Pages

Monday, August 13, 2012

బంగారు ఊయల

అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. ఆయనికి ఒక చిన్నారి కూతురు ఉంది. ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంది. తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణని చూసి అసూయ పడేది. మందరమ్మకి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు తనకే కావాలి. మిఠాయి అంతా తనే తినాలి. గౌన్లు అన్నీ తనవే అనేది. పాపం! సువర్ణ ఎంత పని చేసినా, మందరమ్మ తిడుతూ, కొడుతూ ఉండేది. చిరిగిన గౌన్లు ఇచ్చేది. సరిగ్గా అన్నం పెట్టేది కాదు. ఆశకి తల్లి పోలిక వచ్చింది. శరీరం నల్లటి నలుపు రంగు. ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి "బంగారు బొమ్మలా ఉందమ్మా" అని మెచ్చుకుంటుంటే, మందరమ్మ, చూసి పళ్ళునూరేది! మందరమ్మ అసూయ, కోపంతో, సువర్ణని ఎండలో పనిచేయించేది! అలా ఎండలో పనిచేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని. మందరమ్మ సువర్ణకి అన్నం పెట్టేది కాదు. పని చేసి అలసిపోయి, పశువుల పాకలో కూర్చుంది. సువర్ణని చూసి చీమలు జట్టుగా వంట ఇంటిలోనికి వెళ్ళాయి. రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి వెళ్ళిపోయేవి. పెంపుడు చిలక రివ్వున ఎగిరి వెళ్ళి జామకాయలు తెచ్చి, సువర్ణ ఒడిలో పడేసేది. సువర్ణ అడవిలోకి వచ్చింది. వెంట కుక్క పిల్ల కూడా వచ్చింది. తోడుగా రామచిలక కూడా ఎగురుతూ వచ్చింది. సువర్ణకి అడవిలో నడిచి, నడిచి, ఆకలివేసింది. దాహం వేసి అలిసిపోయి మూర్చపోయింది. కుక్క పిల్ల పరుగెత్తుకు వెళ్ళి అడవిలో ఉండే అవ్వని తీసుకు వచ్చింది. అవ్వ సువర్ణ ముఖం మీద నీళ్ళు జల్లి లేపింది

అవ్వ సువర్ణతో, తన ఇంట్లో పనిచేస్తే "మంచి కానుక" ఇస్తానని చెప్పింది. సువర్ణ పని చేయసాగింది. సువర్ణ సోమరిపోతు కాదు! ప్రతి పనీ ఎంతో శ్రద్దగా, కష్టపడి చేస్తుంది! ఎవ్వరితోనూ పోట్లాడదు. ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ, గది నిండా బంగారు నగలు పెట్టి, తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది! సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది! అందులో ఒక్క నగ కూడా పోలేదు. మర్నాడు అవ్వ మళ్ళీ, వంట ఇంటి నిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపు తెరచి వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చింది! ఒక్క మిఠాయి కూడా పోలేదు. సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కని మాత్రమే తిని ఊరుకుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి. సువర్ణ చినిగిన గౌనుతో ఉన్నా ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు. అవ్వకి చాలా ఆనందం కలిగింది. పరుల సొమ్ముకి ఆశపడనివారే, ఇతరులకు చాలా మేలు చేస్తారు! మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి! అవ్వ సువర్ణకి తలంటి పోసింది. కొత్త గౌను తొడిగింది. మిఠాయిలు పెట్టింది. నగలు యిచ్చింది! అంతేకాదు. తర్వాత తన దగ్గర ఉన్న ఒక కొరడా తీసి ఝుళిపించింది. వెంటనే అక్కడ గాలికి చిరు గంటలు శబ్దం చేస్తుండగా, ఒక చక్కటి బంగారు ఊయల ధగ ధగ మెరుస్తూ ప్రత్యక్షం అయింది.

అవ్వ సువర్ణని చేయిపట్టుకొని ఆ ఊయలలో కూర్చోపెట్టింది! "అమ్మాయి! నువ్వు చాలా మంచి పిల్లవి! నీకు నేను ఈ 'కొరడా' కానుకగా ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఊరిలో నున్న వారందరికి ఈ ఊయలలో కూర్చొని సాయం చెయ్యి. నువ్వు యీ 'ఊయల'లో కూర్చొని ఏది కోరితే, అది నీ దగ్గరకు వస్తుంది" అంటూ సువర్ణ చేతకి కొరడా అందించింది. సువర్ణ కళ్ళు మూసుకొని, 'చక్కటి గౌను ఒకటి కావాలి' అనుకుంది. వెంటనే గౌను ఆమె ఒడిలో ఉంది! సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. వానలు లేక ఊరిలో కరువుతో బాధపడుతున్నారు. సువర్ణ కొరడాతో బంగారు ఊయల ప్రత్యక్షం చేసింది. దానితో కరువు కాటకం తీరింది. అందరూ సువర్ణని "బంగారు తల్లి" అని ఆశీర్వదించి వెళ్ళారు. ఇది చూసి మందరమ్మకు చాలా ఆశ పుట్టింది. సువర్ణను చంపేసి ఆ 'కొరడా' తీసుకోవాలని అనుకుంది. 'నాకు ఒకసారి ఆ కొరడా ఇవ్వమ్మా' అంది ప్రేమగా. సువర్ణ ఇచ్చింది. మందరమ్మ ఆశని ఒడిలో కూర్చోపెట్టుకొని ఊయలలో కూర్చుంది! అంతే!

ఒక్కసారి ఊయల ఇనుపముళ్ళతో మందరమ్మని బంధించివేసిది. అడుగున రంపపు మొనలు, చుట్టూరా మంటలు! ఆమె అందులో కాలిపోయింది. "అమ్మాయి! ఈ బంగారు ఊయల మంచి వాళ్ళ కోసమే!" చెడ్డవాళ్ళు ఇందులో కూర్చుంటే, వారికి ఇదే 'శాస్తి!' అని చెప్పి మాయమైంది. ఇది చూసి ఆ ఊరిలో అందరూ, చెడ్డ బుద్దులు మానేసి, మంచి నడవడికతో నడుచుకున్నారు! 

ప్రోత్సాహం

ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు, గుట్టల మధ్య దారితప్పి పోయాడు. రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తూ ఒక ఊబిగుంటలోకి చిక్కుకు పోయాడు. అతనికి దెబ్బలేమి తగలకపోయినా, అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం అర్ధిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరకు వెళ్లాడు.

"గంగ మీ కారుని ఈ ఊబిలో నుండి బయట పడేయగలడు." అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు. ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తు, "ఈ ముసలి గంగ అంత పని చేయగలదా?" అని అడిగాడు. ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు, ముసలి గుర్రంలతో పాటు ఊబిగుంట వైపు నడిచారు.

రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి "రాధా, రాణీ! రాజా, గంగా! గుర్రం ఒకే ఉదుటున కారును ఊబిగుంటలో నుంచి పైకి లాగేసింది.

ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞ్తలు చెప్పి, "నువ్వు గంగ అని పిలిచేముందు అన్ని పేర్లెందుకు పిలిచావు?" అని అడిగాడు.

రైతు చిరునవ్వుతో, "ముసలిదైన గంగ ఒక గుడ్డిగుర్రం. దానితో పాటు మరికొన్ని గుర్రాలు కుడా కలిసి పనిచేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు. అదొక్కటే పనిచేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగాచేయలేదు" అని చెప్పాడు.       

ప్రియమైన వస్తువు - అక్బరు బీర్బల్ కథలు

ఒకరోజు అక్బరు చక్రవర్తికి తన రాణి పట్ల చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన రాణిని అంత:పురం విడిచి పుట్టింటికి వెళ్ళిపొమ్మని, ఇంకెప్పూడూ తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు. రాణి అక్బరు కోపం పోగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రాధేయపడింది. కాని, ఆయన రాణి మాటలు వినే స్థితిలో లేడు. ఏం చేయాలో పాలుపోక రాణి బీర్బలు కు కబురు పంపింది. బీర్బల్‌ వచ్చాక జరిగినదంతా చెప్పి ఆ సంకటంలోంచి తనను గట్టెక్కించమని ప్రాధేయపడింది. బీర్బల్‌ ఆమెను ఓదార్చి, కొద్దిసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. అది విన్న రాణి మనసు కొంత కుదుటపడింది.

వెంటనే రాణి కోపంగా ఉన్న అక్బరు దగ్గరకి వెళ్ళి "ప్రభూ, మీ ఆదేశానుసారం నేను రేపు ఈ కోటను వదిలి వెడుతున్నాను. ప్రభువుల వారు అనుమతి ఇస్తే నాకు ప్రియమైంది నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను." అని వినయంగా చెప్పింది.

"ఈ కోట నుండి నీకేం కావాలో అది తీసుకువెళ్ళు" అని జవాబిచ్చాడు అక్బరు. ఆ మరునాడు రాణి తన ప్రయాణానికి సిద్ధం అయ్యింది. అప్పుడు బీర్బల్‌ అక్బర్‌ దగ్గరకు వెళ్ళి "ప్రభూ, రాణీగారు కోటను వదిలి వెళ్ళి పోవాలనుకుంటున్నారు కాని వారికి ప్రియమైన వస్తువు ఒకటి ఉందని, అది లేనిదే వెళ్ళలేనని అంటున్నారు." అని చెప్పాడు.

"తనకేం కావాలో అది తీసుకుని తక్షణం ఇక్కడుంచి వెళ్ళిపోమని చెప్పు."

"అలాగే జహాపనా. ఆవిషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు"

సరే రమ్మని చెప్పు" అని ఆదేశించాదు అక్బరు.

రాణి సరాసరి అక్బరు ముందు నిలబడి "ప్రభూ మీరు నా ప్రియమైన వస్తువు నాతో తీసుకెళ్ళవచ్చని అనుమతి ఇచ్చారు. మీరు నాతో కలిసి మా పుట్టింటికి రమ్మని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను. మీకంటే ప్రియమైనది ఈ ప్రంపంచంలో నాకు ఇంకొకటి లేదు," అంది రాణి వణికే కంఠంతో.

రాణి మాటలు వినగానే అక్బరులోని కోపం ఒక్కసారిగా చల్లారింది. రాణి తనను ఎంతగానో ప్రేమిస్తోందన్న విషయాన్ని గ్రహించాడు. ఈ తెలివైన ఆలోచన ఎవరిదో అక్బరుకు తెలుసు. అందుకే నవ్వుతూ బీర్బల్‌ వైపు చూశాడు.

ప్రాప్తం

రామయ్య కోమటి దగ్గర గుమస్తాగా వుండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళి అయింది. భార్య అందగత్తె, చదువుకున్నది. తెలివితేటలుగలది. కట్నము లేకపోయినా చేసుకున్నాడు. ఒక రోజు నిద్రలేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీ దేవిలా అలంకరించుకొని భార్య కనిపించింది. నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను. ఈ రోజు ఎలా వుంటుందో అన్నాడు. ఆమె చిరునవ్వి నా ముఖం చూసినవారికి మంచే జరుగుతుంది అన్నది. తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందోనని ఆలోచిస్తూ తన కాలకృత్యములు తీర్చుకొని షాపుకి వెళ్ళాడు.

రామయ్యకి ముందు వెనుకా ఎవరూ లేరు. తల్లీ, తండ్రీ చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వ చేరదీసింది. తన మనుమడిలా వున్నావని చెప్పి పెంచి పెద్ద చేసింది. ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు. అవ్వని చూడాలనిపించినా తనుకూడా వస్తానంటుందేమోనని వెళ్ళడం మానివేశాడు. ఆ ఆలోచనలతో పరధ్యానంగానే షాపు దాటి ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి వెళ్ళాడు. షాపులోకి వెళ్ళిన తర్వాత షావుకారు కోపంగా వున్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు చర్రుబుర్రులాడాడు. బేరాలు కూడా సరిగాలేవు. షాపు కట్టేసి ఇంటికి వస్తూండగా కొందరు అవ్వ వూరివారు గుర్తుపట్టి పిలిచారు. రామయ్యా అవ్వ నీ మీద బెంగతో మంచం పట్టింది. నిన్నే తలస్తుంది. అవ్వకి ఇంట్లో బంగారముతో లంకెబిందెలు దొరికాయి. మంచి యిల్లు కట్టుకొని పొలముగట్రాకొంది. నిన్ను కలవరిస్తూ మనవూరి వాళ్ళను తలాదిక్కుకు పంపిందిరా అన్నారు.

ఇంటికి వెళ్ళి భార్యను వెంటబెట్టుకొని ఆ గ్రామము వెళ్ళాడు. అవ్వ మంచం మీద నుండి లేచి మనవణ్ణి ఆప్యాయంగా నిమిరింది. అతని భార్యను చూసి మురిసిపోతూ అమ్మాయి! మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నన్ను వంటరిదాన్ని చేసి వెళ్ళకండి అని చెప్పింది. రామయ్య అవ్వదగ్గరే వుండి వ్యవసాయము చేసుకోసాగాడు. కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించి మగపిల్లవాణ్ణి కని గారాబంగా పెంచసాగింది. రామయ్య సంసారం సుఖ సంతోషాలతో ఆనందముగా గడిచింది.       

ప్రాణాలు తీసిన స్వార్ధం

ఒక ఊరిలో ఒక జమీందారుండేవాడు. ఒక నాటి రాత్రి ఇద్దరు దొంగలు జమీందారు ఇంట్లో తమకు దొరికినంత బంగారాన్ని, ధనాన్ని దోచుకుని ఆడవిలోకి జారుకున్నారు, ఆ బంగారాన్ని మరసటి రోజు తమ పక్క ఊరిలో అమ్మాలని ముందే నిర్ణయించుకున్నారు, అప్పటివరకు ఆ ధనాన్ని ఎక్కడైనా దాచేయాలని అనుకున్నారు.

ఒక చెట్టు బోదెలో బంగారాన్ని దాచారు. కాని అది భద్రంగా ఉంటుందని వారికి నమ్మకం కలగలేదు, అందువల్ల వారిద్దరూ ఆచెట్టు బోదెవైపు ఒక కన్ను వేయాలని ఎవరికివారు అనుకున్నారు.

కొద్దిసేపటి తర్వాత ఇద్దరికీ ఆకలివేసింది. కాని అంత ధనాన్ని వదిలి వారిద్దరూ తినడానికి ఎలా వెళ్లగలరు? కాబట్టి భోజన వసతలు ఏర్పాటుచేయడానికి కూడా వాళ్లు వంతులు వేసుకోవాలనుకున్నారు వారిలో మొదటి వాడు రెండవాడితో "లంబూ, నీవు ఈ బంగారానికి రక్షణగా ఉండు. నేను ఊర్లోకి వెళ్లి మనకు కావలసిన భోజనం తీసుకువస్తాను" అన్నాడు.

"సరేరా జంబూ! కాని త్వరగా వచ్చెయ్" అని లంబూ బదులిచ్చాడు.

జంబూ ఊర్లోకి వెళ్లాడు ఆ లోపల లంబూ 'నేను ఈ దొంగిలించిన ధనాన్ని జంబూతో పంచుకోవడమెందుకు?" అని ఆలోచించి ఒక పన్నాగం పన్నాడు.

జంబూ భోజనం తీసుకురాగానే అతణ్ణి చంపి మొత్తం ధనాన్ని బంగారాన్ని తానే సొంతం చేసుకోవాలనుకున్నాడు.

ఊర్లోకి వెళ్లిన జంబూకు కూడా అచ్చం ఇలాంటి ఆలోచనే వచ్చింది. అతను భోజనం చేసి లంబూకు తీసుకువచ్చే ఆహారంలో విషం కలిపాడు. కొద్దిసేపటి తర్వాత, జంబూ అడవిలోని ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు. చెట్టు పక్కన దాక్కున్న లంబూ ఒక పెద్ద రాయితో జంబూ తలపై బలంగా మోదడంతో జంబూ విలవిల్లాడుతూ కిండపడి ప్రాణం విడిచాడు. సంతోషంగా విషం కలిపిన ఆహారం తిన్న లంబూ నురగలు కక్కుతూ మరణించాడు,

అంత ధనం, బంగారం వారిద్దరిలో ఎవరికీ దక్కకుండా పోయింది.

పిల్లలు! అతి స్వార్ధం అనర్ధాలకు దారి తీస్తుందని పెద్దలెందుకంటారో అర్ధమయిందా?!

ప్రాణం తీసిన దొంగతనం

కోటయ్యకు చిల్లర దొంగతనాలు చేయడం అలవాటు. తన దొంగతనాలకు బాగా ఉపయోగపడుతుందని తోచి, ఓ కోతిని తీసుకు వచ్చాడు. తన దొంగ విద్యలన్నిటినీ ఆ కోతికి బాగా నేర్పాడు. ఆ కోతి అలికిడి కాకుండా దొడ్డి గోడలు ఎక్కి, లోపల వున్న విలువైన వస్తువులను తీసుకువచ్చి ఇస్తూవుండేది. ఆ వస్తువులను అమ్మి కోటయ్య సొమ్ము చేసుకొంటూ వుండేవాడు.

ఇలా ఉండగా ఊరిలోని దేవాలయంలో వున్న కొబ్బరి చెట్ల మీద కోటయ్య కన్ను పడింది. ఆ కొబ్బరి చెట్లు చాలా పొడుగైనవి. ఆకాశంలో మబ్బులను అందుకొనేటంత ఎత్తయిన ఆ చెట్ల కాయలను కోయడానికి ఎవరికీ ధైర్యం చాలదు. అందుచేత ఎవ్వరూ ఆ చెట్లను ఎక్కరు. కోసే వారు లేకపోవడంవల్ల, గుత్తులు గుత్తులుగా కాయలతో కొబ్బరి గెలలు వేలాడుతూ వుంటాయి.

కోటయ్య కొబ్బరిచెట్టు దగ్గరకు కోతిని తీసుకువచ్చి సంజ్ఞ చేశాడు. చర చరా చెట్టు ఎక్కి మొవ్వులో కూర్చుని, కోతి ఒక్కొక్క కాయనే తుంచి కింద పడవేయడం మొదలు పెట్టింది. కిందపడిన కాయలను ఆదరాబాదరా ఏరుకొంటూ, పోగుచేస్తూ, కోటయ్య, తల పైకెత్తి చూడటం మరిచి పోయాడు. అంతలో రెండు కొబ్బరి కాయలు అతని నడి నెత్తి మీద పడ్డాయి. ఎంతో ఎత్తు నుండి పడినందువల్ల, ఆ దెబ్బకు తల పగిలి రక్తం కక్కుకొంటూ, గిలగిల తన్నుకొని, కోటయ్య కన్ను మూశాడు!

కొబ్బరికాయలు పడుతున్న చప్పుడు విని పూజారి గబగబా వచ్చాడు. కొబ్బరి చెట్టు కింద కోటయ్యను, పైన కోతి చూసి ఆశ్చర్యపోయాడు!"తాను దొంగతనాలు చేయడమే గాక, కోతికి కూడా ఆ విద్య నేర్పాడు దురలవాటు నేర్వడం, నేర్పటం సుళువే కాని, ఒక్కొక్కప్పుడు ఆ దురలవాటు ప్రాణాలు తీస్తుంది కదా" అనుకొంటూ నిలబడి పోయాడు ఆ పూజారి నిశ్చేష్టుడై...!        

ప్రాణం తీసిన దురాశ

సంస్కృత భాషలో అద్భుతమైన నీతి కథలను, నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో పండిన మహానుభావులు రచించారు. హితోపదేశం - మిత్రలాభంలో నారాయణకవి చెప్పిన గొప్ప నీతి వున్న చిన్న కథ ఒకటి ఉంది.

వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహారపదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరకనిదేముంది? ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం ఇలా ఎన్నో లభిస్తాయి. కాని, ఈ శాఖాహారం కంటే కుందేలు, జింక, అడవి పంది వంటి జంతువుల మాంసాహారమే ఈ వేటగాళ్ళు ఇష్టపడతారు. భైరవుడు ఒకనాడు ఒక బలసిన జింకను వేటాడి చంపాడు. ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చుననుకుంటూ, దానిని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకున్నాడు. పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అడవి పందులకు కోపం మొండితనం ఎక్కువ. వేటగాడి బాణం వెనుదిరిగి వచ్చిందా అన్నట్లు, అది అతి వేగంగా వచ్చి, భైరవుని పొట్టను కోరలతో చీల్చి చంపింది. తర్వాత, అదీ చచ్చింది. వీరి తొక్కిసలాటలో ఆటుగా వచ్చిన పాము కూడా, ప్రాణాలు విడిచింది.

ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు. పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగు శవాలు కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది. నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది."

క్షుద్రబుద్ధి వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే! పదునైన వింటి కోపు దాని శరీరంలో గుచ్చుకుని, తన దురాశకు చింతిస్తూ క్షుద్రబుద్ధి ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ ఐదు శవాలు పడి ఉన్నాయి.

భైరవుడు ఒక మృగము చాలదని మరో దాన్ని వేటాడబోయి చచ్చాడు. క్షుద్రబుద్ధిఎటువంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా పేరుకు తగినట్లు పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. అందుకే అత్యాశ మంచిది కాదు. మానవుడు ఆశాజీవి. కానీ దురాశకు పోతే దుఃఖమే మిగులుతుంది.        

ప్రాణం తీసిన గొప్ప

అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి, కబుర్లాడు కొంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి, చివరికి మనలో ఎవరుగొప్ప? అనే వివాదానికి వచ్చింది!

ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి! నేను నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను 'నేనే గొప్ప' అంటూ అటూ ఇటూ తిరిగింది చరచరా! అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు 'నేనే గొప్ప' అంది గర్వంగా, తన రెక్కలను చూసుకొంటూ, చూపిస్తూనూ!

ఇలా అన్ని పురుగులూ ఏవేవో గొప్పలు చెప్పుకొంటుంటే, ఓ మిణుగురు పురుగు చరచరా ముందుకు వచ్చి వూరుకోండి, లేనిపోని గొప్పలు చెప్పుకోకండి నన్ను చూడండి! నేను నేల మీద పాకగలను, గాలిలో ఎగరగలను. అంతే కాదు మీలో ఎవరికీ లేని గొప్పదనము నాకున్నది. నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంగా వుంటాను. "ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలూ" అనుకొంటారు అందరూ! నన్ను చూసి, ఎంత అందంగా వుందో అని అందరూ ముచ్చటపడతారు.అంటూ గిర్రున తిరిగి మిలమిల మెరిసి పోయింది.

మిణుగురు పురుగు మెరుపులు చూసి చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెర పోయాయి. ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి వూరుకొన్నాయి. మిణుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ వుంటే, బంగారు పిచ్చుక చూసి, రివ్వున చక్కా వచ్చి, ఆ మిణుగురు పురుగును ముక్కుతో కరచుకొని, చెట్టుమీద ఓ కొమ్మకు కట్టుకొని ఉన్న తన గూటిలోని మట్టి ముద్దకు అంటించి, నొక్కేసింది. కాళ్ళు రెక్కలు మట్టిముద్దకు అంటుకు పోవడం వల్ల, మిణుగురు పురుగు కదలలేక పోయినది. ఎగరలేక పోయినది.

ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి. అంతలో చీకురు పురుగు "చూశారా? నక్షత్రంలా మిలమిల మెరిసే శక్తి నాకేవుంది" అంటూ గర్వంగా ఎగిరెగిరిపడిన మిణుగురు పురుగు గతి ఏమైందో! దానిని చూసి మనం బుద్దితెచ్చుకోవాలి. నేనే గొప్ప, నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి" అనుకొంటూ, అటూ ఇటూ వెళ్ళిపోయాయి.       

ప్రత్యుపకారం

ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేదదీరింది.

చిట్టెలుక ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది.

ఆ ఎలుక భయపడి "అయ్యా నేను అల్ప ప్రాణిని. అవివేకం వల్ల మీ మీదకు దూకాను. నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి" అంటూ ప్రాధేయపడింది.

సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి "మీరు చేసిన మేలును నేనెన్నటికీ మరచిపోను" అని తన బొరియలోకి వెళ్ళిపోయింది.

కొన్ని రోజులు గడిచాయి. ఎప్పటిలా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంసి. ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది. కాని బయటపడలేకపోయింది.

'ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోతుందీ అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వల నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నించసాగింది.

దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలోంచి బయటకు వచ్చింది. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది.

"బాధపడకండి మహారాజా! మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది" అంటూ వల తాళ్ళని తన వాడియైన పళ్ళతో పటపటా కొరికేసింది.

ప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఎలుకకి కృతజ్ఞతలు తెలిపింది.

ప్రతిభే పెట్టుబడి

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తుండగా బోధిసత్వుడు వైశ్యకులంలో చిన్ని అనే పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బుద్దిమంతుడే కాకుండా శకునశాస్త్రజ్ఞుడుకూడా.

ఒకనాడాయన రాజుగారి వద్దకు వెళ్తూ తోవలో చచ్చిన ఎలుకని చూసి నక్షత్ర స్థానం గుణించి 'తెలివితేటలు కల యువకుడైతే యీ చచ్చిన ఎలుకని తీసుకుపోయి దీనినే పెట్టుబడిగా వ్యాపారము చేసి వివాహము చేసుకోవచ్చును' అన్నాడు. ఆ మాటలు పేదవాడయిన ఒక మంచి తెలివైన బాలుడు విన్నాడు. చిన్ని శ్రేష్టి తెలిసి తప్పుమాట్లాడడని తలచి ఆ ఎలుకను తీసుకెళ్ళి పిల్లిని పెంచే ఒక కొట్టువానికి కాణికి (కాణి రూపాయలో 64 వ వంతు) అమ్మి దానితో బెల్లంకొని, మంచినీటిని పట్టుకొని అడవి నుంచి పువ్వులు తెచ్చి అమ్మేవారికి చిన్న బెల్లం ముక్కపెట్టి మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళతనికి కొన్ని పూలు ఇచ్చి పోయారు. అతను వాటిని అంగడిలో అమ్మి ఆ డబ్బులతో మరింత బెల్లంకొని మరునాడు కూడా వారికి బెల్లం ముక్క మంచి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళీసారి కొన్ని పూలదండలు, పూలమొక్కలు యిచ్చారు. ఈ ప్రకారంగా అతను ఎనిమిది కార్షాపణములు త్వరగానే సంపాదించాడు. ఇలా ఉండగా ఒకనాడు పెనుగాలి వీచి వానకురిసింది. ఆ గాలికి రాజోద్యానములో ఎండుకొమ్మలు ఆకులు రాలి అక్కడంతా చిందరవందరగా తయారయ్యింది. తోటమాలికి ఏం చేయాలో అర్థంకాలేదు. అదంతా బాగుచేయడం అతనికి తలకిమించినపని. అదిగమనించి యువకుడతనివద్దకు వెళ్ళి రాలిపడిన కర్రలూ కంపా నాకిచ్చేస్తాను అంటే నేను తోట బాగుచేయిస్తాను అన్నాడు. తోటమాలి వెంటనే అంగీకరించాడు.

ఆ యువకుడు పిల్లలాడుకునే చోటుకిపోయి బెల్లం ముక్క పెడతాను అని ఆశచూపి వాళ్ళని తోటలోకి తీసుకుపోయి తుక్కుపోగుచేయించి బయట పోయించాడు. ఆ సమయంలో కుండలని కాల్చేందుకు కర్రలకోసం పోతున్న ఒక కుమ్మరి 26 కార్షాపణములు, కొన్నిచెట్లు యువకుడికిచ్చి ఆ కుప్పని తరలించుకుపోయాడు. అప్పుడా యువకుడికొక ఉపాయంతోచింది. నగరద్వారానికి దగ్గరలో గడ్డికోసుకొని వచ్చేవారికి కుండలతో నీరిచ్చి వారి దాహం తీర్చాడు. నువ్వు మాకు మేలుచేశావు. మేము నీకేంచేయమంటావు? అని అడిగారు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను. అప్పుడు మీరు నాకు సాయం చేద్దురుగాని అన్నాడు. ఆ యువకుడు మెల్లగా కొందరు వర్తకులతో స్నేహం చేశాడు. ఒకనాడొక వర్తకుడు రేపు 500 గుర్రాలతో అశ్వవర్తకుడు నగరానికి వస్తాడు. అని యువకుడికి చెప్పాడు. అతను వెంటనే గడ్డి తెచ్చేవాళ్ళ దగ్గరకెళ్ళి రేపు మీరునాకు ఒక్కొక్కరూ ఒక గడ్డిమోపు చొప్పున వెయ్యాలి. నా మోపులమ్ముడయ్యే వరకూ మీరెవరూ మీ గడ్డిమోపులమ్మకూడదు. ఇదే మీరు నాకు చేయవలసిన సాయం అన్నాడు. వాళ్ళంగీకరించారు.

మరునాడు గుర్రాల వర్తకుడు వచ్చాడు. ఆ గుర్రాలకి గడ్డి కావాలి. కాని, ఆ యువకుడి దగ్గర తప్ప నగరంలో మరెక్కడా గడ్డి దొరకలేదు. అందుచేత తన 500 గుర్రాలకి అతనివద్దనున్న 500 గడ్డిమోపులని 1000 నాణాలిచ్చి కొనవలసివచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక వర్తకుడు యువకుడితో 'రేవులోకి ఒక గొప్ప నావ వచ్చింది' అని చెప్పాడు. ఆ మాటలతో యువకుడికొక ఉపాయము తట్టింది. అతను చక్కగా అలంకరించబడిన బండి నొకదానిని గంటకింత అని అద్దెకు తీసుకొని ఒక నావను కొని దగ్గరలో ఒక మంటపం నిర్మించి లోపల తాను కూర్చొని తన పరివారంతో 'బయటినుండి వర్తకులు వచ్చినప్పుడు వరసగా మీ ముగ్గురు వారిని నా దగ్గరకు తీసుకురండి'. అన్నాడు. రేవులోకి నౌక వచ్చిందని విని వారణాసి నుండి 100 మంది వర్తకులు సరుకులు కొనడానికి వచ్చారు. కాని... అంతకు ముందే సరుకంతా యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు వెళ్ళబోయారు. యువకుడు నియమించిన ముగ్గురూ వారినతని వద్దకు తీసుకువెళ్ళారు. బేరసారాల పిమ్మట వర్తకులొక్కక్కరూ నౌకలో భాగమునకు వెయ్యిచొప్పున సరుకుకి వెయ్యిచొప్పునా నాణాలిచ్చారు. ఈ విధంగా ఆ యువకుడు రెండు లక్షలతో వారణాసికి తిరిగి వచ్చాడు . మర్నాడతను లక్ష నాణాలతో కృతజ్ఞతలు తెలిపేందుకు చిన్ని శ్రేష్టి వద్దకు వెళ్ళాడు. అప్పుడు శ్రేష్టి 'నాయనా! నీకీ ధనమెలా వచ్చింది?' అని అడిగాడు. మీరిచ్చిన ఉపదేశమువలననే వచ్చింది. ఆరు మాసములలో యిదంతయూ నాకు లభించింది'. అన్నాడు యువకుడు వినయంగా.

వివరంగా చెప్పు అన్నాడు శ్రేష్టి. చచ్చిపోయిన ఎలుక, శ్రేష్టి మాటలు మొదలుకొని జరిగినదంతా వివరంగా చెప్పాడా యువకుడు. అది విన్న శ్రేష్టి ఆనందానికి మేరలేకపోయింది. ఇతన్ని యితరుల చేతిలో పడనివ్వకూడదు అనుకూడదు అనుకున్నాడు. అంతలోనే అతనికి తన పుత్రిక జ్ఞాపకం వచ్చింది. ఆమె పెళ్ళికెదిగి ఉంది. యువకడు అవివాహితుడు, ఇంకేంకావాలి? ఆ శ్రేష్టి అతనికి తన పుత్రికనిచ్చి తొందరలో వివాహం చేసేశాడు. పుత్రికతోపాటు తన సర్వసంపదని అతనికిచ్చాడు. ఆ శ్రేష్టి మరణానంతరం యువకుడు శ్రేష్టి పదవిని పొందాడు.       

ప్రతిధ్వని

ఒక రోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా, నింపాధిగా సమాధానం చెబుతున్నారు.

అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు.దెబ్బ బాగా తగలడంతో "అమ్మా" అని అరిచాడు.అతను అరవకున్నా మరోసారి "అమ్మా" అనే శబ్దం వినబడడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోనించి రావడాన్ని గమనించాడు.

ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు "ఎవరు నువ్వు" అని అడిగాడు శబ్దం వినిపించినవైపు చూస్తూ "ఎవరు నువ్వు" మరల ఆ గొంతుక పలికింది.

రఘు మళ్ళీ కొంచెం గట్టిగా, "నీకు ధైర్యం ఉందా?" అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయిన రఘు "పిరికి పందా!" అని నరాలు బిగపట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిదంగా మరింత గట్టిగా "పిరికి పందా!" అని వినిపించిది.

ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో "నాన్నా! ఏంటీది? ఎవరు నాన్నా అక్కడ?" అని అడిగాడు.తండ్రి నవ్వుతూ "కొంచెం ఓపిక పట్టు" అంటూ "నువ్వు చాంపియన్ వి" అన్నారు గట్టిగా. "నువ్వు చాంపియన్ వి" అన్న శబ్దమే మళ్ళీ వినిపించిది.ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్ధం కాలేదు.

రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు. "దీన్ని ప్రతిధ్వని అంటారు బాబు! జీవితం కూడా ఇలాంటిదే. నీవు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది.ప్రపంచం లో ప్రేమ శాంతి వికసించాలి, 'అందరూ నీతో ప్రేమగా వుండాలి' అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల, విజయ కాంక్ష రగిలిచాలంటే నీలో అవి పుష్కలంగా వుండాలి. లేకపోతే విజయ కాంక్షని పురిగొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాలలో అన్ని సందర్బాలకి వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం మనకి అదే ఇస్తుంది.

ప్రజ్ఞాశాలి

అనగనగా ఒక రాజు. అతని దగ్గర బాగా డబ్బుంది. దాచడం కోసం ఒక శిల్పిని పిలిచి, రహస్య ధనాగారం ఏర్పాటు చేయించాడు. దానికున్న రహస్యద్వారం కూడా ఇతరులకు తెలియనివ్వలేదు. దీనిని నిర్మించిన శిల్పి మాత్రం తక్కువ వాడా? పిసినారి రాజుకు తగ్గవాడే! రాజుకు తెలీయకుండా గోడకు అమర్చిన రాతి పలకల్లో ఇంకో రహస్య మార్గం ఏర్పాటు చేసి, పోయే ముందు కొడుకులిద్దరికీ దాని సంగతి చెప్పి కన్ను మూశాడు. డబ్బు కావలసినప్పుడు. వాళ్ళిద్దరూ, ఆ మార్గం వాడుకొనేవారు. అసలే పీనాసి రాజు. రోజూ డబ్బును తనివి తీరా చూచుకొనే గుణం ఉండడంవలన ధనం మాయం కావడం గమనించాడు.

రాజు కత్తెర బోను ఏర్పాటు చేశాడు. ఎప్పటిలానే వచ్చిన ఇద్దరిలో ఒకడు దానిలో చిక్కుకున్నాడు. తనను గుర్తుపట్టే స్థితి రాకూడదని, అన్నచేత తన తల నరికించేసుకున్నాడు బోనులో ఇరుక్కున్నవాడు. తల ఇంటికి తీసుకెళ్ళాడు సోదరుడు. రాజు తెలివితక్కువ వాడా? ఈ పని ఇద్దరు చేశారని గ్రహించేశాడు. దొరికిన మొడెం కోటగుమ్మానికి వ్రేలాడ దీయించి, కాపలా వాళ్ళకి చెప్పాడు. అది చూసి ఎవరయినా తీసుకుపోదామని ప్రయత్నిస్తే పట్టుకోమని. తల్లిపోరు పడలేక, తల నరికిన వాడు, నేర్పుగా కాపలా వాళ్ళకి సారా పోసి, మత్తులో ముంచి, మొండెం దించుకొని ఇంటికి పట్టుకుపోయాడు.

అతడు అసాధ్యుడని రాజుకు అర్థమైపోయింది. తన కూతురు అందాలరాశిని ఎరగా వేశాడీసారి. అతి దారుణమైన పని, నేర్పుతో కూడిన సాహస కార్యం చేసిన వాడినే ఆమె పెళ్ళాడబోతున్నట్టు ప్రకటించింది. తన వాళ్ళ తల నరికిన సంగతీ, మొండెం మాయం చేసిన సంగతీ చెప్పి పెళ్ళడమన్నాడు బ్రతికి ఉన్న సోదరుడు. ఆమె అతన్ని గుర్తించి, కాపలా వాళ్ళకు పట్టివ్వబోయేలోగా గమ్మత్తుగా తప్పించుకున్నాడు. ఇలాటి అసాధ్యడు అల్లుడయితే దిగుల్లేదు అనుకున్న రాజు, అసలు ఖజానా దొంగను శిక్షించే ప్రసక్తి లేదన్నాడు. అప్పుడు బైటపడ్డాడు సోదరుడు. నిన్ను ఇప్పుడు నరికేస్తే నీకు దిక్కెవరు? అడిగాడు రాజు. తమరు మారాజులు కనుక అడిగే దమ్ములు ఎవరికీ లేవు. కాని మీరు ఆడిన మాట తప్పితే, రేపు పరలోకంలో అల్లాకు జవాబు చెప్పుకోవలసి వస్తుంది. అన్నాడా చిన్నవాడు. అతడి ధైర్యానికి మెచ్చి, రాజు తన కూతుర్నిచ్చి పెళ్ళి చేశాడు. అంతే కాదు! అర్థరాజ్యం కూడా కానుకగా ఇచ్చాడు.       

పేదవాడైన రాజుగారి అన్న...

పృధ్వీపాలుడు ఔదార్యంగల రాజు ఆయన కొలువు లోకి పండితులు ఎప్పుడు స్వేచ్చగా ప్రవేశించే వీలు ఉండేది. ఒకరోజు బిచ్చగాడిలా కనిపిస్తున్న ఒక వృద్ధుడు పృధ్వీపాలుడి కొలువులోకి ప్రవేశించబోయాడు. అతడి అవతారం చూసి ద్వారపాలకులు అడ్డుకున్నారు.

"నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు. నేను రాజు గారి అన్నని" అని చెప్పాడతడు.

"ఇలాంటి వేషాలు మా దగ్గర కుదరవు. మా రాజు గరికి అన్నలుగాని, తమ్ముళ్ళుగాని లేరు" అన్నారు ద్వారపాలకులు.

"నా మాటలు నమ్మకపోతే మీరు నేరుగా రాజు దగ్గరకి వెళ్ళి మీ అన్న కలవటానికి వచ్చాడు అని చెప్పండి" అని చెప్పాడు ఆవ్యక్తి.

ద్వారపాలకులు చెప్పింది వినగానే పృధ్వీపాలుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. "అవునా...వెంటనే అతన్ని నాముందుకు తీసుకురండి" అని ఆదేశించాడు.

ఆ వ్యక్తిని చూడగానే రాజు "అన్నగారికి స్వాగతం. ఏమిటి విశేషాలు?" అని అడిగాడు.

అతను రాజుగారి ముందు ఆసీనుడవుతూ "సోదరా...నా దగ్గర మంచి వార్తలేం లేవు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నారాజ్యం రోజు రోజుకి కూలిపోతున్నది. నాకున్న ముఫ్ఫైరెండుమంది సేవకులలో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. నాఅయిదుగురు రాణులు కూడా ముసలివాళ్ళైపోయారు. దయచేసి నాకు సాయం చెయ్యి" అన్నాడు.

పృధ్వీపాలుడు అతని వైపు చాలా ఆసక్తిగా చూశాడు. తరువాత తన కోశాధికారితో అతనికి ఒక యాబై రూపాయలు ఇవ్వమని చెప్పాడు. " యాబై రూపాయలు చాలా తక్కువ" చెప్పాడతను.

"సోదరా... ధనానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా ఖాండాగారం తరిగిపోయింది" అన్నాడు రాజు.

ఆ వృద్దుడు ఒకసారి గాడంగా నిట్టూర్చి "ఏడు సముద్రాల అవతలున్న సముద్రపు ఒడ్డులో బంగారు ఇసుక వుంది. నాతో వచ్చి ఆ బంగారు ఇసుక తీసుకువచ్చి నీ భాండాగారం నింపుకో అన్నాడు"

"మరి ఆ సముద్రాలను దాటటం ఎలా?" సందేహంగా అడిగాడు పృధ్వీపాలుడు.

"నా పాదాల మహత్యాన్ని నువ్వు గమనించే వుంటావు. నేను సముద్రం లో అడుగు పెడితే అక్కడి నీరు కూడ ఆవిరైపోతుంది" అన్నాడు వృద్దుడు.

పృధ్వీపాలుడు అతను కోరినంత ధనం ఇచ్చి పంపించమని కోశాధికారికి ఆదేశించాడు. వృద్ధుడు వెళ్ళిపోయాక ప్రధానమంత్రి "ప్రభూ...మీ ఇద్దరి సంభాషణ నాకు అర్ధం కాలేదు" అన్నాడు.

పృధ్వీపాలుడు చిన్నగా నవ్వి " అతను ఒకప్పుడు బాగా బ్రతికిన పండితుడు. అదృష్టం నాణేనికి ఒకవైపు నన్ను రాజుగా రెండోవైపు అతణ్ణి పేదవాడిగా చేసి మమ్మల్ని అన్నదమ్ములను చేసింది. అతను నివసించే రాజ్యం వేరొకటి కాదు అతని శరీరమే. అతని ముఫ్ఫైరెండు సేవకులంటే అతని పండ్లు. అయిదుగురు రాణులంటే అతని పంచేంద్రియాలు. అంతేకాదు ఖాండాగారం తరిగిపోయింది అని నేనన్న మాటకు, తనెక్కడ కాలు పెట్టినా సముద్రాలు సైతం ఇంకిపోతాయని లోపం తనమీద వేసుకున్నట్లు మాట్లాడిన సున్నితంగా నన్ను విమర్శించాడు" అని వివరించి చెప్పాడు.

పేదరాశి పెద్దమ్మ కథ

అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను - అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.

చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని - అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని - అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.

బయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు - అనుకుంది. "బానా బానా దొర్లు,దొర్లు" అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను - అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని - అంది పెద్దమ్మ. పులి "సరే" అని వదిలి పెట్టింది.

పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసలడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం.       

పెద్దపులి - బాటసారి

రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా... ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్దించాను... దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం. చెట్ల ఆకుల్లోంచి పడుతున్న సుర్యుడి వెలుగుకి ధగధగా మెరుస్తోంది. దాన్నిచూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది .

నువ్వు పులివి, కౄర జంతువువి కూడా. నీ మాటలను నేను ఎలా నమ్మాలి. భలేవాడివే నువ్వు! నేను నిజంగా కౄర జంతువునే అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునే దానిని, కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్దపులి. శివశర్మ ఆ మాటలకు తృప్తి పడ్డాడు, నిజమే... పులి కౄర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చెయ్యలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. శివశర్మ మనసులో భయం పోయి ఆ బంగారు కంకణం ఇటు విసురు, అది తీసుకుని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను. నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. దానికి ఆ పెద్దపులి నవ్వి భలే బ్రాహ్మ ణుడివయ్యా నువ్వు... శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు... నువ్వు మాత్రం వాటిని పాటించవా... ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా..! అందుకే నేను దానం తీసుకునేవాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు ప్రక్కన కుర్చున్నాను. నువ్వు స్నానం చేసివచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకుని నన్ను ఆశీర్వదించు అంది.

శివశర్మ ఆ మాటకి సరే! అలాగే అంటూ స్నానం చెయ్యటానికి చెరువులోకి దిగబోయాడు మెత్తగా ఉన్నచెరువు గట్టున బురదనేలలోనడుంవరకు దిగబడిపోయాడు అతను. అది చూసిన పులి అయ్యయ్యో ! బురదలో దిగబడి పోయావా..? ఉండు రక్షిస్తాను అంటూ తన కూర్చన్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డున నిల్చుని శివశర్మ కంఠం దొరకపుచ్చకుని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది.

చూశారా..! దురాశ దు:ఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ పులిచేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటివాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవ్వరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకుని దురాశకు పోరాదు.       

పులి మేకపిల్ల

ఒక మేకలమందలో బుజ్జి మేకపిల్లొకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏ మాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకె్ళ్ళాడు. ఆ కొండ పైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది.

పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధంకాగానే "పులిరాజా! ఒక్క నిమిషం ఆగండి. మీకు నేను మూడు నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలెయ్యాలి" అంది మేకపిల్ల.

మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో "సరే చెప్పు" అంది పులి కుతూహలంగా.

"నువ్వు మిగతా పులులతో 'ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది. అయినా చంపకుండా వదిలేశానూ అని చెబితే అవి నమ్మవు నిజమేనా?"

"నిజమే!" అని తలూపింది పులి.

"అలాగే నేనూ మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు. నిజమేనా?" అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది.

"ఇక మూడో నిజం. చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కదూ!" అంది మేకపిల్ల.

అంత చిన్న పిల్ల తనముందు నిలబడి అంత ధైర్యంగా మాట్ల్లాడటం చూసి పులికి ముచ్చటేసింది.

"నిజమే. నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను వదిలేస్తున్నాను పో" అంది.

'హమ్మయ్య, ఇంకెప్పుడూ అమ్మని వదిలి వచ్చేయకూడదూ అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల.

పులి మీసం

ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. కొంత కాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భత్ర యుద్దంలో పని చేసి వచ్చాడు. మూడు సంవత్సరాలు భార్యకు దూరంగా వున్నాడు. ఆ తరువాత తిరిగి వచ్చాడు ఆమె భర్త. అప్పతి నుండీ అతనిలో ఏదో తేడా వచ్చింది. ఆమెతో సరిగా మాటలాడటంలేదు. భార్యమీద యిది వరకు ప్రేమ చూపడం లేదు. ఇది ధర్మావతిని ఎంతో బాధించింది. తన భర్త ప్రేమ పొదడానికి ఏదైనా చిట్కా కావాలి. అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది. వినయ విధేయతలతో చేతులు జోడించింది. నమస్కారం స్వామీజీ! నా పేరు ధర్మావతి. నాభర్త నాతో ప్రేమగా వుండటంలేదు. నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా వుండాలి. అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుంది. ఋషి ఆలోచించాడు. నీ భర్త యిది వరకులా నీతో ప్రేమగా వుండాలి. నేను ఒక మందు తయారు చేసి యిస్తాను. ఆ మందు అతని చేత తినిపించు. కొద్ది రోజులలో అతను నీకు దగ్గర అవుతాడు. నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. నీ మీద ప్రేమను చూపుతాడు. నిన్ను వదిలి వుండలేదు అన్నాడు. ధర్మావతి సంతోషించింది. 'ధన్యవాదాలు స్వామీ' అంది. అయితే ఒక యిబ్బంది వుంది. ఆ మందుకు అన్నీ వున్నాయి. ఒక దినుసు తక్కువ అయింది. మరి ఆ దినుసు నీవు తీసుకు రాగలవా? అన్నారు స్వామీజీ. అలాగే స్వామీ. నా భర్తకోసం ప్రాణాలకు తెగిస్తాను. ఆ దినుసును తెస్తాను అంది. అప్పుడు ఆ ఋషి యిలా అన్నాడు. అది పెద్ద పులి మీసం. అది నువ్వు తీసుకు రాగలిగితే చక్కని మందు తయారవుతుంది. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. అలాగే స్వామీ. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలకు తెగించి అయినా పెద్దపులి మీసం తెస్తాను.

పులి ధర్మావతిని చూస్తూనే గాండ్రించింది. భయంతో గజగజ వణికి పోయింది ధర్మావతి. అయినా గుండెదిటవు చేసుకొని నిలబడింది. అలా కాసేపు నిలబడి తన యింటికి తిరిగి వెళ్ళింది. మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది. అక్కడ ఇంకోచోట నిలబడింది. పులి మళ్ళి గట్టిగా గాండ్రించింది. ధర్మావతి అలాగే నిలబడింది. ఇలా కొన్ని రోజులు జరిగాయి. రోజులు గడిచే కొద్దీ ధర్మావతిని చూసి పులి అరవడం మానుకుంది. ఆతర్వాత కొన్ని పిండి వంటలు వండి పులికి పెట్టింది. ధర్మావతి వండిన వంటకాలు రుచి చూసింది పులి. ఆవురు ఆవురు మంటూ తిన్నది. నాలుకతో మూతి తుడుచుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకొన్ని నాళ్ళకు పులి బాగా అలవాటు అయింది. ఇప్పుడూ ధర్మావతి ముట్టుకున్నా పులి ఏమీ అనడం లేదు. చివరికి ఒక రోజు ఆ పులిని నిమురుతూ వుంది ధర్మావతి. అదను చూసి పులి మీసం పీకింది. పులి మూలిగిందేగానీ ఏమీ అనలేదు. ధర్మావతి పర్గుపరుగున వచ్చింది. పులి మీసం తీసుకొని ముని వద్దకు వచ్చింది. స్వామీ ఎంతో శ్రమ పడి పులి మీసం స్మపాదించాను తీసుకోండి అన్నది ధర్మావతి. ఋషి ఆమె యిచ్చిన పులి మీసాన్ని అందుకుని మంటలో పడవేశాడు. ధర్మావతి ఆశ్చర్యపోయింద్ది. అయ్యో స్వామీ! యిలా చేశారేంటి? అని తెగ గాధపడింది. అప్పుడు ఋషి యిలా అన్నాడు. అమ్మా ధర్మావతీ నీకు ఏ మందుతోనూ పనిలేదు. నువ్వు నాకు ఓక సంగతి చెప్పు. పులిని నువ్వు ఎలా లొంగదీసుకున్నావు? ప్రేమ, ఆప్యాయతలతో! అవునా? ఎంతో కౄరమైన జంతువునే లొంగదీసుకున్నావు. అంతటృఇ ఓర్పుగల నీవు నీ భర్తను లొంగదీసుకోలేవా? ఇదే ప్రేమ, అనురాగం నీ భర్తపై చూపించు. సహనంతో అతనిని నీ వైపుకు మళ్ళించుకో. నీ ప్రేమను పంచి, అతని ప్రేమను పొందు. అని చెప్పాడు ఋషి. ధర్మావతికి కళ్ళు తెరచుకున్నాయి. ధైర్యంగా యింటికి వెళ్ళింది. భర్తలో మార్పు తెచ్చింది. అతని నుండి వెనకటి ప్రేమను పొందింది.        

పుట్టినరోజు

ఉదయం ఆరు గంటలు కావొస్తోంది. రవి ఇంకా నిద్రలేవలేదు. "ఒరేయ్ రవి! లేవరా! ఈరోజు నీ పుట్టినరోజు, మరచిపోయావా"? అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగతనిద్రలో వున్న రవి, తల్లి పిలుపుతో లేచికూర్చున్నాడు. అది చూసి సునీత "హ్యపీ బర్తడే" అంటు శుభాకాంక్షలు తెలిపింది. "ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా! మీ డాడీ హాల్లో ఎదురచూస్తున్నారు" అంటూ వెళ్ళిపోయింది.

రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్ధుడు. రవి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డయినా క్రమశిక్షణతో పెరిగాడు. మాష్టార్లకు రవి అంటే చాలా యిష్టం. చదువుల్లోను, ఆటల్లోను ఫస్టు. తోటి పిల్లలతో స్నేహంగా ఉంటాడు. పేదపిల్లలను అవసరాల్లో ఆదుకొంటాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులందుకొన్నాడు. రాఘవ వందరూపాయల నోటును రవి చేతికిచ్చి "నీ కిష్టమైన వస్తువు కొనక్కో" అని చెప్పి వెళ్ళి పోయాడు.

రవి ఆ నోటును జేబులో ఉంచుకొని బడికి వెళ్ళాడు. క్లాసులో ఉమ టీచర్ "మదర్ థెరీసా" పాఠం చెబుతోంది. అందులో మదర్ చేసిన సేవా కార్యక్రమాలను గూర్చి వివరిస్తోంది. పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు రవి పైకి లేచి 'మదర్ థెరీసా' అంటే ఎవరు టీచర్? అని అడిగాడు. "దీన జనులకు సాయపడాలనే తపనతో పరాయిదేశం నుంచి మన దేశానికి వచ్చింది. ఇక్కడ ఎందరో రోగపీడితులకు, అనాథ పిల్లలకు, వృద్దులకు ఆసుపత్రులు శిశుకేంద్రాలు, వృద్దుల పునరా వాస కేంద్రాలను స్ధాపించింది. సేవాభావంతో వాటిని నడిపించి అందరి బాధలను తనవిగా భావించి వారికోసం తన జీవితాన్ని అంకితం చేసింది. అటువంటి కరుణామయి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం, ఆమెకు "భారతరత్న"నిచ్చి గౌరవించింది. అంటూ గోడపై వేలాడుతున్న మదర్ ఫొటోను చూపించింది. అది చూసి రవి మనస్సు భక్తి భావంతో నిండిపోయింది. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలంతా బిలబిలమంటూ బయటికి వస్తున్నారు.

రవి మనస్సులో టీచర్ చెప్పిన పాఠం మెదులుతూనే ఉంది. ఈ పుట్టినరోజున తాను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకొన్నాడు. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఆసుపత్రి బోర్డు కనిపించింది. వెంటనే పండ్ల దుకాణానికి వెళ్ళి తన వద్ద ఉన్న వంద రూపాయలతో పండ్లను కొని ఆసుపత్రిలోని రోగులకు పంచిపెట్టాడు. అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనస్సును అభినందించారు. ఒక మంచి పని చేసానన్న తృప్తితో ఇంటికి వచ్చాడు. రవి రావడం తండ్రి గమనించి "ఒరేయ్! రవీ! ఎందుకాలస్యంగా వచ్చావ్? బజారుకెళ్ళి ఏమైనా కొన్నావా? అంటూ ప్రశ్నించాడు. తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియక అలాగే తలవంచుకొని నిలబడ్డాడు.

కొడుకు మౌనంచూసి రాఘవ "ఏమైందిరా! నీకు! అలా మౌనంగావున్నా" వంటూ గద్దించాడు. అప్పుడు రవి జరిగినదంతా చెప్పి తండ్రివంక భయంగా చూసాడు. అది విని రాఘవ ముఖం సంతోషంతో నిండిపోయింది. రవిని దగ్గరికి పిలచి భుజంతట్టి ఇంత మంచి పనిచేసి భయపడతా వెందుకు? అంటూ మెచ్చుకొన్నాడు. తండ్రి పొగడ్తవిని రవి ఆనందంతో ఎగిరి గంతేసాడు.

ఆ రాత్రి భోజనం చేసి నిదుర పోయాడు. ఆ నిదురలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఎక్కడ నుంచో "రవీ!" అంటూ పిలుపు వచ్చింది. అలా వెళుతుంటే తెల్లని వస్త్రాలు ధరించి దేవదూతలా మెరుస్తున్న ఒక ముసలావిడ కనిపించింది. ఆమె "రవీ! నన్ను గుర్తుపట్టలేదా!" అంటూ ప్రేమగా పలికింది. రవి ఆమెవంక ఆశ్చర్యంగా చూసి "మదర్! మీరా!" అంటూ దగ్గరికి వెళ్ళాడు.

"రవీ! ఈరోజు నువ్వు చాలా మంచి పని చేసావు. అలాగే నువ్వు బాగా చదివి గొప్పవాడివి కావాలి. ఇలాంటి మంచి పనులెన్నో చెయ్యాలి? అంటుంటే కల చెదిరింది. రవి మదర్! మదర్! అని కలవరిస్తున్నాడు.

"ఓరేయ్! రవీ! ఏమైందిరా నీకు?" అంటున్న తల్లి పిలుపుకు రవి ఉలిక్కిపడి లేచి ఏమీలేదని తలూపి మళ్ళీ నిదురపోయాడు. మరుసటిరోజు క్లాసులో జరిగినదంతా టీచర్‌కు చెప్పాడు. టీచర్ "పిల్లలూ! విన్నారు కదూ! మదర్ ఏమి చెప్పిందో! మీరు కూడా బాగా చదువుకొని గొపవాళ్ళు కావాలి. మదర్‌ను ఆదర్శంగా చేసుకొని ఆమె అడుగు జాడాల్లో నడచి పేదలకు, అనాథలకు సేవ చేస్తారు కదూ అంది. పిల్లలు అలాగే టీచర్! అన్నారు ఒక్కసారిగా!        

పిసినారి పేరయ్య

చాలా మందికి సంతకాలు చేయడం వచ్చింది. పేపరు చదువుతున్నారు. మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. పంతులుగారిపైన అందరికీ గౌరవం, ప్రేమ. రాగానే పాదాలంటేవారు. ఆయన ఆశీర్వదించేవారు. రాత్రి బడికి పంతులుగారు వచ్చారు. చేతిలో వేమన శతకం ఉంది. వారంతా ఆ కథలు వినాలని అడిగారు. ఆయన అంగీకరించారు. అందరూ పుస్తకాలు చదువుతారు. వేమన జీవితం చదివాడు. ఎదుటివారిని చదివాడు. అనుభవం గడించాడు. యోగిగా మారాడు. చెప్పడం ప్రారంబించారు పంతులుగారు. నా చిన్నతనంలోని ఒక సంఘటన చెపుతాను. మా గ్రామంలో ఒక దుకాణం ఉండేది. ఆ దుకాణంలో సరుకులు అన్నీ దొరికేవి. యజమాని పేరు పేరయ్య. పేరయ్యకు పేరాశ. మంచి మాటకారి. అందరితో కలుపుగోలుతనంగా ఉండేవాడు. అప్పులు ఇచ్చేవాడు. బేరం అధికంగా ఉండేది. అందరూ ఆ దుకాణంలోనే కొనేవారు. అయితే అతను పరమలోభి. కడుపునిండా తినేవాడు కాడు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడు. భార్య పేరు లీల. మంచి మనిషి. అయినా మొగుడికి భయపడేది. సొంతంగా ఏమీ చేసేది కాదు. ఆమెనూ కడుపు నిండా తిననిచ్చేవాడు కాదు. కొడుకు పేరు బాలరాజు. పదకొండు సంవత్సరాల వయస్సు. అక్షరం రాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి. చొక్కా ధరించడు. నిక్కరుతో ఉండేవాడు. ఇది తండ్రికి నచ్చదు. బాదుతూ ఉండేవాడు. బాలరాజు ఏడిచి గోలచేసేవాడు.

అందరూ మంచి కూరలు అమ్మేవారు. పేరయ్య పుచ్చూ చచ్చూ అమ్మేవాడు. ఎక్కువ ధర తీసుకునే వాడు. మాటలు మాత్రం మంచిగా ఉండేవి. బాగా సంపాదించాడు. పొలం కొన్నాడు. భవనం కట్టించాడు. పొలం వెళ్ళేవాడు. అజమాయిషీ చేసేవాడు. ఇంట్లో వారికి మంచి దుస్తులు ఉండవు. మంచి తిండి ఉండదు. రూపాయికీ తనకూ లంకె. ఎవరు పిలిచినా వెళ్ళి తినేవాడు. తనకు అయిన వారికి గూడా ఏది విదిలించేవాడు కాడు. చీకటి పడేది. ధనం దాచిన పెట్టె వద్దకు వెళ్ళేవాడు. దానిని చూసుకుంటూ మురిసి పోయేవాడు. అక్కడే నిదురించేవాడు. భార్యకు నలతగా ఉంది. లేవడం లేదు. పేరయ్యకు బాధలేదు. ఆమెకు వైద్యం లేదు. నీరసంగా వుండేది. పాలు పితకమనేవాడు. ఇంటి చాకిరీ చేయించేవాడు. నీరు తోడించేవాడు. కొడుకేమీ చేయడు. పాపం ఆమెకు జ్వరం మొదలయింది. అందరూ వైద్యునికి చూపించమన్నారు. అదే నయమవుతుందనేవాడు. అన్నిటికీ మిరియాల కషాయమే మందు అనేవాడు. రోజు రోజుకూ ఆమెకు సుస్తీ ఎక్కువయింది. పేరయ్యకు ఖర్చు అంటే భయం. వైద్యుని కలవలేదు. ఆమె మంచం మీద వుంది. కదలలేక పోతోంది. కాఫీ అడిగే వారు లేరు. పేరయ్య బేరం చేస్తూనే వుండేవాడు. మందూ లేదు, మాకూ లేదు. అమె మరణించింది.

కొడుకు కాసేపు ఏడిచాడు. చిరు తిండి ప్రారంభించాడు. పేరయ్యకు బాధేలేదు. మందుల పైకం మిగిలిందని ఆనందం. దహనం చేయించాడు. బంధువులకు తెలియదు. కర్మకాండలు లేవు. పైకం మిగిలిందని పేరయ్య ఆనందం. బంధువులు కూడా వచ్చేవారు కారు. అతని సంగతి అందరికీ తెలుసు. పనిమనిషి కుదిరింది. పేరయ్యకు పని జరిగిపోతోంది. కొడుకు జులాయిగా మారాడు. చదివించమనేవారు ఊరివారు. పైకం దండగ అనేవాడు పేరయ్య. బాలరాజు తిండికి ముందుండే వాడు. తరువాత కోతి కొమ్మచ్చులు ఆడేవాడు. అయినా పేరయ్యకు చీకూ చింతా కలుగలేదు. చివరకు జులాయిగా మారాడు. ఇంటికి పేచీలు, కొట్లాటలు తెచ్చేవాడు. దుకాణంలో కరివేపాకు వుండేది. కానీ కరివేపాకు మరొకరిని అడిగేవాడు. ఏమిటంటే మంచిది కాదు అనేవాడు. పాడి గేదెను కొనడు, మజ్జిగ ఎదురింటి వారిని అడిగేవాడు. వంటపని ఒకరికి పురమాయించేవాడు. ఒకరి సహకారం వొకరికి అవసరమంటాడు. తన పైకం మాత్రం తీయడు. ఎదుటి వారిని అడిగేవాడు. అందరూ హేళన చేసేవారు. తనకు రోగం వచ్చేది. జీలకర్ర, మిరియాలు నమిలేవాడు. వైద్యం చేయించుకునేవాడు కాదు. శరీరం శాశ్వతం కాదనేవాడు. పైకం దాపరికం దేనికని అడిగేవారు. పైసా యే పరమాత్మా హై అనేవాడు.

మరికొంత పొలం బేరం చేశాడు. ఇంకో రెండు ఇండ్లు కొన్నాడు. అయినా వొంటికి సుఖం లేదు. మంచి లేదు. బాలరాజుకు చిరుతిండి ప్రధానం. ఇంకేమీ అవసరం లేదు. పేరయ్య ధనాన్ని ప్రేమించాడు. ధనం గురించే ఆలోచించాడు. మనుషులను నమ్మలేకపోయాడు. ప్రేమించలేకపోయాడు. దొంగల భయం. కంటికి నిదురరాదు. తిండి సహించేది కాదు. ఆరోగ్యం పాడైంది. పక్షవాతం వచ్చింది. వైద్యుని చూడలేదు. పైకం పాడవుతుంది. అదీ అతని ఆలోచన. చేసేవారు లేరు. కొడుకును నమ్మడు. బాలరాజు బరి తెగించాడు. దొరికింది దుబారా చేయసాగాడు. పేరయ్య బావమరిదికి ఈ తంతు అంతా తెలిసింది. అయినా రాలేకపోయాడు. ఇతరుల సలహా మీద బావమరిదిని పిలిపించాడు పేరయ్య. కొడుకుని దారి చేయమని అడిగాడు. పైకం యీయనని చెప్పాడు. అందరూ మందలించారు. అయినా వినలేదు. బావమరిదికి అక్కగారి మీద అభిమానం. బాలరాజును తీసుకుపోయాడు. ఆ ఊరి నదికి వరద వచ్చింది. చాలా ప్రాణాలు పోయాయి. నీరు ఊరంతటినీ ముంచింది. పేరయ్య పెట్టెను కౌగిలించుకున్నాడు. వదలలేదు. నీరు బాగా త్రాగాడు. వరద నీటిలో హరీమన్నాడు. పెట్టెను కౌగిలించుకున్నాడు. ప్రాణం నిలుపుకోలేకపోయాడు.

అందుకే వేమన చెప్పింది. లోభిని ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. పైకం అడిగితే చాలు పడి చస్తాడు అని నీతిని చెప్పాడు. సంపాదించాలి. సంపాదించింది అనుభవించాలి. అతడే మనిషి. ఇది మనకు వేమన తెలియ చేసిన నీతి. మరిచిపోకండి. అంటూ పంతులు గారు పాఠం ముగించారు.       

పిశాచాలు చేసిన సహాయము

అనగనగా అవంతీపురం సమీపములో గల గ్రామములో ఒక ముసలి అవ్వ, మనుమడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు, పప్పు తీసుకువెళ్ళేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వచేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారము చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళము చెవి దొరికింది. అది తన మనుమడి పెట్టెదని తీసి పెట్టె తాళము తీసి పెట్టెలోపల డబ్బు చూసి అందరిని పిలిచి చెప్పింది. ఆ మాటలు చాటుగా ఉన్న దొంగలు విని హడావుడిగా వచ్చి మీ మనుమడు చెట్టు మీదనుంచి పడిపోయాడు. దెబ్బలు తగిలాయి. డబ్బు తీసుకొని రమ్మన్నాడని చెపితే తీసుకొని వాళ్లమాటలు నిజమేనని నమ్మి ఆ డబ్బులు ఇచ్చింది అవ్వ. ఆధనము తీసుకొని వాళ్ళు పారిపోయారు. అవ్వ ఏడుస్తూ గుమ్మంలో చతికిలపడింది.

కొంతసేపు గడిచేసరికి మనుమడు సరుకులు తీసుకొని వచ్చాడు. అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయా? అని అవ్వ అడిగేసరికి అవ్వ చెప్పిన మాటలు వల్ల అంతా తెలిసి నా కష్టార్జితము మట్టి పాలు చేశావు గదే! ఇంకా కాస్త కూడబెట్టి పట్టణంలో వ్యాపారము చేద్దామనుకున్నాను. నాకు ఆ రాత లేదే. మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని అన్నము తినకుండా వెళ్ళిపోయాడు. మనుమడి మాటలకు అవ్వకు పట్టరాని దుఃఖము కలిగి అడవిలోకి వెళ్ళి పిశాచాల బారిన పడి మరణించాలని బయలుదేరి వెళ్ళి చింతచెట్టు దగ్గర కూర్చొని పిశాచాలు పిశాచాలు రండి అంటూ అరిచింది. రెండు తెల్లని పిశాచాలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటూ అడిగాయి. అవ్వ వాటిని చూసి భయపడక విషయమంతా చెప్పి నా మనుమడిచే అంత మాటలు అనిపించుకున్నాక ఎందుకు బ్రతకాలి నన్ను చంపేయండి అంది.

పిశాచాలు కూడబలుక్కొని అది కుర్రదొంగలపని అని గ్రహించి అవ్వా నీ మనుమడి ధనము నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళతావా? లేక చచ్చిపోతావా? అని అడిగాయి. ధనము దొరికితే ఇంటికి వెళ్తానంటే సరే మా వెంటరా అని కుర్రదొంగల వద్దకు తీసుకువెళ్ళి బయట ఉండమని చెప్పాయి. లోపల అందమయిన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఏడిపించటం గమనించి ఆ అమ్మాయిలో ప్రవేశించి నేను పిశాచాల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని. మీ సంగతి చెప్తా అంటూ ఇద్దర్నీ చావబాదింది. దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా రెండో దయ్యము పిశాచము ఆవహించి వున్న దయ్యం కాళ్ళ దగ్గర పడేసింది. దాంతో హడలెత్తిన దొంగలతో అవ్వను మోసం చేసి ధనము తీసుకున్నది మీరేనా అని అనగా మేమే అంటూ ఆ ధనమును అక్కడ పడేసి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అవ్వ లోపలికి వచ్చింది. అవ్వా! నీ డబ్బు తీసుకో. అని ఈ అమ్మాయి మంచిది. సవతి తల్లి బాధలు పడలేక వచ్చి వీరి బారిన పడింది. నీ మనుమడికి ఇచ్చి వివాహం చేసి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాయి.

అవ్వ ధనముతో పాటు అందగత్తెలాంటి అమ్మాయిని తీసుకురావడం చూసిన మనుమడు అవ్వా ఎవరు ఈమె అన్నాడు. నీ భార్య నీ ధనము ఇదుగోరా అంటూ జరిగిన విషయము చెప్పింది. మంచి ముహూర్తం చూసి వారి వివాహం జరిపించింది. వారు సుఖంగా జీవనంసాగిస్తున్నారు.       

పిరికి దుప్పి

అది దట్టమైన పచ్చని అడవి. ఒక దుప్పి దాని పిల్ల దుప్పితోపాటు గడ్డిమేస్తూ అడవంతా తిరుగుతోంది. అడవిలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నాయి.

హఠాత్తుగా ఆ దుప్పులకు వేటకుక్కలు మొరుగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం దూరం నుంచే వినిపిస్తున్నా తల్లి దుప్పిలో విపరీతమైన అలజడి ప్రారంభమైంది. వేటకుక్కలు ఎటునుంచి వస్తున్నాయో, వాటి అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అర్ధంకాక అటూ ఇటూ చూస్తూ కలవరపడింది.

తల్లిని చూసి విషయం అర్ధం కాని దుప్పిపిల్ల " అమ్మా! వేటకుక్కల కంటే పెద్దగా ఉన్నావు కదా. మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటికంటే వేగంగా పరుగెత్తుతావు. నీకు కొమ్ములు కూడా ఉన్నాయి. వాటితో ఆ వేటకుక్కలను తరిమికొట్టచ్చు" అని అంది.

దుప్పిపిల్ల మాటలకు తల్లి, "అవును, నిజమే," అంటూ కుక్కల అరుపులు విన్న వెంటనే పారిపోవడం ప్రారంభించింది. తల్లి ప్రవర్తన అర్ధంకాని దుప్పిపిల్ల కూడా తల్లి వెంటే పరిగెత్తింది.

పిచ్చి కబుర్లు

అననగనగా ఒక వనము. ఆ వనంలో కాకి, పావురం, కొంగ స్నేహంగా ఉన్నాయి. ఒక రోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి. వనంలో అవి ఉన్న స్థలం నుంచీ దాదాపుగా ఓ కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి చేరాలి. ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లు... ఆ నెగ్గిన వాళ్లు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలా నడుచుకోవాలనే పందెం అది.

కాకి, పావురం, కొంగ నిర్ణీత స్థలం నుంచీ ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చాయి. కొంగ ఎంతగా రెక్కలు అదిలించినా కాకినీ, పావురాన్ని దాటలేక చాలా దూరం వెనక బడింది. "పావురం మిత్రమా. మనం అతి వేగంగా చాలాదూరం ఎగిరి వచ్చాం. కొంగ మనల్ని దాటి పోవడం అసంభవం... కాసేపు మనమిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటున కూర్చుని కబుర్లు చెప్పుకుందాం" అంది కాకి. "సరే అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా" అంది పావురం. ఆ రెండు పక్షులు చెట్టు మీదకి పోయాయి. ఏవేవో కబుర్లూ, ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి.

కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టున ఉన్న కొబ్బరి చెట్లను చేరుకుంది ప్రశాంతంగా. అది చూసిన పావురం, కాకి పిచ్చి కబుర్లు ఆపేసి గబగబా ఎగిరి వచ్చి ఆయాసపడుతూ కొంగ చెంత వాలిపోయాయి. "మమ్మల్ని ఓడించావు కొంగ గారు. మా పిచ్చి కబుర్లూ, ఊసులే కొంపలు ముంచాయి... ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు... నీకు అభినందనలు... "

అన్నాయి పావురము, కాకి తలదించుకొని...

చూశారా పిల్లలూ పిచ్చి కబుర్లు ఎంత నష్టం కలిగిస్తాయో...

పావురాళ్ళు-రాళ్ళు

పావురాలంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు!అరలు అరలుగా గూళ్ళతో నిండిన పెట్టెలు ఇంటి వసారాలో చూడ ముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు, పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల, ఆ పావురాలు బాగా బలిసి, నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి.

ఓ నాడు, గూళ్ళల్లోని పావురాలనన్నిటినీ విడిచి పెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ, ఆ పావురాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకొంటూ వెంకయ్య మురిసి పోతున్నాడు!

అంతలో ఆ పావురాలు నేలమీద వున్న చిన్నచిన్న రాళ్ళ పిసళ్ళను వెదుక్కొంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కల్గింది! అసహ్యం కూడా వేసింది; "మంచి మంచి పప్పులు, పళ్ళు పెడుతూవుంటే, ఇవి రాళ్ళు మింగుతున్నాయేమిటి?" అని కోపం కూడా వచ్చింది. వెంటనే, ఛీ!మట్టి తినే ఈ పావురాలను పెంచడం నాదే తప్పు" అనుకొంటూ, చేతిలో ఉన్న కర్రను, వాటి మీద బలంగా విసిరాడు. కర్రదెబ్బ తప్పించుకొని పావురాలన్ని ఎగిరి పోయాయి కానీ, పావురాలతో పాటు రాతి పిసళ్ళను మింగుతూవున్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఒరిగి పడిపోయింది.

'అయ్యో' అనుకొంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో అంది, ఆ పిచ్చుక, బాధపడుతూ "మన బతుకు పద్దతి ఇతడికి తెలియదు అతడు పెట్టే పప్పులు, పళ్ళు, బలమైన ఆహారం తింటున్నాం. అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం. ఇది మన తిండి పద్ధతి! ఆ విషయం తెలుసుకోక, అతడు మనలను కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువవాడి వద్ద ఉండడం మనదే తప్పు, ప్రమాదం కూడానూ, పద, పోదాం" అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరి పోయింది! పావురాలన్నీ తలొక దిక్కుకూ ఎగిరిపోయాయి.

నిశ్చేష్టుడై వెంకయ్య అలానే కూర్చుండి పోయాడు, ఆకాశంలోకి ఎగిరి పోతున్న పావురాల కేసి చూస్తూ...!       

పాలు ముట్టని పిల్లి

విజయనగరములో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైనది. ప్రభుత్వము ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించినిది. రాయలవారు ప్రభుత్వోద్యోగులకు పిల్లులను ఉచితంగా యిప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరము. కావున ఒక్కొక్క ఆవును కూడా యిప్పించినారు.

ప్రభుత్వోద్యోగులతోపాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును యిచ్చినారు. అందరితోపాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చినారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారంలేక ఆకలితో చాలా బాధపడుతూ వుండేది. ఆ ఆకలి తీర్చుకొనుటకు రాత్రింబగళ్ళూ మేల్కొని వుండి కనబడిన ఎలుకనన్నిటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇండ్లలో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలి తీర్చుకోసాగింది. అందువలన రామకృష్ణుని ఇంటిలోగాని, ఇరుగు పొరుగు ఇండ్లలో గాని ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందుకు అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది.

ఇట్లు జరుగుతుండగా రాయలవారు తాము ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన పిల్లులను చూచి, బాగా పెంచిన వారికి బహుమతి యివ్వబడనున్నట్లు ప్రకటించారు. తమవద్ద నుండి పిల్లులను తీసుకొని వెళ్ళినవారంతా వాటిని పౌర్ణమినాడు తప్పక తీసుకొనివచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణకవి తెలుసుకొని ఆలోచనలో పడ్డాడు. ' ఆవు ఇచ్చిన పాలన్నీ నేను, మా కుటుంబ సభ్యులం హాయిగా త్రాగేశాం. పిల్లికి ఒక్కనాడయినా పాలు ఇవ్వలేదు. సరిగా తిండికూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చేస్థితిలో వుంది. దీనిని తీసుకొని వెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి యిక వారం దినాలున్నది. ఈ అగండం నుంచి బయటపడడమెలా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపైన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా వున్న పాలు తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకొని వచ్చింది. ఆ గిన్నె నొకచోట పెట్టి పిల్లిని తీసుకొనివచ్చి దానిచేత త్రాగించుటకు ప్రయత్నించాడు. పాలను చూచి అది ఎంతో ఆనందించింది, ఆనందించి త్రాగబోయింది. మూతి కాలింది. అరుస్తూ పారిపోయింది. దానిని మళ్ళీ తీసుకొనివచ్చి పాలదగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్ని సార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడంలేదు. అది పాలను చూసి ముఖం త్రిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణుని చేతుల నుండి తప్పించుకొని పారిపోవుటకు ప్రయత్నించింది. కాని పాలు త్రాగుటకు సిద్దపడలేదు. దాని ప్రవర్తనను చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించాడు. గండం తప్పించుకొని గట్టెక్కగలననుకున్నాడు.

పౌర్ణమినాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైది, ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లులను ఎత్తుకొని తెచ్చి రాయలవారికి చూపిస్తున్నారు. ఒక పిల్లికంటే ఒకటి బాగా బలిసి వున్నది. అతిగా బలిసి అడుగు తీసి అడుగువేయలేక ఆయాసపడే స్థితిలో వున్నవి. ఎలుక కనపడినా పరుగెత్తి వెళ్ళలేనంత లావుగా వున్నవి. తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణకవి తాను పెంచుటకు తీసుకొని వెళ్ళిన పిల్లిని తీసుకొనివచ్చి రాయలవారికి చూపించినాడు. అది బాగా కృశించిపోయి రేపోమాపో చస్తుందేమో అనుకొనేటట్లు వున్నది.

ఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవిగారు! మీ పిల్లి యిలా వుండడానికి కారణం ఏమిటని అందరు పిల్లులూ ఒకదాని కంటే ఒకటి బలిసి ఎంతో అందంగా వుండగా మీ పిల్లి బక్కచిక్కి ఈ క్షణమో, మరుక్షణమో ప్రాణం వదిలేదానిలా వుందేం? మేము ఇచ్చిన ఆవుపాలు దీనికి పట్టడంలేదా? అని అడుగగా, రామకృష్ణుడు వినయంగా మహాప్రభు! ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు ఇన్ని అన్నీ కావు. అసలు పాలు ముట్టదు. అప్పుడప్పుడు కాస్త పప్పు అన్నం తింటుందనుకోండి. ఎప్పుడూ దీని దృష్టి ఎలుకలమీదే! దీని పుణ్యమా అని మేమేగాక, మా యిరుగు పొరుగు యిండ్లలోని వారుకూడా ఎలుకల బాధ లేక హాయిగా వున్నారు అని చెప్పినాడు.

రామకృష్ణుని మాటలు విని రాయలవారేగాక సభలో వున్న మంత్రులు మున్నగువారు కూడ ఎంతో ఆశ్చర్యపడ్డారు. రాయలవారు, ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటుని పంపి పాలు తెప్పించి ఒకచోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు త్రాగించండి అని ఆజ్ఞాపించారు! రామకృష్ణుడు పట్టుకొనివున్న పిల్లిని తీసుకొనివెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం ప్రక్కకు త్రిప్పుకోసాగింది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనుకకు తిరిగి వస్తున్నది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణకవి చెప్పిన మాటలు నిజమే అనుకోసాగారు.

ఎవరు ఏమనుకున్నా రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటలు నమ్మలేదు. ' లోకంలో పాలుత్రాగని పిల్లి వుంటుందా? రామకృష్ణుడేదో కొంటె పని చేసివుంటాడు. అందువల్లనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతున్నది ' అని ఆ పిల్లిని దగ్గరకు తెప్పించుకొని దాని నోరుపరీక్షించి చూచినారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనబడినవి. నాలుక చివర వాతపడినట్లున్నది. వాటిని చూచి రాయలవారు కోపించి రామకృష్ణకవీ! పిల్లి పాలు త్రాగకుండ మీరేదో చత్కారం చేసినట్లు గ్రహించాము. మీరు నిజం చెపితే క్షమించి విడిచిపెడతాను లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను. అని బెదిరించగా, రామకృష్ణుడు జరిగిన విషయమంతయు చెప్పి ' మహాప్రభూ! మీరు మా ఎలుకల బాధ తీర్చుటకై పిల్లిని, దానిని పెంచుటకు ఆవును యిచ్చినారు. ఆ పిల్లివలన మా యింటిలోని ఎలుకల బాధయే గాక, మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధకూడా పోయినది. మీరు ఎవరినైనను పంపి మా యింటిలో పరిసరములో ఎక్కడైతే ఎలుకలు కనబడతాయో తెలుసుకొని రమ్మనండి, నేను నా పిల్లిని, ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టుటయేగాక, మాకు నిత్యం కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలగువానిని లోటు కలుగకుండ ఆవును కూడ యిచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వక వందనము అర్పించుకొనుచున్నాను. నా పిల్లివలె యిచటికి తేబడిన ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడుము. కడుపునిండాతిని, బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించునా? ఇచ్చటికి వచ్చినవారినడిగి తెలిసికొని నన్ను శిక్షించుటయో, రక్షించుటయో చేయుడి అని చెప్పాడు.

రామకృష్ణుని మాటలు విని రాయలవారు అచ్చటికి బలిసిన పిల్లులను తెచ్చి వారిని విచారించగా వారి ఇండ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పిరి. రామకృష్ణుని యింటి పరిసరములలో నున్నవారిని విచారించగా తమకు ఎలుకలబాధ ఏ మాత్రం లేదని చెప్పిరి. ఆ సమాచారం తెలుసుకొని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరియైనదేనని మెచ్చుకొని, వందవరహాలు బహుమతిగా యిచ్చి సత్కరించారు.       

పారిన పథకం

గౌరీపురంలో వుండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగానూ, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ వుండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వుండగానే భర్తపోగా, ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్ళి చేసింది. ఇక పెళ్ళికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు.

గోపాలుడు బాగా చదువుకొని కచ్చేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపెళ్ళి వారి నుంచి పెద్దగా కట్న కానుకలు లాగి, తన పూర్వవైభవాన్ని పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్నీ వారి ఆస్తిపాస్తులు తూకం వేసి తిరగ్గొట్టడం ప్రారంభించింది. తల్లి సంగతి ఇలా వుండగా గోపాలుడి ఆశలూ, కోరికలూ అందుకు భిన్నంగా వున్నవి. తాముంటున్న వీధిలోనే, నాలుగిళ్ళ అవతల వున్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతడి ఆలోచన. నిర్మల చురుకుదనమూ, సహనమూగల పిల్ల. అయితే, తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతడికి లేదు. అందుకు, నిర్మల కుటుంబం ఆర్థికంగా తమకంటే తక్కువ స్థితిలో వుండడం ఒక కారణమైతే, నిర్మల తండ్రి రామయ్యకూ, తన తల్లికీ మధ్య ఏవో కుటుంబాల పాత తగువుల కారణంగా నివురుకప్పిన నిప్పులాంటి శత్రుత్వం వుండడం మరొక కారణం.

ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని గోపాలుడు చాలాకాలం మధనపడి చివరకు ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకుని, తను కోరుకుంటున్నదేమిటో వివరంగా చెప్పి, మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్నతల్లి! ఆమెలో మార్పు కోరుకోవడమే గాని ఏమీ చెయ్యలేని అసహాయ పరిస్థితి నాది. అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖ జీవితం గడపాలంటే, నీ వంటిదాని సహకారం అవసరం. నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో, మన పెళ్ళికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు.

తల్లిలాగా కాకుండా మంచివాడూ, నెమ్మదస్థుడూ అయిన గోపాలుడంటే నిర్మలకు ఇష్టమే. ఆ ఇష్టాన్ని సూచిస్తూ, సిగ్గుతో తలవంచుకుని కొద్దిసేపు మౌనంగా వూరుకున్న నిర్మల, చివరకు, ఉపాయానికేం ఆలోచించవచ్చుకాని ఎటుతిరిగీ అత్తయ్యను కాస్త అయినా కష్టపెట్టక తప్పదు. అన్నది. దీనికి గోపాలుడు నవ్వి ఉన్నది మొండి జబ్బని తెలిశాక దాన్ని పూర్తిగా మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుణ్ణి కాదు, నిర్మలా! అన్నాడు. గోపాలుడికి తన మీద వున్న అభిమానానికీ, నమ్మకానికీ కృతజ్ఞతగా చూసిన నిర్మల, అయితే సరే! సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి, నీకు చెబుతాను అన్నది. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించడమూ, గోపాలుడు దానికి అంగీకరించడమూ జరిగాయి.

ఆ రోజు నుంచి వారం గడవకుండా, ఒక విచిత్రం జరిగింది. ఒకనాటి తెల్లవారుఝామున, ఇంటి ముంగిట కళ్ళాపి చల్లడానికి నిర్మల వచ్చేసరికి, వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు. నిర్మల చప్పున తండ్రిని పిలిచి, సాధువును లోపలకు చేర్చి ఉపచారాలు చేసింది. కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువును, మరి రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు. క్రమంగా అతణ్ణి గురించిన వివరాలు తెలియవచ్చాయి. సాధువు పేరు కరుణానందుడు. అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు. గత నూట పది సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ, అనేక మహిమలు గడించాడు. మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు. గురువు ఆదేశానుసారం, తాను నిర్వాణం చెందేలోగా, జనావాసాలన్నీ కాలినడకన తిరిగి, తన మహిమలన్నీ మంచివాళ్ళకూ, కరుణాహృదయులకూ ధారపోస్తున్నాడు. అలా తిరుగుతూనే ప్రయాణభారం, వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి. ఊరివాళ్ళలో కొందరు పూలు, పండ్లు తీసుకెళ్ళి కరుణానందుడి దర్శనం చేసుకురాసాగారు. ఒకరిద్దరు మంచివాళ్ళకు మాత్రం, ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది. అటువంటి వారిలో సూరమ్మ ఇంటికెదురుగా వుంటున్న గంగాధరం ఒకడు. గంగాధరాన్ని కరుణించిన సాధువు, అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదిస్తానని చెప్పాడు.

ఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది. మొదట రామయ్య ఇంటికి వెళ్ళడానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకొని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది. తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు. అతడు లోపల దీక్షలో కూర్చుని, నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల, సూరమ్మకు తెలిసినదేమంటే సాధువు, నిర్మలకు మహాలక్ష్మీ మంత్రం ఉపదేశిస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమీ శుక్రవారం నాడు, ఆ మంత్రాన్ని ఎనిమిదిసార్లు జపిస్తే, ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చొప్పున బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి!

ఇది వింటూనే సూరమ్మకు, నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది. ఇంతలో లోపలి తతంగం అంతా ముగిసినట్టు తెలియవచ్చింది. సూరమ్మ లోపలికి పోయి, సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి, అతణ్ణి తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది. సాధువు మందహాసం చేస్తూ, ఇప్పుడు వీలుకాదు, తల్లీ! ఏచోటా వారం రోజులకు మించి వుండరాదని గురువాజ్ఞ. మరొక ఆరునెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మీ మంత్రం జరిపించబోతున్నది. ఉపదేశించిన గురువుగా నన్ను, ఆరోజున ఇక్కడికి వచ్చి, నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతుంది. అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను, అన్నాడు. సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం . స్వామీ కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది. ఏమిటో చెప్పు అన్నాడు సాధువు.

మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే, నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామీ! ఎంతోకాలంగా దాన్ని నా కోడలిని చేసుకోవాలనుకుంటున్నాను. కానీ దాని తండ్రికి నేనంటే పిసిరంత గౌరవం కూడా లేదు, అన్నది సూరమ్మ. సూరమ్మ మాట వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకొని కొద్దిసేపు తర్వాత తెరచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు! వాడు కచ్చేరీ ఉద్యోగం చేస్తున్నాడు అవునా? అని ప్రశ్నించాడు. అవును స్వామీ! అంటూ సూరమ్మ ఆనందంగా జవాబిచ్చింది.

సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిపించి రామయ్యా! ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు. నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు. రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞ స్వామీ అన్నాడు. ఆ తర్వాత నెల తిరక్కుండానే రామయ్య నిర్మలకూ, గోపాలుడికీ వివాహం జరిపించాడు. వివాహం అయిన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీలచేత పాడుపడినట్టున్న పెద్ద పెరడును బాగుచేయించి, రకరకాల కూరగాయల మొక్కలు నాటింది. ఆ పెరట్లోనే ఒక మూలగా పాకవేయించి, అందులో రెండు గేదెల్ని కొనితెచ్చిపెట్టి పాలవ్యాపారం ప్రారంభించింది. ఈ విధంగా నాలుగునెలలు గడిచేసరికి కూరగాయలూ, పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడా ఇక్కడా చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనుక వేసింది.

తన కోడలు ఏ మంత్రం జపించకుండానే డబ్బు సంపాయిస్తున్నదని సూరమ్మ సంతోషించినా, రాబోయే శ్రావణమాసంలో మహాలక్ష్మీ మంత్రం జపించి, ఆమె కూడబెట్టబోయే బంగారు నాణాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. కొన్నాళ్ళకు శ్రావణమాసం వచ్చింది. ఒకనాటి ఉదయాన రామయ్య, గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు. తనను చూడగానే పొంగిపోతూ అతిధి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు, ఏం సూరమ్మా! ఇల్లు కళకళలాడుతున్నది. నీ కోడలు మంత్రం జపించకుండానే, నీ ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందన్నమాట! అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డమూ, జడలూ తీసి పక్కన పెట్టాడు. సూరమ్మ నిర్ఘాంతపోతూ చూసి ఏమిటీ మోసం? అంటూ కోపంగా మరేదో అనబోయింది. కాని, కరుణానందుడిగా వేషం వేసుకు వచ్చిన వృద్దుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయేముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మా! అన్నాడు. అతణ్ణి పరీక్షగా చూసిన సూరమ్మ అతణ్ణి గుర్తుపట్టి తడబడుతూ మీరా! అంటూ తల వంచుకున్నది.

అప్పుడు వృద్దుడు శాంతంగా గుర్తుపట్టావు గదా! అని, అక్కడే వున్న గోపాలుడికేసి తిరిగి, నాయనా! నేను నీ నాన్నకు స్వయానా పినతండ్రిని మీ అమ్మకు పిన మామగారిని. నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటుండేది. అది మా అన్నయ్యకు అంటే, మీ తాతకు ఇష్టం ఉండేదికాదు. నా అభిరుచి వదులుకోలేక, నేను మరొక ఊరు వెళ్ళిపోయాను. వృద్దురాలైన అత్త మామల్ని మీ అమ్మ నానాబాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది. ఆ తర్వాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచినా, వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకూ కొడుకు కోసం బాధపడుతూనే వున్నారు, అంటూ ఆగి సూరమ్మను ఏం తల్లీ నేను చెప్పిన దాంట్లో అబద్దం పాలు ఏమీ లేదుగదా? అని ప్రశ్నించాడు.

సూరమ్మ వెలవెలపోతూ, తల పక్కకు తిప్పుకున్నది. వృద్దుడు ఒక్క క్షణం ఆగి, గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకూ, గంగాధరానికీ తెలుసు. నువ్వు నిర్మలను చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాత, నిర్మల రూపొందించిన పథకంలో, సాధువు పాత్రకు రామయ్యా, గంగాధరం నన్ను ఒప్పించారు. ఆపైన జరిగినదంతా తెలిసిందే! ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది. అంటూ సూరమ్మ వైపు తిరిగి, అత్త మామలను కాల్చుకుతిన్న నీ వంటి దానికి, నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి, నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలిని చేశాడు. నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే, ఈ ఆరునెలలు గడువు ఇచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని సవ్యంగా ప్రవర్తించావా సరేసరి, లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలా ప్రవర్తిస్తుంది. అన్నాడు.

ఆఖరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొటా బొటా కన్నీళ్ళు కారుస్తూ మామయ్యా! నా తప్పు నాకు తెలిసింది. మీరు చెప్పినట్లు నిర్మల నా కోడలవడం నా అదృష్టం. ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మే అన్నది. సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో వున్న ఆమె పినమామతో పాటు అక్కడ వున్నవారందరూ చాలా సంతోషించారు.       

పారని పన్నాగం

ఒక ముసలి పిల్లి తన కిష్టమైన ఆహారం, ఎలుక పిల్లలను పట్టుకోలేక చతికిలపడిపోయింది. పారిపోతున్న ఎలుకులను పట్టుకునేంతలోనే అవిచేజారిపోతున్నాయి. వయసు మీద పడుతుండడంతో ఇక ఎలుకులను పట్టడం తనవల్ల కాదని నిర్ణయించుకుంది.

ఎలుకులను చంపి తినేందుకు తన ఒళ్ళు కరగకుండా, ఆయాసం రాకుండా ఉండే ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించింది. ఎలుకులు బొయ్యారం దగ్గర్లోని గోడవద్ద ఒక తలదిండు కవర్‌ను మెడవరకు కప్పుకుని తలకిందులుగా నిలబడింది. ఎలుకులు తను చనిపోయిందనుకుని తన దగ్గరకు వస్తాయని, గుట్టు చప్పుడు కాకుండా వటిని గుటుక్కుమనిపించవచ్చని ఆలోచించింది ముసలి పిల్లి. చిట్టెలుకలన్నీ తమ బొయ్యారపు ద్వారం దగ్గర నిలబడి పిల్లిని చూస్తున్నాయి. అది గమనించిన ఒక తెలివైన ముసలి ఎలుక పిల్లి పన్నాగాన్ని అర్ధం చేసుకుంది. కాని ఈ విషయం చెబితే చిట్టేలుకులు నమ్మవని దానికి తెలుసు కాబట్టి వాటిని కాపాడాలంటే తను కూడా పిల్లిలాగా అబద్ధపు ఆలోచన చేయాలని భావించింది. అంతే, అనుకున్నదే తడవుగా చిట్టెలుకల వద్దకు వచ్చి ఆహా ఎంత మంచి బ్యాగు. నేనెప్పుడూ పిల్లి తలతో ఉన్న ఇలాంటి బ్యాగ్‌ను చూడలేదే! చాలా బావుంది కదా! అంది. అది బ్యాగేనని తలపోసిన చిట్టెలుకలు వాటి దారిన అవి వెళ్లిపోయాయి. ముసలి పిల్లి ఆశలు అడి యాశలయ్యాయి.

పసిమనసు

రాఘవరావుగారు కూతురును చూడటానికి పట్నం నుండి వచ్చారు. ఆయన కర్నూలు జిల్లాలో హెడ్‌మాస్టర్. తాతగారిని చూసి పరుగున వచ్చాడు పవన్. మనవడిని ఎత్తుకొని ముద్దాడుతూ ఇంట్లోకి నడిచాడు రాఘవరావుగారు. అమ్మా! అమ్మా! తాతయ్య వచ్చాడు. అరిచాడు పవన్. శైలజ కిచెన్ రూం నుండి బయటికి వచ్చి తండ్రిని క్షేమసమాచారాలడిగింది. అనంతరం అల్లుడుగారింకా రాలేదా? అడిగారాయన.

ఆఫీస్ టైం అయిపోయింది కదా! వస్తుంటారు నాన్నా అని చెప్పింది శైలజ. మనువడితో ఆడుకుంటూ కబుర్లలో పడ్డాడు రాఘవరావుగారు. తండ్రి కోసం పవన్ మనసు ఎదురుచూస్తుంది. ఆఫీస్, దారి కబుర్లు పూర్తి చేసుకొని రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చాడు రంగనాథం. రాగానే పరుగున వెళ్ళి తండ్రి చేయి పట్టుకున్నాడు పవన్. అలసటగా వున్న రంగనాథం చేయి విడిపించుకున్నాడు. మామగారిని చూసి క్షేమసమాచారాలు అడిగాడు. టవల్ తీసుకొని బాత్‌రూం వైపు నడిచాడు. తండ్రి తనను ఎత్తుకోవాలని ఎంతో ఆశగా పరుగెత్తుకుంటూ వచ్చిన పవన్ మనసు నిరాశతో గిలగిలలాడింది.

రంగనాథం డ్రస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. అలసటగా కుర్చీలో కూర్చున్నాడు. టి.వి. ఆన్ చేసాడు. పవన్ పలక చేత పట్టుకొని పరుగున వచ్చాడు. పలకలో ఓ సున్నా చుట్టి, దానికి రెండు కళ్ళు, ముఖం, చెవులు పెట్టాడు. నాన్నా! నాన్నా! నేను బొమ్మ గీశాను చూడు అన్నాడు. రంగనాథం టి.వి పై నుండి చూపు మరల్చలేదు. పలకలోకి చూడకుండా ఎబిసడిలు రాసుకోకుండా ఈ బొమ్మలేంటి? వెళ్ళి ఎబిసిడిలు రాయి వెళ్ళు అన్నాడు చెంపలు నిమిరి. తాను గీసిన బొమ్మ చూసి నాన్న మెచ్చుకుంటాడని ఆశ పడిన పవన్ ముఖం చిన్నబోయింది. మెల్లగా వెళ్ళి గోడవారగా కూర్చున్నాడు. ఎబసిడిలు వచ్చినవన్నీ రాసాడు. నాన్నా నాన్నా! ఎబసిడిలు రాశాను అంటూ ఉత్సాహంగా వచ్చాడు. తాతయ్యకు చూపించు అన్నాడు రంగనాథం. ఉరకలు వేసే ఉత్సాహం చచ్చుబడిపోయింది. చేసేది లేక ముఖం చిన్నబుచ్చుకుని తాతయ్య దగ్గరకెళ్ళి కూర్చున్నాడు. రాత్రి భోజనాలయ్యాక టి.వి లో వార్తలు వింటున్నాడు రంగనాథం. పవన్ వచ్చాడు. నాన్నా! నాన్నా! కథ చెప్పవా? గడ్డం పట్టుకుని లాగుతూ అడిగాడు. "కథకు కాళ్ళులేవు. ముంతకు చెవుల్లేవు పడుకోకన్నా" అన్నాడు రంగనాథం. పవన్ కథ చెప్పమని గడ్డం పట్టుకులాగుతున్నాడు. వార్తలు వినాలి. చెబుతుంది నీక్కాదా విసిగించకు వెళ్ళి పడుకో! లేకుంటే పిచ్చోడికి పట్టిస్తా అన్నాడు. అంతా గమనిస్తున్న రాఘవరావుగారు అల్లుడూ వాడికి కథ చెప్పు అన్నారు.

అదేంటి మామయ్యా! వాడేదో పిల్ల తనం కొద్దీ కథ చెప్పమంటున్నాడు. అలాగని కథలు చెబుతూ కూర్చోవటమేనా? అంత తీరికెక్కడుంది. అన్నాడు రంగనాథం. వచ్చినప్పటి నుండీ గమనిస్తున్నాను. నువ్వు వాడిని నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నారు రాఘవరావుగారు. నేను వాడిని నిర్లక్ష్యం చేయటమేమిటి? వాడు నాప్రాణం. వాడికి పదిహేను జతల బట్టలు తెచ్చాను. కోరిన తినుబండారాలు కొనిచ్చాను. వందలకొద్దీ ఫీజ్‌తో స్కూల్లో చేర్చాను. వాడికేంతక్కువైంది? అన్నాడు రంగనాథం. వాడికి అన్నీ అమర్చావని నీ వనుకుంటున్నావు. సంతృప్తి పడుతున్నావు కానీ, వాడి ఒంటరితనాన్ని దూరం చేసే నీ ప్రేమ మాత్రం వాడికి లేదు అన్నారు రాఘవరావుగారు. వాడు నా ప్రాణం. వాడిపై నాకు ప్రేమలేక పోవడమేమిటి మావయ్యా? ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథం.

రాఘవరావుగారు అల్లుడి మాటలకు నవ్వి, పిల్లలకు తల్లిదండ్రులతో కబుర్లు చెప్పాలని ఉంటుంది. తాము రాసిన అక్షరాలు, బొమ్మలు చూపి మెప్పుపొందాలని ఉంటుంది. కథలు వినాలని ఉంటుంది. తల్లిదండ్రులతో ఆడుకోవాలని ఉంటుంది. కానీ మనం యాంత్రిక జీవితంలో పడి పట్టించుకోము. వారికేలోటు చేయలేదనుకుంటాం. వాళ్ళ మనసులో బాథ మనకర్థం కాదు. వాళ్ళ ఒంటరితనాన్ని గుర్తించలేము. వాళ్ళ ఉత్సాహాన్ని అల్లరి అంటాం. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గదమాయిస్తాము, భయపెడతాము. వాళ్ళ ఉరకలు వేసే ఉత్సాహాన్ని ఆనకట్ట వేస్తాము. తెలుసుకోవాలనే ఉత్సుకతను ఆదిలోనే నరికేస్తాం. ఎన్నో పనులతో అలసిపోయామంటాము. కానీ పిల్లల సమక్షంలో అలసట తీర్చుకోవచ్చని మనకు తెలియదు. పని, స్నేహితులు, ఊరి రాజకీయాలు, అనవసర కబుర్లు, టి.వి కోసం కేటాయించే సమయంలో కొంత టైం కూడా పిల్లలకోసం వినియోగించలేము. వారితో కలిసి కబుర్లు చెప్పలేం, ఆడలేం. వాళ్ళని మానసికంగా ఒంటరిని చేస్తాం. వాడికన్నీ అమర్చామనుకుంటాం. ఇదీ మనం పిల్లల కోసం చేస్తున్న త్యాగం అన్నారు.

ఆయన మాటల్లోని యదార్థం అర్థమయ్యి రంగనాథం ఉలిక్కిపడ్డాడు. నన్ను క్షమించండి మామయ్యా! మీరు చెప్పింది అక్షరాలా నిజమే! అంటూ తాత పక్కన నిద్రలోకి జారుకున్న బాబు వైపు నడిచాడు రంగనాథం.       

పరోపకారి

ఒక ఊరిలో రామారావు అనే ఒక ధనవంతుడుండేవాడు. ఆయన చాలా ఉదారస్వభావంగలవాడు. అనేక విద్యాసంస్థలకు, అనాధ శరణాలయాలకు విరివిరిగా దానధర్మాలు చేసిన మనసున్న మనిషి. రామరావు తన దానగుణం వల్ల ఎంతో పేరు గడించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా అవడం వలన ఆయన గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు.

రామారావు దగ్గర చాలాకాలం నుండి పని చేస్తున్నాడు దానయ్య. ఒకరోజు దానయ్య రామరావును "అయ్యా! తమకు ఏమి తక్కువ? ఇన్ని సంపదలుండి మీరు విలాసవంతమైన జివితాన్ని కోరుకోరు. ఉదయం, సాయంత్రం పనివాళ్ళతో కలిసి పనిచేస్తారు. సరైన బట్టలు కూడా వేసుకోరు. అనుభవించడానికేగా ఈ సంపదంతా" అని అడిగాడు. దానికాయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

కొంతకాలం తర్వాత వ్యాపారాల్లో నష్టాలు సంభవించాయి. ఆయన మంచిగుణం వలన ఇల్లు మాత్రమే మిగిలింది. అయినా ఆయన దిగాలుపడకుండా సంతోషంగానే ఉండసాగాడు. అప్పుడు దానయ్య "అయ్యా! ఇన్నాళ్ళు అంత ధనవంతుడిగా ఉండి మీరు ఇంత పేదవాడిగా కూడా ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు?" అని అడిగాడు.

చిరునవ్వుతో రామరావు "దానయ్య! నేను ధనవంతుడిగా ఉన్నా బీదవాడిగానే జివించాను, సుఖం అనేది శాశ్వతం కాదు, ఒక చుట్టం వంటిది. ధనమున్నదని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడితే, ధనంలేని రోజు బ్రతుకు నరకంలా ఉంటుంది. నా స్థితి బాగున్న సమయంలో ఎందరికో సాయం చేసాను, వారిలో కొందరు నాకు ఈ స్థితి లో సహాయం చేస్తున్నారు" అన్నాడు. ఆ తర్వాత మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయంతో వ్యాపారంలో ప్రవేశిఇంచి ఆయన మంచిగుణం వలన త్వరలోనే పూర్ణస్థితికి చేరుకున్నాడు. రామారావు వ్యక్తిత్వం, కీర్తిప్రతిష్టలు ఆయన్ని ఈ స్థితికి చేరుకునేలా చేశాయి.

పరోపకారం

ఒక అడవిలో నది ఒడ్డున ఓ మర్రిచెట్టు ఉన్నది. దానిపై ఒక పావురం నివసించేది. అది చాలా మంచిది. ఎవరికి కష్టం కలిగినా సాయం చేసేది. ఆ పావురానికి పాటలు పాడటమంటే భలే ఇష్టం తన పనంతా అయిపోయాక చెట్టు పై పాటలు పాడుతూ గడిపేసేది.

ఓ రోజు పావురం పాటపాడుతూ నదిలో నీరు తాగటానికి వచ్చింది. ఇంతలో నదీ ప్రవాహంలో కొట్టుకు పోతున్న చీమ ఒకటి కనిపించినది.దాన్ని ఎలాగయినా కాపాడాలనుకొంది పావురం. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. వెంటనే మర్రిచెట్టు ఆకు నొకదానిని తీసుకొని చీమ పక్కన పడేసింది. 'ఓ చీమా ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో ' అని అరచింది. అంతే, చీమ వెంటనే ఆ ఆకు మీదకు వెళ్ళిపోయింది. ఆకు అలా తేలుతూ నది ఒడ్డున ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది. 'నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యావాదములూ అంటూ పావురానికి చీమ కృతఙ్ఞతలు చెప్పింది. చీమ కొంత దూరం ప్రయాణం చెస్తూ విల్లమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాణ్ణి, ఆ వేటగాడు పక్షులకోసం నాలుగు వైపుల గాలించడం, చెట్టు కొమ్మపై కూర్చుని తినడంలో నిమగ్నమైన పావురాన్ని కూడా వేటగాడు చూసాడు. చీమ కూడా చూసింది.

ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనుక దాక్కొని బాణం ఎక్కు పెట్టి పావురానికి గురి పెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాణ్ణి కుట్టింది. బాణం మాత్రం దూసుకుంటూ వెళ్ళి పోయింది. బాధతో వేటగాడు అరిచాడు. బాణం గురి తప్పింది. పావురం అక్కడి నుండి మరోచోటుకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమకు సంతోషంగా ఉన్నది. మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది.        

పరివర్తన - 2

రామాపురం లో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా బద్దకస్తుడు. ప్రతీ పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా కదిలేవాడు.

ఒక రోజు ఆ ఊరిలో ఉండే పండితుడికి రాజు ఎదురయ్యాడు. రాజులో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు...'నీవు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి ఈశాన్యదిశలో రావిచెట్టుకి కుడివైపు పదిఅడుగుల దూరం లో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి' అని చెప్పి వెళ్ళిపోయాడు పండితుడు.

'బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో! ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే? శ్రమంతా వృధా అయిపోతుంది' అనుకుంటూ అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు రాజు. ప్రతీ పనీ ఇలాగే ఏదో ఒక వంకతో తప్పించుకునేవాడు.

కొంత కాలానికి ఆ ఊరిలో కరువు వచ్చింది. తాగడానికి నీరు లేక పశువులు, ప్రజలు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎందరు ప్రయత్నించినా నీళ్ళు పడలేదు.

రాజుకి హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

బంగారు నగలు దొరికితే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి హయిగా బతకొచ్చనుకున్నుడు.

వెంటనే పలుగు పార తీసుకొని ఈశాన్యదిశలో రావి చెట్టు దగ్గర తవ్వటం మొదలు పెట్టాడు. ఎంతతవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం. కాబట్టి ఎలాగైనా వాటిని చేజిక్కించుకోవాలని తవ్వుతూనే ఉన్నాడు రాజు. మూడు రోజులు గడిచాయి. నాలుగో రోజు ఉదయాన్నే రాజు కాళ్ళకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరటం ప్రారంభించింది. రాజు గబగబా గుంటలో నుంచిపైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్ళతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి రాజు శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి గొప్ప ఉపకారం చేశాడని అందరూ రాజుకి ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చారు.

శ్రమపడితే అందరి ప్రశంసలతోపాటు విలువైన బహుమతులూ వస్తాయని గ్రహించిన రాజు, ఆనాటి నుండి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు.

పరివర్తన - 1

పూర్వం ఒకప్పుడు సత్యధర్మి అనే రాజు పాలిస్తూండేవాడు. పేరుకు తగినట్టుగా ఆ రాజు మిక్కిలి ఔదార్యవంతుడు. న్యాయశీలుడు. మంచి దైర్యశాలి. ఎప్పుడూ తన రాజ్యంలో ప్రజల అవసరాలను తీర్చి వారి సుఖసౌఖ్యాలను పాటుపడుతూండేవాడు. ప్రజలకు ఎటువంటి అపాయం రాకుండా రక్షిస్తూండేవాడు. వారివారి తాహతులకు తగినట్లుగా సహాయం చేస్తూ ప్రజలకు ఉత్సాహం కలిగించేవాడు. రాజ్యం శాంతి భద్రతలతో, సకల సౌభాగ్యాలతో తులతూగుతూండేది ప్రజలు ఎప్పుడూ రాజు మంచితనాన్ని పొగుడుతుండేవారు.

ఒకరోజు సాయంకాలం ఆ రాజు ఉద్యానవనంలో విహరిస్తూ దగ్గరగా ఉన్న అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవి రకరకాల చెట్లతో దట్టమై అతి సుందరంగా ఉంది. ప్రకృతి సౌందర్యానికి రాజు ముగ్దుడై ఆనందిస్తున్నాడు. కొంతసేపటికి ఆ రాజుకి ఆకలివేసింది. దగ్గరగా ఉన్న ఒక ఆశ్రమం చేరాడు. అక్కడ ఒక సాధువు నివసిస్తున్నాడు. ఆ సాధువును సమీపించిన రాజు "ఓ సాధువుంగవా ! ఇక్కడ ఇన్ని వృక్షాలు ఫలాలతో క్రుంగిపోతున్నాయి. ఏ చెట్టు పళ్ళు మధురంగా, రసవంతంగా ఉంటాయి? ఏ చెట్టు పళ్ళు చేదుగా విషమయమై ఉంటాయి? ఏ పళ్ళు తినాలి? ఏవి తినకూడదు?" అని అడిగాడు.

సాధువు "ఓ స్నేహితుడా ఇక్కడ నీకిష్టమైన పళ్ళు నీవు తినవచ్చు. సత్యధర్మి ధర్మరాజు వంటివాడు. అతడి మంచితనంవల్ల ఈ రాజ్యంలోచేదుపళ్ళు అనేవి లేనేలేవు. రాజు చిరంజీవి అగుగాక ఆ వేప చిగుళ్ళు మధురాతిమధురమైన ద్రాక్షపళ్ళులా ఉంటాయి. పుల్లటి చింతపండు పండిన మామిడిపండులాగా తియ్యగా ఉంటుంది. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం రక్షిస్తుంది" అన్నాడు.

వెంటనే సత్యధర్మి కొన్ని వేప చిగుళ్ళు కోసి తిన్నాడు. ఆశ్చర్యం అని మధురరసం ఉట్టిపడే ద్రాక్షపళ్ళులా ఉన్నాయి. చింతపండు తిని చూశాడు. అతి తియ్యని మామిడిపండులా ఉంది. రాజు ఎంతో సంతోషపడ్డాడు. ఆనందంతో ఊరివైపు బయలుదేరి వచ్చాడు.మనస్సులో అహంకారబీజం మొలకెత్తింది. "నేనెంతో గొప్ప రాజును. ప్రపంచంలో నాతో సమానమైన రాజు ఎవ్వరు? ఆహా నా కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది" అనుకున్నాడు.

రాజు అహంకార గర్వంతో రాజ్యపాలనను అశ్రద్ధచేయడం ప్రారంభించాడు. ప్రజల కష్ట సుఖాలను గుర్తించడంలేదు. సదా త్రాగుతూ, తింటూ, నిద్రపోతూ కాలం గడపడం ప్రారంభించాడు. ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడ చూసినా రాజ్యంలో అల్లరులు, దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలు. పంటలు పండడంలేదు. అనావృష్టి ప్రబలిపోయింది అయినా రాజు ప్రవర్తనలో మార్పురాలేదు. తుచ్చసుఖాలతో ఆనందపడిపోతున్నాడు.

ఒకరోజు తిరిగి రాజు విహారానికి బయలు దేరాడు. పూర్వం వెళ్ళిన వనంలోకే వెళ్లాడు. పూర్వం చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూచిన సాధువునే చూచాడు. తన గొప్పతనాన్ని వినడానికి కుతూహలపడుతున్నాడు. సాధువు వీపుపై తట్టి "ఓ మానవా వనంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నన్ను ఏ పళ్ళు తినమంటావు. వేపాకు తినమంటావా? చింతపండు తినమంటావా??"అని అడిగాడు.

సాధుపుంగవుడూ నిర్లక్ష్యంగా "రాజ్యమంతా చెడిపోయింది. రాజు ప్రజల మంచి చెడ్డలను గ్రహించడం లేదు. రాజ్యంలో కరువు ఏర్పడింది. వానలు లేవు. తిండి గింజలు లేవు. పాపం పెరిగిపోయింది. ఏ పండు చూచిన పుచ్చు, పురుగు మధురమైన మామిడిపండు మట్టిముద్దలా ఉంటూంది. ప్రజలు ఈ రాజ్యాన్ని వదులుకుని ఎక్కడికైనా పోదామని తహతహలాడిపోతున్నారు" అన్నాడు. రాజు విమర్శకు ఉలిక్కిపడ్డాడు. నిట్టూర్పు విడిచాడు. అణకువతో నమ్రతతో సాధువు కాళ్ళపైబడి "ఆ పాపాత్ముణ్ణి నేనే. ఈ విపరీత పరిస్థితికి నేనే కారణం. అహంకారం ఆవరించుకుపోయింది. నన్ను రక్షించి ఆశీర్వదించు ప్రభూ" అని వేడుకున్నాడు.

సాధువు రాజును ఆశీర్వదించాడు. సత్యధర్మి నడవడి మారిపోయింది. రాజ్యాన్ని తిరిగి ధర్మయుక్తంగా పాలించడానికి ప్రారంభించాడు. సకాలంలో వర్షాలు పడ్డాయి. పంటలు పుష్కలంగా పండాయి. చెట్లు మధురమైన పళ్ళను ఫలింపచేసాయి. రాజ్యం సౌభాగ్యంతో వర్ధుల్లుతూంది. ఏ మూల చూసినా ప్రజలు రాజు గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం ప్రారంభించారు.        

పరమానందయ్య శిష్యులు చేసిన శొంఠి వైద్యం

ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్థుడు వున్నాడు. అతనికి పరమానందయ్యగారంటే ఎంతో భక్తి. పరమానందయ్యగారి తండ్రి, తాతల కాలం నుండి కుటుంబ గురువులు. అందువల్ల ఆయన పరమానందయ్యగారిని దైవసమానంగా భావిస్తున్నాడు. ఆయన మాట వేద వాక్యంగా భావించి పాటిస్తాడు. అప్పుడప్పుడూ ఆయన పరమానందయ్యగారి వద్దకు వచ్చి తృణమో పణమో యిచ్చి వెళుతూ వుంటాడు.

రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. కిరాణా దుకాణం, బట్టల దుకాణం నడిపేవాడు. అనేక అబద్దాలు ఆడి, మోసాలు చేసి విశేష ధనం, భూమి సంపాదించాడు. కానీ భార్యా పిల్లలు దక్కలేదు. నా అనే దిక్కులేక, గ్రామస్థులతో, సరిపడక మనసు బాగులేనప్పుడూ, ఏదయినా అనారోగ్యం వచ్చినప్పుడూ పరమానందయ్యగారి వద్దకు వెళ్ళి, రెండురోజులు ఉండి పోతుండేవాడు.

ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రామయ్యకు కడుపునొప్పి పట్టుకొంది. ఎన్నాళ్ళకూ తగ్గలేదు. మంచం పట్టాడు. తన స్థితి పరమానందయ్యగారికి ఉత్తరం ద్వారా తెలియచేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు. రామయ్య ఉత్తరం చదువుకొని పరమానందయ్యగారు శిష్య సమేతంగా మరునాడు అతని గ్రామం వెళ్ళారు. గురువుగారిని చూచి రామయ్య చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగా చెప్పాడు. పరమానందయ్యగారు 'నేను వచ్చానుగదా భయపడకు! ఇదొక గొప్ప రోగమా? దీనికి నా శిష్యులు చికిత్స చేయగలరు. రెండు రోజులలో నీ సమస్త బాధలూ తీరిపోతాయి. నిర్భయంగా వుండు'. అని ధైర్యం చెప్పాడు. శిష్యులను పిలిచి ఆయనకు చేయవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు.

గురువుగారి ఆజ్ఞ దొరకడం తడవుగా ఒక శిష్యుడు తన సంచిలో వున్న శొంఠి పొడుము తీసి కాస్త పంచదార కలిపి రామయ్యకు ఇచ్చి గోరువెచ్చని నీళ్ళు త్రాగించాడు. ఆ విధంగా మూడు పూటలు యిచ్చేసరికి రామయ్యగారికి కడుపునొప్పి తగ్గి ఆకలి పుట్టింది. రామయ్య చాలా సంతోషించాడు. రెండవ రోజున మరొక శిష్యుడు శొంఠి మెత్తగా దంచి కషాయం కాచి త్రాగించాడు. రామయ్య శరీరమంతా వేడి పుట్టింది. మూడవరోజున మరొక శిష్యుడు శొంఠి గంధం తీసి రామయ్య శరీరమంతా పట్టించాడు. దాంతో రామయ్య శరీరమంతటా మంటలు పుట్టాయి. ఆ బాధ భరించలేక రామయ్య గట్టిగా ఏడవనారంభించాడు. అది చూసి పరమానందయ్యగారు 'భయపడకు! రోగం తగ్గేముందు అలాగే వుంటుందని ' ధైర్యం చెప్పాడు. రామయ్య నిజమే కావచ్చుననుకొని మంటను ఓర్చుకొంటున్నాడు. నాలుగవరోజున మరొక శిష్యుడు శొంఠి నూరి ముద్దచేసి రామయ్య నడినెత్తిమీద వేసి కట్టుకట్టాడు. ఉన్న బాధలు చాలక తలపోటు పట్టుకొని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు.

అతని స్థితి చూసి పరమానందయ్యగారు శిష్యులను పిలిచి కొంపముంచారు. రామయ్య చచ్చేస్థితిలో వున్నాడు అని బాగా ఆలోచించి చికిత్స సాగించాడు. గురువు గారి మాటలు విని శిష్యులు చాలా బాధపడ్డారు. ఇంత కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోవడంలేదని ఆగ్రహించి 'గురువుగారూ! మీరేం దిగులుపడకండి. రామయ్య చచ్చినా అతని ప్రాణాలు మాత్రం పోనియ్యం' అని వాగ్దానం చేశారు. రాత్రి శిష్యులంతా కలసి ఆలోచించసాగారు. మనం ఎన్నిరకాల చికిత్సలు చేసినా రోగం తగ్గలేదు. రోగం తగ్గినా తగ్గకపోయినా ప్రాణం పోకుండా చూడాలి అని నిశ్చయించుకొన్నారు. ఒకనాడు ప్రాణం ఎటువేపునుంచి పోతుందో తెలుసుకోవాలన్నాడు. మరొకనాడు తెలుసుకోవడానికేముంది? కడుపులోనుంచి పోతుంది అన్నాడు. ఇంకొకడు ముక్కులో నుంచి పోతుందన్నాడు. వేరొకడు కళ్ళలోనుంచి పోతుందన్నాడు. ఈ విధంగా తలోక విధంగా చెప్పి ఎటూ నిర్ధారణ చేసుకోలేక పోయారు. వారిలో ఒక బుద్దిమంతుడు యిలా చెప్పాడు. మన శరీరంలో నవరంధ్రాలున్నాయంటారు. ఆ రంధ్రాలను వెతికి మూసివేస్తే ప్రాణం ఎటూపోలేక చచ్చినట్టు పడివుంటుంది. అన్నాడు. అతని బుద్ది కుశలతకు అంతా మెచ్చుకొన్నారు.

తమ వద్దనున్న శొంఠినంతా తీసి మెత్తగా దంచి ముద్ద చేసి రామయ్యను బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు. అతని నవరంధ్రాలలో శొంఠి ముద్దకూర్చారు. ఎప్పుడైతే నోరు, ముక్కు రంధ్రాలు మూసివేశారో అప్పుడే అతని పంచప్రాణాలు గాలిలో కలసిపోయాయి. కదలక మెదలక పడి వున్నాడు. అతడు బాధ తగ్గి హాయిగా నిద్రపోతున్నాడని శిష్యులనుకొన్నారు. మంచం చుట్టూ కూర్చొని కునుకుతున్నారు. తెల్లవారింది గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రామయ్య వున్న గదిలోనికి వచ్చారు. మంచం వద్దకు వెళ్ళి రామయ్య చెయ్యిపట్టుకొని నాడి చూశారు. గుండె మీద చెయ్యి పెట్టి చూశాడు. కొంప మునిగింది! రామయ్య చనిపోయాడు. లేవండిరా! వెధవల్లారా. అని బిగ్గరగా అరిచారు. శిష్యులు గురువు గారి కేకలు విని త్రుళ్ళిపడి లేచారు. తాము చేసిన ఘనకార్యం గురించి చెప్పబోయారు, మీ తెలివి తక్కువ వైద్యము వల్ల రామయ్య చనిపోయాడు. ఎవరైనా ఈ సంగతి తెలుసుకొంటే చావగొట్టి చెవులు మూస్తారు. ఇతనికి దహన సంస్కారాలు చేయించాలి. కావలసిన వాళ్ళెవరూ లేరు. ఇరుగు పొరుగు వారికి ఈ సంగతి చెప్పి తీసుకొనిరండి అని పంపారు.

రామయ్య అంటే ఆ ఊళ్ళో వున్న వారికందరికీ చాలా కోపంగా వుంది. వాడు చస్తే మాకేం? బ్రతికితే మాకేం? మేము మాత్రం రాము. అని కబురు చేశారు. అంతట పరమానందయ్యగారు అతని శిష్యుల సహాయంతో దహన సంస్కారాలు జరిపారు. రామయ్య అంతకుముందే తాను చనిపోయిన తరువాత తన ఆస్తి అంతా తమ గురువుగారైన పరమానందయ్యగారి మఠమునకు యిస్తానని వాగ్దానం చేసి వీలునామా వ్రాసిపెట్టాడు. దాని ప్రకారం రామయ్య ఆస్థిని గైకొని శిష్యసమేతంగా స్వగ్రామం బయలుదేరారు పరమానందయ్యగారు.       

పరమానందయ్య శిష్యులు

పరమానందయ్యగారికి పన్నెండు మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెలకోసం అడవికి వెళ్ళారు. తిరుగు ప్రాయాణంలో వాళ్ళు ఒక వాగును దాట వలసి వచ్చింది.

"అమ్మో! వాగులో మునిగి పోతామేమో" అంటూ భయపడ్డారు. "మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం" అన్నాడు ఒకడు. "సరే" అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి "అందరం వాగుదాటామా?" అనే అనుమానం వచ్చింది. "ఓరేయ్! మీరంతా వరుసలో నిలబడండి. నేను లెక్కపెడతాను" అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు.

"ఒకటి, రెండు, మూడు..... పడకొండు. ఒరేయ్ పదకొండు మందిమే ఉన్నాం! ఒకడు వాగులో మునిగిపోయాడు" అన్నాడు. శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్కబెట్టారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా సంఖ్య పదకొండే వచ్చింది.

"మనలో ఒకరు వాగులో మునిగిపోయారు" అంటూ అందరూ భోరుభోరున ఏడుస్తూ, గురువు గారి దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ భోరున విలపించారు.

గురువుగారు అందరినీ తేరిపార చూశారు. శిష్యులను మళ్ళీ లెక్కపెట్టమన్నారు. ఒకడు లెక్కబెట్టాడు. మళ్ళీ పదకొండే వచ్చింది. గురువుగారు శిష్యులూ చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్కబెట్టారు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు.       

పగుళ్ళ కుండ


ఒక ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారు పోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది.

చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది.

"ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు. "ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని నసిగిందా పగుళ్ళ కుండ. దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు "బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది.

పనివాడు ఆ కుండతో "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్‌ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు" అన్నాడు. పగుళ్ళ కుండ తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది.

మనలో లోపాలున్నా పగుళ్ళకుండ మదిరిగానే మనమూ ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే గాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్నీ ఆనందంగా ఉండేలా చేసుకోగలం.       

పగటి కల

ఒకప్పుడు డిక్ వైటింగ్టన్‌ అనే కుర్రాడు ఒక దనవంతుడైన వ్యాపారి ఇంట్లో వంట అబ్బాయిగా పని చేసేవాడు .

డిక్‌ తనకు ఉండడానికి ఒక నీడ, వేళకు తిండి దొరికినందుకు ఆనందించేవాడు. కాని, తను కూడా తన యజమాని అంత ధనవంతుడని కావాలని, కనీసం వంటగదిలో తనపై అజమాయిషీ చేసే వంటలమ్మంత ధనవంతుడినైనా కావాలని కోరుకొనేవాడు.

ఎండాకాలం మధ్యాహ్నాలలో కొన్ని సార్లు అతను తన పిల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని కోడిపిల్లలను చూస్తూ, వంటలమ్మ పాడే జోల పాట వింటూ హయిగా పగటికలలను కనే వాడు.ఒక రోజు తన పిల్లి సప్తసముద్రాలు దాటి వెళ్ళి తన కోసం బంగారం, వజ్రాలు, రత్నాలు, తెచ్చినట్లు, దాంతో తను లండన్‌ నగరానికి మేయర్ అయినట్టు పగటికల కన్నాడు.

డిక్ వైటింగన్‌ తన యజమాని ఆదేశాలను పాటిస్తూ తన పగటికలను నిజంచేసుకోవాలనే దిశలో పట్టుదల చిత్తశుద్దితో పని చేసే వాడు.

"తన కల నిజమైతే...", అని తరుచుగా అనుకునేవాడు .

కొన్నాళ్ళకి డిక్ వైటింగ్టన్‌ కల నిజంగానే ఫలించింది. అతను లండన్‌ నగరానికి మూడు సార్లు మేయర్‌గా ఎన్నికయ్యాడు. అతడి కల నిజమైనందుకు అతనికి చెప్పలేనంత ఆనందం, తృప్తి కలిగాయి.

పంటలో వాటా

నజీరుద్దీన్‌ ముల్లాగా మారాక స్వంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బావుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి దగ్గరకు వెళ్ళి, పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటానన్నాడు.

ఆ ఆసామి జిత్తులమారి. నజీరుద్దీన్‌ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, "అలాగే!నా భూమిలో నీవు పంట వేసుకో. కాని అద్దె కట్టాలి"అన్నాడు.

"అలాగే.అద్దె ఎంత?" అడిగాడు నజీరుద్దీన్‌.

"పొలం పండిన తర్వాత, భూమిపైన ఉన్న పైరంతా నాకిచ్చేయాలి. అదే అద్దె" అన్నాడు. ఆ కుటిల ఆస్వామి.

" అలాగే". అని నజరుద్దీన్‌ ఆ రోజునుండే పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు.

కొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆసామీ తన వాటా కోసం నజరుద్దీన్‌ దగ్గరకి వెల్లాడు.

"భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లో ఎక్కించాను. తీసుకువెల్లండి"అన్నాడు.

ఆసామి సంచుల్లో చూస్తే అన్నీ ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయ మూర్తి దగ్గర ఫిర్యాదు చేశాడు.

ఆయన నజీరుద్దీన్‌ని కూడా పిలిపించి విచారించాడు."

ఈ ఆసామి చెప్పేది నిజమేనా?" అని అడిగాడు.

"అవును. నిజమే" అన్నాడు నజీరుద్దీన్‌.

"మరి మోసం చేశావెందుకు?" అడిగాడు. మోసం ఏం ఉంది? ఆయన భూమిపైన పైరు కావాలన్నాడు. నేను వేరుశనగ వేశాను. ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయన కిచ్చి, గింజలు నేను తీసుసున్నాను". అన్నాడు నజీరుద్దీన్‌.

నజీరుద్దీన్‌ తెలివికి న్యాయమూర్తి మెచ్చుకుని, అన్యాయమైన వాటా అడిగినందుకు ఆసామిని చీవాట్లు పెట్టాడు.

నోరుమూయించడం

వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశమే యివ్వకుండా పటపటవాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకీ ఇతరులకీ కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురుచూస్తున్నాడు రాజు.

ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడుండేవాడు. కాళ్ళు వంకరయినా రాళ్ళు విసరడంలో బహునేర్పరి. పిల్లలతనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగరద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్దమర్రిచెట్టుండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టివుండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో, గుర్రం బొమ్మో తెప్పించమనేవారు. కుంటివాడు గులకరాళ్ళు విసిరి మర్రిఆకు చెట్టుమీదుండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేలమీద గుట్టగా పడివుండేవి.

ఒకరోజు రాజు ఉద్యాన వనానికి పోతూ ఆ ఆకులగుట్టని చూసి 'వీటినిలా కోసిన వారెవరు?' అని అడిగారు. పిల్లలు కుంటివాడినొంటరిని చేసి పారిపోగా కుంటివాడు 'నేను మహారాజా' అంటూ విషయమంతా వివరించాడు. రాజు పరివారాన్ని దూరంగా పంపి ఆ కుంటివాడిని 'ఏమయ్యా! మావద్ద ఒక వదరబోతున్నాడు. నీ విద్యతో అతని నోరుకట్టించగలవా?' అని అడిగాడు. తప్పకుండా అన్నాడు కుంటివాడు.

రాజతనిని తన భవనానికి తీసుకొనిపోయి గది మధ్యగా తెర అడ్డం కట్టించి తెరకు చిన్న రంధ్రం చేయించి చిల్లు కెదురుగా పురోహితుడి ఆసనం వేయుంచి ఆయనవచ్చి కూర్చోగానే మాటలు మొదలు పెట్టాడు. అలవాటుప్రకారం పురోహితుడు తెరచిన నోరు మూయకుండా మాట్లాడెయ్యడం మొదలు పెట్టాడు. తెర యివతల కుంటివాడు మేకపెంటికలను గొట్టంలోంచి తెరలోని చిల్లు ద్వారా పురోహితుడు తెరచిన నోటిలోకి గురిచూసి కొట్టసాగాడు తన గొట్టంతో. పురోహితుడు మాటలాడడంలో మునిగిపోయి వాటిని మింగేయసాగాడు. అలా చాలా మేక పెంటికలని తెరలోని కన్నం ద్వారా తన గొట్టంతో అతని నోటిలోనికి గురిచూసి పంపాడు కుంటివాడు. పురోహితుడి కడుపులోకి పోయిన మేకపెంటికలు ఉబ్బిపోయి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు రాజు అయ్యా! మీరు వాక్‌ప్రవాహంలో మునిగిపోయి నోటిలోకి మేక పెంటికలు పోవడం గమనించలేదు. ఇప్పుడవి కడుపులో ఉబ్బి బాధిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి వాంతికి సాధనం చెయ్యండి, సర్దుకోండి. అని పంపేశాడు. అప్పటి నుంచి పురోహితుడు నోరు తెరిస్తే ఒట్టు. రాజుకీ యితరులకీ సుఖంగా ఉంది. రాజు కుంటివాడికి సంవత్సరానికి లక్షరూపాయల ఆదాయం ఇచ్చాడు. ఎదుటివారి పరిస్థితిని యిబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి.       

నేనే గొప్పవాణ్ణి

గోదావరి నదీ ప్రాంతములో కపిలేశ్వరము అనే గ్రామము వుంది. ఓ మోతు బరికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతనిలో ఎంత కష్టమయిన విద్యనైన క్షణములో నేర్చుకునే చురుకుదనము ఉంది. ఆగకుండా ఎనిమిది మైళ్ళ దూరమయినా పరుగుపెట్టగలడు. గురితప్పకుండా చిటారుకొమ్మపై వున్న కాయని కొట్టగలడు. ఎంతటి బరువైనా సులభముగా ఎత్తగలడు. కుస్తీలు పట్టి శభాష్ అనిపించుకోగలడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో, తల్లికి ఇంటిపనిలో సాయం చేస్తుంటాడు.

"మీ అబ్బాయి కృష్ణ చాలా చురుకైనవాడు. రాజమహేంద్రవరములో గల శంకరతీర్ధులవారి వద్దకి పంపిన వాడి తెలివితేటలు ఇంకా రాణించగలవు" అని గ్రామములోగల పెద్దలు చెప్పారు. అంతేగాక ఆయనకి రాని విద్యలు లేవు. మహాపండితుడు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారికి జీవన భుక్తికి ఏలోటు వుండదు అని చెప్పారు. తండ్రి శంకరతీర్ధుల వారి గురించి కృష్ణకి చెప్పి చూశారు. కాని కృష్ణ వారి మాటలు వినలేదు.

కృష్ణ "జీవితంలో క్రొత్త విద్యలు నేర్చుకుని ఏం చేయాలి? ఉన్నంతలో నలుగురికి సాయపడాలి. నేర్చుకోగల పరిస్థితి ఎందుకు? ఆయన వద్ద ఎందుకు శిష్యరికం చెయ్యాలి. నేను గొప్పవాణ్ణికాదా? నేనే క్రొత్త విద్య కనిపెట్టగలను" అని అత్మవిశ్వాసంతో పలికాడు. తన గ్రామ ప్రజలు తన గొప్పతనము గుర్తించాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యం కలిగింది. ఆ ఊరిలో పెద్దతోట ఉంది. ఆ తోటలో ఒక చెట్టుకి రేగికాయలు ఉన్నాయి. అవి తింటే కాకరకాయలాగా చేదుగా ఉంటాయి. ఆ కాయల జోలికి ఎవరూ వెళ్ళరు. వాటిని గురించి బాగా ఆలోచించాడు.

మరుసటి రోజు సాయంత్రం ఒక కోతి ఆ కాయల్ని తిని రెట్టించిన ఉత్సాహంతో ఆకాశములోకి ఎగిరింది. అది గమనించిన కృష్ణ రెండుకాయలు తిని మరి నాలుగు కాయలు జేబులో వేసుకుని పైకి ఎగిరి పక్షిలాగా పై ఎత్తుకి వెళ్ళి క్రమంగా క్రిందకి దిగాడు. ఇటువంటి ఫలాలు తినే ఆంజనేయుడు లంకని దాటాడా అనే సంశయము కూడా కలిగింది కృష్ణకి మరుసటి రోజు గ్రామ పెద్దల్ని సమావేశపరచి వారికి చెప్పి ఆకాశగమనము చేయసాగాడు. ఆ వార్త దావానంలా అంతా ప్రాకిపోయింది. రాజమహేంద్రవరములోగల శంకరతర్ధులవారికి తెలిసి వారు ఈ గ్రామమునకు వచ్చి కృష్ణను కలిశారు. తనను శిష్యునిగా చేసుకుని ఆ విద్య నేర్పమని అడిగారు. తన గురించి చెప్పారు.

కృష్ణ "తమరు శంకరతీర్ధుల వారా? తమకి రానివిద్య లేదంటారు గదా? ఈ ఒక్క విద్యకోసం వెతుక్కుంటూ నావద్దకి వచ్చారా? తమకి రాని విద్య ఉండకూడదనే అహంభావమా? " అని అడిగాడు. "నాయనా! నాకే గనక అహంకారం వుంటే నీ వద్దకి శిష్యరికం చేయటానికి రాను శంకరతీర్ధులవారు అనగా" అలాంటప్పుడు ఈ కొత్త విద్య సంపాదించాలనా? " అని కృష్ణ అడిగాడు. విద్యావంతుడికి ధన సంపాదనపై వ్యామోహము ఉండదు. నేను విద్యలు నేర్చుకున్నది నా కోసమూ కాదు. నాకున్న జ్ఞానము నా భవితరాల వారికి పంచిపెట్టాలనే సదుద్దేశమే.

నేను దాపరికము లేకుండా మనకున్న జ్ఞానము మనతోనే అంతరించిపోకుండా జాగ్రత్తపడుతున్నాను అని వినయముగా చెప్పారు శంకరతీర్ధులు. కృష్ణ హేళనగా నవ్వి ఈ విద్య నాతోనే అంతరచిపోయి నందువల్ల ప్రమాదం ఏమీ లేదు. ప్రపంచానికి నష్టము కలగదు అని అన్నాడు.

"ఉంది నాయనా! మనిషి నీటిలో ఈదాలి, గాలిలోకి ఎగరాలి. అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకోవాలి. అదే నీటిలో చేప గాని, మొసలి గాని బయటకు వస్తే బలహీనమయి ప్రాణము కోసం విలవిలలాడగలవు. హిమాలయ పర్వత శ్రేణులలో ఉండే ఎలుగుబంటి ఎడారిలో ఉండలేదు. నీవు నేర్చిన విద్య వలన ఏరు దాటవచ్చు, కార్చిచ్చులా మండుతున్న మంటల్లోంచి బయటపడవచ్చు. ఏ విద్యకైనా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి అవసరాన్ని బట్టి మనుష్యులు ఉపయోగించుకోగలరు. విద్యలను, గ్రంధస్థము చేసి ప్రచారం చేయటమే విద్యావంతుల కర్తవ్యము" అని చెప్పారు శంకరతీర్ధులవారు.

వారు చెప్పిన మటలు వినగానే కృష్ణ ఆయనకి నమస్కరించి పాదాలపై పడి "నన్ను మన్నించండి. నేను మీకు శిష్యరికం చేసి నా జ్ఞానము అభివృద్ధి చేసుకుంటాను. నాకు తెలిసిన విద్య మీకు గురుదక్షిణగా సమర్పించుకుంటాను.

"నేనే గొప్పవాణ్ణి అనే అహం నాలో కలిగి మీకు మనస్థాపం కలిగించాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించండి" అని అన్నాడు.

విద్యావంతునికి వినయము భూషణము వంటిది. రోజూ గురువును భక్తి శ్రద్ధలతో పూజించి మంచి శిష్యునిగ, ఉత్తమపౌరునిగ ఉంచుతుంది. విద్య వలన వివేకము, వినయము, జ్ఞానము కలుగును. విద్యలేనివాడు వింత పశువని సామెత కలదు.        

నిద్రమత్తు

ఒక గ్రామములో రాము, రవి అనే యువకులుండేవారు. రాము ఉదయాన్నేలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యముగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయము నిద్రలేచేవాడుకాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైనది. ఒక రోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలని వుంది. మీ సహాయం కావాలని అంది. సరేనన్నాడు మేనమామ.

నేను ఉదయమే లేచి వూరు వెళుతున్నాను. సాయంత్రానికి తిరిగి వస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము, మేనమామ ఉదయమే పనికి వెళ్ళారు. వాళ్ళతోపాటు మేనమామ భార్యకూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారము ఆలస్యముగా లేచి పొలము వెళ్ళాడు. పొలము నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా? లేక నీవే దొంగవా? అంటూ రవిని గద్దించింది. అందరము వెళ్ళిపోయాక నీవే వున్నావుగా అని నిలదీయటంతో మేనమామ రవి అలాంటివాడుకాదు. రవి దొంగ అన్నావంటే బాగుండదు. అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళటానికి సిద్దమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారిందని ఆనందించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో నిన్ను ఉదయమే లేపటానికే నిన్ను అనరాని మాటలు అన్నాను. నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబూ అని అంది.

రాము, రవి, మేనమాల కృషి వల్ల పంటలు బాగాపండాయి. కొంతకాలము గడిచేసరికి వారిద్దరికీ మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వారిద్దరికి పెళ్ళి చేసి తన వద్దే ఉంచేసుకున్నాడు మేనమామ. అందరూ సుఖసంతోషాలతో హాయిగా కలిసి మెలసి ఏటా పొలముకొంటూ వూరిలో మోతుబరిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు.       

నిద్ర మొహం నస్రు

నస్రు చాలా తెలివిగలవాడే కాని ఉదయాన్నే నిద్రలేవడం అతని వల్ల అయ్యేది కాదు. బారెడు పొదెక్కేవరకూ బద్దకంగా నిద్రపోవడం అతనికి చాలా ఇష్టం.

అతని అలవాటు మాన్పించడానికి అతని తండ్రి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీలుపడలేదు.

ఒక రోజు నస్రు తండ్రి ఉదయాన్నే లేచి అలా ఊరి చివరకు నడకకు బయలుదేరాడు. దారిలో అతనికి బంగారు నాణాలున్నసంచి ఒకటి కనిపించింది. అది ఎవరో పారేసుకున్నట్టుంది. దాన్నితీసుకుని ఇంటికి వచ్చేసరికి నస్రు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు.

నస్రు తండ్రి నస్రుపై చెంబెడు నీళ్లు కుమ్మరించాడు, నస్రు నిద్రలేచి, ఎందుకు నాన్నా ఇలా చేశావని అడిగాడు.

ఉదయాన్నే నిద్రలేవడం వల్ల బోలెడు లాభం ఉంది. చూడు, నాకు సంచి నిండా బంగారు నాణాలు దొరికాయి అదే నేనూ నీలా పడుకుని ఉంటే ఇలా ధన లాభం కలిగేదా? అన్నాడు తండ్రి.

లాభం గతేమో గాని, ఆ ధనం పోగొట్టుకున్నవాడికి మాత్రం బోలేడు నష్టం కలిగింది. నీకంటే ముందు నిద్రలేవడం వల్లే కదా అతను పారేసుకున్న డబ్బు నీకు దొరికింది అంటే ముందుగా నిద్రలేవడం వల్ల నష్టమేగా? అని మళ్లీ ముసుగుతన్ని పడుకున్నాడు నస్రు.

ఏం చెప్పాలో తెలియక నస్రు తండ్రి వెనుదిరిగాడు.

నిదానమే ప్రధానం

ఒక ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు. అతడు బాధ్యతలు లేకుండా, తిరిగే దుందుడుకు స్వభావం గలవాడు. రంగా భవిష్యత్తును గురించి అతని తెల్లిదండ్రులు బాధపడసాగారు.

అదే ఊరిలో ఉండే ఒక వర్తకుడు రైతుల దగ్గర కొబ్బరికాయలు కొని పట్నంలో అమ్మేవాడు. రంగా తండ్రి ఆ వర్తకుడిని బ్రతిమిలాడగా, ఆ వర్తకుడు రంగాకి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.

ఆ వర్తకుడు రంగాను పిలిచి దగ్గర్లోని పట్టణంలో కొబ్బరికాయలు అమ్ముకుని రమ్మని పంపించాడు. సరేనన్న రంగా కొబ్బరికాయలను గుర్రపుబండిలో నింపుకుని పట్టణంవైపు బయల్దేరాడు. పట్టణానికి దగ్గరి దారిలో వెళ్దామనుకున్నాడు. దారిలో అతనికి ఒక బాలుడు కలిశాడు. రంగా ఆ బాలుణ్ణి "బాబూ! ప్రధాన రహదారిని చేరుకునేందుకు ఇంకా ఎంతసేపు పడుతుంది?" అని అడిగాడు, దానికి ఆ అబ్బాయి - "నెమ్మదిగా వెళ్ళు, పదిహేను నిమిషాల్లో చేరుకుంటావు, కాని వేగంగా వెళ్తే మాత్రం కనీసం గంట పడుతుంది" అని బదులిచ్చాడు.

రంగాకి ఆ అబ్బాయి మాటలు అర్ధంకాలేదు. అతను అత్యంత వేగంగా బండిని ముందుకు దూకించాడు. కొద్ది దూరం ప్రయాణించగానే బండి చక్రం ఒకటి రాయి తగిలి ఇరుక్కుపోయింది. ఆ కుదుపుకు కొబ్బరికాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అవన్నీ తీసి బండిలో ఎక్కించేందుకు రంగాకి చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి చెప్పిన మాటలు రంగాకి అప్పటిగ్గాని అర్ధంకాలేదు.

ఆ సంఘటనలో రంగా తన జీవితానికి సరిపడా గునపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి రంగా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏ పనిచేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయసాగాడు.