Pages

Friday, June 14, 2013

మాధవ ముంగిస

ఉజ్జైని నగరంలో మాధవా అనబడే బ్రాహ్మడుండేవాడు. ఒక రోజు బ్రాహ్మడి భార్య పక్కవూరికి పేరెంటానికి వెళ్తూ వాళ్ళ పసి పాపను బ్రాహ్మడికి అప్పచెప్పి వెళ్ళింది. ఇదిలా ఉండగా రోజు మహారాజుగారు బ్రాహ్మడిని సభకు రమ్మని కబురు పెట్టారు. పసిపాపను ఇంట్లో వదిలేసి ఎలా వెళ్ళడమని ఆలోచిస్తున్న బ్రాహ్మడికి అతని ముంగిస కనిపించింది. “ముంగిస చాలా యేళ్ళగా నా దెగ్గిర నా కొడుకులానే పెరుగుతోంది, దీనికి పాపను అప్పచెప్పి వెళ్తానుఅనుకుని రజ్యసభ వైపు బయలుద్యారాడు.

ముంగిస తనను నమ్మి పనిని అప్పచెప్పినందుకు చాలా గర్వ పడింది. వెళ్ళి పాప దెగ్గిరే కూర్చింది. సమయానికి ఒక పామును పాప వైపుకు వెళ్తూ చూసింది. వెంటనే పామును చంపేసింది.


కొంత సేపటికి మాధవ రజ్యమర్యాదలన్ని స్వీకరించి, రాజు ఇచ్చిన బహుమానాలతో సంతోషంగా
ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే ఆనందంతో ముంగిస అతని దెగ్గిరకు గబగబా వెళ్ళింది. మాధవ ముంగిస మూతికున్న నెత్తురును చూసాడు. పాపను చంపేసిందని అపోహ పడ్డాడు. కోపంగా ముంగిసను చంపేసాడు. బాధతో ఇంటిలోకెళ్ళాడు. ఎదురుగానే పసి పాప తన ఉయ్యాలలో హాయిగా నిద్రపోతోంది. పక్కనే చచ్చి పడున్న పామును చూసి మాధవ అన్ని అర్ధం చేసుకున్నాడు. అయ్యో తొందరపడ్డానే! అని చాలా పశ్చాతాప పడ్డాడు.

కన్న మమకారం

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒకావిడ ఉండేది. ఆవిడ కొడుకు జబ్బు పడి ప్రాణాలను కొలిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక ఆవిడ క్రుంగి పోయింది. చాలా రోజులు గడిచినా కొడుకు మీద మమకారం మట్టుకు తగ్గలేదు, యే రోజు తన చనిపోయిన కొడుకుని గుర్తు చేసుకోకుండా గడపలేదు. అదే చింతలో యెప్పుడూ వుండెది.

ఒక రోజు ఊరిలోకి ఒక బొధిసత్త్వుడు వచ్చాడు. అతను చాలా మహిమ గలవాడని, భగవంతునితో అనుసంధానముగల వాడని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటుంటే ఆమె విన్నది. కొడుకును మళ్ళీ జీవింప చేయ గలుగుతాడేమోనని ఆశ పడింది. వెళ్ళి ఆ బొధిసత్త్వుడి కాళ్ళ మీద పడి, తన కొడుకుని మళ్ళి తనకు దక్కేలా చెయమని అడిగింది.

ఆ బొధిసత్త్వుడు ఊళ్ళో యెవ్వరూ మరిణంచిని ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రమ్మన్నాడు.

మొన్నాడు ఉదయమే లేచి, స్నానం చేసి, దెవుడికి దీపం పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళింది. ప్రతి ఇంటి వాకిటలోని నిలుచుని వాళ్ళింట్లో యెవరైన మరణించారా అనడిగింది. ప్రతి ఇంట్లోను యెవరో ఒకరు పోయారు. మొత్తం గ్రామంలో యముడు రాని ఇల్లు ఒక్కటి లేదు. నిరాశ చందినా అవిడకు జీవితంలో చావు కూడ ఒక భాగమని, అది యెవ్వరు తప్పించలేరని అర్ధం అయ్యింది.

మిణుగురు పురుగు, కాకి

అనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.

కాకి “యేమిటది” అని అడిగింది.

“నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.

ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.

కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయి, ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని యెగిరిపోయింది.


ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పా” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది!

మంత్రి, సామంతరాజు

అనగనగ ఒక చక్రవర్తి ఒక సామంతరాజును సభకు చాల సార్లు ఆహ్వానించాడు. కాని ఆ సామంతరాజు చక్రవర్తి సభకు రాలేదు.

ఒక రోజు ఆ చక్రవర్తి మారు వేశం వేసుకుని తన మంత్రితో పర్యటనకు బయలుద్యారాడు. బజారును తనిఖి చేస్తున్నప్పుడు ఒక కసాయివాడి కొట్టును దాటారు. కొట్టు దాటుతున్నప్పుడు చక్రవర్తికి ఆ సామంతరాజు గుర్తుకొచ్చాడు. ఆ సామంతరాజు ఊళ్ళో కి రాగానే సభకు రప్పించమని ఆదేశించాడు.

పర్యటన ముగించుకుని రజగృహానికి తిరిగి వెళ్ళారు. చక్రవర్తి రప్పించిన సామంతరాజు ఆ మంత్రి కళ్ళబడ్డాడు. విచారిస్తే చక్రవర్తిని కలవడానికే తాము వచ్చాడని సామంతరాజు ఆ మంత్రితో అన్నాడు. అది విన్న మంత్రి ఆ సమంతరాజును వెంటనే వెళ్ళమని, తను పిలిచేదాకా రావద్దని అన్నాడు.

ఈ విషయం చక్రవర్తికి తెలిసింది. మంత్రిని పిలిచి యెందుకలా చేసాడని కన్నుక్కున్నాడు. దానికి మంత్రి, “మీరు కసాయివాడి కొట్టును చూసి ఆ సమంతరాజును రమ్మన్నారు. మీ కళ్ళల్లోని క్రొధం చూస్తే అతన్ని గొర్రెను కోసినట్టు సమ్హరిస్తారేమోనని భయపడ్డాను. మీకు కోపం చల్లారి, మీ మనస్థిథి మారేక రమ్మనదామనుకున్నాను. తప్పైతే క్షమించండి” అని జవాబు చెప్పాడు.


చక్రవర్తి ఆ వివేకంగల మంత్రి దూరదృష్టిని అభినందించాడు.

నక్కా, కోడి పుంజు

అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్ళను, కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు.

ఒక రోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు కనబడ్డాడు. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను యెవరో చంపేసారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడి పుంజు కూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళింది.

ఇంతలో ఆ నక్క లేచి, పెద్దగా ఆవలించింది. “హరే! నువ్వు చచ్చిపోయావనుకున్నామే!” అంది కోడి పుంజు.
“లేదు, అదేమి కాదు. నిన్న రాత్రి బాగ తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది” అని జవాబు చెప్పిందా నక్క.

పుంజు వెంటనే తన పిల్లలను లెక్ఖ పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ వుంది. “ఇదేమిటి, ఒక పిల్ల తక్కువ వున్నా నాకు తెలియలేదే,” అంది.

“యేమిటయ్య! నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలీలేదు కాని ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలుస్తే వెంటనె వచ్చావు” అంది నక్క వ్యంగ్యంగా.


నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని, తరవాత ఇతరుల విషయం పట్టించుకోవాలి.

నక్కా, సింహం, జింకా

అనగనగా ఒక అడవిలో ఒక నక్క వుండేది. ఒక రోజు ఆ నక్క ఓ జింకను చూసింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క.

ఆ సింహం దెగ్గిరకు వెళ్ళి చాలా వినయంగా నమస్కరించింది. “రాజన్! మీరీ తుచ్చమైన సేవకుడికి అవకాశమిస్తే మీకు మంచి వేటను చూపిస్తాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక వుంది!” అని నక్క అంది.

సింహం నక్కతో బయలుద్యారింది. కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బ పైకి యెక్కి దాక్కుంది. నక్కా, సింహం అక్కడికి వచ్చే సరికి వాటికి యేమి కనిపించలేదు.

సింహం ఆ నక్కను కోపంగా చూసి, “నన్నే ఆటపట్టించాలనుకున్నావా! జింక లేకపోతే పోని, నాకు నువ్వైనా సరే!” అని ఆ నక్కను తినేసింది.


దుష్టులెప్పుడైనా వాళ్ళ పాపాన్న వాళ్ళే పోతారు.

కప్పా, పాము

ఒక కప్పా, పాము మంచి స్నేహితులుగా వుండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు భుసకొట్టడం నేర్పించింది.

పాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దెగ్గిరకు వెళ్ళేవి. పాము చటుక్కున వాటిని తినేసేది.

కప్ప నీళ్ళల్లో భుస కొడుతుంటే దాని దెగ్గిరకు పాములు వచ్చేవి కాదు. కప్ప నిర్భయంగా వుండేది. ఇలా కొంత కాలం కొనసాగింది.

కాల క్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దెగ్గిరకు వెళ్ళడం మానేసాయి. పాము తినడానికి యేమి లేక చిక్కి క్షీణించుకు పోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది.

చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైన మనకే చేటు.

కుక్కా, వ్యాపారస్తుడు

ఒక ఊరిలో ఒక కుక్కల వ్యాపారస్తుడుండేవాడు. అతను కుక్కలను కొని, వాటిని పెంచాలనుకునే వాళ్ళకు అమ్ముకునేవాడు.

ఒక రోజు అతను పొలాల్లోంచి వెళ్తుంటే అక్కడొక కుక్కను చూసాడు. ఆ కుక్క అతని దెగ్గిరకు వెళ్ళి తనని కొనుక్కోమని ప్రాధేయ పడింది. ఆ వ్యాపారస్తుడు “నీలాంటి కురూపిని ఎవరు కొనుక్కుంటారు?” అని ఛీ: కొట్టాడు.
కొద్ది రోజుల తరవాత ఆ కుక్క రజగృహం దెగ్గిరకు వెళ్తే అక్కడ రక్షక భటుడు దాన్ని చూసి నిమురాడు. అప్పుడే ఆ వ్యాపారస్తుడు అటు వైపు వచ్చాడు. కుక్క అతన్ని మళ్ళీ తనను కొనుక్కొమని అడిగింది.

“నువ్వు రాజ మహలులో వుంటున్నావు, చక్రవర్తిని కాపలా కాస్తున్నావు – నీ విలువ నేను ఇచ్చుకోలేను” అని వెళ్ళి పోయాడు.


నిజమే, మనం ఎక్కడున్నామో, ఎవరితో ఉన్నామో, దాన్ని బట్టే మనుషులు మన విలువను నిర్ధారిస్తారు.

ఇద్దరు శిశ్యుల కథ

ఒక గురువుకు ఇద్దరు శిశ్యులుండేవారు. ఆ గురువు ఒక రోజు వాళ్ళిద్దరినీ పిలిచి కొంత సొమ్మును ఇచ్చాడు. “నేను మీకు ఇస్తున్నది చాలా చిన్న మొత్తం, కాని దీనితో మీరు ఎదైన కొని ఒక గదిని నింపాలి” అన్నాడు.

మొదటి శిశ్యుడు సొమ్మంతా ఖర్చు చేసి, బోల్డంత ఎండుగడ్డిని కొని గదిలో నింపాడు. గురువును చూడమని ఆహ్వానించాడు. గురువు అది చూసి “గదిని నిరుత్సాహముతో నింపావు” అన్నారు.


రెండవ శిశ్యుడు ఒక చిన్న కాసును ఖర్చు చేసి ఒక దీపం కొన్నాడు. దాన్ని వెలిగించగానే గదంతా కాంతితో నిండిపోయింది. గురువు మెచ్చుకుని, నలుగురికీ వెల్తురు ఇద్దామనుకునే వాడే నిజమైన వివేకవంతుడని అభినందించాడు.

నక్కా, పీతలు

ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి.

“అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క.

పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి.
“ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి?” అంది నక్క.

“ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు.
“తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క.
పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది.

రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.
“ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది.
భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి.

కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి.


ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది.

చారలు కోరిన నక్క

పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి, “చారలు కావాలికాని నొప్పి కాదు, ఇంకేదైన చేయి” అంది నక్క. “ఐతే రంగులు పులివించుకో” అన్నాడు కంసాలాడు.

రంగులు వేసే వాడి దెగ్గిరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడివిలోకి వెళ్ళి, పులి లాగ గాండ్రించబొయి, ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూసాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్ని నీళ్ళల్లో కలిసి చెరిగి పోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడ నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి.


ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది.

అద్దం, రాయి

ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు, నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ మెరుపునిచ్చాడు”.  ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది.

కొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది. అద్దం పిడుగు మంటకు కాలిపోయి, దాని మొత్తం మెరుపును కోల్పోయింది.

ఆ రాయి, “నీ మెరుపు ఏమైంది?” అని అద్దాన్ని అడిగింది.

“ఒహ్, ఆ పిడుగు వచ్చి నా దెగ్గిర అరువు తీసుకుంది” అన్నదా అద్దం.


“ఒక్క సారి మన గొప్ప చాటుకున్నాక ఎన్ని అబద్ధాలాడాలో” అనుకుంది రాయి.

కోతి, అద్దం

ఒక అడివిలో ఒక కోతికి ఓ అద్దం దొరికింది. అది ఆ అద్దాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది.
భల్లూకం అందులో తన ప్రతిబింబం చూసుకుని, “అయ్యో, నేను ఇంత కురూపినా” అనుకున్నాడు.
తోడేలు చూసి నేను కూడ జింకలాగా వుంటే బాగుండేది, అనుకుంది.

ఇలా ఒకటి తరవాతోకటి అన్ని జంతువులు వాటి ప్రతిమలను చూసుకుని ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది అనుకున్నాయి.

చివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ గుడ్లగూబ, “వద్దు నాకు చూపించద్దు. ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడడం తప్ప దాని వల్ల వాళ్ళకు వచ్చిన ఙానము లేదు, విచక్షణ లేదు. అలాంటి దాన్ని చూసి బాధ పడడం అనవసరం” అని అంది.


కోతి ఒప్పుకుని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది.

మూడు చేపల కథ

అనగనగా ఒక చెరువు లొ చాల చేపలు వుండేవి. ఒక రోజు ఇద్దరు చేపలు పట్టే వాళు ఆ చెరువు దెగ్గిరనుంచి వెళ్ళారు. చెరువు లో చాలా చేపలు వున్నాయని గమనించి మన్నాడు ఆ చెరువు లో చేపలు పడదామని నిర్ణయించు కున్నారు.

వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకొ రెండు చేపలకు చెబుతూ – “మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువు ని వదిలి వెళ్ళిపోవాలి – లేక పోతె రేపు మనం ప్రాణాలతో వుండము” అని వివరించింది.

ఈ మాటలు విన్న వేరే రెండు చేపలు ఆలొచన లో పడ్డాయి.
రెండో చేప, “వాళ్ళు రేపు వస్తే చూద్దాం” అనుకుంది.

మూడో చేప, “ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ – ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అద్రుష్టం బాగుంటే వాళ్ళేమి చేస్తారు” అనుకుంది.

మొదటి చేప రాత్రి కి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళి పొయింది.
తెల్లవారగనే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుతుంబం తో వేరే చెరువుకు వెంటనే వెళ్ళి పొయింది.

మూడో చేప వల లో చిక్కుకుని ప్రాణాలను వదులుకుంది.
దూరదృష్టి తో ఆలోచించిన మొదటి చేప తన బంధువులునందరినీ కాపడుకో గలిగింది. ఆపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండొ చేప కొంత వరకు తన కుటుంబాన్ని కాపడుకుంది.

ఆదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు యేమి చేయలేక పొయింది.

అలాగే మన జీవితం లో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని, మన వంతు కృషి మనం చేయకపోతే, లాభం ఫలించదు.

వేరుశనగ దొంగ

కొన్ని సంవత్సరాల క్రితం ఒక వూరిలో లక్ష్మి పేరుగల ఒకావిడ వుండేది. ఆఅవిడకు రోజు సాయంత్రం ఇంటి దెగ్గిర వున్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్దిరోజలకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది.

అలాగే ఒక రోజు పర్కులోకి వెళ్తుంటే అక్కడ వేడి వేడి గా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పధ్ధతి లో తన బెంచి కి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయిన కూర్చుని వున్నరు.

రుసరుసలాడుతూ తన షాల్వా, పర్సు, కూడా తెచుకున్న ఇతర సామాన్లు, చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది.

చదువుతూ పక్కనవున్న వేరుశనగల అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. “యెంత పొగరు, అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తునాడు, ఇలాంటి వాళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా వుంది” అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్ది సేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్ని తినేస్తారో అని లక్ష్మిగారు కూడ పోటి పడి గబ గబా మిగిలిన వేరుశెనగలు వల్చుకుని తినేసింది. అన్ని అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. ఫెద్దాయన చిరునవ్వుతొ “ఇది మీరు తీసుకోండి” అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయరు.

ళక్ష్మిగరు “వేరుశనగ దొంగ!” అని చికకుగా అనుకుంది.
లేచి తన సామను బెంచి మీద నుంచి తీసుకుంటు చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దెగ్గిరే కనిపించింది.


“అయ్యో! ఐతే నేనే వేరుశనగ దొంగనా! పాపం అయ్యిన్ని ఎన్ని మాటలనుకున్ననో!’ అని చాలా బాధ పడింది.

బీర్బల్ కాకి లెక్కలు

ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలొచన వచ్చింది.

సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దం అనుకున్నారు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి, “బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?” అని అడిగారు.

బీర్బల్ రెప్ప ఆర్చకుండ వెంటనే “సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందల నలభై మూడు కాకులు వున్నాయి” అని బదులు చెప్పరు.

ఆష్చర్య పోయిన అక్బర్ మహారాజు, “అంత కచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే?” అని అడిగారు.

“అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్టు” అన్నారు బీర్బల్.
“ఒక వేళ తక్కువ వుంటే?” అని అడిగారు అక్బర్

“అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ!” అని చెప్పారు బీర్బల్.

ఈ కథను ఈ రోజు వరకు బీర్బల్ తెలివితేటలకు, స్థిత ప్రగ్న్యతకు ఉదాహరణగా చెప్పుకుంటారు. నిజమే, తెలివిగా అక్బర్ మహారాజు వేశిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కద! మీరేమంటారు?

ఒక రాజు, యేడుగురు కొడుకులు

అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.
సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని.

రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.

రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని.

అమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది”
రాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.

రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు “చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ”

ఆప్పుదు చీమ అంది “నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా” అని…


చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఈ కథ చెప్పేది. చాల కాలం ఇదొక మాములు కథ అనుకున్నను. పెద్దయ్యక మా పిల్లలకు ఈ కథ చెపుతున్నప్పుడు అర్ధం అయ్యంది. ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని. చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో యెండు చాప లేదు. 

దీపావళి పోటీ

అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్టు పక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం వుండేది.

ఒక సంవత్సరం దీపావళి పండుగ దెగ్గిర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్న ఆయన రాజ్యం లో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వెయ్యించారు.

రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాలుకున్నారు. ఒకరినిమించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పరియటించారు. యెన్నో అద్భుతమైన ఇళ్ళను చూసి చాల సంతోషించారు.

ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూశి, “ఆ ఇంట్లో యెవరుంటారు? యెందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు?” అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు.

ఇంటి దెగ్గిరకు వెళ్ళి చూస్తే ఇంటి బయిట రహదారి లో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది.

ఇది చూశిన రాజుగారు, “అవ్వ, నువ్వు ఇక్కడ యెమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు యెందుకు పెట్టలేదు?” అని అడిగారు.

“నా దెగ్గిర రోజు ఒక్క దీపం పెట్టే అంత దబ్బే వుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను” అని చెప్పింది.

జవాబువిన్న రాజుగారు చాల ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్ళని దీపలతో అలంకరించికుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించటంకోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు.


మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో వున్న గోతిని మరమ్మత్తు కూడా చేసారు.

నోరు జారిన మాటలు

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు పట్టించుకునేది కాదు.

ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.

మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.

“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.

సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.

మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.

వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.

అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.


ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.

కాకి దాహం

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది.

చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు.


కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది.


నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది.

రాజు రోగం కుదిర్చిన కూలి

  hyd



రంగన్న అడవిలో నడుస్తూ ఒక చెట్టు క్రింద తపస్సుకు కూర్చున్న ఓ సాధువును చూసాడు. పాము ఒకటి ఆ సాధువు వద్దకు సరసరా ప్రాకి పడగ విప్పింది. సరిగ్గా అదేసమయంలో అటుగా వెళ్లుతున్న రంగన్న ఆ దృశ్యాన్ని చూసి.. ''స్వామీ పాము'' అంటూ పరుగె త్తి ఆ సర్పాన్ని తోకపట్టుకొని గిరగిరా తిప్పి దూరంగా విసిరేసాడు. రంగన్న కేకతో కళ్లుతెరిచి '' పాము కాటు కు గురికాకుండా నన్ను కాపాడావు నీ పేరు? ఏ ఊరు? ఏం చేస్తుంటావు?'' అడిగాడు సాధువు. ''నా పేరు రంగన్న. నాది దగ్గర్లో ఉన్న రంగాపురం, రాళ్ళుకొట్టి వచ్చే కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ చావలేక బతుకుతున్నాను, రెక్కా ఎంత ఆడించినా డొక్కనిండటం లేదు. నాభార్య ఏదో వణుకుడు రోగంతో నీరసించి మంచం పట్టింది. రేపో మాపో అన్నట్టుంది ఆవిడ పరిస్థితి. పిల్లల బాగోగులూ నేనే చూడాలి అనుక్షణమూ ఈ జన్మ ఎందుకేత్తానా? అని పిస్తుంది'' వాపోయాడు రంగన్న '' పరితపించకు పరిస్థితులు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు, చీకటి తరువాత వెన్నెల రాక మానదు, ఇదిగో ఇది తీసుకో'' అని తన జడల జుట్టులో నుండి ఒక పుల్లను తీసాడు. తన వద్దనున్న ఔషధాలను బాగా నూరి అందులో పుల్లను ఉంచాడు. 

మరుసటి రోజు ఉదయం వచ్చి ఆ పుల్లను తీసుకువెళ్లమని చెప్పాడు. సరే అంటూ ఇంటికి వెళ్లిన రంగన్న ఉదయమే సాధువు వద్దకు రాగ ఔషధగుణాలు నిండిన పుల్లను ఇచ్చాడు సాధువు'' అది మామూలు పుల్లకాదు ఔషధశక్తి గల ఈ పుల్ల ఎటువంటి రోగా నైనా బాగు చేస్తుంది. ఆ పుల్లను రోగి తల మీద ఉంచి బ్రహ్మం, విష్ణుం, మహేశ్వరం' అనాలి, అలా మూడు సార్లు తలమీద ఉంచి త్రిమూర్తులను తలవాలి, రోజూ మూడు పుటలూ అలా చేస్తే మూడు రోజుల్లో వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ పుల్ల ప్రభావం ముగ్గురు వ్యాధి గ్రస్తులకే పరిమితం.మూడోవ రోగికి వైద్యం ముగిసాక ఆపుల్లను పారే నీటిలో వేయాలి. ఆ పుల్ల గొప్పతనం గుర్తించేవారు దాన్ని కాజేయటానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్త'' అని చెప్పి సాధువు ఆ ప్రాంతం నుంచి వెెళ్ళిపోయాడు.

రంగన్న ఇల్లు చేరి కాళ్ళు కడుక్కొని, భార్యను కళ్ళు మూసుకొని పడుకోమని చెప్పి పుల్లను ఆమె తలపై ఉంచి త్రిమూర్తులను తలచి, అలా మరో రెండు దఫాలతో ఆరోజు ప్రక్రియను పూర్తి చేసాడు. ఉదయాన్నే భార్య రత్తాలు నాకళ్ళల్లో నీరు కారటం లేదు. వొంటి వొణుకూ ఆగి పోయింది' అంది. సాధువు ఇచ్చిన పుల్ల పనిచేస్తున్నదని గ్రహించాడు. రెండో రోజు ఆమె లేచి కూర్చుంది. మూడో రోజు లేచి నడవటమేగాక ఇంటి పనులన్నీ చేయసాగింది రత్తాలు. గోరంత పుల్ల చేసిన మేలుకు కొండంత సంబరపడ్డాడు రంగన్న.

రాజుగారు గుర్రమెక్కబోయి కాలు జారి కిందపడి వెన్ను పూసవిరిగి మూలుగుతూ చిక్కిశల్యమై శయ్య మీద ఉన్నాడని వైద్యులె వ్వరూ, చివరకు ఎంతో పేరున్న రాజు వైద్యుడూ నయం చెయ్యలేక పోయాడని ఆనోట, ఈనోట రంగన్నకుతె లిసింది. రాజును రక్షిస్తే తనకు గుర్తింపు ఉంటుందని మరుసటి రోజే నగరానికి బయలుదేరాడు. 

ద్వారపాలకులు రంగన్నను రాజభవనంలోనికి వె ళ్ళనివ్వలేదు. రంగన్న రాజవైద్యుడు రాంభట్టు ఇంటికి వెళ్ళి తనకు అవకాశం కల్పిస్తే తనవైద్యంతో రాజుకు నయం చేస్తానన్నాడు. రాంభట్టు రంగన్నకు ఒకరోగిని చూపి 'ఆమె నా చెల్లెలి కూతురు ఊర్మిళ . ఏడాదిగా మతిస్థిమితం లెెదు. ఎవ్వరినీ గుర్తు పట్టడం లేదు. ముందుగా ఆమె జబ్బు నయంచేస్తే నీకు రాజుగారికి వైద్యం చేసే వీలు కల్పిస్తాను' అన్నాడు . సరే అని రంగన్న ఆమెకు వైద్యం చేశాడు. 

నాలుగో రోజు ఊర్మిళ రాంభట్టును చూసి ''మామయ్యా బాగున్నావా?'' అంటూ పలుకరించింది. ఇంట్లోవారందరినీ గుర్తించింది. రంగన్న తన వైద్యం తో ఊర్మిళ తలకు పుల్లతాకించటం, త్రిమూర్తులను స్మరించటం, ఏమందూ మాకూ వాడకపోవటం గమనించాడు రాంభట్టు . పుల్లలో ఏదో మహిమ ఉందని భావించాడు. ''రంగన్నా నిన్ను రాజువద్దకు తీసుకెళ్ళటానికి దినాలు బాగా లేవు మూడు రోజులు ఆగు'' అన్నాడు. ఆ రాత్రి కొక్కేనికి తగిలించిన రంగన్న చొక్కా జేబులోని పుల్లను తీసుకొని దానిస్థానంలో మరోపుల్లను ఉంచాడు. తాను దొంగిలించిన పుల్లతో మూడురోజులు రాజు వైద్యం చేసాడు. కానీ రాజు ఆరోగ్యపరిస్థితిలో మెరుగుదలలేదు ''రాంభట్టూ, నీవు నాజేబులోనుండి తీసుకెళ్ళింది నకిలీ పుల్ల. అసలు పుల్లను జేబులో పెట్టడానికి నేనేమైనా వెెర్రి వాడినా? పుల్లకాజేయటంలో నీ అల్పబుద్ధి బయటపడింది. నకిలీ పుల్లతో రాజుకు ఎలా బాగావుతుంది.'' అని రంగన్న రాంభట్టును నిలదీశాడు. తమ తప్పు తెలుసుకున్న రాంభట్టు చివరకు రాజు జబ్బునయం అయితే..ఆయన ఇచ్చే బహుమతిలో సగం తనకు ఇవ్వాలన్న షరతుతో రంగన్నను రాజుకు పరిచయం చేసాడు. పెట్టాడు. రాజు అసహనంతో 'రాంభట్టూ! నా వ్యాధి నయం చేయటం నీ వల్లే కాలేదు. ఇతని వల్ల ఏమౌతుంది? ఇక నాకు వల్ల కాడే గతి? అని నిరాశగా అన్నాడు రాజు. మీ వ్యాధిని పూర్తిగా నయం చేస్తాను నమ్మండి'' అన్నాడు రంగన్న ''ఏ పుట్ట లో ఏ పాముందో ..సరే కాని వ్వు '' అన్నాడు రాజు. రంగన్న దాచుకున్న అసలు పుల్లను తీసి రాజు తలపై ఉంచి బ్రహ్మ, విష్ణుం, మహేశ్వరం అన్నాడు . ముప్పొద్దుల వైద్యం ముగిసి తేల్లారగానే రాజుకు వెన్ను నొప్పి పోయింది. ఊరటచెందిన రాజు మనసు ఉత్సాహంతో ఉల్లాసంతో ఉప్పొంగింది. రెండో రోజు కాళ్ళునొప్పులు, కీళ్ళు నొప్పులు తొలిగిపోయాయి, మూడవరోజు లేచి మునుపటిలా నడిచేస రికి రాజు ఆనందం అంబరాన్ని తాకింది. ''రంగన్నా! అద్భుత మైన నీవైద్యంతో నా ప్రాణాలు నిలిపావు. నీవు మరో రాజు వైద్యునిగా ఇక్కడే ఉండిపో '' అన్నాడు రాజు. ''మహరాజా! నేను వైద్యుణ్ణికాను, రాళ్ళు కొట్టి బతికేవాణ్ణి అని తాను సాధువును పాము కాటు నుంచి కాపాడింది లగాయితు జరిగిందంతా పూసగుచ్చినట్టు చె ప్పాడు రంగన్న. 'అలాగా ఎలాగైతేనేం నాకు పునర్జన్మనిచ్చావు. నీకేం కావాలో కోరుకో' అన్నాడు రాజు. నాకు ఏమీ వద్దు ఏమి తీసుకున్నా అందులో నాకు దక్కేది సగమే. నా వల్ల తమ వ్యాధినయమైతే మీరు నాకే దైనా బహుమతి ఇస్తే అందులో ఆయనకు అర్ధభాగం ఇవ్వాలని రాంభట్టు మీకు నాతో వద్యం చేయించటానికి షరతుపెట్టాడు' అన్నాడు రంగన్న. అప్పుడే వచ్చిన రాంభట్టు, రాజులేచి నడవటం చూసి ఆశ్చర్యపోయాడు. అతణ్ణి చూడగానే రాజు ఉగ్రుడయ్యాడు.

'' రాంభట్టూ! ఈ రంగన్న నీ మేనకోడలి రోగం నయం చేసాడన్న విశ్వాసం లేకుండా నా వ్యాధి బాగైతే నేను తనికిచ్చే కానుక సగం వాటా ఇవ్వాలన్నావట? నిన్ను రాజ వైద్యుని పదవి నుండి తొలగిస్తున్నాను. పదివేలవరహాలుతో సత్కరించి రంగాపురంలో అతనికి పది అంకణాల మిద్దె, పదె కరాల మాగాణితో పాటు పశుసంపదను బహుమతిగా ఇచ్చాడు. రాజు ఇచ్చిన బహుమానాలతో బయలుదేరిన రంగన్న ఊరు చివరన ఉన్న ఏరు ముందు నిలిచి పుల్లను కళ్ళకద్దుకుని స్వామీ! నీ కరుణతో నా జీవితానికి దారీ తెన్నూ ఏర్పడింది కృతజ్ఞుణ్ణి '' అని పుల్లను నీటిలో విడిచాడు. 

వారాల పాట - బాలల గేయం

 అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం 
షోకు చేయ మొదలు పెట్టె సోమవారం
మల్లె పూలు తలలో పెట్టె మంగళవారం 
బుగ్గ మీద చుక్క పెట్టె బుధవారం 
ఘల్లు ఘల్లు గజ్జె కట్టె గురువారం 
చుక్కల చుక్కల గౌను వేసె శుక్రవారం 
చెంగు చెంగున బడికి వెళ్లే శనివారం 
మెచ్చి ఇచ్చె పంతులుగారు అక్షరహారం 

ఎందుకని? - బాలల గేయం

కోయిల పాడే దెందుకని? పాటలు బాగా పాడమని 
కోడి కూసేదెందుకని ? వేకువ జామున లేవమని 
నెమలి ఆడేదెందుకని ?  ఆనందముగా ఉండమని 
ఉడత గంతులు ఎందుకని ? చింతలు లేక మెలగమని 
పావురం చెప్పేదేమిటని ? శాంతిని ఎపుడూ కోరమని 
తాబేలు చెప్పేదేమిటని ?తొందరపాటు తగదని 
సాలీడు చెప్పేదేమిటని ?పట్టుదలగ పైకెదగమని 
కుందేలు చెప్పేదేమిటని ?ఖుషీ ఖుషీ గా ఉండమని 
ఒంటెలు చెప్పేదేమిటని ? ఒంటరితనం వీడమని 
చేపలు చెప్పేదేమిటని ?చురుకుగా ఎప్పుడు ఉండమని 

తేనెల తేటల మాటలు - బాలల గేయం

తేనెల తేటల మాటలతో
మన దేశ మాతనే కొలిచెదమా
భావం, భాగ్యం కూర్చుకుని
నవజీవన యానం చేయుదమా                                                        //తేనెల//

సాగరమేఖల చుట్టుకొని
సురగంగ చీరగా మలచుకొని
స్వేచ్ఛాగానం పాడుకొని
మన దేవికి ఇవ్వాలి హారతులు                                                       //తేనెల//

గాంగ జటాధర భావనతో
హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే                                                            //తేనెల//

ఎందరొ వీరుల త్యాగఫలం
మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరినీ తలచుకొని
మన మానసవీధిని నిలుపుకొని                                                    //తేనెల//