊరకే ఉంటాడా... ఒకవేళ పులి వచ్చినట్లయితే నాన్న వస్తాడో, లేదో చూద్దామనుకుని "నాన్నా పులి వచ్చింది" అంటూ గట్టిగా అరిచాడు. అదివిన్న అతడి తండ్రి పరుగు పరుగున వచ్చి పులి ఎక్కడ? అని ప్రశ్నించాడు. చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడ చూసినా పులి కనిపించలేదు. కొడుకు సరదాగా అలా చేశాడని అర్థం చేసుకున్న అతను మళ్లీ కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు.

ఈ తుంటరి పిల్లవాడు ఊరుకోకుండా... మళ్ళీ కాసేపటి తరువాత "నాన్నా.. పులి వచ్చింది" అంటూ గట్టిగా, భయంగా అరిచాడు. అది విన్న తండ్రి ఈసారి నిజమే గాబోలు అనుకుంటూ, కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అక్కడ పులిలేదు. కొడుకును చీవాట్లు పెట్టిన అతను ఇంకోసారి అలా చేయవద్దని హెచ్చరించి, మళ్లీ తన పనిలోకి వెళ్ళిపోయాడు.

తండ్రి తిట్టడంతో చాలాసేపటి దాకా కిమ్మనకుండా ఉన్న ఆ పిల్లవాడు మళ్ళీ "నాయనా... పులి వచ్చింది" అంటూ గట్టిగా కేకలేసాడు. ఈసారి కూడా నిజంగా పులి వచ్చిందనుకున్న తండ్రి పరుగెత్తుకుని వచ్చి చూస్తే.. అక్కడ పులీ లేదు గిలీ లేదు. పట్టరాని కోపంతో ఆ పిల్లవాడికి ఒక్కటిచ్చిన తండ్రి విసురుగా అడవిలోకి కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు.

గొర్రెల వాసన పసిగట్టిన పులి ఈసారి మాత్రం నిజంగానే వచ్చింది. ఒక్కసారిగా పులిని చూసిన ఆ పిల్లాడు "నాయనా నిజంగానే పులి వచ్చింది" అంటూ భయం భయంగా గట్టిగా కేకలేసాడు. ఆ... వీడికి ఊరికే ఆటలెక్కువయినాయి. పులి రాకపోయినా వచ్చిందంటూ ఇందాకటినుంచీ మోసం చేస్తున్నాడు. అరిస్తే అరుచుకోనీలే అనుకుంటూ తన మానాన తను కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయాడు తండ్రి.

ఇంకేముందీ... పులి ఎంచక్కా గొర్రెలన్నింటినీ తినేసి అడవిలోకి పారిపోయింది. కట్టెలు కొట్టడం పూర్తయిన తరువాత కొడుకు దగ్గరకు వచ్చిన తండ్రి గొర్రెలు లేకపోవడం చూసి లబోదిబోమంటూ ఏడుస్తూ ఉండిపోయాడు.

కాబట్టి పిల్లలూ... ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే... ఒకసారి అబద్ధం చెప్పిన వారి మాటలను ఎవరూ నమ్మరు. ఒక్కసారి అబద్ధం చెప్పి, తరువాత నిజం చెప్పినా కూడా అబద్ధమే అనుకుంటారు. కాబట్టి, నవ్వులాటకు కూడా అబద్ధాలాడకూడదు. అబద్ధమాడితే ఆపదలను కొనితెస్తుంది.

అవ్వ దీవెనలు

పసిప్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శీనయ్యను, ఓ అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. అదే ఊర్లోని ఆలయంలో పనిచేసే అవ్వకు ఆ గ్రామస్తులు త్రుణమో, పణమో సమర్పించుకునేవాళ్ళు. అవ్వ ఉండేందుకు ఊరి చివర్లో ఓ గుడిసెను కూడా వేయించారు. దాంట్లోనే అవ్వ, శివయ్య జీవనం గడిపేవారు.

అవ్వ కష్టపడి శీనయ్యను పెంచేది. కానీ వాడిని ఏమాత్రం కష్టపడనిచ్చేది కాదు. దీంతో శీనయ్య సోమరిపోతుగా తయారయ్యాడు. అందరూ పనికిరానివాడని తిడుతుంటే, వాడు కోపంతో తిరగబడేవాడు. ఎలాగైనా సరే శీనయ్యను ప్రయోజకుడిని చేయాలనుకున్న అవ్వ చదువుసంధ్యలు నేర్పించేందుకు బడిలో చేర్పించింది. అయితే, బడిలో పిల్లలను కొడుతున్నాడన్న కారణంతో పంతులు వాడిని బడికి రానివ్వలేదు. దాంతో చదువు సాగకపోగా, వాడి మొరటుతనం పెరగసాగింది.

ఒకరోజు అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది. తాను చనిపోవడం తప్పదనుకున్న ఆమె మనవణ్ణి దగ్గరికి పిలిచి... "నాయనా శివయ్యా...! అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధ పడి, వాళ్ళ మీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏదీ ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. ఈరోజు ఇలా అన్నవారే, రేపు నిన్ను మంచివాడివి అంటారు. ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు" అని చెప్పి కన్నుమూసింది.

అవ్వ పోయాక ఊరిజనం శీనయ్యను మరింత చులకనగా చూడసాగారు. దీంతో ఈ ఊర్లో నుంచి బయటికి వెళ్లిపోయి, అవ్వ చెప్పినట్లుగా ప్రయోజకుడై తిరిగి వచ్చి, అందరిదగ్గరా మెప్పు పొందాలని అనుకున్నాడు. గుడిసెలో ఒక మూలగా అవ్వ వాడిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూదీ కనిపించాయి.వాటిని చూడగానే..."ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు," అని చెప్పిన అవ్వమాటలు గుర్తుకు రాగా, అక్కడ్నించి బయటపడ్డాడు.

అలా వెళ్తుండగా... ఒక అడవిలో ఓ పెళ్లి బృందాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడడంతో.. శీనయ్యను మెచ్చుకుంటూ వాళ్లు పదికాసుల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో శీనయ్య వేగంగా నడవసాగాడు. అడవిదాటి కొంత దూరం పోయేసరికి, వాడికి ఒక మామిడితోపులో కొంతమంది గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం కనిపించింది.




దగ్గరికెళ్ళిన శీనయ్య సంగతేంటని అడిగాడు. మహారాజా వారిని చూసి తిరిగి వస్తున్న మా జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు. కాళ్ళు కడుక్కునేందుకు చెప్పులు విడిచినప్పుడు ముల్లు గుచ్చుకుపోయింది ఎలా తీయాలో మాకు పాలుపోవడం లేదని చెప్పారు సేవకులు.

"ఓస్, ఇంతేనా? అంటూ తన దగ్గరున్న సూదిని తీసి ముందుకెళ్లిన శీనయ్య జమీందారు కాలినుంచి ముల్లును సునాయాసంగా తీసి పారేశాడు. దీంతో ముల్లు బాధనుంచి బయటపడ్డ జమీందారు మెచ్చుకున్నాడు. ఈలోగా అటువైపే వెళ్తోన్న పెళ్లి బృందం వాళ్లుకూడా శీనయ్య చేసిన సహాయం గురించి జమీందారుకి చెప్పారు.

విషయం విన్న జమీందారు మరింతగా సంతోషిస్తూ... శీనయ్య వివరాలు అడిగి తెలుసుకుని, మీ ఊరు మా జమీనులో భాగమే. కొంతకాలంగా ఆ ఊర్లో శిస్తులు సరిగా వసూలు కావటం లేదు. మా అధికారులకు నీ సహాయం కావాలి, వారికి సహాయకుడిగా నీకు ఉద్యోగం ఇస్తాను చేరుతావా..? అని అన్నాడు జమీందారు.

పట్టరాని సంతోషంతో శీనయ్య సరేనన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత శిస్తులు వసూలు చేసే అధికారికి సహాయంగా తన గ్రామానికి వెళ్ళిన అతడిని గ్రామస్థులంతా చాలా గౌరవంగా "శీనయ్యగారూ" అంటూ పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. "ఈరోజు హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి ప్రయోజకుడివని మెచ్చుకోగలరు" అంటూ అవ్వ ఇచ్చిన దీవెనలో మనసులో మెదలగా లోలోపలే సంతోషంతో పొంగిపోయాడు శీనయ్య.

కొంగ తెలివి..!

అనగనగా ఒక అడవిలో పెద్ద కొలను ఒకటి ఉండేది. ఆ కొలను దగ్గర మర్రిచెట్టు ఉండేది, ఆ చెట్టుమీద ఆడ, మగ కొంగలు నివాసం ఏర్పుర్చుకుని జీవిస్తుండేవి. ఇలా రోజులు గడుస్తుండగా కొంగ జంటలోని ఆడకొంగ గుడ్లుపెట్టి పొదగసాగింది.

ఒకరోజు మగ కొంగ తిండి కోసం వేటకు వెళ్లి తిరిగి రాగానే, ఆడకొంగ దిగాలుగా కూర్చుని కనిపించింది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు? అంటూ ఆడకొంగను ప్రశ్నించింది. "మరేం లేదు... ఈ చెట్టుకిందనే పెద్ద పుట్ట ఉందట. ఆ పుట్టలోని పాము చెట్టుపైకి వచ్చి చిన్న చిన్న పక్షి పిల్లలను అన్నింటినీ తినేస్తూందట. అందుకే చెట్టుమీద ఇంతకుముందున్న పక్షులన్నీ భయంతో ఈ చెట్టును వదలి పారిపోయాయి" అంటూ బాధగా చెప్పింది.


"ఓస్... అంతేనా..? నువ్వేమీ భయపడవద్దు. నేనో మంచి ఉపాయం ఆలోచిస్తాను. ఎలాగైనా సరే ఆ పాము పీడను వదిలించుకుందాంలే.." అంటూ ఆడకొంగకు ధైర్యం చెప్పింది మగ కొంగ.

తరువాత ఒకరోజు ఆడకొంగను పిలిచి... "నేను కొన్ని చేపలను ముక్కున కరచుకుని వచ్చి వరుసగా పాము పుట్ట దగ్గర పడేస్తాను. అలా చేపల కోసం ముంగిస తప్పకుండా వస్తుంది. చేపలను తింటూ, తింటూ పాము పుట్ట దగ్గరకు కూడా వెళ్తుంది. అప్పుడు పామును కూడా ముంగిస తినేస్తుంది. తరువాత మనకేమీ భయం ఉండదు" అని చెప్పింది.



మరుసటి రోజు ఉదయాన్నే ముందు చెప్పినట్లుగానే మగ కొంగ చేపల్ని తీసుకొచ్చి పుట్టముందు పడవేసింది. చేపల్ని చూసిన ముంగిస ఆశగా ఒక్కొక్కదాన్ని తింటూ, పుట్ట దగ్గరకు చేరుకుంది. పుట్టలో ఉన్న పామును చూసి ముంగిస మరింత సంతోషం కలిగింది. కాసేపు పాముతో తలపడి, ఎట్టకేలకు దాన్ని చంపి తినేసింది ముంగిస.

పామును చంపి తినేసిన ముంగిస విజయగర్వంతో పైకి తలెత్తి చూస్తే... కొంగ పెట్టిన గుడ్లు కనిపించాయి. ఇంకేముంది అలా కనిపించిన గుడ్లను ముంగిస ఊరికే వదులుతుందా, గబగబా చెట్టెక్కి, గుడ్లని కూడా సుష్టుగా భోంచేసి ఎంచక్కా వెళ్లిపోయింది.

ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే... ఏదేని అపాయం సంభవించినప్పుడు, ఉపాయం ఆలోచిస్తే మాత్రం సరిపోదు. ఉపాయాన్ని ప్రయోగించిన తరువాత వచ్చే ఆపదలను కూడా ఆలోచించగలగాలి. లేకపోతే కొంగల జంటకి పట్టిన గతే మనకూ పడుతుంది.

దుష్టులకు దూరంగా...!

కైలాసగిరి అనే అడవిలో ఉన్న ఓ కొండ గుహలో ఒక పెద్ద పులి నివసిస్తుండేది. ఆ పులి మహా టక్కరిది. ఆహారం కోసం ఎలాంటి పనికయినా అది వెనుకాడేది కాదు. ఆ గుహకు సమీపంలోనే ఒక జువ్వి చెట్టు కూడా ఉండేది. ఆ జువ్వి చెట్టుపైన ఒక కొంగ నివసిస్తూ ఉండేది. ఈ పులికి, కొంగకు పెద్దగా స్నేహం అంటూ ఏమీ లేదు కాగనీ, అప్పుడప్పుడు మాట్లాడుకునేవి.

ఒకరోజు పులి ఒక మేకపోతుని వేటాడి తింటుండగా, ఓ సన్నటి ఎముక ఒకటి దాని గొంతులో గుచ్చుకుపోయింది. ఎంత ప్రయత్నించినా, మెడ బలంగా విదిలించినా, గట్టిగా గాలి లోపలికి పీల్చినా ఎముక బయటకు రాలేదు. అలా నొప్పితో పులి కష్టపడుతూ ఉండగా సాయంత్రం అయ్యింది.


కొంగ తన ఆహారం సంపాదించుకుని తన గూటికి చేరింది. గుహలోని పులి ఎలా ఉందో పలుకరిద్దామనుకుని వచ్చింది. పులి పడుతున్న బాధను చూసి ఏం మిత్రమా...! ఏంటి అంత బాధపడుతున్నావు? అంటూ కుశల ప్రశ్నలు వేసింది.

అప్పుడు పులి.. "మరేంలేదు మిత్రమా...! ఎముకు ముక్క ఒకటి నా గొంతులో గుచ్చుకుపోయింది. అది చాలా బాధ పెడుతోంది. దానిని నీ పొడుగాటి ముక్కుతో కొంచెం బయటికి తీసి పుణ్యం కట్టుకోరాదూ...!" అంటూ బ్రతిమలాడింది. కొంగకి పులి బాధ చూసి చాలా జాలేసింది. కానీ పులి క్రూర జంతువు కాబట్టి, ఎముక ముక్క తీసేసిన తరువాత తననే మింగేసిన ఆశ్చర్యపడాల్సింది లేదు అనుకుంటూ అలాగే నిలబడింది.

దీన్ని గమనించిన పులి "ఓ మిత్రమా నేను నిన్ను ఏమీ చెయ్యను, భయపడకు. ఎముక ముక్క లాగి కొంచెం సహాయం చెయ్యి, నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను" అంటూ దీనంగా అడిగింది. దీంతో కొంగ దయతలచి తన పొడుగయిన ముక్కుని పులి గొంతులో పెట్టి ఎముక ముక్కను తీసి పారేసింది. అప్పటినుంచి పులి, కొంగ రెండూ స్నేహంగా మెలగసాగాయి.



ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు పులి వేటకి వెళ్ళగా, సాయంత్రం దాకా ఒక్క జంతువు కూడా దానికి దొరకలేదు. దిగాలుగా, నీరసంగా, ఆకలితో నకనకలాడుతూ ఎలాగోలా గుహకు చేరుకుంది. ఏమీ తోచక గుహ బయటికి వచ్చి కూర్చుంది. అదే సమయంలో కొంగ కూడా ఇంటికి చేరుకుంది.

దిగాలుగా కూర్చున్న పులిని చూసిన కొంగ "ఏంటి మిత్రమా... మళ్ళీ ఏమయ్యింది?" అంటూ ప్రశ్నించింది. అప్పుడు జిత్తులమారిదైన పులి "మిత్రమా మళ్లీ నా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఈసారి కూడా నువ్వు సాయం చేయక తప్పదు" అంటూ దొంగ ఏడుపును నటించింది.

పాపం... పులి ఏడుపు నిజమేననుకున్న అమాయకపు కొంగ తన పొడుగాటి ముక్కును మళ్లీ పులి నోట్లో పెట్టింది. ఇంకేముంది... జిత్తులమారి పులి తను బుద్ధిని చాటుకుంటూ క్రూరంగా కొంగ మెడ కొరికి చంపి తినేసింది.

కాబట్టి పిల్లలూ...! ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే... దుష్టుడయిన వాడు స్నేహితుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడడు. అలాంటివారితో స్నేహం చేస్తే, కొంగకి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. కాబట్టి, చెడ్డవాళ్లతో స్నేహం చేయరాదు.

కాకి దాహం తీరింది...!!

అసలే మే నెల... ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం కావడంతో పొలాలు, చెరువులు, బావులు.. అన్నీ నీరు లేక ఎండిపోయాయి. ఇలాంటి సమయంలోనే ఒక కాకికి బాగా దాహం వేస్తోంది. విపరీతమైన దాహంతో అది, దానికి తెలిసిన ప్రాంతాలన్నింటినీ నీటికోసం గాలించేసింది. ఎక్కడా దానికి ఒక్క నీటి చుక్క కూడా కానరాలేదు.

అలా... నీటి కోసం కాకి వెతకని చోటు లేదు. నీరు మాత్రం దొరకడం లేదు. దీంతో అది రోజు రోజుకూ నీరసించిపోతోంది. ఇక ఇప్పట్లో నీరు దొరుకుతుందన్న ఆశ కూడా లేకపోవడంతో... "దేవుడా నన్ను నీవే రక్షించాలి" అని మనసులో అనుకుంటూ, అలాగే ఉండిపోయింది.

ఎప్పట్లాగే ఒకరోజు కాకి నీటికోసం వెతుకుతుండగా... ఒక చెట్టుకింద ఓ మట్టి కూజాలో నీరు కనిపించింది. నీరు బాగా అడుగున ఉండటంతో, కాకి వాటిని తాగాలంటే అందటం లేదు. దొరక్క దొరక్క దొరికిన నీటిని ఎలాగైనా సరే... తాగి తీరాలని అనుకుంది. అయితే ఎలాగ..? అంటూ ఆలోచనలో పడింది.


వెంటనే ఆ మట్టికూజాను ఒకవైపుకు వంచింది. కూజా మెడ ప్రాంతం బాగా సన్నగా ఉండటంతో నీటిని కాకి అందుకోలేక పోయింది. ఇప్పుడెలాగబ్బా..? అనుకుంటూ అటూ, ఇటూ తిరిగింది. అలా తిరుగుతుండగా వెంటనే దానికో ఉపాయం తట్టింది.

ఆ కూజాను నిటారుగా నిలబెట్టి, చెట్టుకింద ఉండే చిన్న చిన్న గులకరాళ్ళను ఒక్కోటిగా తెచ్చి వేయడం మొదలెట్టింది కాకి. అలా వేస్తుండగా కూజాలోంచి నీరు మెల్ల మెల్లగా పైకి రావటం మొదలైంది. పైకి వచ్చిన నీటిని చూసిన కాకి సంతోషంతో గబగబా తాగేసి దాహం తీర్చుకుంది. తాను చేసిన ప్రయత్నం ఫలించటంతో కాకి పట్టరాని ఆనందంతో ఎగిరిపోయింది.

పిల్లలూ..! ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటంటే... ఏదైనా ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు, వెంటనే కుంగిపోకుండా.. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అలాగే మనం అనుకున్నది సాధించాలంటే ముందుగా, కష్టించి పనిచేయటం నేర్చుకోవాలి. బాగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య కయినా పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది.

ఆరోజే దండించి ఉంటే...!!

రామాపురం అనే ఊర్లో శివాజీ అనే అబ్బాయి ఉండేవాడు. ఐదో తరగతి చదువుతుండే శివాజీ ఒకానొక రోజున తన క్లాస్‌మేట్ పుస్తకాన్ని దొంగిలించాడు. ఇంటికొచ్చి తల్లికి చూపిస్తే... తల్లి సంతోషంతో మురిసిపోతూ.. మంచిపని చేశావు నాన్నా..! అంటూ మెచ్చుకుంది.

అంతేగాకుండా.. పక్కింటి వాళ్లందరికీ "మా అబ్బాయి చాలా తెలివైనవాడు" అంటూ కొడుకు గురించి గొప్పలు చెప్పుకునేది. ఇదంతా చూస్తోన్న శివాజీకి తాను చేస్తున్న దొంగ పనులు ఎప్పుడూ తప్పుగా అనిపించలేదు. వయసు పెరిగేకొద్దీ శివాజీ దొంగతనాలు, హత్యలు కూడా పెరిగిపోయి ఆ ఊర్లో ఒక పెద్ద దొంగగా పేరు తెచ్చేసుకున్నాడు.


ఊర్లో రాను రాను దొంగతనాలు పెరిగిపోవడంతో ఆగ్రహించిన ఆ ఊరి ప్రజలు శివాజీపై పోలీసు కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఊరిపై దాడి చేసి ఎలాగోలా శివాజీని పట్టుకుని కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ కేసు విచారించిన జడ్జి లెక్కకు మించి దొంగతనాలు చేసి, మనుషుల ప్రాణాలను తీసిన శివాజీకి ఉరిశిక్ష విధించాడు.

కోర్టులో జడ్జి తీర్పు విన్న శివాజీ తల్లి... గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ తన కొడుకును ఎలాగైనా కాపాడండి అంటూ కనిపించిన వారినల్లా అడుగుతుంది. శివాజీని ఉరిశిక్ష తీసేరోజు రానే వస్తుంది. చివరిసారిగా తన కొడుకుతో ఏమైనా మాట్లాడాలనుంటే మాట్లాడవచ్చని జైలు అధికారులు అతడి తల్లిని పిలిపించారు.

తన కొడుకు ఇకపై తనకు దక్కడని, విపరీతమైన దుఃఖంతో ఏడుస్తూ... ఆమె కొడుకు దగ్గరికి వెళ్లింది. ఇనుప కమ్మీలకు అటువైపు నున్న కొడుకును చూసి పలుకరించగా, కొడుకు మాట్లాడేది ఆమెకు సరిగా వినిపించలేదు. ఏంటి నాయనా..! అంటూ తన చెవులను కమ్మీలకు దగ్గరగా పెట్టగా ఒక్కసారిగా శివాజీ ఆమె చెవిని కసిగా కొరికేశాడు.



ఇదంతా గమనిస్తూ ఉన్న జైలు పోలీసులు అతడిని పక్కకు లాగేసి... "ఆమె నీకు కన్నతల్లేనా...? తల్లి అయితే ఆమె చెవినే కొరికేస్తావా..? నువ్వసలు మనిషివేనా?" అంటూ తిట్టిపోశారు.

అప్పుడు నోరు తెరిచిన శివాజీ పట్టరాని కోపంతో ఇలా అన్నాడు. "ఈరోజు నాకు ఉరిశిక్ష పడుతోందంటే.. దీనికంతటికీ ఆమె కారణం. చిన్నప్పుడు నేను దొంగతనం చేసిన రోజునే నన్ను దండించి, ఇది తప్పురా నాన్నా..! అని చెప్పి ఉంటే.. ఈరోజు నేను ఇలా తయారయ్యేవాడినే కాదు."

"తప్పుచేసిన ప్రతిసారీ ఈమె నన్ను ప్రోత్సహించిందేగానీ.. ఏనాడూ ఇది తప్పు అని చెప్పలేదు... అందుకనే నేను వ్యక్తిగా ఏమాత్రం ఎదగలేదు. ఈరోజు ఇలా అందరిముందూ దోషిలా నిలబడి, నా జీవితానికి నేనే సమాధి కట్టుకుంటున్నాను" అంటూ... తనముందు అసలు నిలబడవద్దని తల్లిని హెచ్చరించి పంపేశాడు శివాజీ.

ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటి పిల్లలూ...! చిన్నప్పటి నుంచే మంచి పద్ధతులు, అలవాట్లు నేర్చుకోవాలి. తప్పుడు దారుల్లో నడవకూడదు. దొంగతనం చేయకూడదు. దొంగతనం చేసినప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పటికీ, మీరు అలాంటి పనలు చేయకూడదు.

తల్లిదండ్రులు కూడా పిల్లలు తప్పు చేసినప్పుడు.. "ఇది తప్పు" అని తెలియజెప్పాలే గానీ... ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. లేకపోతే... శివాజీకి పట్టిన గతే మీ పిల్లలకూ పడుతుంది. జరగాల్సింది జరిగిపోయిన తరువాత ఎంత విచారించినా లాభం ఉండదు.

ఇతరుల పనుల్లో వేలు పెట్టొద్దు

సింగరాయగుంట అనే ఊర్లో సుబ్బయ్య అనే ఒక వడ్రంగి ఉండేవాడు. అతను ఊర్లోని వాళ్లందరికీ వడ్రంగి పనులు చేసి పెడుతూ జీవనం సాగిస్తుండేవాడు. అదే ఊర్లోని చెట్లపైన కోతుల గుంపులు కూడా చాలా ఉండేవి.

ఈ కోతులు చాలా అల్లరివి. ఊర్లో ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేవి కావు. ఇళ్లలో పెంచుకున్న పండ్ల మొక్కల్లోంచి పండ్లన్నింటినీ తెంపి తినేసి, ఇష్టం వచ్చినట్లుగా పడవేసేవి. ఎవరు ఎలాంటి పని చేస్తున్నా కోతుల గుంపు అక్కడ ప్రత్యక్షమై... ఆ పనిని నాశనం చేస్తూ ఉండేవి.

ఇదంతా చూసిన ఊరివాళ్ళందరూ... అబ్బా ఈ కోతుల పీడ ఎప్పటికి వదులుతుందో అని తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇదిలా ఉంటే... వడ్రంగి సుబ్బయ్య ఒకరోజు ఓ చెట్టు దగ్గర ఎండిపోయి ఉన్న చెక్క దూలాన్ని చూశాడు. తనకు పనికొస్తుందని భావించిన అతడు దాన్ని ఎలాగైనా తీసుకెళ్లాలని అనుకున్నాడు. చెట్టునుంచి ఎండిన ఆ దూలాన్ని వేరుచేసే పనుల్లో నిమగ్నమయ్యాడు.

ఈలోపు మధ్యాహ్నం కావడం, బాగా ఆకలిగా ఉండటంతో భోజనానికి ఇంటికి బయలుదేరాడు. వెళ్తూ, వెళ్తూ చెక్కదూలాన్ని విడిగా చీల్చి, మేకులు కొట్టి, అది దగ్గరకు రాకుండా వదిలిపెట్టాడు. ఇక మిగతా పనిని భోజనం చేసి వచ్చి చూద్దాంలే అనుకుంటూ దాన్నక్కడే వదిలేసి వెళ్లిపోయాడు సుబ్బయ్య.



సుబ్బయ్య అలా వెళ్ళాడో లేదో, అల్లరిమూక అయిన కోతుల గుంపు అక్కడికి చేరిపోయింది. ఆ చెట్టుపైన ఒకటే ఆటలు పాటలు... చెప్పలేనంత అల్లరి చేస్తూ, ఆ ప్రాంతాన్నంతా అల్లకల్లోలం చేశాయి. అప్పుడే వాటి కన్ను మధ్యకు చీల్చి ఉన్న దూలంపై కన్నుపడింది.

ఇదేంటో చూద్దాం అనుకుంటూ ఓ కోతి చీల్చి ఉన్న దూలం మధ్యలో దూరి, కూర్చుని మధ్యలో ఉన్న మేకుల్ని తీసి అవతల విసిరి పారేసింది. ఎప్పుడైతే కోతి మేకుల్ని తీసేసిందో... అప్పుడే దూలం చటుక్కున దగ్గరికి అయిపోయింది. ఇంకేముంది దూలం మధ్యలో ఇరుక్కుపోయిన కోతి పొట్ట బాగా నలిగిపోయి, ఊపిరాడక చనిపోయింది.

దీన్నంతా కళ్లారా చూసినా కోతులన్నింటికీ అప్పటికిగానీ బుద్ధి రాలేదు. తాము చేస్తోన్న అల్లరి పనులవల్లనే ఇలా అయ్యిందని, ఇకపై ఎప్పుడూ అలా చేయకూడదని అవి నిర్ణయించుకుని, ఏడుస్తూ... చచ్చిపోయిన కోతిచుట్టూ చేరాయి.

పిల్లలూ మరి ఈ కథలో నీతి ఏంటో అర్థమైందా...? మనవి కాని పనుల జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు. అనవసరంగా ఇతరుల పనుల్లో వేలు పెడితే... అది మనకే ప్రమాదంగా మారుతుందని, ఈ కోతుల కథ ద్వారా తెలుస్తోంది కదూ...!?

"పులిని జూసి నక్క" చందంగా...!

అనగనగా ఒక అడవిలో నెమళ్ళు గుంపులు గుంపులుగా నివసిస్తుండేవి. అదే అడవిలో కాకుల గుంపులు కూడా నివాసం ఏర్పర్చుకుని జీవనం సాగిస్తుంటాయి. అసలే అందంగా ఉండే నెమళ్ళు ఒకరోజు సంతోషంతో చిందులు వేస్తూ, పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయి.

నెమళ్ళ అందాన్ని, నాట్యాన్ని చూసిన ఓ కాకి ఈర్ష్యాసూయలతో రగిలిపోయింది. "నాకు కూడా నెమళ్ళకిలాగానే అందమైన పింఛాలుంటే ఎంత బాగుండు" అని మనసులో అనుకుంది. అలా అనుకుంటూనే దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయింది.

ఆలోచనల్లోంచి తేరుకున్న కాకి ఓ నిర్ణయానికి వచ్చినదానిమల్లే... ఒక్క ఉదటున పరుగెత్తి అక్కడక్కడా ఊడిపోయి పడిఉన్న నెమలి ఈకలన్నింటినీ ఏరి తెచ్చుకుంది. ఎవరూ చూడకుండా తన తోకకు వాటిని అంటించుకుని, సంతోషంతో కులుకుతూ పరుగులెత్తింది.



ఇలా ప్రతిరోజూ రాలిపోయిన నెమలి ఈకలన్నింటినీ ఏరి తెచ్చుకుని తోకకు అంటించుకుంటోన్న కాకి "నేనే గొప్ప, నేనే గొప్ప" అంటూ చెప్పుకునేది. దీంతో కాకుల గుంపులోని ఏ కాకి కూడా దీని దగ్గరకు చేరేది కాదు.

కొద్ది రోజులు గడిచిన తరువాత కాకి సంగతిని కనిపెట్టిన నెమళ్ళు, అది అతికించుకున్న ఈకలన్నింటినీ ఊడబెరికి, దేహశుద్ధి చేసి... ఇకనైనా బుద్ధిగా ఉండమని హెచ్చరించి వదిలిపెట్టాయి.

ఈకలన్నీ ఊడిపోగానే ఒక్కసారిగా కాకి రూపం అంధవికారంగా మారిపోయింది. దీంతో తమకంటే భిన్నంగా కనిపిస్తోన్న ఆ కాకిని మిగిలిన కాకులు తమ గుంపులోకి రానీయకుండా వెళ్ళగొట్టాయి. అటు నెమళ్ళ గుంపులోకీ, ఇటు కాకుల గుంపులోకి వెళ్ళలేక చేసిన తప్పుకు బాధపడుతూ... కాకి విచారంలో మునిగిపోయింది.

పిల్లలూ...! ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే... తనకులేని వేషాలను వేయరాదు. వేరేవాళ్ళను చూసి, అబ్బా... వాళ్ళకి ఉన్నాయి మనకు లేవు అని అసూయ పడకూడదు. నెమలి ఈకలను అంటించుకున్న కాకికి ఏర్పడిన పరిస్థితి మనకు ఎదురుకాకుండా ఉండాలంటే... అసూయ అనేదాన్ని మనలో రానీయకుండా జాగ్రత్త పడాలి.

మూడు చేపల కథ

అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి.

"అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి.

మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది.

ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది.



ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.

చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. ఛీ..ఛీ చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుర్లో... అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది.

ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజ గిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా ఎంత పెద్ద చేపో... భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ... ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేశారు.

కాబట్టి పిల్లలూ...! ఈ కథ ద్వారా మీకు అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే... మొదటగా ముందుచూపుతో ఆలోచించటం నేర్చుకోవాలి. ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించగలిగి, తప్పించుకునే తెలివితేటలు కలిగి ఉండాలి. లేకపోతే మన పరిస్థితి కూడా మూడో చేప పరిస్థితి లాగా అయిపోతుంది.

పులి.. పేరాశ బ్రాహ్మణుడు

ఒక ముసలి పులి స్నానం చేసి ఒక చేతిలో దర్భలు, మరో చేతిలో బంగారు కంకణం చేతిలో పట్టుకుని ఏటి గట్టుపైన కూర్చుంది. అదే సమయంలో ఏట్లో స్నానం చేసేందుకు వచ్చిన బ్రాహ్మణుడు ఆవలి గట్టుమీద ఉన్న పులిని చూసి భయంతో పారిపోబోయాడు.

ఇది చూసిన పులి "ఓయీ బ్రాహ్మణుడా...! నన్ను చూసి భయపడవద్దు. నేను నిన్నేమీ చేయను" అంది. దీంతో కాస్తంత బెరుకుగానే ఆగిపోయాడు బ్రాహ్మణుడు. ఇంకా అతడికి భయం పోలేదని గ్రహించిన పులి... "ఇదిగో ఈ బంగారు కంకణం తీసుకుని నీ దరిద్రాన్ని పోగొట్టుకో..!" అంటూ నమ్మబలికింది.

బంగారం అనగానే, అసలే పేరాశ కలిగిన ఆ బ్రాహ్మణుడికి కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఈ పులి క్రూరజంతువు కదా... దీన్నెలా నమ్మేది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. అది చూసిన పులి.. "నేను బాగా వయసులో ఉన్నప్పుడు మనుషులను చంపి తిని బోలెడంత పాపం మూటగట్టుకున్నాను. ఇకమీదటైనా అలాంటి పనులు మానుకోవాలని అనుకుంటున్నాను" అని చెప్పింది.

అయినా కూడా బ్రాహ్మణుడు తన దగ్గరకు రాకపోవడంతో... "నేను పాపపు పనులు చేసేటప్పుడు ఒక పుణ్యాత్ముడు నామీద దయతలచి ఇకపై ఎప్పుడూ పశువులను, మనుషులను చంపకుండా ఉండి సత్కార్యములు చేశావంటే... కాస్తంత పుణ్యమైనా దక్కుతుందని" హితబోధ చేశాడు అని చెప్పింది పులి.



"కాబట్టి... ఆరోజు నుంచి నేను పాపపు పనులేమీ చేయకుండా... ఇలా దానధర్మాలు చేస్తూ, నా పాపాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటున్నాను" అని మళ్ళీ నమ్మబలికింది ఆ పులి. దాని మాటలకు పూర్తిగా లోబడిపోయిన ఆ బ్రాహ్మణుడు బంగారంపైన ఆశతో... ఏటి అవతలి ఒడ్డువైపున ఉన్న పులి వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించి బురదలో దిగబడిపోయాడు.

అప్పటిదాకా వేచిచూస్తోన్న పులి, బ్రాహ్మణుడికి దగ్గరికి వచ్చి.. "అయ్యో...! బురదలో దిగబడిపోయావు కదా... ఉండు నేను వచ్చి నిన్ను బయటికి తీస్తాను" అంటూ ఒక్కసారిగా మీదపడింది. అసలే ఆకలితో ఉన్న పులి, ఆ పేరాశ బ్రాహ్మణుడిని సుష్టుగా భోంచేసింది.

కాబట్టి పిల్లలూ...! ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏమిటంటే... పేరాశ ఎప్పటికీ మంచిది కాదు. అదేవిధంగా ఏదైనా ఒక పని చేయాలంటే అన్ని రకాలుగా ఆలోచించిగానీ ఓ నిర్ణయానికి రాకూడదు.

కట్టెలు కొట్టే చిన్నయ్య.. బంగారు గొడ్డలి

ఒక ఊర్లో చిన్నయ్య అనే అతను ఉండేవాడు. బాగా పేదవాడైన అతను తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆ ఊరికి దగ్గర్లో ఒక అడవి ఉంది. అక్కడికెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి, వాటిని అమ్మి, వచ్చిన డబ్బులతో తిండిగింజలు కొనుక్కెళ్లేవాడు.

ఒకరోజు ఎప్పట్లాగే కట్టెల కోసం అడవికి వెళ్లాడు చిన్నయ్య. ఎండపడే లోపునే కట్టెలు కొట్టుకుని త్వరగా ఇల్లు చేరుకోవాలనుకుని గబగబా కట్టెలు కొడుతుంటాడు. ఓ చెట్టుపైనున్న బలమైన కొమ్మనొకదానిని చిన్నయ్య నరుకుతుండగా పొరపాటున చెయ్యిజారి, గొడ్డలి కిందనున్న వాగులో పడిపోయింది.

తన ఏకైక జీవనాధారమైన గొడ్డలి నీటిలో పడిపోయిందే... ఇకపై తానెలా బ్రతకాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి? అని గొణుక్కుంటూ, వలవలా ఏడుస్తూ వాగు ఒడ్డున కూర్చున్నాడు చిన్నయ్య.

అతని దుఃఖాన్ని చూసి కడుపు తరుక్కుపోయి జలదేవత ప్రత్యక్షమైంది. ఏం నాయనా..! ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు? అంటూ ప్రశ్నించింది. చిన్నయ్య జరిగినదంతా చెప్పగానే దేవత ఉన్నట్లుండి నీటిలో మునిగిపోయి, కాసేపటి తరువాత గొడ్డలితోపాటు బయటికి వచ్చింది.

తన చేతిలోనున్న బంగారు గొడ్డలిని చిన్నయ్యకిచ్చి ఇదే కదా నీ గొడ్డలి అంది జలదేవత. ఆహా... అది నాది కాదు తల్లి అన్నాడు చిన్నయ్య. మళ్లీ నీటిలోకి మునిగిన జలదేవత ఈసారి వెండి గొడ్డలిని తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు కూడా అది తనది కాదని తిరస్కరించాడు చిన్నయ్య

అలాగా..! అంటూ మళ్లీ నీళ్లలో మునిగిన జలదేవత ఈసారి మాత్రం ఇనుపగొడ్డలిని బయటికి తెచ్చింది. దాన్ని చూసిన చిన్నయ్య సంతోషంతో.. అమ్మా నా గొడ్డలి ఇదే అంటూ చేతిలోకి తీసుకున్నాడు. దీంతో... చిన్నయ్య నిజాయితీకి మెచ్చిన జలదేవత సంతోషించి అతడి ఇనుప గొడ్డలితో పాటుగా బంగారు, వెండి గొడ్డళ్లను కూడా బహుమతిగా ఇచ్చింది. ఇకమీదట చల్లగా, సంతోషంగా జీవించమంటూ చిన్నయ్యను దీవించిన జలదేవత మాయమైపోయింది.

పట్టరాని సంతోషంతో ఊర్లోకి వెళ్లిన చిన్నయ్య అడవిలో జరిగిన సంగతంతా అందరికీ పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇది విన్న అదే ఊర్లో ఉన్న సోమయ్య అనే ఆశపోతుకు దుర్భుద్ది పుట్టింది. ఎలాగైనా సరే తాను కూడా బంగారు, వెండి గొడ్డళ్లను సంపాదించాలని అనుకుని మరుసటిరోజు అడవికి వెళ్లాడు.

ఓ వాగు ఒడ్డున ఉండే చెట్టుపై కట్టెలు కొడుతున్నట్లుగా నటిస్తూ, కావాలనే గొడ్డలిని నీళ్లలోకి జారవిడిచాడు సోమయ్య. గొడ్డలి పడిపోగానే ఒడ్డుకు చేరి దొంగ ఏడుపులు ఏడ్వటం మొదలెట్టాడు. అతడి ఆట కట్టించాలనుకున్న జలదేవత ప్రత్యక్షమై ఎందుకేడుస్తున్నావంటూ ప్రశ్నించగా... అతడు గొడ్డలి పోయిందని ఏడుస్తూ చెప్పాడు.

అలాగా..! అంటూ జలదేవత నీళ్లలో మునిగి బంగారు గొడ్డలి తీసుకుని బయటకు వచ్చింది. దురాశాపరుడైన సోమయ్య వెంటనే అమ్మా..! అదే నా గొడ్డలి అంటూ అబద్ధం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన జలదేవత బంగారు గొడ్డలితో పాటు మాయమైపోయింది.

దీంతో "ఉన్నదీ పోయే.. ఉంచుకున్నదీ పోయే.." అన్న చందాన ఆశపోతు సోమయ్యకు బంగారు గొడ్డలి రాకపోగా, తన సొంతమైన ఇనుప గొడ్డలిని కూడా పోగొట్టుకుని బావురుమన్నాడు. కాబట్టి పిల్లలూ... అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలాడితే ఆపద కొని తెచ్చుకున్నట్లే... ఎప్పటికైనా నిజాయితీనే మనకు మేలు చేస్తుంది.

ఉచిత సలహాలు వద్దు

సోమయ్య ఇంట్లో ఓ దున్నపోతు, గాడిద ఉండేవి. అతను గాడిదను ఇంటిదగ్గర చిన్న చిన్న పనులు చేసేందుకు ఉపయోగించు కునేవాడు. అలాగే దున్నపోతుతో పొలం దున్నించడం, బండి లాగించటం లాంటి బరువు పనులన్నింటినీ చేయిస్తుండేవాడు.

బాగా కష్టమైన పనులు పదే పదే చేయటంతో దున్నపోతు బాగా అలసిపోయేది. దానికి తన యజమానిమీద అసహ్యం కలగసాగింది. అయినప్పటికీ చేసేదేం లేక నిస్సహాయంగా పనిచేస్తూ ఉంటుంది.

ఒకరోజు తన కష్టాలన్నింటినీ గాడిదతో చెప్పుకుంది దున్నపోతు. అంతా విన్న గాడిద దున్నపోతుకు ఓ మంచి ఉపాయం చెప్పింది. దీంతో దున్నపోతు మరుసటి రోజు పొద్దుటి నుంచీ నీరు త్రాగడం, గడ్డి మేయటం మానేసింది. రెండు రోజులుగా అది ఏమీ తినకుండా ఉండటంతో బాగా నీరసించిపోయింది.

దున్నపోతుకు ఏదో జబ్బు చేసినట్లుందని భావించిన సోమయ్య దాన్ని పొలానికి తోలుకెళ్లడం మానేశాడు. అంతేగాకుండా గాడిదనే అన్ని పనులకూ ఉపయోగించటం మొదలుపెట్టాడు. "దున్నపోతుకు సాయం చేద్దామని ఉపాయం చెబితే... నేనే అపాయంలో పడ్డానే... అది మాత్రం ఎంచక్కా విశ్రాంతి తీసుకుంటోంది. దానిపని కూడా నేనే చేయాల్సి వస్తోందని" గాడిద వాపోయింది.



ఇంక ఇలాగ కాదు.. దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి అనుకుంది గాడిద. అనుకున్నదే తడవుగా దున్నపోతు దగ్గరకు వెళ్లి.. "ఈ భోగం ఇంకెన్నాళ్ళులే...! ఇక రేపటినుంచి నీ ఆటలు సాగవు. నీకు జబ్బు చేసిందని, ఏ పనీ చెయ్యలేక పోతున్నావని... మన యజమాని నిన్ను కసాయి వాళ్లకు అమ్మేస్తున్నాడు" అని చెప్పింది.

దీంతో ఖంగుతిన్న దున్నపోతు, బుద్ధి తెచ్చుకుని తెల్లారగానే పొలానికి వెళ్లిపోయింది. అలా చెబితేగానీ దున్నపోతు కదలదని భావించిన గాడిద, తెలివిగా అదనపు పనినుంచి తప్పించుకుంది. హమ్మయ్య... ఇకమీదట ఎవరిపని వాళ్లు చేసుకోవచ్చు. లేకపోతే తన ప్రాణానికొచ్చేదని నిట్టూర్చింది గాడిద.

పిల్లలూ...! ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఎంటంటే.... ఎవరిపని వారే చేయాలి. ఉచిత సలహాలు ఇవ్వడం మానేయాలి. అలా చేస్తే... ఉపాయం కాస్తా తమకే అపాయంగా మారుతుందని గ్రహించాలి.

రామలింగడు.. మూర్ఖుల జాబితా..!

ఓసారి విజయనగర సామ్రాజ్యానికి రాజైన శ్రీకృష్ణ దేవరాయలు వద్దకు ఓ వర్తకుడు వచ్చాడు. పండ్లు, ఫలాలను కానుకగా తెచ్చిన అతడు "ప్రభూ...! నేనొక వర్తకుణ్ణి. నా దగ్గర మేలిమి జాతికి చెందిన అశ్వాలు (గుర్రాలు) దాదాపు వెయ్యిదాకా ఉన్నాయి. అవి గాలికంటే వేగంగా పరుగెత్తుతాయి. అలుపు ఎరగకుండా ఎంతదూరమైనా సరే పరుగులు తీస్తాయి..." అంటూ చెప్పుకుపోయాడు.

"ఆహా...! అలాగా..!!" అంటూ రాయలవారు అనేసరికి, అవును ప్రభూ... "ఇలాంటి అశ్వాలు మీ ఏలుబడిలో ఉంటే మీకూ, నాకూ గౌరవం. కాబట్టి వీటిని మీరు కొనుగోలు చేయండి" అని విన్నవించాడు ఆ వర్తకుడు.

"సరే అలాగే వర్తకుడా...! ఇదిగో ఈ ఐదువేల బంగారు నాణేలను తీసుకో. వెంటనే నీ దగ్గరుండే అశ్వాలను నాకు తెచ్చి ఇవ్వు" అన్నాడు రాయలవారు. అయితే సభలో ఈ తతంగాన్నంతా చూస్తోన్న తెనాలి రామలింగడికి ఏ మాత్రం నచ్చలేదు. రాయలవారిని ఈ విషయంలో ఎలాగైనా సరే ఆపాలని నిర్ణయించుకున్నాడు.

మరుసటి రోజు రాయలవారు విహారానికి తోటలోకి వచ్చి... అక్కడే ఓ మూలగ కూర్చొని ఏదో పట్టిక రాస్తోన్న రామలింగడిని చూశారు. "ఏంటి రామలింగా... ఇక్కడేం చేస్తున్నావు.. ఏదో రాస్తున్నట్టున్నావే...?" అంటూ ప్రశ్నించారు.



"మరేం లేదు ప్రభూ... మన రాజ్యంలో ఉండే మూర్ఖుల జాబితాను రాస్తున్నా...!" అంటూ పట్టిక చూయించాడు. చాలా కుతూహలంతో ఆ పట్టికను తీసుకున్న రాయలవారు మొదటగా తనపేరే ఉండటం చూసి ఖంగుతిన్నారు.

"ఏంటి రామలింగా..? నేను మూర్ఖుడినా..?" అన్నాడు కోపంగా.... ""క్షమించండి ప్రభూ...! ముక్కూ మొహం తెలియనివాడు వచ్చి వర్తకుడినని చెప్పాడు. దాన్ని మీరు నమ్మడమే గాకుండా ఐదువేల బంగారు నాణేలు అప్పజెప్పేశారు కాబట్టి నా దృష్టిలో మీరు మూర్ఖులే...!" అన్నాడు రామలింగడు.

రాయలవారు మౌనంగా ఉండటాన్ని చూసిన రామలింగడు మళ్లీ మాట్లాడుతూ... "అంత డబ్బును తీసుకున్న ఏ వ్యక్తీ తిరిగి రాడు, అశ్వాలూ ఇవ్వడు కదా...!" అన్నాడు. రాయలవారు కాసేపు ఆలోచించిన మీదట ఇలా అన్నాడు. "నిజమే రామలింగా... అతడు ఎవరో, ఏంటో తెలుసుకోలేదు. అదిసరేగానీ అతడు తిరిగి వస్తే అప్పుడేం చేస్తావ్?" అంటూ ప్రశ్నించాడు.

ఊహించని ప్రశ్నతో గతుక్కుమన్న రామలింగడు రాయలవారికి తెలియకుండా జాగ్రత్తపడి... ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. తరువాత ఇలా అన్నాడు... "ఏం లేదు ప్రభూ...! అప్పుడు ఈ జాబితాలోంచి మీ పేరు కొట్టేసి వాడి పేరు రాయిస్తాన్లే...!" అన్నాడు. రామలింగడి మాటలను అర్థం చేసుకున్న రాయలవారు భళ్లున నవ్వేయగా, రామలింగడు కూడా ఆయనతో జతకలిపాడు.

సీతయ్య.. పావురాల జంట..!

అడవిలో కట్టెలు కొట్టుకుని జీవించే సీతయ్య ఎప్పట్లాగే ఆరోజు కూడా అడవికి కట్టెలు కొట్టేందుకు అడవికి బయలుదేరాడు. అలా వెళ్తుండగా దారిలో ఓ వేటగాడు పావురాలను వేటాడుతూ... ఓ వలలో బియ్యం నూకలు చల్లి, వెళ్లడాన్ని గమనించాడు.

ఇంతలో.. వేటగాడు అలా వెళ్లాడో లేదో బియ్యం నూకలకు ఆశపడ్డ ఓ పావురాల జంట వచ్చి వలలో వాలాయి. అంతే ఒక్కసారిగా వలలో ఇరుక్కుపోయాయి. ప్రాణభీతితో అల్లాడుతున్న పావురాలను ఎలాగైనా రక్షించాలనుకున్న సీతయ్య వాటిని వలనుంచి తప్పి పైకి ఎగురవేసి కట్టెల కోసం వెళ్లిపోయాడు.

అలా కొంతకాలం గడచిన తరువాత సీతయ్య ఎప్పట్లాగే అడవికి వెళ్లి వస్తూనే ఉంటాడు. ఒకరోజు అడవిలో దారి తప్పి బాగా లోపలి ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. అతడు దారి తెలియక అవస్థపడుతూ తిరుగుతుంటే ఈలోపు చీకటి కూడా పడింది. అడవిలోని క్రూర మృగాలు తనను ఏం చేస్తాయో ఏమో అని భయపడుతూ ఉన్న సీతయ్య దగ్గర్లో ఓ చిన్న గుడిసె లాంటిది కనిపించింది.

సీతయ్య గబగబా గుడిసె దగ్గరికి వేగంగా నడుస్తుండగానే జోరున వర్షం మొదలయ్యింది. ఏంటో ఈ పాడు వర్షం వేళాపాళా లేకుండా.. దారి తప్పోయాను, ఇంటికెళ్ళాలో తెలియటం లేదు. భగవంతుడా నన్ను క్షేమంగా ఇంటికి చేర్చు తండ్రీ...! అంటూ మనసులో గొణుక్కుంటూ ఉండిపోయాడు.

అయితే... అదే గుడిసె పైనున్న పావురాల జంట సీతయ్యను గుర్తించి, తమ ప్రాణాలను కాపాడిన అతడిని ఎలాగైనా సరే ఇంటికి చేర్చాలని అనుకున్నాయి. అనుకున్నదే తడవుగా అతడి తలపైనున్న గుడ్డను తన్నుకుని వెళ్ళాయి. తలగుడ్డ ఎగిరిపోవడంతో పైకెత్తి చూసిన సీతయ్య పావురాల జంటను వెంబడిస్తూ పరుగులు తీశాడు.

అలా అలా తనకు తెలిసిన దోవలోకి పరుగెత్తిన సీతయ్యకు పావురాలు చేసిన సహాయం అర్థమైంది. తనని ఇంటికి చేర్చేందుకే ఈ పావురాలు తన తలగుడ్డను తన్నుకుపోయాయని అర్థం చేసుకున్నాడు. చిన్న జీవులైనప్పటికీ, వాటిని కాపాడిన విషయాన్ని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతతో ప్రవర్తించాయని అనుకున్నాడు. వెంటనే ఆ పావురాలను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి అక్కడే ఉంచుకుని పెంచుకోసాగాడు సీతయ్య.

మొదటికే మోసం..!!

శివపురం అనే ఊళ్ళో నిత్యానందం అనే విత్తనాల వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర రాము, సోము అనే ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. వీరిద్దరూ ఇంటిపనే కాకుండా, విత్తనాల కొట్టు దగ్గర కూడా పనిచేసేవాళ్ళు. నిత్యానందం దగ్గర ఒక కోడిపుంజు కూడా ఉండేది. ఇది తెల్లవారుఝాము కాగానే తన కూతతో యజమానిని నిద్రలేపేది. ఆయన లేచిన తరువాత రాము, సోములను లేపేవాడు.

నిత్యానందం వ్యాపారి అయినప్పటికీ పనివాళ్ళను మంచిగానే ఆదరించేవాడు. వాళ్లకు కావలసిన వస్తువులను ఇవ్వడమే కాకుండా, కడుపునిండా భోజనం కూడా పెట్టేవాడు. అయినప్పటికీ రాము, సోములకు తెల్లవారుఝామునే నిద్ర లేవటం మాత్రం ఇష్టం ఉండేది కాదు. అయితే కోడిపుంజు కూతకు మేల్కొనే యజమాని వాళ్లిద్దరినీ కూడా నిద్రలేపి పనులు పురమాయించేవాడు.


దీంతో... రాము, సోములు ఒకరోజు కూర్చుని ఇలా మాట్లాడుకోసాగారు... "ఒరేయ్ మన యజమాని త్వరగా నిద్ర లేచి, మనల్ని కూడా నిద్రలేపుతుండేది ఈ కోడిపుంజు వల్లనే... కాబట్టి దీన్ని చంపేద్దాం.. అప్పుడు మనల్ని నిద్ర లేపేవారు ఎవరూ ఉండరు. ఎంచక్కా, ఎంతసేపైనా పడుకోవచ్చు" అంటూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఆ అవకాశం కోసం వేచిచూడసాగారు.

ఇలా ఉండగా... ఒకరోజు యజమాని ఏదో పని నిమిత్తం పొరుగూరుకు వెళ్లి, ఆరోజు రాత్రికి కూడా రాలేడు. చీకటి పడిన తరువాత, అదే అదనుగా భావించిన రాము, సోములు గుట్టు చప్పుడు కాకుండా.. గంపకింద కప్పెట్టిన కోడిపుంజును తీసుకుని ఊరిబయటకు వెళ్లారు. అక్కడ కోడి పీక కోసి పడేసి, ఇంటికి తిరిగొచ్చి ఏమీ ఎరగనట్లుగా నిద్రపోయారు.

ఆ మరుసటి రోజు ఇంటికి తిరిగొచ్చిన యజమాని కోడిపుంజు గురించి ఆరా తీశాడు. నాకు తెలీదంటే తెలీదని రాము, సోములిద్దరూ బొంకారు. లోలోపల నవ్వుకుంటూ, పైకి మాత్రం చాలా గంభీరంగా ముఖం పెట్టి నిత్యానందం చెప్పిన చోటల్లా వాళ్లు వెతికి వచ్చారు.



ఎక్కడా కనబడలేదని చెప్పిన రాము, సోమూలు కోడిపుంజు పీడ విరగడైనందుకు సంతోషిస్తూ... ఇంకెవ్వరూ తమను తొందరగా లేపరని అనుకుంటూ నిద్రపోయారు. అయితే వాళ్ళిద్దరి ఆలోచనలూ తారుమారైపోయాయి.

అర్థరాత్రి అయ్యేసరికే నిత్యానందానికి మెలకువ వచ్చేసింది. తెల్లారుతుందేమోననుకుని రాము, సోములిద్దరినీ నిద్రలేపేశాడు. కానీ ఎంతోసేపు గడిస్తేగానీ తెల్లారలేదు. దీంతో వాళ్లిద్దరూ చాలా నీరసపడిపోయి ఇవేం కష్టాలురా బాబూ అనుకున్నారు.

ఇంకేముంది ఆరోజు నుంచీ రాము, సోములకు నిజమైన కష్టాలు ప్రారంభమయ్యాయి. యజమానికి ఎప్పుడు మెలకువ వస్తే... అప్పుడే పనివాళ్లను నిద్ర లేపేసేవాడు. తమను ఎక్కువసేపు నిద్రపోనీయలేదన్న కసితో, దానికి కారణమైన కోడిపుంజును చంపేసిన రాము, సోములు ప్రశ్చాత్తాపంతో కుంగిపోయారు.

ఎక్కువసేపు నిద్రపోవచ్చనుకుంటే అసలు నిద్రే లేకుండా పోయిందని, మొదటికే మోసం వచ్చిందని అనుకున్నారు. చేజేతులా కోడిపుంజును చంపేసి కష్టాలు కొనితెచ్చుకున్నామని రాము, సోములు భాదపడుతూ కూర్చున్నారు.

దుష్టులకి దూరంగా...!

శివపురం అనే ఊర్లో... ఒకరోజు రాత్రి దొంగ ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ ఊరి షావుకారు దుకాణంలో దూరాడు. దొంగను చూసిన వెంటనే షావుకారు ఎవడ్రా నువ్వు..? అంటూ గద్దించాడు.

"అయ్యయ్యో...! గట్టిగా అరవబోకండి షావుకారు గారూ.. జమీందారు ఇంట్లో దొంగతనం చేసి వస్తుంటే... రాజభటులు నన్ను చూసి ఈ దారినే వస్తున్నారు. వాళ్లు గనుక నన్ను పట్టుకున్నారంటే ఇక నాకు చావే శరణ్యం. వాళ్ల దగ్గర్నించీ నన్ను మీరు రక్షిస్తే... నేను దొంగతనం చేసిన డబ్బులో సగం వాటా మీకు ఇస్తాను" అన్నాడు దొంగ.


అసలే దురాశాపరుడైన ఆ షావుకారు దొంగను రక్షించేందుకు ఒప్పుకున్నాడు. తలుపు చాటున దాక్కోమని దొంగకు చెప్పాడు. ఆ దారిలోనే వచ్చిన "రాజభటులు దొంగ ఇటువైపుగానీ వచ్చాడా?" అంటూ షావుకారును ఆరా తీశారు. ఎవరూ రాలేదని అతను అబద్ధం చెప్పాడు. దీంతో ఆ రాజభటులు దొంగను వెతుక్కుంటూ మరో దారిలో ముందుకు వెళ్లారు.

భటులు వెళ్లిపోయిన తరువాత, దొంగను తన వాటా తనకు ఇమ్మని అడిగాడు షావుకారు. "ఏంటీ... వాటానా.. ఇదిగో.." అంటూ సంచిలోంచి కత్తితీశాడు దొంగ. బిత్తరపోయి నోట మాట రాలేదు ఆ షావుకారుకు. భయంతో అలాగే నిల్చుండిపోయాడు.



"నీకు ప్రాణాలమీద ఆశ ఉంటే, కేకలు వేయకుండా ఉండు" అంటూ షావుకారును ఓ కుర్చీకి రెండుచేతులు విరిచి వెనక్కి కట్టివేసి, అతడి దుకాణంలోని గల్లా పెట్టెలో ఉండే డబ్బును కూడా తీసుకుని పారిపోయాడు దొంగ.

దొంగ వెళ్లిపోయిన తరువాత షావుకారు కేకలు పెట్టడంతో పక్క దుకాణాల వారు వచ్చి అతడిని విడిపించి వెళ్లిపోయారు. దొంగకు ఆశ్రయం కల్పించటం వల్లనే తన డబ్బు పోయిందని లబోదిబోమంటూ మొత్తుకున్నాడు షావుకారు. కష్టపడి సంపాదించని డబ్బుకోసం ఆశపడితే... తన కష్టార్జితం కూడా పోయిందని అతడు బాధపడ్డాడు.

తన డబ్బు దొంగతనం గురించి రాజుగారికి చెబితే... దొంగకు తాను సాయం చేసిన విషయం కూడా బయటకు వచ్చి మరింత చిక్కుల్లో పడాల్సి వస్తుందేమోనన్న భయంతో బయటకు చెప్పకుండా ఉండిపోయాడు షావుకారు. అంతేగాకుండా మరెప్పుడూ దుష్టులకి సాయం చేయకూదని, తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఎప్పుడూ ఆశపడకూడదని అతడు గట్టిగా బుద్ధితెచ్చుకున్నాడు.

అసూయ తెచ్చిన తంటా..!

ఒక ఊర్లో రాజేష్, కామేశ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తన పొరుగింట్లో ఉంటోన్న రాజేష్‌ను ఎలాగైనా అధిగమించాలని అనుకుంటాడు కామేశ్. తెలివితేటల్లోనూ, ఆస్తిపాస్తుల్లోనూ, మంచి తనంలోనూ, పరోపకారం చేయడంలోనూ... తనకంటే ఇంకెవరూ ఎక్కువగా ఉండకూదని అతను ప్రయత్నిస్తూ ఉంటాడు.

అయితే... ప్రతిసారీ ఇతడికి రాజేష్ చేతిలో భంగపాటే ఎదురవుతూ ఉండేది. రాజేష్ ఇంకెప్పటికీ వసూలు కాదని వదిలేసిన రెండు వేల రూపాయల బాకీ వసూలయింది. ఈ విషయం తెలిసిన కామేశ్ అసూయతో రగిలిపోతున్న సమయంలోనే దూరపు బంధువు ఒకడు వచ్చి అప్పు అడిగాడు. పట్టరాని కోపం వచ్చినా ఆపుకుని ఎలాగైనా సరే దీన్ని అవకాశంగా తీసుకుని రాజేష్‌ను దెబ్బతీయాలనుకుంటాడు కామేశ్.


"సమయానికి నా దగ్గరా డబ్బులేదు. పరోపకారానికి మారుపేరైన మా పక్కింటి రాజేష్ నీకు సాయపడవచ్చు. వెళ్దాం రా...'' అంటూ అతడిని రాజేష్ ఇంటికి తీసుకువెళ్ళాడు కామేశ్. ఊరిపెద్దలతో మాట్లాడుతున్న రాజేష్‌కు తన బంధువును పరిచయం చేసి... డబ్బు అవసరమట, మీరే ఇవ్వగలనని చెప్పాడు.

ఇంతలో కామేశ్ బంధువు రాజేష్‌తో మాట్లాడుతూ... మీరు నాకు అప్పు ఇవ్వలేకపోతే నా ఇంకా కోతకు రాని వరిపంటను తనఖాగా పెట్టుకుని ఇవ్వండి చాలా అవసరం అన్నాడు. ఇంతలో అక్కడ ఉన్న పెద్దమనుషులు ఇప్పుడు వరిపంటకు అంత డిమాండ్ ఏమీ లేదు కదా... అలాంటప్పుడు ఆ పంటను ఎలా తనాఖాగా పెట్టుకుంటారని రాజేష్‌కు సూచించారు.



ఇంతలో రాజేష్‌ను ఎలాగైనా సరే ఇబ్బందుల్లో పడేయాలనుకున్న కామేశ్.. మన రాజేష్‌కేంటండీ... అతను ఎందులో చేయిపెట్టినా లాభమే సాధిస్తాడంటూ మాట్లాడాడు. పైన తథాస్తు దేవతలుంటారని, కామేశ్ మంచి ఉద్దేశ్యంతో చెప్పాడు కాబట్టి అప్పు ఇవ్వమని చెప్పేసారు ఆ పెద్దమనుషులు. సరేనన్న రాజేష్ అప్పుగా కొంత డబ్బును ఇచ్చి పంపేస్తాడు.

తథాస్తు దేవతల దీవెనల చలువో, లేదా తాను చేస్తున్న మంచి పనుల చలువో, మెచ్చుకుంటోన్న ప్రజల ఆశీర్వాదాల చలువోగానీ రాజేష్ తనఖాగా పెట్టుకున్న వరిపంట బాగా పండింది. ఊహించని రీతిలో వరిపంట డిమాండ్ పెరిగి, అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి.

తాను అప్పుగా ఇచ్చిన డబ్బుకంటే పదింతల డబ్బును వరిపంట ద్వారా సంపాదించాడు రాజేష్. విషయమంతా తెలిసిన కామేశ్ ఇంకా అసూయతో రగిలిపోతూ... అరే ఎంతపని చేశాను. ఆ పంటను నేనే పెట్టుకుని ఉంటే... మంచిపేరుకు మంచిపేరు, డబ్బుకు డబ్బు వచ్చి ఉండేవి. అన్నింటినీ పోగొట్టుకున్నాను కదా అనుకున్న కామేశ్... ప్రతిక్షణం కుమిలిపోతూ కాలం వెళ్లదీయసాగాడు.

కాబట్టి పిల్లలూ...! పక్క వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే... రోజు రోజుకూ ఎదిగిపోతుంటే అందుకు కుమిలి పోవడం, అసూయతో రగిలిపోవడం కాకుండా... మనం కూడా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలని ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...!

నీతి కథలు : దురాశ దుఃఖానికి చేటు

వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి... కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం.

ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది



ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి... పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగూ చనిపోయి కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.

దగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది." అనుకుంది.

అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే...! పదునైన "వింటి కోపు" దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ... తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి.

భైరవుడు ఒక జింక చాలదని అడవిపందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా, పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. దీన్నిబట్టి మీకెమర్థమయ్యింది పిల్లలూ...! దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు.

హద్దుల్లేని స్వేచ్ఛ అపాయం!

సోమయ్య అనే అతను నరసాపురం అనే ఊర్లో ఓ చిన్న రైతు. అతడికి కొన్ని ఎడ్లు, గేదెలు, మేకలు ఉన్నాయి. ఎడ్లు, గేదెలతో అతడు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. పొలంలో పండిన పంటను బస్తాలలో నింపి... ఎడ్లబండికి గేదెలను కట్టి వాటిద్వారా ఇంటికి చేర్చేవాడు.

ఒకరోజు పొలంలో పనేమీ లేకపోవడంతో... ఎడ్లు, గేదెలు, మేకలను తోలుకుని దగ్గర్లోని అడవికి మేతకు తీసుకెళ్లాడు సోమయ్య. దొరకక దొరికిన స్వేచ్చతో... ఎప్పుడూ ఆ పనీ ఈ పనీ చేస్తుండే ఆ జంతువులన్నింటికీ పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆనందంగా గెంతులు వేస్తూ పరుగులెత్తాయి.


అన్నింట్లోకి కొంచెం బలంగా ఉండే గేదెకైతే మరీ ఆనందంగా ఉంది. ముళ్ల కంచెల వైపు పోవడం, గడ్డిపూలపై గంతులేయడం లాంటివి చేస్తూ... అన్నింటికంటే ముందు వెళ్ళాలన్న ప్రయత్నంలో వేగంగా పరుగులెత్తింది. మితిమీరిన ఆనందంలో పూర్తిగా ఒళ్లుమరచి పోయిందది.

వెనకబడిన వాటిని అదిలిస్తూ... తోలుకొస్తున్న సోమయ్య ఈ గేదె సంగతిని మరచిపోయాడు. గేదె మాత్రం వేగంగా ముందుకు పోసాగింది. అలా వెళ్తుండగా దారిలో ఓ పెద్ద గొయ్యి అడ్డు వచ్చింది. అది ఎప్పుడో పూర్వకాలంలో తవ్విన బావి. నీళ్లు ఎండిపోవడంతో అడవిలోని చెత్తాచెదారం అంతా నిండిపోయి గొయ్యిలాగా తయారయ్యింది.



ఆనందంలో కన్నూమిన్నూ కానరాని గేదె ఆ గొయ్యిని గమనించలేదు. కాలిబాట నుంచి కిందికి పరుగులెత్తబోయి, పట్టుదప్పి గోతిలోకి జారి పడబోయింది. ఇంతలో కాస్త ముందుకు వచ్చి పరిస్థితిని గమనించిన సోమయ్య పరుగెత్తుకొచ్చి గోతిలోకి జారిపోబోతున్న గేదె తోకను పట్టుకుని ఆపబోయాడు.

అయితే... బాగా బలిష్టంగా ఉన్న ఆ గేదె తోకను పట్టుకున్న సోమయ్య దాని బరువును ఏమాత్రం ఆపలేకపోయాడు. ఫలితంగా గేదె తోక అతడి చేతిలోంచి జారిపోయింది. దాంతో, గేదె పట్టుదప్పి నూతిలో పడిపోయింది. అడవిలో సాయం చేసేవారు ఎవరూ కానరాక పోవడంతో సోమయ్య ఆ గేదెను వదిలేసి మిగతా వాటితో ఇంటిదారి పట్టాడు.

కాబట్టి పిల్లలూ...! మితిమీరిన స్వేచ్ఛ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని ఈ కథ ద్వారా మీకు అర్థమయ్యింది కదూ..!

మమ్మల్నీ బ్రతకనివ్వండి..!

దైవభక్తుడైన సింహాచలం ఊరూరా తిరుగుతూ.. దేవుడి గురించి ప్రచారం చేస్తూ వెళ్తుంటాడు. అలా ఒకరోజు గరుడాద్రి అనే ఊర్లో దేవుడి గురించి, దేవుడి మహిమల గురించి ప్రజలకు తెలియజెప్పి, పూజలు జరిపించి మరో ఊరికి బయలుదేరాడు.

మార్గమధ్యంలో ఓ అడవి గుండా వెళ్ళాల్సి వస్తుంది. అడవిలో ప్రయాణం చేస్తున్న సింహాచలంకు బాగా అలసటగా ఉండటంతో గుబురుగా ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్ళి, దాని నీడలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపక్రమించాడు. నడచి నడచి అలసిపోవడంతో అలాగే కళ్లుమూసుకుని పడుకున్నాడు.


ఇంతలో ఒక మూల నుంచి ఏదో జంతువు కదిలిన శబ్దం రావడంతో అటువైపు చూశాడు సింహాచలం. అంతే ఎదురుగా ఉన్న జంతువును చూసి భయంతో బిక్కచచ్చిపోయాడు. దేవుడా ఈ పులి బారినుంచి నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదేనంటూ భారం దేవుడిమీద వేశాడు సింహాచలం.

"ఈ క్రూర జంతువు ఎలాగైనా సరే నన్ను తినేస్తుంది. నీ మహిమవల్లనే నేను బ్రతకగలను. నీ భక్తుడినైన నన్ను కాపాడు స్వామీ..!" అంటూ భయంతో కళ్లుమూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగాడు సింహాచలం. అలా ఎంతసేపటికీ పులి దగ్గరకు రాలేదు. మెల్లిగా భయం భయంగా కళ్లు తెరిచి చూశాడు.

అంతే.. మరోసారి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టక తప్పలేదు సింహాచలానికి. ఎందుకంటే... ఎదురుగా పులి కూడా రెండు కాళ్లూ పైకెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది...! ఇదంతా ఆ భగవంతుడి మహిమేనేమో అనుకున్న సింహాచలం కాస్తంత ధైర్యం తెచ్చుకుని పులి దగ్గరకు వెళ్లాడు.



"ఓ పులిరాజా...! ప్రాణభయంతో ఉన్న నేను.. నువ్వు నన్ను చంపకుండా ఉండాలని, నీ నుండి నన్ను రక్షించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. దాంట్లో ఓ అర్థం ఉంది. మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు...?" అని ప్రశ్నించాడు సింహాచలం.

"ఓ మానవుడా...! నేను కూడా నీ నుంచి నన్ను రక్షించమని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను" అని చెప్పింది పులి.

"ఎందుకు..?" తిరిగీ ప్రశ్నించాడు సింహాచలం.

"ఎందుకంటే.. ఇప్పుడు మీ మానవులు మా వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా చంపేస్తున్నారు కదా...! దీంతో మా జాతులన్నీ అంతరించుకు పోతున్నాయి. మాకు స్వేచ్చగా బ్రతికే అవకాశమే లేకుండా పోతోంది. అలా జరక్కుండా చూడాలనే నేనూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని చెప్పింది పులి.

నిజమే కదా పిల్లలూ..! ఈ రోజుల్లో వన్య మృగాలను వేటాడి చంపడంలో మన మానవులు ముందే ఉన్నారు. మనుషులు ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో, వన్య ప్రాణులను కూడా అంతే స్వేచ్ఛగా బ్రతకనీయాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. కాబట్టి... వన్యప్రాణులను వేటాడి, చంపేసే వారిని తీవ్రంగా వ్యతిరేకిద్దాం...!

నల్లని బాతుపిల్ల... మనసు మాత్రం వెన్న..!

ఒక చిన్న నీటి సరస్సులో పక్షులన్ని కలసిమెలసి జీవనం సాగిస్తుండేవి. అందులో ఎక్కువగా హంసల సంఖ్య ఎక్కువగా ఉండేవి. ఓ ఎండాకాలంలో ఆ సరస్సులో నీరు తక్కువ అవడంతో బాతులన్నీ వలస వెళ్లిపోయాయి. అందులో ఒక్క నల్లని బాతు మాత్రం అక్కడే హంసలతోపాటు ఉండిపోయింది.

హంసల్లో పెద్దవయసు కలిగినవి తమ పిల్లలతో పాటు ఈ నల్లబాతు పిల్లను కూడా చేరదీసి తమతోనే ఉంచుకోసాగాయి. ఇది నచ్చని చిన్నవయసు హంసలన్నీ బాతు పిల్లను ఏడిపించేవి. తమతో ఉండవద్దని, నువ్వు అందంగా ఉండవు, మేము చూడు ఎంత తెల్లగా ఉన్నామో అంటూ మాటలతో గాయపర్చేవి.


వీటన్నింటినీ మౌనంగా భరించిన నల్ల బాతుపిల్ల ప్రతిరోజూ గట్టుపైన కూర్చుని బాగా ఏడ్చేది. ఎన్ని రోజులు గడుస్తున్నా చిన్న హంస పిల్లలు ఏవీ దాన్ని దగ్గరకు రానీయలేదు. దీంతో ఆ బాధ భరించలేని నల్ల బాతు అక్కడ్నించీ దూరంగా వెళ్ళిపోయి ఒక చిన్న చెరువులో ఉండిపోయింది. అక్కడ దాన్ని ఎవరూ ఏడిపించేవారు లేకపోవడంతో సంతోషంగా రోజులు వెళ్లదీయసాగింది.

అయితే... చిన్న హంసలు తనను దగ్గరికి రానీయకపోయినా, బిడ్డకంటే ఎక్కువగా చూసుకున్న తల్లి హంసలను ఒకసారైనా చూసి రావాలన్న కోరిక కలిగింది నల్లబాతుకు. ఇంకేముందీ అనుకున్న వెంటనే సొంత గూటికి బయలుదేరింది. అక్కడికి వెళ్లిన నల్లబాతు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది.



ఎందుకంటే... తనతోటి వయస్సున్న చిన్న హంసలన్నీ పెద్ద హంసలైపోయాయి. తననే ఆశ్చర్యంగా అవి చూస్తుండటంతో... "మీరందరూ నన్ను దగ్గరికి రానీయని నల్లబాతును నేనండ్రా...?! గుర్తు పట్టారా...?" అని వాటిని ప్రశ్నించింది. మీరు ఏడిపిస్తున్నారని వెళ్లిపోయాను. మిమ్మల్ని చూడాలన్న ఆశతో మళ్లీ తిరిగి వచ్చాను అని చెప్పింది. వెంటనే హంసలకు నల్లబాతు గుర్తు వచ్చి నోరుమెదపకుండా ఉండిపోయాయి.

ఇంతలో తల్లి హంసలు దీన్నంతా చూసి... నల్లబాతును అక్కున చేర్చుకుని, ఎందుకు వెళ్లిపోయావు? ఎలా ఉన్నావంటూ కుశల ప్రశ్నలు వేసి నల్లబాతును దగ్గరికి తీసుకున్నాయి. దీన్ని చూసి ఈర్ష్యతో వెళ్లిపోతున్న పెద్దవైన హంసపిల్లలను తల్లి హంసలు పిల్చి చీవాట్లు పెట్టాయి.

మీరంతా బయటకు కనిపించే అందాన్నే చూస్తున్నారు. మనసును చూడటం లేదు. రంగు నల్లనైనప్పటికీ బాతుకు మనమందరం అంటే ఏంతో ప్రేమ. మనం మర్చిపోయినప్పటికీ మనల్ని గుర్తుపెట్టుకుని అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. అలాంటిదాన్ని బాధపెట్టడం మంచిది కాదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు. పెద్దవాళ్లు అయినారు. మంచి చెడ్డలు ఆలోచించాలంటూ బుద్ధి చెప్పాయి తల్లి హంసలు.

దీంతో చేసిన తప్పును తెలుసుకున్న హంస పిల్లలు.. తమను మన్నించమని నల్లబాతును కోరాయి. నల్లబాతు సంతోషంగా వాటిని స్వీకరించటంతో ఆనందంగా నీళ్లలోకి గంతులు వేసుకుంటూ చేపలు పట్టేందుకు వెళ్లిపోయాయి. ఇక అప్పటినుంచి అవన్నీ కలసిమెలసి, ఐకమత్యంతో సంతోషంగా జీవనం గడపసాగాయి.

తల్లి మేక... టక్కరి నక్క...!

ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.

ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు.


ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది.

తల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, "నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా...!" అని అరచింది.

లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడ్నించీ వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగీ గుడిసె దగ్గరకు వచ్చి "తలుపు తియ్యమని బ్రతిమాలుకుంది".

అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మకి తెల్ల కాళ్లుంటాయి" అని అన్నాయి.



ఆహా...! అలాగా... అనుకుంటూ అక్కడ్నించీ వెళ్లిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్లరంగు పులుముకుని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపుతీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి, అక్కడ్నించి పారిపోయింది.

కాసేపటికి తల్లిమేక మేత నుండి గుడిసె తిరిగి వచ్చేసరికి... ఒకే ఒక్క పిల్ల మాత్రం బిక్కు బిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది. ఏం తల్లీ...! ఏం జరిగింది అంటూ దగ్గరికి తీసుకుంది తల్లిమేక. అప్పుడు తల్లికి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది పిల్లమేక.

అంతా విన్న తల్లి మేక ఆవేశంతో.... ఒక కత్తి, సూది, దారం తీసుకుని నక్క దాగి ఉండే గుహ దగ్గరికి వెళ్ళింది. అది మంచి నిద్రలో ఉండగా... పొట్టకోసి, తన పిల్లలను బయటకు లాగింది. కొన్ని రాళ్ళను నక్క కడుపులో వేసి తిరిగి కుట్టేసి పిల్లలను తీసుకుని బయటపడింది తల్లిమేక.

మంచి నిద్రలో ఉన్న నక్కకు ఇవేమీ తెలియలేదు. ఒళ్లు విరుచుకుంటూ నిద్ర లేచిన దానికి విపరీతంగా దాహం వేసింది. ఎక్కడా నీరు దొరకక పోవడంతో, నది దగ్గరకు నీళ్ళు తాగేందుకు వెళ్లింది. నదిలోని నీరు తాగేందుకు వంగగానే కడుపులో ఉన్న రాళ్ల బరువు వల్ల నీటిలో పడిపోయి, మునిగిపోయింది.

చూశారా.. పిల్లలూ...! జిత్తుల మారి టక్కరి నక్కను, దానిలాగే తెలివిగా ఆలోచించిన తల్లిమేక తన పిల్లలను ఎలా రక్షించుకుందో, ఆ టక్కరి నక్క పీడను ఎలా వదిలించుకుందో.. అర్థమైంది కదూ...!