Pages

Sunday, August 30, 2015

సువర్ణ సాహసం :-

అవంతీపురాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలిస్తూండేవాడు. చక్కని పరిపాలకుడిగా అతనికి పేరుండేది. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. పేరు రవి వర్మ. అతనికి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు, ఓసారి రవివర్మ స్నేహితులతో కలిసి ఆడుకుంటూండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. అందరూ కళ్ళు మూసుకుని, తెరచేటప్పటికి, అక్కడ రవివర్మ లేడు! రాజు రాణి అతనికోసం వెదకని ప్రదేశమంటూ లేదు. అయినా ఏమీ ఫలితం లేకపోయింది. పిల్లవాడు ఏమైనాడో ఏమో, ఇక దొరకనే లేదు. రాజుగారు ఆ బెంగతో రాజసభకే వెళ్ళటం మానుకున్నారు.
ఆ తరువాత రాణి ఒక పాపకు జన్మనిచ్చింది. కొడుకును కోల్పోయిన దు:ఖంలో ఉన్న రాజు, రాణిలకు ఆ పాప దేవుడిచ్చిన వరమే అనిపించింది. వారు ఆమెకు సువర్ణ అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచసాగారు. అశోకవర్మ ఆమెకు అన్నిరకాల యుద్ధవిద్యలు, శాస్త్రాలు నేర్పించాడు. తల్లినుండి ఆమెకు సౌకుమార్యమూ, కళలూ అబ్బాయి. పద్దెనిమిది సంవత్సరాలు నిండేసరికి సువర్ణ అందచందాలతోబాటు, మంచి గుణాలు, ధైర్యసాహసాలు కలిగిన యువతిగా తయారైంది.అయినా సందర్భం వచ్చినప్పుడల్లా రాజు, రాణి సుడిగాలి ఎత్తుకెళ్లిపోయిన తమ కొడుకును గురించే బాధపడుతూ ఉండేవారు. సువర్ణకూడా ఈ విషయమై చాలా ఆలోచించేది. చివరికి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి, అన్నను వెతికేందుకై ఒక గుర్రం ఎక్కి బయలుదేరింది.
అలా వెళ్ళిన సువర్ణ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక పట్టణానికి చేరుకున్నది. అక్కడి ప్రజలంతా దు:ఖంలో మునిగినట్లు కనిపించారు. సువర్ణ ఒక పూటకూళ్లవ్వ ఇంట ఆగి, అక్కడి విశేషాలను కనుక్కున్నది: "ఒక రాక్షసుడు ఏరోజుకారోజు అక్కడి పిల్లలను ఎత్తుకు పోతున్నాడు. నగరమంతా హాహాకారాలు అలుముకున్నాయి. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు."
"అయితే నేను వెళ్లి వాడి పనిపడతా"నన్నది సువర్ణ.
"నీకెందుకమ్మా? అదీకాక ఆడపిల్లవు. నీ వల్ల ఏమి అవుతుంది?. మా మహారాజే ఏమీ చేయలేక ఊరుకున్నాడు కదా!" అంది అవ్వ. కానీ సువర్ణ తన పట్టు విడువలేదు. గుర్రం ఎక్కి నేరుగా రాక్షసుడునాడంటున్న అడవిలోకే పోయింది. కానీ ఎంత వెతికినా రాకాసి జాడ లేదు.
అలసిన సువర్ణ ఒక చెట్టుకిందకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పాము, ముంగిస తీవ్రంగా పోట్లాడుకుంటూ కనిపించాయి ఆమెకు. మంచితనం కొద్దీ ఆమె ఆ రెండింటి పోరునూ ఆపాలని చూసింది. కాని ముంగిస చాలా పొగరుబోతని త్వరలోనే తెలుసుకున్న సువర్ణ దాన్ని చంపి, పామును కాపాడింది. పాము సువర్ణకు తన కృతజ్ఞతను తెలిపి, ఏదైనా సహాయం కావాలేమో అడిగింది. రాక్షసుని సమాచారం కావాలన్నది సువర్ణ.
"ఆ రాక్షసుడు ఉండేది ఇక్కడకాదు. వాడు ఉండే చోటు చాలా భయంకరంగా ఉంటుంది. దానికి రక్షణగా చుట్టూతా సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి కాపలాగా దాని చుట్టూతా కొరివిదెయ్యాలు ఉంటాయి. నువ్వు రాక్షసుడి దగ్గరికి వెళ్లాలంటే ముందుగా ఆ కనబడే గుహలోని దయ్యాలను దాటుకొని పోవాలి. అందుకుగాను నేను ఈ పాదరక్షలు ఇస్తాను. వీటిని ధరిస్తే నువ్వు ఇక దెయ్యాలకు కనిపించవు. ఆ దెయ్యాలను దాటిన తరువాత నువ్వు గుహకు అవతల ఉన్న సముద్రాన్ని దాటాల్సి ఉంటుంది. కానీ ఆ సముద్రంలో చాలా భయంకరమైన పాములు ఉంటాయి. వాటిని దాటటం సాధారణ మానవులకు సాధ్యం కాదు. అందుకే నేను నీకు ఈ మణిని ఇస్తాను. దీనిని ధరిస్తే పాములు నిన్నేమీ చేయవు" అని పాదరక్షల్నీ, మణినీ సువర్ణకిచ్చింది పాము. సువర్ణ వాటిని తీసుకొని, పాముకు కృజ్ఞతలు చెప్పి అక్కడినుండి గుహవైపుకు బయలుదేరింది.
గుహను చేరుకొని, ముందుగా పాము తనకిచ్చిన పాదరక్షల్ని ధరించింది సువర్ణ. ఇక ఆమె దెయ్యాలకు కనిపించలేదు. ఆపైన ఆమె గుహను దాటి ధైర్యంగా సముద్రంలోకి దూకింది. సముద్రంలోని పాములు ఆమెను చూసి కూడా ఏమీ అనలేదు- ఆమె మెడలోని మణిప్రభావం చేతనే!
అలా రాకుమారి సువర్ణ సముద్రం దాటి ఒక ద్వీపాన్ని చేరుకుంది. మూసిన తలుపులున్న ఒక కోట తప్ప, అక్కడ జనసంచారమనేదే లేదు. సువర్ణ ధైర్యంగా ఆ కోట తలుపులు తట్టింది. చాలాసేపటికి ఒక పండుముసలి అవ్వ కోట తలుపులు తీసింది. ఆమె సువర్ణను చూసి ఆశ్చర్యపడుతూ "అమ్మా పాపా! ఇంత వరకూ తమంతట తాముగా ఇక్కడికి ఏ నరపురుగూ రాలేదు. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. నీచేతిలో ఈ రాక్షసుడి చావు ఖాయం అని నాకు తోస్తున్నది. ముందుజాగ్రత్తగా నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తాను. మొదటిదాన్ని చదివితే నువ్వు చిన్న పాపగా మారిపోతావు. రెండో మంత్రం చదివితే నీ మామూలు రూపం ధరిస్తావు" అని ఆ మంత్రాల్ని ఉపదేశించింది.
కోట లోపలచూస్తే ఒక్కరు తక్కువగా పదివేలమంది పిల్లలున్నారు. సువర్ణ మొదటి మంత్రాన్ని చదివి చిన్నపిల్లగా మారిపోయి వారిలో కలిసిపోయింది. ఆరోజు సాయంత్రం రాక్షసుడు వచ్చీరాగానే అవ్వను "పదివేలమందీ పూర్తయ్యారా?" అని అడిగాడు. "అయ్యార"న్నది అవ్వ. "అయితే బలికి అన్నీ సిద్దం చేయమన్నాడు రాకాసి. అవ్వ అన్నీ సిధ్ధంచేసి, మొదటగా సువర్ణను ముందుకు తెచ్చి నిలబెట్టింది.
రాక్షసుడు సురర్ణను చూసి వికవికా నవ్వాడు. "పాపా, నువ్వు స్వర్గం చేరుకునే సమయం వచ్చింది. ముందుగా నిన్ను కన్న ఈ మాతకు మోకరిల్లు" అన్నాడు కత్తిని పక్కనే ఉంచుకొని.
సువర్ణ రెండు చేతులూ జోడించి అమ్మకు మొక్కింది. "అలాకాదు పాపా, వంగి, నేలబారుగా పడుకొని నమస్కరించాలి" అన్నాడు రాక్షసుడు ప్రేమను నటిస్తూ. "నాకు తెలియదు, నువ్వే చేసి చూపించు" అన్నది సువర్ణ. "అయ్యో! ఆ మాత్రం తెలీదా, ఇలా పడుకొని, ఇలా మొక్కాలి" అని రాక్షసుడు నేలబారున పడుకోగానే, ప్రక్కనున్న కత్తిని తీసుకొని, సువర్ణ ఒక్కవేటుతో అతని శిరస్సును ఖండించివేసింది.
రాక్షసుడు చనిపోగానే, అనేక సంవత్సరాలుగా వాడు ఎత్తుకొచ్చి పెట్టిన పదివేలమంది పిల్లలకూ వాళ్ల వాళ్ల రూపాలు లభించాయి. అవ్వకుకూడా దాస్య విముక్తి లభించింది. ఎదిగిన ఆ పిల్లలందరికీ తమ తమ కుటుంబ వివరాలు గుర్తున్నాయి! అవ్వ మహిమతో అలా వారంతా ఎవరి తావులకు వారు చేరుకున్నారు.
ఆ పిల్లల్లోనే ఒకడు, రవివర్మ! అలా అనుకోకుండా తన అన్నను కాపాడుకోగలిగినందుకు సువర్ణ చాలా సంతోషించింది. పోయిన కొడుకు దక్కినందుకు, ధీరురాలైన కుమార్తె తమకు కలిగినందుకూ వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దానధర్మాలు చేసి, ఉత్సవాలు నిర్వహించారు. అందరూ సువర్ణ సాహసాన్ని కొనియాడారు.

నేను కొనబోయే ఆవు కథ : -

పేరొందిన హాస్య కళా మూర్తి గోపాల్ భాండ్ బెంగాల్ రాష్ట్రంలో నివసిస్తున్న రోజుల్లో, ఆయన ఇంటి ప్రక్కనే పేద దంపతులు ఇద్దరు నివసించేవాళ్ళు. ఆ భార్యాభర్తలిద్దరికీ, పాపం, పగటి కలలు కనే అలవాటు ఉండేది. ఒక రోజున గోపాల్ భాండ్ వింటుండగా వాళ్ళిద్దరూ ఒకళ్ళను మించి మరొకళ్ళు కోతలు కోస్తూ పగటి కలలు కనటం మొదలు పెట్టారు.
భర్త అన్నాడు: " నాకు కొంచెం డబ్బు సమకూరిందంటే, నేనొక ఆవును కొంటాను" అని.
భార్య శృతి కలిపింది- "అప్పుడు నేను పాలు పిండుతాను. మనకు చాలా కుండలు అవసరమౌతాయి మరి. నేను వెళ్ళి, కొన్ని కుండలు కొనుక్కురావాలి" అని.
మర్నాడు నిజంగానే భార్య సంతకు వెళ్లి కుండలు కొనుక్కొచ్చింది. భర్త ఆమెను అడిగాడు: " ఏం కొనుక్కొచ్చావు?" అని."ఏముంది? కుండలు! ఒకటి పాలకు, ఒకటి మజ్జిగకు, ఒకటి వెన్నకు, ఒకటి నెయ్యికి!" అన్నది భార్య.
"బాగుంది, బాగుంది. మరి ఇంక ఆ ఐదో కుండ దేనికి?‌" అడిగాడు భర్త.
"మిగులు పాలు కొన్నిటిని మా చెల్లెలికి ఇవ్వటం కోసం ఈ ఐదో కుండ!‌" అన్నది భార్య.
"ఏంటీ!? మిగులు పాలు మీ చెల్లెలికి ఇస్తావా?! ఎంతకాలంగా చేస్తున్నావు, ఈ పని? నాకు కనీసం చెప్పకుండా, నా అనుమతి లేకుండా, ఇంత నాటకం ఆడుతున్నావా?" అని భర్త అరుస్తూ, కోపం పట్టలేక కుండల్ని విసిరేసి, అన్నింటినీ పగలగొట్టేశాడు.
ఇక భార్య తిరగబడింది- " ఆవు ఆలనా, పాలనా చూసేది నేను! పాలు పిండేది నేను! మిగులు పాలతో‌నాకేది ఇష్టమైతే అది చేస్తాను!" అని.
"దుర్మార్గురాలా! నేను రాత్రింబవళ్ళూ చెమటోడ్చి పనిచేసి, డబ్బులు కూడబెట్టి, ఆవును కొంటే, ఆ పాలను నువ్వు తీసుకెళ్లి నీ చెల్లెలికి పోసేస్తావా? ముందు నిన్నేం చేస్తానో చూడు" అని గర్జిస్తూ, భర్త తన చేతికందిన మూకుళ్లనూ, గిన్నెల్నీ భార్య మీదికి విసిరేశాడు.
ఇంట్లోంచి వింటున్న గోపాల్ భాండ్ కి చాలనిపించింది. అతను పక్కింటికెళ్ళి అడిగాడు అమాయకంగా- "ఏమైంది? వంట సామాన్లన్నీ ఎందుకు విసిరేస్తున్నారు?" అని.
" మా ఆవు పాలన్నీ తీసుకెళ్ళి, ఈమె తన చెల్లెలికి పోసేస్తోంది!" అన్నాడు భర్త.
"మీ ఆవా?!" అడిగాడు గోపాల్ భాండ్.
"అవును. తగినంత డబ్బు సంపాదించి కూడబెట్టాక నేను కొనబోతున్న ఆవు!"
"ఓహో, ఆ ఆవా? మీకు ఈరోజున ఇంకా ఆవు లేదు, కదూ?" అడిగాడు గోపాల్.
భర్త అన్నాడు- " చూస్తూండు. ఎప్పటినుండో అనుకుంటున్నాను. నేనొకదాన్ని తెస్తున్నాను త్వరలో" అని.
"ఓహో ఇప్పుడు అర్థమైంది, నా కూరగాయల తోట ఎప్పుడూ నాశనం ఎందుకౌతున్నదో!" అని గోపాల్ అకస్మాత్తుగా ఓ చింత బరికె చేతపుచ్చుకొని అతని మీదికి ఉరికాడు.
"ఆగు..ఆగు... నన్నెందుకు కొడుతున్నావు?" అని అడుగుతూనే తప్పించుకునేందుకు గంతులు వేయటం మొదలుపెట్టాడు పక్కింటాయన.
"నీ ఆవు! నీ ఆవు మా తోటలోకి జొరబడి, నా చిక్కుళ్ళనీ, దోసపాదుల్నీ ఇష్టం వచ్చినట్లు నమిలేస్తోంది. నువ్వు దాన్ని అట్లా వదిలేశావు!" అని చిందులేశాడు గోపాల్.
"ఏ చిక్కుళ్ళూ, ఏ దోస పాదులు? నీ కూరగాయల తోట ఎక్కడుంది అసలు?"
"నేను నాటబోతున్న చిక్కుళ్ళూ, నేను పెట్టబోతున్న దోసపాదులు! నేను పెంచబోతున్న కూరగాయల తోట! నేను ఎంతో కాలంగా దాన్ని గురించి ఆలోచిస్తుంటే, మీ ఆవు ఎప్పటికప్పుడు నాశనం చేస్తోంది దాన్ని!" అన్నాడు గోపాల్ ఊపిరి బిగబట్టి.
పొరుగింటివాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నై. కలలన్నీ విరిగి, ఆకాశం నుండి నేలకు దిగి వచ్చారు. ఆపైన కొద్ది సేపటికి అందరూ కలిసి నవ్వుకున్నారు.

గుర్తింపు

చంటి వాళ్ళ మావయ్య దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎంతో మంది పత్రికా విలేఖరులు, టి.వి.ఛానెళ్ళ వాళ్ళు వస్తున్నారు. చాలా ప్రశ్నలు వేసి, ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. ఇదంతా సహజమే మరి, మావయ్య తీసిన పక్షుల ఫోటోకి జాతీయ స్థాయి పోటీలో మొదటి బహుమతి వచ్చింది!
విలేఖర్లడిగే ప్రశ్నలన్నింటికీ మావయ్య చిరునవ్వుతో సమాధానాలు చెప్తున్నాడు. "మీ ఈ ఛాయాగ్రహణ విద్యకు వారసులెవరైనా ఉన్నారా" అని ఒకరడిగిన ప్రశ్నకి, మావయ్య తనను ఒళ్ళోకి తీసుకుంటూ- "ఏం చంటీ, నువ్వు కూడా నాలాగే ఫోటోగ్రాఫర్ అవుతావు కదూ" అని అడిగాడు. చంటిగాడికి ఆ పక్షుల ఫోటో తీసిన రోజు గుర్తుకొస్తోంది:
మావయ్య ఫోటోలు తీయడానికని దగ్గర్లో ఉన్న చిట్టడవికి వెళ్తూ కేమెరాలు, లెన్సులూ సర్దుకుంటుంటే ఎప్పటిలాగానే తనూ వస్తానన్నాడు. అడవుల్లో తిరుగుతూ అక్కడి పక్షుల్నీ, జంతువుల్నీ కళ్ళారా చూడటం భలే మజాగా ఉంటుంది. అప్పుడప్పుడు భయం వేస్తుంది గానీ, మావయ్య పక్కనే ఉంటాడుగా. ముక్కాలిస్టాండు మీద పెద్ద పెద్ద కేమెరాలు బిగించి, క్షణంలో మాయమైపోయే జంతువుల ఫొటోలు తీసే మావయ్య హీరోలా కనిపిస్తూ ఉంటాడు తన కళ్ళకి. పెద్దయ్యాక తను కూడా మంచి ఫోటోలు తీస్తానని చాలా సార్లు అనుకున్నాడు కూడా.
ఆ రోజు మావయ్య ముందుగానే పక్షుల ఫోటో తీద్దామని నిర్ణయించుకున్నట్లున్నాడు, ఒక గుబురు చెట్టు మీద పెద్ద పక్షి గూడు కనిపించగానే ఆగిపోయాడు. గూటిలోంచి అప్పుడప్పుడు చిన్నగా 'కూకూ' శబ్దాలొస్తున్నాయి. పక్షి పిల్లలు మాత్రమే ఉన్నాయనుకుంటా- 'వాళ్ళమ్మ, నాన్న పిల్లలకి ఆహారం తేవడానికి వెళ్ళుంటాయి; అవి కూడా వచ్చాక, అన్నింటికీ కలిపి ఫోటో తీయాలి' అన్నాడు మావయ్య.కేమెరాని సిద్ధం చేసుకుని వాటి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ఇద్దరూ. ఎర్రని ముక్కులతో తెల్లగా ఉన్న పక్షిపిల్లల తలలు మాత్రం కనిపిస్తున్నాయి తనకు అప్పుడప్పుడూ. ఎంత ముద్దుగా ఉన్నాయో అవి! మావయ్య దృష్టి మాత్రం వాటి అమ్మానాన్నల మీదే ఉన్నట్లుంది. కానీ అవి ఎంతకీ రాలేదు.
సూర్యుడు నడినెత్తికొస్తున్నాడు. ఎండ బాగా పెరిగిపోయింది. తెచ్చుకున్న బిస్కట్లు, మంచి నీళ్ళు అయిపోవచ్చాయి.
ఇక ఉండబట్టలేక మావయ్య "పెద్ద పక్షులు కూడా ఇక్కడికి దగ్గర్లోనే తిరుగుతూ ఉండి ఉంటాయి, నువ్వెళ్ళి ఈ కర్రని ఆ గూడుకి తాకించడానికి ప్రయత్నించు" అని ఒక పొడుగాటి కర్రని తనకిచ్చాడు. మావయ్య చెప్పింది పూర్తిగా అర్ధం కాలేదు కానీ, తన కన్నా ఓ మూడు రెట్లు పొడుగున్న ఆ కర్రని పట్టుకుని పక్షి గూడు కింద ఎగరడం మొదలుపెట్టాడు తను- కర్ర ఆ గూటికి తగలకుండా జాగ్రత్త పడుతూనే. మావయ్యేమో కేమెరా ఫోకస్ చేసుకుని, ఫోటోలు తీసుకుంటూనే, "ఇంకొంచెం చంటీ ఇంకాస్త ఎత్తుకి ఎగరాలి" అంటూ తనను ప్రోత్సహించాడు.
అయితే అలసట వల్ల తన చెయ్యి పట్టు తప్పింది! తన చేతిలోని కర్ర వెళ్ళి పక్షిపిల్లల గూటి కింద తగిలింది. పిల్లలేమౌతాయో అన్న బాధతో, భయంతో తను కళ్ళు తిరిగి పడిపోవటం, ఎక్కడినుంచో పెద్ద పక్షులు తమ పిల్లల్ని రక్షించుకోటానికి రావడం ఒక్కసారే జరిగిపోయాయి.
తరువాత మావయ్య నన్ను తెగ మెచ్చుకున్నాడు, "నాక్కావల్సినట్లు ఫోటో వచ్చిందిరా, ఒక అద్భుతమైన ఫోటో తీయడానికి సాయం చేసావు" అంటూ. కొంచెం చెదిరిన గూడు, దానిలోపల, తమ చిన్ని చిన్ని కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న భయంతో పక్షిపిల్లలు, తమ రెక్కలతో గూడును పడిపోకుండా పట్టుకుని, వాత్సల్యంతో పిల్లలవంకే చూస్తున్న రెండు పెద్ద పక్షులు - ఇదీ ఆ "అద్భుతమైన" ఫోటోలోని దృశ్యం. మావయ్యకి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందికూడా ఆ ఫోటో వల్లనే!
ఆ రోజు గుర్తుకు రాగానే ఎనిమిదేళ్ళ చంటిగాడు మావయ్య చేతుల్ని విదిలించుకుంటూ చెప్పేశాడు - "నీలాంటి ఫోటోగ్రాఫర్ని మాత్రం నేనెప్పటికీ కాను" అని. ఆ పెద్ద పక్షులు రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే, ఆ చిన్ని పక్షి పిల్లలు తన మూలంగా చనిపోయేవన్న నిజాన్ని మర్చిపోవడానికి వాడికి నెల రోజులు పట్టింది మరి!

బావురు పిల్లి

అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుమంది భార్యలు. పిల్లలు కలగక పోవడం చేత ఆయన ఏడు పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా కాలం తరువాత చివరి భార్య గర్భవతి అయ్యింది. "ఈ సంగతి రాజుకు తెలిస్తే ఇక ఆయన మనల్ని సరిగ్గా చూసుకోడు. ఎలాగైనా చివరామెను బయటకి వెళ్ళగొట్టాలి" అనుకున్నారు మిగిలిన భార్యలు.
ఒకనాడు రాజు వేటకని అడవికి వెళ్ళాడు. అదే సమయమని భావించి, పెళ్లాలందరూ కలసి ఇద్దరు నమ్మకస్తులైన భటులను పిలిచారు. వాళ్ళకు చాలా ధనమిచ్చి, "చిన్న భార్యను ఉత్తరాన ఉన్న అడవిలో వదిలేసి, ఆమె కన్నులు పీక్కురమ్మ"ని చెప్పి పంపారు. ధనాశచేత ఆ భటులు, చిన్న రాణిని తీసుకుపోయి, ఆమె కన్నులు పీక్కొని, చాలా దూరంగా ఉండే ఒక అడవిలో వదిలేశారు.

వేట ముగించుకొని తిరిగొచ్చిన రాజుకు చిన్న భార్య అదృశ్యంపై ఏవో నాలుగు మాయ మాటలు చెప్పి నమ్మించారు.
ఇక అడవిలో పడ్డ ఆరాణి పాపం, కళ్లు పోయిన బాధను భరించలేక చాలా ఏడ్చింది. ఏడ్చీ ఏడ్చీ అలిసిపోయి, ఒక చేనులో కందిచెట్టు కింద కూర్చొని మూర్ఛపోయింది. అప్పుడే ఆమెకు నొప్పులు వచ్చి, చక్కని కొడుకు ఒకడు పుట్టాడు. కానీ పురిట్లోనే ఆ రాణి చనిపోయింది!

అయితే అదే సమయంలో అటుగా పోతున్న ఒక బావురుపిల్లి పిల్లవాడి ఏడ్పులు విన్నది. అది వెంటనే అక్కడికి వెళ్ళి, ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకొనిపోయి, బాగా పెంచుకున్నది. ప్రతిరోజూ అది ఊరి లోనికి వెళ్లి, ఆహారం సంపాదించి, దాన్ని తీసుకుపోయి ఆ పిల్లవాడికి పెట్టేది. క్రమంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు.
ఒకనాడు ఆ పిల్లవాడు బావురుపిల్లితో " ఈరోజు ఊళ్లోకి నేను పోయి ఆహారం సంపాదించుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో"అని చెప్పాడు. కానీ అందుకు ఆ పిల్లి ఒప్పుకోలేదు. పిల్లి ఎంతచెప్పినా వినకుండా అబ్బాయి, "ఊళ్లోకి నేనే వెళతా" అని మొండిపట్టు పట్టాడు. చేసేదిలేక `సరే' అని ఒప్పుకుంది పిల్లి. వెళ్లేముందు "నాయనా! ఎటువైపుకైనా పో, కానీ, దక్షిణం వైపుకు మాత్రం పోవద్దు. మిగిలిన మూడు దిక్కులలో ఎటువైపుకైనా సరే పో. పోయి వాళ్ల ఇండ్లవద్ద నిలబడి,"రాజుకు ఏడుగురు భార్యలంట

కడతట్టాయమ్మ మాఅమ్మ
కందిచెట్టు కింద నీళ్లాడ
బావురుపిల్లి నన్ను సాకె
బావురు బిక్షం పెట్టండి."
అని పాట పాడు" అని, పాటని నేర్పించి పంపింది ఆ పిల్లి.
సరే'నని వెళ్లిన ఆ అబ్బాయిపిల్లి నన్ను దక్షిణం వైపుకు పోవద్దని ఎందుకు చెప్పింది? ఆ వైపున ఏముందో తెలుసుకోవాల'ని అటువైపుకే పోయాడు. అలా ఆ వైపుకు వెళుతూ వెళుతూ ఒక పెద్ద నగరం చేరుకుని అక్కడున్న ఒక అందమైన భవనం ముందు నిలబడి

"రాజుకు ఏడుగురు భార్యలంట
కడతట్టాయమ్మ మా అమ్మ
కందిచెట్టు కింద నీళ్లాడ
బావురుపిల్లి నన్ను సాకె
బావురు బిక్షం పెట్టండ"ని పాట పాడాడు.

ఆ భవనం రాజుగారిది. ఆ అబ్బాయి అలా పాట పాడిన సమయంలో రాజుగారు అక్కడే ఉన్నాడు. పాట విన్నాడు. విన్నాక బయటికి వచ్చిన రాజు, భవనం ముందు నిల్చుని పాట పాడిన పిల్లవాడిని గమనించాడు. ఆ అబ్బాయికి రాజు పోలికలే ఉన్నాయి! రాజు ఆ అబ్బాయినీ, ఆ అబ్బాయి పాటనూ అర్థం చేసుకున్నాడు. వాడు తన కుమారుడేనన్న విషయాన్ని పోలికల ఆధారంగా ఊహించుకోగలిగాడు. వెంటనే ఆయనకు మిగిలిన భార్యలమీద అనుమానం కలిగింది. వాళ్లని పిలిపించి, గట్టిగా అడిగేసరికి వాళ్లంతా నిజం ఒప్పుకున్నారు. ఆయన వాళ్లందరినీ కఠినంగా శిక్షించి, ఆ పిల్లవాడినే తన కుమారుడిగా అందరికీ పరిచయం చేశాడు. ఇంకొంతకాలానికి ఆ పిల్లవాడే రాజై, రాజ్యాన్ని బాగా పాలించాడు.

మిత్రులు

అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజులు మంచి స్నేహితులు.

ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో "ఒరే! మన ఊరి చివరి పెద్ద బంగళా పక్కన ఉన్న పెద్ద పూలచెట్టులోంచి, ఒక్క పువ్వును ఈ రోజు రాత్రికి గనక వెళ్లి తెంపుకొస్తే, వాళ్లకు నేను పది నెమలి ఈకలను ఇస్తాను"అని చెప్పాడు.

రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను! కానీ ఒకేసారి పది నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు "నేను ఎలాగైనా సరే, ఈ రాత్రికి అక్కడికి వెళ్లి, ఆ పువ్వును తీసుకొచ్చి, నీకు చూపిస్తాను!" అని సోముతో పందెం కాశాడు.

ఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చిలైటును తీసుకొని, ఆరోజు రాత్రి రాజు వెంట తనూ పెద్ద బంగళాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగళాను సమీపిస్తుండగా, చీకట్లో రాజు కాలికి ఏదో తగిలినట్లనిపించింది! వెంటనే రాజు భయపడి, గట్టిగా "దెయ్యం!దెయ్యం!" అని అరిచాడు. అప్పుడు లలిత "భయపడకు రాజూ! నా దగ్గర టార్చిలైట్ ఉంది కదా! అదేమిటో చూద్దాం, ఆగు- ఒక్క నిముషం-" అంటూ అటు వైపుకు టార్చిలైటును వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు- భయం భయంగా రాజుకేసే చూస్తూ ఉన్నది! 'హమ్మయ్య!' అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు.

బంగళా వచ్చేసింది- కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తోంది. బంగళా గేటు తీసేసరికి, రాజు ఏపనీ చెయ్యలేని స్థితిలోకి వెళ్లిపోయాడు.అప్పుడు లలిత తనే పెద్ద పూలచెట్టు పైకెక్కి, ఒక పువ్వును కోసుకొని వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి.. దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మిణుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి.. ఏవేవో గుర్తుకు వస్తున్నాయి! రాజు అలా భయపడుతూండగానే వాళ్లిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వును ఇచ్చేసి, టాటా చెప్పి, వాళ్ల ఇంటికి పోయింది.

ఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వును తీసుకెళ్ళి సోముకు ఇచ్చాడు. కానీ, సోము మాట నిలుపుకోలేదు. పది నెమలి ఈకల్ని ఇవ్వలేదు రాజుకు.
"రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్లి, ఈ పువ్వును తీసుకు వచ్చావు. -లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబూ!" అని సోము రాజును ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్లి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు.

"ఒక వేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే- అదిగో చూడు , లలిత అక్కడ ఉంది. నువ్వు వెళ్లి, ఆమెను ఒక దెబ్బ కొట్టిరావాలి!" అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తనని వెక్కిరిస్తారని, అతను పోయి లలిత చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు పది నెమలి ఈకల్ని ఇచ్చేశాడు.
రాజుకు నెమలి ఈకలు అయితే దొరికాయి- కానీ, ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ల స్నేహం ఒక్క పనికిమాలిన పందెం కారణంగా చెడిపోయింది!

వేట

సువర్ణ నగరాన్ని పాలించే రాజు ధనవర్మకు వేట అంటే మహా ఇష్టం. ఒక రోజున రాజు వేటకు వెళ్తుండగా, దారిలో రెండు పులి పిల్లలు కనిపించాయి. రాజు ఆ రెండు పులి పిల్లలను తీసుకొని రాజధానికి తిరిగి వచ్చి, వాటిని ప్రేమగా సాకాడు. వాటిలో‌ఒకదాని పేరు మాయ, రెండవదాని పేరు బుజ్జి. ఆ రెండూ రాజుపట్ల చాలా ప్రేమాభిమానాలు కలిగి ఉండేవి.

కానీ రాజుకు మాత్రం ఒక్కటే దిగులు- అదేమిటంటే, "అయ్యో! నాకింకా పెళ్ళి కాలేదే!" అని. ఆ సంగతి తెలుసుకున్న పులిపిల్లలు రెండూ రాజుకు తగిన భార్యను వెతకటం కోసం బయలుదేరి పోయి, దేశ దేశాలూ తిరిగాయి. చివరికి సదిశా రాజ్యం చేరుకొని, పౌరులెవ్వరికీ కనబడకుండా ఆ దేశపు రాజుగారి తోటలోకి దూరాయి. ఆ రాజుగారి బిడ్డ పద్మ- చాలా అందమైనది. ఆమె చెలికత్తెలతో కలిసి అక్కడ ఆటలాడుతూ, అకస్మాత్తుగా పులిపిల్లలను చూసి "వామ్మో!‌ పులి పిల్లలు!" అని గట్టిగా అరిచింది. కానీ చాలా తెలివైన మాయ, బుజ్జిలు సైనికులు వచ్చేలోపు అక్కడినుండి పారిపోయి, సువర్ణ నగరం చేరుకున్నాయి.

ధనవర్మ ఆ పులులను చూసి "అరే! మీరు ఎక్కడికో పారిపోయారే, అని ఎంత దిగులు పడ్డానో‌ తెలుసా?" అన్నాడు సంతోషంగా. అప్పుడా పులి పిల్లలు "మేం నీకోసం ఎంత మంచి యువరాణిని వెతికి పెట్టామో తెలుసా?" అని, సదిశారాజ్యపు రాజుగారి బిడ్డ గురించి చెప్పాయి.ధనవర్మ సదిశారాజ్యం చేరుకునే సరికి రాజుగారు పద్మకు స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నారు- వేగంగా పరుగులెత్తే చిరుతపులికి తగిలేట్లుగా మూడు బాణాలు వేసినవారికి తన బిడ్డనిచ్చి పెళ్ళి చేస్తానని ఆయన ప్రకటించాడు. ఆ పోటీలో ఇతరులెవ్వరూ నెగ్గలేదు. వేటలో అనుభవం గల ధనవర్మ, సునాయాసంగా చిరుతపులిని చంపి, యువరాణి పద్మను పెళ్ళిచేసుకున్నాడు.

రాజు, రాణి కొంతకాలం సుఖంగా కాలం గడిపిన తరువాత, పొరుగు రాజ్యపు సూర్యవర్మ సువర్ణనగరం మీదికి దండెత్తి వచ్చాడు. సూర్యవర్మకు అపారమైన సైన్యం ఉన్నది. 'అతనితో ఎలా తలపడాలా' అని బాధపడుతున్న ధనవర్మతో పులులు "రాజా! దీనికి చింత ఎందుకు? మమ్మల్ని యుద్ధానికి పంపు. రక్తపాతం లేకుండానే సమస్యను మేం పరిష్కరిస్తాం" అన్నాయి. రాజు వాటిని ముందుగా శత్రువులమీదికి వదిలాడు. వాటిని చూడగానే శత్రు సైన్యాలు వెనక్కి పరుగు తీశాయి. తన రాజ్యాన్ని కాపాడిన పులులు రెండింటినీ రాజు ఎంతో మెచ్చుకున్నాడు.
అయితే రాజుగారి వేటపిచ్చి రాజ్యానికే ప్రమాదం కొని తెచ్చింది. రాజును ఆదర్శంగా తీసుకున్న ప్రజలందరూ ఇష్టం వచ్చినట్లు వేటాడి, అడవిలోని జంతువులన్నిటినీ చంపేశారు. అడవుల్లోని చెట్లు, చేమలు అన్నీ ఒక్కటొక్కటే నేలకూలాయి. పర్యావరణం పాడవ్వటం మూలంగా రాజ్యానికి కరువుకాలం వచ్చింది. వానలు లేవు. అడవిలో మిగిలిన క్రూరమృగాలు పల్లెసీమల్లోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్లు తినెయ్యటం మొదలెట్టాయి.
ఏం చెయ్యాలో తెలీక తల పట్టుకున్న ధనవర్మతో పులులు - "రాజా, మీ దగ్గర ఉన్న ఆహార ధాన్యాలన్నిటినీ రాజ్యంలోని ప్రజలకు పంచిపెట్టండి. మమ్మల్ని అడవిలోకి వదిలి పెట్టండి. వేటను నిషేధించండి. మిగిలినది మేం చూసుకుంటాం " అని అన్నాయి.

"సరే" అని రాజుగారు తన దగ్గరున్న ఆహార ధాన్యాలను ప్రజలకు పంచిపెట్టి, పులులను అడవిలో విడిచాడు. మాయ, బుజ్జి ఆపైన అడవుల సంరక్షణకు పూనుకున్నాయి. త్వరలోనే అడవులన్నీ మళ్ళీ చెట్టు చేమలతో కళకళలాడాయి. జంతువులన్నీ తిరిగి అడవుల్లోకి వచ్చాయి. కరువు తీరి రాజ్యం సుభిక్షం అయ్యింది.

కలతో‌వచ్చిన తిప్పలు

ఒక ఊళ్లో భీముడనే క్లీనరు ఉండేవాడు. పేరుకు తగ్గట్టే, పెద్ద పెద్ద కళ్ళు, గంభీరమైన మీసాలు, గట్టి శరీరంతో ఉండే భీమన్న అచిరకాలంలోనే డ్రైవరయ్యాడు. కొత్తగా డ్రైవరైన భీమన్నకు, సహజంగానే, తన వృత్తి ధర్మం అంటే విపరీతమైన భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి.

అయితే, భీముడికి చిన్ననాటి నుండీ ఒక సమస్య ఉండేది. ఎప్పుడు పడుకున్నాసరే, వెంటనే అతనికి గొప్ప కలలు మొదలైపోయేవి. ఆ కలల ప్రపంచంలో ఉంటూ అతను ఒక్కోసారి భీకరంగా నవ్వేవాడు. ఒక్కోసారీ బాధగా మూలిగేవాడు. ఈ రెండూ చేయనప్పుడు, అతను ప్రశాంతంగా, గది అదిరేటట్లు, గురక పెట్టేవాడు. అట్లాంటి వ్యక్తితో సహజీవనం చెయ్యాలంటే ఎంత ఓపిక అవసరమో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. భీముడి భార్య బంగారం నిజంగా బంగారం లాంటిదే. ఆమెకు భీముడే ప్రత్యక్ష దైవం. తన దైవం నిద్రపోతున్నప్పుడు తన కాలి అందెలు మ్రోగి ఆయనకు ఎక్కడ నిద్రాభంగం‌కలిగిస్తాయోనని ఆమె అందెలు పెట్టుకోవటం మానే ‌సింది! భర్త ఎంత పెద్దగా నవ్వినా, ఎంత గట్టిగా గురకపెట్టినా బంగారం మాత్రం బహు చక్కగా సర్దుకుపోతుండేది.

ఒకరోజు భీమన్న యథా ప్రకారం లారీ దిగి ఇంటికొచ్చాడు. దూరప్రయాణం చేసి వచ్చాడేమో, భోజనం చెయ్యగానే కునుకు పట్టింది. బంగారం కూడా‌ పని ముగించుకొని వచ్చి పడుకున్నది. నిద్రలో భీమన్నకు డ్రైవింగు పని పడింది. ఇంకేమి, లారీని సుతారంగా తోలటం మొదలు పెట్టాడు. చేతులు స్టీరింగు కోసం తారాడాయి. అంతలో చేతికి భార్య చెవులు దొరికాయి. వాటిని పట్టుకొని భీమన్న కులాసాగా స్టీరింగు తిప్పుతూ లారీని తోలసాగాడు. బంగారానికి ఠపీమని మెలకువ వచ్చేసింది- కా‌నీ భర్తకు నిద్రాభంగం‌కాకూడదని, మిన్నకుండిపోయింది.

అంతలో లారీ వేగం‌పెంచాల్సి వచ్చింది మెల్లగా. భార్య మెడ కాస్త వేగం పుంజుకున్నది. తల అటూ ఇటూ‌తిప్పేస్తున్నాడు భీమన్న. స్టీరింగు చేజారిపోకుండా ఉండేందుకని, ఆమె చెవుల్ని గట్టిగా దొరకపుచ్చుకుని, తలని బొంగరంలాగా తిప్పటం మొదలుపెట్టాడు. అంతలో‌మరి, రోడ్డుకు ఎత్తుపల్లాలు కనబడ్డాయి. వేగం తగ్గించాలి.. క్లచ్ నొక్కాలి.. గేరు మార్చాలి. ఎడమ కాలు భార్య కాలిని గట్టిగా నొక్కుతూండగా, భీమన్న చెయ్యి గేరుకోసం వెతకసాగింది. అతనికి ఇప్పుడు బంగారం చెయ్యి దొరికింది. ఇక డ్రైవరుగారు ఆ చేతిని ముందుకీ, వెనక్కీ లాగుతూ డ్రైవింగు మొదలుపెట్టారు. భార్యామణి అరుద్దామనుకున్నది- కానీ అరవలేక, రెండో చేత్తో నోటిని అదుముకున్నది.
అంతలో ఇంకేముంది, వాహనానికి ఎదురుగా ఒక బర్రె వచ్చి నిలుచున్నది! బ్రేకు వెయ్యాలి! 'బ్రేకు ఏది?' భీమన్న కాలెత్తి, బాగా పైకి తీసి..ఎగ్గిరి ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నుకు బంగారం కెవ్వున అరిచి మంచం మీదినుండి దభీమని నేలనపడింది. అయినా ఆవిడగారికి భర్తను తట్టి లేపేందుకు మనసొప్పలేదు.

అంతలో భీమన్న లారీ వేగం పెంచాడు. ఎదురుగుండా రోడ్డు వంకర తిరిగి కనబడ్డది, నిద్రలో. ఒక్క ఉదుటున శరీరాన్నంతా ఊపి స్టీరింగును తిప్పబోయాడు. అంతే ఊపుగా తను మంచం మీదినుండి దభీమని క్రిందపడిపోయి, ఒక్క క్షణంపాటు నిశ్చేష్టుడైపోయాడు. చెయ్యి యాంత్రికంగా వెతికింది లైట్ల కోసం. లైట్లువేసి చూసుకుంటే తను గదిలో‌ఒకమూలన పడి ఉన్నాడు. బంగారం రెండో మూలన కూర్చొని బొప్పిగట్టిన తలను తడుముకుంటున్నది! సిగ్గు పడ్డ భీమన్న భార్యకు క్షమాపణలు చెప్పుకున్నాడు గానీ, మళ్ళీ పడుకోగానే ఇంకొక కల మొదలైతే, మరి ఎవరిది తప్పు?

వదిలెయ్యండి

శివపురపు శివార్లలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది. నూరేళ్ల వయసున్న ఆ చెట్టు అనేక తరాలుగా రకరకాల పక్షుల, ఉడతలు, మరెన్నో ఇతర జంతువుల్ని ఆకర్షిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం నాలుగైదు నెలలపాటు చెట్టు తన తీయని పండ్ల ను వాటితో పంచుకొనేది.

రాజు అనే కోతి ఒకటి ఆ చెట్టు మీద నివసించేది. ఆ చెట్టుమీదే గూడు కట్టుకొని నివసించే "కాలియా" అనే కాకికి, రాజుకు చక్కని స్నేహం కుదిరింది. రెండూ ఆడుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఒకరి అనుభవాలనొకరు పంచుకుంటూ సంతోషంగా ఉండేది.ఒక రోజున రాజుకు చెట్టు మొదట్లోనే ఒక వింత వస్తువు కనబడింది. అదొక సన్నమూతి కూజా- మెడ వరకూ నేలలో పూడిపోయి ఉన్నది. ఆ కూజాలో దాదాపు సగం వరకూ వేయించక శనగపప్పులు ఉన్నాయి! కోతులకు వేయించిన శనగపప్పు అంటే చాలా ఇష్టం. రాజుకు వాటిని చూసి ఎక్కడలేని సంతోషం కలిగింది.

ఆ సమయానికి కాలియా చెట్టు మీదనే ఒన్నది. క్రిందనుండే అరిచింది రాజు-”ఓ...కాలియా, చూడు, ఇవ్వాళ్ల ఎంత మంచిరోజో! ఏంటో! ఊహించు! నాకోసం భోజనం నా ఇంటి గడపకే వచ్చింది! అదిన్నీ, నాకిష్టమైన భోజనం!
కాలియాకు అదంతా నమ్మసక్యం కాలేదు. ఏ వేటగాడో, కోతుల్ని పట్టుకునేవాడో పన్నిన ఉచ్చు కావచ్చుననిపించింది. అది కోతికంటే ఎత్తు నుండి లోకాన్ని చూస్తుంది కనకనేమో, దానికి మనుషుల ప్రవర్తన గురించి కొంచెం ఎక్కువే తెలుసు. వాళ్లు జంతువుల్ని పట్టేందుకు వాడే తెలివితేటల్ని చూస్తే దానికి ఒకింత భయం కూడానూ. అందువల్ల అది రాజుతో "ఒరే! దాని మానాన దాన్ని వదిలెయ్యి. వేయించిన శనగపప్పుల మీద యావ తగ్గించుకో. ఈ ఒక్కసారికీ వాటిని తినకపోతే ఏమీ కాదులే. ఎందుకు, లేనిపోని ప్రమాదాల్లో పడతావు?” అన్నది.
కానీ రాజు కాకి సలహాను తీసుకోలేదు. ఎదురుగా కనబడుతున్న ఆహారపు రుచి గురించిన ఊహలు దాని మనసును వశం చేసుకున్నై. ఆ పరవశంలో అది అసలు కాలియా ఏం చెప్తున్నదీ పూర్తీగా విననే లేదు. “ఈ కాకి ఎప్పుడూ 'వద్దు ' అనే అంటుంటుంది. దాని ముందుచూపు కొన్నిసార్లు మేలు చేస్తుంటుంది, నిజమే. కానీ అది అన్నిసార్లూ ఎలా పనిచేస్తుంది? పట్టుబడకుండా ఈ పనుల్ని ఎలా అందుకోవాలో తెలుసు, నాకు. నాకు కనీసం ఆ మాత్రం తెలివితేటలు లేవా? కోతులు చాలా తెలివైనవి. బహుశ: ఈ కాకి మా తెలివితేటల్ని తక్కువగా అంచనా వేసి ఉంటుంది. నేను జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈ పప్పుల్ని ఎలాగైనా సరే, తినాల్సిందే.” అనుకున్నదది.

అలా అనుకొని, అది కూజా దగ్గరికి వెళ్లింది. సన్నటి దాని చేయి, కూజాలోకి సులభంగానే దూరింది. లోపల కూజా విశాలంగానే ఉన్నది. రాజు తనకు వీలైనన్ని పప్పుల్ని పిడికిట పట్టింది. అటూ ఇటూ చూసింది. ఎలాంటి ఉచ్చూ లేదు. దానికి చాలా సంతోషం వేసింది. కానీ, చేతిని బయటికి తీద్దామని చూసేటప్పటికి, చెయ్యి బయటికి రాలేదు! మూసిన పిడికిలి సన్నమూతిలోకి దూరటం లేదు! రాజు తన శక్తినంతా ఉపయోగించి చేతిని బయటికి లాగేందుకు ప్రయత్నించింది. చేతిని అన్ని వైపులకూ వంచి, లాగి చూసింది. ఏం చేసినా దాని వేళ్లకు కూజా రాచుకొని పెచ్చులు ఊడినై,తప్పిస్తే పిడికిలి మాత్రం కూజాలోంచి బయటికి రాలేదు. నొప్పికొద్దీ అది అరవటం మొదలు పెట్టింది- పిడికిలిని మాత్రం తెరవటం లేదు.

కొద్ది దూరంలోనే ఉన్న కోతులు పట్టేవాడికి రాజు అరుపులు వినబడినై. వాడు కులాసాగా నవ్వుకుంటూ అటువైపు రాసాగాడు. పైనుండి చూసిన కాలియా గాభరాపడి రాజుతో- “ఓరే! వదిలిపెట్టురా, కోతీ! నీ చేతిలోని పప్పుల్ని వదులు" అని అరిచింది. “పిడికిలి బిగించకు, తెరిచి పెట్టు. ఆ పప్పుల్ని వదిలెయ్యి. వదిలేస్తే, నీ చెయ్యి బయటికి జారి వచ్చేస్తుంది" అని కాకి ఎంత మొత్తుకున్నా, మొండి కోతి తన పట్టును సడలించలేదు.

విడిచిపెట్టటం రాని రాజు, ఆ విధంగా కోతులవాడి పాలబడింది. వదిలెయ్యటం నేర్చుకోవాలి అందరమూ- పట్టు పట్టడం ఎంత అవసరమో గానీ, పట్టు విడవటం అంతకంటే ఎక్కువే అవసరం! ఏమంటారు?

సలహాల అంగడి

నందనవనం అనే గ్రామంలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. దేశ దేశాలన్నీ తిరిగి, ఆయన అపారమైన జ్ఞానం సంపాదించాడు. తన సొంతఊళ్ళో జనాలంతా సమస్యలతో సతమతమౌతూ ఉన్నారని గమనించిన విష్ణుశర్మ , వారికి ఏదైనా వినూత్నమైన సేవను అందించాలనుకున్నాడు.

ఒక మర్రిచెట్టు కింద ఆయన తన అంగడిని ప్రారంభించాడు. చెట్టుకు ఒక బోర్డు వ్రేలాడదీశాడు: "సలహాల అంగడి. పూర్తి హామీ!" అని. దారి వెంబడి వచ్చిపోయేవాళ్లందరూ అంగడిపేరు చదివి నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎవరు వచ్చినా, రాకున్నావిష్ణుశర్మ మాత్రం ప్రతిరోజూ మర్రిచెట్టు క్రింద క్రమం తప్పకుండా కూర్చుంటూ వచ్చాడు.
ఒక రోజున రాముడు, రంగడు అనేవాళ్లు ఇద్దరు వచ్చారు సలహాల అంగడికి. అక్కడ కూర్చొని ఉన్న విష్ణుశర్మను "మీ దగ్గర ఏమి సలహాలు ఉన్నాయి, ఎంతకు అమ్ముతారు?" అని అడిగారు. "నేనిచ్చే ప్రతి సలహాకూ కనీస ధర 100 రూపాయలు. ఆ సలహా ఇవ్వటంలో ఉన్న కష్టాన్ని బట్టి అసలు ధర మారుతుంటుంది. ఒకవేళ మీరు గనక నా సలహా వద్దనుకుంటే, మీ ధనం మీకు తిరిగి ఇచ్చేస్తాను" అన్నాడు విష్ణుశర్మ.

రాముడు, రంగడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, "సరే, మాకు ఇద్దరికీ చెరొక సలహా ఇవ్వండి" అని రెండు వందల రూపాయలు విష్ణుశర్మ చేతికిచ్చారు.

"ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడే చోట మీరు ఉండకండి" అని చెప్పాడు విష్ణుశర్మ, ఆ డబ్బును జాగ్రత్త చేసుకుంటూ. "ఆ! ఇదో సలహా, దీనికో వంద రూపాయలు!" అన్నాడు రాముడు తిరస్కారంగా. వెంటనే "నీకు నా సలహా మంచిది కాదనిపిస్తే ఇదిగో, నీ వంద నువ్వు తీసుకో" అని వంద రూపాయలు తిరిగి ఇచ్చేశాడు విష్ణుశర్మ.

రాముడు డబ్బును వెనక్కి తీసుకున్నాడుగానీ, రంగడు మాత్రం విష్ణుశర్మకు ధన్యవాదాలు చెప్పి శలవు తీసుకున్నాడు. కొద్ది దూరం పోగానే రాముడు అతనితో "నువ్వు డబ్బు నెందుకు వెనక్కి తీసుకోలేదు? ఊరికే వంద రూపాయలు వృధా ఖర్చు!" అన్నాడు. "లేదులేరా! విష్ణుశర్మ గారితో‌పరిచయంకోసం ఆ వందా ఖర్చు పెట్టాననుకుంటాను. నా దగ్గర ఉంటే కూడా ఆ వంద మరో విధంగా ఖర్చైపోయేది" అన్నాడు రంగడు.
రాముడు, రంగడు పోయే దారిలో ఇద్దరు ఆడవాళ్ళు తగవు పడుతున్నారు. ఇద్దరూ వాళ్లను దాటుకొని పోతుండగా "రంగా, ఆ గొడవ ఏంటో చూసి వెళ్దాం, ఒక్క క్షణం ఆగు" అన్నాడు రాముడు.

అయితే రంగడికి విష్ణుశర్మ ఇచ్చిన సలహా గుర్తుకొచ్చింది. "ఇద్దరు ఆడవాళ్ళు గొడవపడేచోట ఆగవద్దని గదా, విష్ణుశర్మ చెప్పింది?" అని, రంగడు అక్కడ నిలువకుండా ఇంటికి వెళ్లి పోయాడు.

రాముడు మాత్రం అక్కడే నిలబడి ఆ తగవులాటని చూడసాగాడు వినోదంగా.

అయితే అక్కడ తగవు పడుతున్నవాళ్ళు మరెవరో కాదు- ఆ దేశపు రాజుగారి భార్యలు. వాళ్ళిద్దరి గొడవా చిలికి చిలికి గాలివానైంది. 'నువ్వెంతంటే నువ్వెంత' అనుకున్నారు. 'రాజుగార్ని రానియ్, నీపని చెబుతా' అనుకున్నారు. 'నాకు సాక్షి ఇదిగో, వీడే!' అని ఒకామె రాముడిని చూపించింది. 'నాకు సాక్షి కూడా వీడే, నీ పక్షం ఎట్లా మాట్లాడతాడో నేనూ చూస్తాగా!'అని రెట్టించింది రెండో ఆమె. ఇక రాముడి పని అడకత్తెరలో పోకచెక్క మాదిరి అయ్యింది. 'రాజుగారు రాక మానరు; నన్ను పిలువనంపక మానరు. నేను ఎవ్వరి పక్షం వహించినా, అవతలి వాళ్ళవైపునుండి నాకు ముప్పు తప్పదు. ఏం చేయాలి?!" అని వాడు క్రుంగి పోయాడు; ఇంటికి వెళ్లి, సంగతంతా రంగడికి చెప్పుకొని బాధ పడ్డాడు.

"విష్ణుశర్మ మాట వినకపోవటం వల్ల కదా, ఇట్లా అయింది?" అని రంగడు వాడిని విష్ణుశర్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. జరిగిన సంగతంతా విని విష్ణుశర్మ 500రూపాయలు ఇమ్మన్నాడు. "అదేమి, పోయిన సారి సలహాకు ఒక వందనే తీసుకున్నావు గదా" అని రాముడు గింజుకున్నాడు గానీ, 'కష్టాన్ని బట్టి ధర ఉంటుందని నేను ముందే చెప్పాను గదా!' అన్నాడు విష్ణుశర్మ, రాముడిచ్చిన ఐదు వందలూ భద్రపరచుకుంటూ.

"ఇవాల్టి నుండీ నువ్వు మూగవాడివి అనుకో. నీ కష్టం తీరిపోవాలంటే నువ్వు మాటలు రాని వాడి మాదిరి బ్రతకాలి" అని సలహా ఇచ్చాడు విష్ణుశర్మ. "ఈ మాత్రం సలహాకు ఐదు వందలా" అనిపించింది రాముడికి- అయినా ఒకసారి దెబ్బతిని ఉన్నాడు గనుక, 'సరే' అనక తప్పలేదు. అనుకున్నట్లుగానే మరునాడు రాముడి కోసం రాజభటులు వచ్చారు. ఉన్నవాడిని ఉన్నట్లు రాజసభకు పిలుచుకు వెళ్ళారు. రాజుగారి భార్యలిద్దరూ వాడిని గుర్తుపట్టారు-"ఇతనే, అక్కడ నిలబడి, మా పోట్లాట మొత్తం చూసిన ప్రత్యక్ష సాక్షి" అన్నారు. రాజుగారు రాముడిని చూసి- "ఏమయ్యా, నువ్వేనట, ప్రత్యక్ష సాక్షివి? మరి ఎవరిది తప్పో నువ్వే చెప్పు!" అన్నారు గట్టిగా. 'బ్బె బ్బె బ్బె బ్బె' అన్నాడు రాముడు, నీళ్ళు నములుతూ.

రాజు "ఏమిరా, మాటలు రావా?" అన్నాడు. 'బ్బెబ్బె బ్బె బ్బె' అన్నాడు రాముడు మళ్ళీ, విష్ణుశర్మను తలుచుకుంటూ. రాజుగారు భార్యలతో "వీడికి మాటలు వచ్చినట్లు లేవే, మరి ఎలాగ?" అన్నాడు. "ఏమో మరి, మేమైతే ముందుగా ఊహించలేదు!" అన్నారిద్దరూ. "ఏమైతేనేం, వీడు మనకు పనికి రాడు!" అని రాజు రాముడిని ఇంటికి పంపించేశాడు.

గండం గడిచిందని రాముడు ఊపిరైతే పీల్చుకున్నాడు గాని, వాడి నోట మాట లేకుండా పోయింది. తాను మాట్లాడగలడని రాజుకు తెలిస్తే తనకు మరణశిక్ష ఖాయం! అందుకని ఆరోజునుండీ వాడు పూర్తిగా మూగ జీవితం గడపవలసి వచ్చింది!

ఇలా నాలుగు రోజులు గడిచాక వాడికి తన జీవితం మీదే విరక్తి కలిగింది. 'ఎలాగైనా సరే, మళ్ళీ తన మాట వెనక్కి తిరిగివస్తే చాలు' అనిపించింది వాడికి. సలహా కోసం మళ్ళీ విష్ణుశర్మ శరణు జొచ్చాడు.
ఈసారి వెయ్యి రూపాయలు పుచ్చుకొని, విష్ణుశర్మ దీర్ఘంగా ఆలోచించి, వేళ్ళమీద లెక్కలు వేసి, చెప్పాడు- "నేటికి పదకొండవ రోజున, నువ్వు వెళ్లి రాజుగారిని కలువు. నిర్భయంగా జరిగిందంతా చెప్పెయ్!" అన్నాడు.
"ఈరోజే చెప్పేస్తే ఏమి?" అన్నాడు రాముడు. "రాణులు నీ శరీర అవయవాల్లో ఏదో‌ఒకటి ఊడగొడతారు, పరవాలేదా మరి?" అన్నాడు విష్ణుశర్మ.

రాముడు కిక్కురుమనకుండా 'సరే' అన్నాడు. నాటినుండి పదకొండవ రోజున వెళ్ళి రాజును దర్శించుకున్నాడు. జరిగిందంతా చెప్పాడు. నాటినుండీ తన నోటమాట లేక ఎంత కష్టపడిందీ చెప్పుకుని, మన్నించమని వేడుకున్నాడు.
రాజుగారూ, రాణులూ పగలబడి నవ్వారు. "ఒరే, ఈ తెలివి నీకు సొంతంగా వచ్చింది కాదు అని మాకు తోస్తున్నది- నీకెవరో తెలివిగలవాళ్ళు సలహాలు ఇచ్చి ఉండాలి. ఎవరు వాళ్లు?" అని అడిగారు రాజుగారు, రాముడికి భోజనం పెట్టించి పంపుతూ.

విష్ణుశర్మ గురించి చెప్పాడు రాముడు. వెంటనే రాజుగారు సంతోషంగా నవ్వి, విష్ణుశర్మకు కానుకగా ఇవ్వమని ఒక రత్నాల హారాన్ని, ప్రశంసా పత్రాన్నీ పంపారు. "ఊరికో విష్ణుశర్మ ఉంటే మన రాజ్యానికి ఇక ఏ ఆపదా రాదు. మన రాజ్యపు మంత్రి పదవి విష్ణుశర్మకోసమే ఎదురు చూస్తున్నది' అని చెప్పమన్నారు!!

రాముడు విష్ణుశర్మకు వాటిని అందిస్తూ "మరేం అనుకోకండి. పదిహేను రోజుల్లో ఏం జరిగినట్లు?" అని అడిగాడు. "ఏమీ లేదు రాముడూ, నిన్న రాజుగారి పుట్టినరోజు. ఆయన గొప్ప మనసుతో దాన ధర్మాలు చేసే పండుగ రోజు. ఆరోజున వాస్తవం చెబితే, ఆయన ఆనందం ముందు నీ సమస్య చిన్నదైపోయి నిన్ను మన్నించేస్తాడని, ఆరోజున వెళ్లమన్నాను. గుర్తుంచుకో- ఆనందం అధికం చేసుకుంటే సమస్యలు మాయమైపోతాయి!" అన్నాడు విష్ణుశర్మ.

రుబ్బు రాయి

ఒక ఊరిలో గొప్ప పండితుడు ఒకాయన ఉండేవాడు. వాళ్ళ ఊరిలోనే ఒక విద్యాలయం స్థాపించి, ఆయన అనేకమందికి చదువు చెప్పేవాడు. ఆయన విద్యార్థులు దేశం నలుమూలలా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు.
అయితే ఆయన కొడుకు రవిశంకరుడు మాత్రం ఎందుకూ పనికిరాని చవటగా తయారయ్యాడు. చదువు సంధ్యలు లేక, రవి ఊరంతా బలాదూరుగా తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకునేవాడు. తండ్రి ఎంత తిట్టినా, కొట్టినా అతనిలో ఏమాత్రం పరివర్తన రాలేదు. అస్సలు చదవని కారణంగా అతను పదవతరగతి పరీక్షల్లో తప్పాడు కూడా.

కొడుకు 'పరీక్షల్లో తప్పాడే' అన్న బాధకొద్దీ పండితుడు రవిని ఏదేదో అనేవాడు. వాడికి మొదట్లో ఆ మాటలు బాధ కలిగించేవిగానీ, రానురానూ వాడు వాటిని పట్టించుకోకుండా వదిలెయ్యటం‌ నేర్చుకున్నాడు. ఆ తరువాత తిట్టీ తిట్టీ తండ్రి సిగ్గుపడేవాడు తప్ప, రవిశంకరుడికి మాత్రం ఏదీ‌ తగలకుండా అయ్యింది.

అలాగని రవిశంకరుడు నిజంగా బండరాయి కాదు. వాడికి ఏ పనినైనా మళ్ళీ మళ్ళీ చేయటం ఇష్టం లేదు- అంతే. ఒకసారి చదివిన పాఠాన్ని వాడు మళ్ళీ చదివేవాడు కాడు. ఒకసారి రాసినదాన్ని మళ్ళీ రాయాలంటే వాడికి మహా బద్ధకంగా ఉండేది- అలాగని వాడు ఏకసంథాగ్రాహీ కాదు! అందుకని వాడికి ఏదీ రాకుండా అయ్యింది.
వీటన్నింటికీ తోడు తండ్రి ఎత్తిపొడుపు మాటలు వాడికి చాలా కష్టం కలిగించేవి. ప్రేమగా ఎవరైనా చెబితే వాడికి ఈ సంగతులన్నీ అర్థం అయ్యేవేమో, కానీ అలా చెప్పేవాళ్ళు ఎవరూ వాడికి ఎదురు పడలేదు.

ఒక రోజున పండితుడు వాడితో విసిగిపోయి చెడామడా తిట్టేశాడు. దాంతో వాడికి విపరీతమైన కోపం వచ్చి, దొరికిన దారిన నడుస్తూ పోయాడు. ఊరి చివరన ఒక గుడిసె కనిపించింది వాడికి.

ఆ గుడిసె ముందు ఒక కుటుంబంలోనివాళ్లు అందరూ కూర్చొని రాతితో‌ రోళ్ళు-రోకళ్ళు, తిరగలిరాళ్లు, రుబ్బుడు గుండ్లు తయారు చేస్తున్నారు. ఆ శబ్దాలూ, వాళ్ళ పని తీరూ నచ్చి, వాడు అక్కడే కూర్చొని చూడసాగాడు.
"ఒరే, మెల్లగా, కొంచెం కొంచెంగా చెక్కాలి. గరుకుగా ఉందని ఇంకా ఇంకా చెక్కుతూ పోయేవు- జాగ్రత్త. రుబ్బగా రుబ్బగా- నున్నగా అవుతుంది తప్ప, రుబ్బుడు గుండును ఎంత చెక్కినా నున్నగా కాదు" అంటున్నాడు, అక్కడ ఒక తండ్రి- కొడుక్కు రాళ్లు చెక్కటం నేర్పిస్తూ.

ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో‌చూశాడు రవి. ఒక రుబ్బుడు గుండును మళ్ళీ మళ్ళీ ఉలితో చెక్కుతున్నాడు వాడు. 'టిక్కు టిక్కు టిక్కు' అని ఉలి చప్పుడు చేస్తుంటే రవి ఆలోచనలు ఎటో పరుగెత్తాయి-
"బండరాయి అనుకునే రుబ్బుడు గుండు కూడా రుబ్బీ రుబ్బీ అరిగి- నునుపుగా తయారౌతున్నది. అలాంటి రుబ్బుడు రాయిని చేసేందుకుగూడా కార్మికుడు మళ్ళీ మళ్ళీ- ఎంతో శ్రద్ధగా, ఓపికగా ఉలితో పనిచేస్తాడు. మళ్ళీ మళ్ళీ పనిచేస్తే బండలే అరుగుతున్నాయి- అలాంటప్పుడు, నేను మాత్రం పాఠాల్ని మళ్లీ మళ్లీ ఎందుకు చదవకూడదు?" అనిపించింది రవికి.

ఆ తరువాత రవి బాగా సాధన చేశాడు. పట్టుదలతో చదివాడు; మళ్లీ మళ్ళీ రాసాడు. తండ్రికంటే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అనేకమందికి తనే మార్గదర్శకుడైనాడు. సాధన చేస్తే సాధించలేనిది ఏముంది?

మురికి దయ్యం

రామాపురం గ్రామంలో రామయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. ఉద్యోగరీత్యా రామయ్య తన భార్యతో సహా భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు. అయితే ఆ గ్రామంలో రామయ్యకు ఎంత వెతికినా ఒక్క ఇల్లు కూడా అద్దెకు దొరకలేదు. చివరికి ఊరి చివర్లో ఒక పాడుబడిన ఇల్లు ఖాళీగా కనబడింది. ఊళ్ళో ఆ యింటి యజమాని గురించి వాకబు చేసాడు రామయ్య.

ఇంటి యజమాని ఎవరో దానయ్య అట. అతను చనిపోయి పదేళ్లయినా తన ఇంటిమీద మమకారం చావక, ఇంకా ఆ ఇంటినే అంటిపెట్టుకొని ఉన్నాడట. ఊళ్ళోవాళ్ళెవ్వరూ అటువైపుకు రారు. ఆ ఇంట్లో ఉండే ఆలోచన మానుకొమ్మని రామయ్యకు, కమలమ్మకు సలహా ఇచ్చారు వాళ్ళు.

అయినా వేరే అవకాశం లేని రామయ్య, ఆ ఇంటికే వెళ్తానన్నాడు. "సరే, మీ ఇష్టం; మేం చెప్పాల్సింది చెప్పాం" అన్నారు ఊళ్ళో జనాలు.

అయితే ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉన్నది! కమలమ్మ, రామయ్య చీపురు కట్టలూ, బూజు కట్టెలూ చేతబట్టుకొని ఆ యింట్లోకి ప్రవేశించారు. వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టారో, లేదో, దానయ్య దయ్యం వాళ్లముందు ప్రత్యక్షమైంది "ఊ....." అంటూ. ఇద్దరూ చటుక్కున ఆగిపోగానే అది వాళ్ల చుట్టూ గింగిరాలు కొడుతూ "ఎవరు మీరు? ఎందుకొచ్చారు, నా యింటికి? ఇక్కడికి చీపురు కట్టలు, బూజు కట్టెలూ తేకూడదని మీకు తెలీదా?" అని అరిచింది బిగ్గరగా.
రామయ్యకు గుండె ఆగినంత పనైంది. దెయ్యం గియ్యం అని ఊరికే కట్టుకథలు చెప్పారనుకున్నాడు గానీ, అది ఇలా కళ్ళముందు గింగిరాలు తిరుగుతుందని అతను అనుకోలేదు మరి! కానీ కమలమ్మ మొండిది. ఆమె "మాకు ఉండేందుకు వేరే ఇల్లు ఎక్కడా లేదు. ఈ ఇల్లు తప్ప మాకు వేరే గతి లేదు. మేం ఇక్కడ ఉండాల్సిందే. నీకు ఇష్టమైనా అంతే; కష్టమైనా అంతే" అన్నది మొండిగా.

దయ్యం ఇప్పటివరకూ అలాంటి సమాధానం విని ఎరగదు. ఎవరొచ్చినా దాని అరుపు వినగానే పారిపోయేవాళ్ళు. కమలమ్మ మొండితనం దానికి నచ్చింది. అయితే ఇన్నేళ్ళుగా అది ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉన్నది. ఇప్పుడు ఎవరితోటో తన ఇంటిని పంచుకోవాలంటే దానికి కష్టమే అనిపించింది. అయినా కమలమ్మ వినేటట్టు లేదు. అందుకని అది "ఇదిగో, ఇక్కడ నేను తప్ప, మనిషన్నవాడు ఉండే అవకాశం లేదు. ఒక వేళ ధైర్యం చేసి మీరిద్దరూ ఇక్కడ ఉంటామంటే- సరే; కానీ నేను పెట్టే ఐదు షరతులకూ లోబడాలి మరి" అన్నది తెలివిని ప్రదర్శిస్తూ.
"ఏమిటా షరతులు, నన్నూ విననివ్వు!" అన్నది కమలమ్మ.

"ఈ ఇంట్లో చెత్తను ఊడవకూడదు. బూజు దులపకూడదు. మీరెవ్వరూ స్నానం చెయ్యకూడదు. గిన్నెలు తోమకూడదు- ఇవి కాక, నాకోసం రోజూ చేపలు వండిపెట్టాలి" అన్నది దానయ్య దయ్యం, ఇకిలిస్తూ. మనిషన్నవాడెవ్వడూ ఈ షరతులకు ఒప్పుకోడని దానికి తెలుసు.

కానీ కమలమ్మకు ఈ షరతులేవీ బరువనిపించలేదు. "ఓస్! ఇంతేనా? నువ్వు నాకు నచ్చావు. షరతులంటే మరేవో అనుకున్నాను. ఇవేనా! చెత్తను ఊడవకపోతే, బూజు దులపకపోతే, నాకు శ్రమ ఉండదు. వంటగిన్నెలు కడుక్కోకపోతే నాకు ఎంత పని తగ్గుతుంది! స్నానం చెయ్యకపోతే అసలే పని ఉండదు. నువ్వెంత మంచివాడివో ఊహించుకుంటేనే నాకు సంతోషం కలుగుతున్నది. చేపల కూర నాకూ ఇష్టమే!" అన్నది కమలమ్మ, మురిసిపోతున్నట్లు.

మరునాడు తెల్లవారగానే కమలమ్మ, రామయ్య బయలుదేరి ఊరి చెరువుకు పోయి శుభ్రంగా స్నానం చేశారు. తర్వాత అక్కడ రెండు పెద్ద కొడదల్ని పట్టుకొని ఇల్లు చేరుకున్నారు. లోపలికి అడుగు పెట్టగానే దానయ్య దయ్యం ఎదురై, "నా మాట ఎందుకు కాదన్నారు" అని పళ్ళు కొరికింది.
"మేమేం చేశాం?" అన్నారు వీళ్ళిద్దరూ.

"ఇంకా ఏమనాలి? స్నానం చేసి వచ్చారు కద!" అన్నది దయ్యం కోపంగా.

"అయ్యో! ఏం చెప్పాలి? ఈ చేపల్ని పట్టుకునేందుకు మేం చెరువులోకి దిగాల్సి వచ్చింది. చలికి చచ్చాం అనుకో. అయినా నీ చేపలు నువ్వు తెచ్చిస్తే, మాకు ఈ స్నానం చేసే ఖర్మ తప్పుతుంది గద!" అన్నది కమలమ్మ.
"నేను తెచ్చిస్తానని చెప్పలేదు ముందు" అన్నది దయ్యం కొంచెం తగ్గి.

"అలాగయితే నోరు మూసుకో. మేం‌ఇంత కష్టపడి చేపలు తెస్తే ఇలా తప్పుపట్టటం తగదు" అన్నది కమలమ్మ గడుసుగా.

ఆరోజునుండి దయ్యం ఇక వాళ్ల స్నానానికి అడ్డు చెప్పలేదు.

కమలమ్మ ఆరోజు చేపల కూరను వండుతూ, కావాలని అక్కడున్న బూజును, సాలీళ్లను అందులోకి వేసింది. చేపలకూర వాసనకు ఆగలేని దానయ్య దయ్యం సంతోషంతో గంతులు వేసింది. అయితే కూర పూర్తై అది తినేందుకు కూర్చోగానే చేపలకు బదులు, సాలీళ్ళు, బూజు దాని కంటపడ్డాయి. అది కోపంతో "సాలీళ్లకూర కాదు, నేనడిగింది చేపల కూర!" అని అరిచింది బిగ్గరగా.

చుట్టూ బూజు ఉంటే కూరలోకి అవికాక మరేమి వస్తాయి? అయినా దయ్యాలను సాలీళ్ళు ఏమీ చెయ్యవులే" అన్నది కమలమ్మ తాపీగా.

అయినా దయ్యానికి కూర నచ్చలేదు. "ఈసారి వంటలో చెబుతున్నాను- సాలీళ్ళు ఒక్కటీ రాకూడదు" అన్నదది. "మరైతే నువ్వు కొంచెం సేపు చెరువు గట్టున తిరిగిరా, ఆలోగా నేను బూజు దులిపేస్తాను. అయినా నాకు ఇదేం పని పెడుతున్నావు అనవసరంగా" అని విసుక్కున్నది కమలమ్మ.

ఇక బూజు దులిపేందుకు దయ్యం అడ్డు తొలిగిపోయింది కనుక కమలమ్మ కులాసాగా ఇల్లును శుభ్రం చేసేసింది. అయితే దులిపిన దుమ్మును, చెత్తను బయటికి చిమ్మే వీలు లేకపోయింది- ఊడవటానికి లేదు గద!
ఇక ఆరోజు పాత్రలు అలాగే ఉండిపోయాయి కడగకుండా. కమలమ్మ ఆ పాత్రల్లో కొంచెం తేమ, దుమ్ము, చెత్త అన్నీ వేసి మురిగిపోయేట్లు చేసింది. అవి ఘోరమైన వాసన వస్తుంటే, వాటిలోనే మరునాటి రోజు చేపల కూర వండి పెట్టింది దయ్యానికి.

ఆ కూర తిన్న దయ్యానికి వాంతులు, బేదులు మొదలయ్యాయి. సాయంత్రానికి దానికి జ్వరం వచ్చేసింది. "ఏం కూర వండావు తల్లీ! నేను బ్రతికున్నప్పుడు కూడా ఇంత చల్లగా లేదు" అన్నదది వణుక్కుంటూ.

"నేనేం చేసేది? గిన్నెలు తోమకపోతే వాటికి పట్టిన బూజు, నిన్నటి చేపలు కుళ్ళి వాసన వేస్తున్నా దాన్ని చిమ్మక పోవటం వల్ల తయారైన క్రిములూ, దోమలూ అన్నీ కలిసి నీకు ఆ రోగం వచ్చి ఉండాలి. ఆచార్లు దగ్గరకు పోయి ఏమైనా మందు తెచ్చుకోరాదూ? గిన్నెలు తోమటం, ఇల్లు ఊడ్చటం నావల్ల కాదు బాబూ" అన్నది కమలమ్మ ఆవులిస్తూ.

"కాదు కాదు. ఈ చెత్తను ఊడ్చి పారెయ్యి. గిన్నెలు శుభ్రంగా తోము. ఏమీ అనుకోకు. నేను ఈ వణుకును తట్టుకోలేకపోతున్నాను" అన్నది దయ్యం ప్రాధేయపడుతున్నట్లు.

"సరేలే, మీ ఇంట్లో ఉండి నువ్వు చెప్పినట్లు చేయకపోతే కుదురుతుందా?" అని గొణుక్కుంటూ కమలమ్మ ఇల్లును ఊడ్చి శుభ్రం చేసి, గిన్నెలు కడిగి పెట్టుకున్నది.

ఇంకో రెండు రోజులు గడిచేసరికి, దయ్యం రోగం కుదురుకున్నది. ఇప్పుడు అది కమలమ్మ మాట విని రోజూ ఉదయం, సాయంత్రం ఆరు బయట చల్లగాలిలో తిరిగి వస్తున్నది. రోజూ ఒక గంట ధ్యానంకూడా చేస్తున్నది. రాను రాను దానికి పరిశుభ్రంగా ఉండటం మంచిదే అని అనిపించసాగింది. ధ్యానం వల్ల దాని కోపం కూడా తగ్గింది. పరలోక చింతన పెరిగింది కూడాను. అంతేకాదు- దానికి కమలమ్మ మీద ఎంత గురి కుదిరిందంటే, ఆమె చేతిలో తన ఇల్లు అద్దంలా మెరిసిపోతూ భద్రంగా ఉంటుందని దానికి నమ్మకం కలిగింది. కొన్నాళ్లకు దానికి ఆ ఇంటి పైన మమకారం నశించింది. చివరికి అది ఇంటిని కమలమ్మకు, రామయ్యకు అప్పగించి తపస్సుకోసం నిశ్చింతగా అడవులకు వెళ్లిపోయింది.

నక్కరాజు - పందిరాజు

ఒక అడవిలో ఒక నక్క -ఒక పంది జతగా ఉండేవి. అడవిలోని జంతువులన్నీ నక్కనూ, పందినీ తమ రాజులుగా కొలిచేవి. మామూలుగా అవి రెండూ అడవిలోనే కలిసి మేత మేస్తుండేవి. అయితే ఒకనాడు నక్కరాజు-పందిరాజు మేతను వెతుక్కుంటూ ఒక ఊరివైపుకు పోయాయి. పోయి -పోయి, అవిరెండూ ఊరి ముందర్నే ఉన్న తోటలోకి వెళ్ళాయి. అక్కడ ఆ రెండింటికీ కావలసినంత ఆహారం దొరికింది. ఆరోజు తోటలో వాటికి దొరికిన ఆ ఆహారం చాలా రుచికరంగా ఉంది; అంతేకాక అది కుప్పలు తిప్పలుగా ఉన్నది కూడా. అటు తర్వాత నక్కరాజు-పందిరాజు ప్రతిరోజూ ఆ తోటకే వెళ్ళి కడుపునిండా మెక్కటం మొదలుపెట్టాయి. ఇలా కులాసాగా నడుచుకుంటూ తోటకు వెళ్ళడం-అక్కడ కావలసినంత మెక్కటం - ఆ పైన ఇంటికి పోయి పడుకోవటం- ఇది రోజువారీ పనయింది మిత్రులిద్దరికీ.
రోజూ అక్కడికి చేరుకొన్న వెంటనే, నక్క-పంది రెండూ తమకు దొరికిన ఆహారం మీదికి దూకేవి. అయితే నక్క త్వరగా మేసేసి, తోటనుండి బయటకు వచ్చి, గట్టిగా కూతలుపెట్టేది. పంది మాత్రం నిదానంగా, కడుపునిండా తిన్నాకగానీ అక్కడినుండి కదిలేది కాదు. ఈ తతంగమంతా ప్రతిరోజూ నడిచేది.ఒకనాడు నక్కపెట్టే కూతలను విన్న ఆ తోట యజమాని, అడవి జంతువుల బారి నుండి తన పంటను ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకున్నాడు. మంచి వేటకుక్కలను పట్టుకొచ్చాడు. ఆ మర్నాడు నక్క కూతలు పెట్టే సమయానికి వాటిని తోటలోకి వదిలాడు. ముందుగా తినేసి తోట బయటికి వెళ్ళి కూస్తున్న నక్క, వేటకుక్కల రాకను పసిగట్టి హడావిడిగా అడవిలోకి పారిపోయింది. కానీ, ఇంకా తోటలోనే తీరికగా మేస్తున్న పంది మాత్రం ఆ వేటకుక్కలకు దొరికిపోయింది. ఆ వెంటనే తోట యజమాని వచ్చి, పందిని పట్టుకొని, చెట్టుకు కట్టేశాడు. కట్టేసి, "పందిరాజా! ఇన్నాళ్లూ నువ్వు నా తోటలో పంటనంతా తిన్నావు- అందుకుగాను నువ్వు నాకు నష్టపరిహారం తప్పక చెల్లించాలి " అన్నాడు.

"నాదగ్గరేముంది, మీకు ఇవ్వటానికి? ఏదో, ఒక సంవత్సరంపాటు మీరు చెప్పిన పని చేసుకుంటూ ఉండిపోయి, మీ బాకీ తీర్చేస్తా" అన్నది పంది. "ఇప్పుడు దారిలోకి వచ్చింది" అనుకున్న రైతు దానికి తోటలోనే పనిపెట్టాడు. పందికూడా నోరుమూసుకొని ఆ తోటలోనే పనిచేసుకుంటూ ఉండిపోయింది.

కానీ పారిపోయిన నక్క కథ వేరుగా ఉండింది. అది ఆసరికే బాగా తినమరిగింది. తన మిత్రుడైన పంది వేటకుక్కలకు దొరికిపోయిన తర్వాత కూడా నక్క ఆ తోటకు పోకుండా ఉండలేకపోయింది. "నా అంతటిది, మామూలు వేటకుక్కలకు దొరుకుతుందా?" అనుకున్నదది. అయితే ఒకనాడు అదికూడా వేటకుక్కలకు చిక్కిపోయింది. పందితో కలిసి ఆ తోటలో పని చేయాల్సివచ్చింది.

అయితే అప్పటికే పందికి పని బాగా అలవాటయింది. అది బాగా కష్టపడి పనిచేసేది. కొత్తగా చేరిన నక్కకు పనిచేయటం వచ్చేది కాదు. అదీకాక, అంతవరకూ పనీపాటా లేకుండా తిని, తిరిగే నక్కకు పని చేయాలంటే మనసు కూడా ఒప్పేది కాదు. అందుకని అది పోయి, ఓ చెట్టుకింద పడుకొని , నిద్రపోతూ ఉండేది. అయితే రైతు తోటకువచ్చే సమయం అవుతున్నదనగా అది పంది దగ్గరకు వెళ్ళి, "యజమాని అన్నం తెచ్చే పొద్దయింది. నువ్వు పోయి కాళ్లూ చేతులు కడుక్కో" అని చెప్పేది. పంది అట్లా వెళ్ళి, తన కాళ్లూ చేతులు కడుక్కోగానే, నక్క తన ఒంటికి బురద పూసుకొనేది. యజమాని వచ్చి చూసి, "ఓహో నక్క బాగా పనిచేస్తున్నది- అందుకనే దానికి బురద అంటి ఉన్నది - పంది చూడు, ఎంత శుభ్రంగా ఉన్నదో- అది అస్సలు పనిచేస్తున్నట్లు లేదు' అనుకునేవాడు. నక్కకు బాగా ఇష్టంగా, ప్రేమగా తిండిపెట్టేవాడు.

యజమాని పోగానే, నక్క పందితో "చూశావా? రైతుకు నేనంటే ఎంత ఇష్టమో? నువ్వు కూడా నాలాగానే చెట్టు నీడన పడుకో, పని అస్సలు చేయకు. అప్పుడుగానీ రైతు నీకు కడుపునిండా తిండి పెట్టడు" అనేది.

అయితే ఒకనాడు నక్క ఖర్మ కొద్దీ యజమానికి ఏదో పనిపడి, రోజూకంటే ముందుగానే తోటకు వచ్చేశాడు. ఆ సమయానికి నక్క ఓ కొబ్బరిచెట్టు నీడన పడుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నది. రైతు దాన్ని చూసికూడా ఏమీ అనకుండా తన పని తను చేసుకున్నాడు. అయితే ఇక యజమాని రోజూ వచ్చే సమయం అయ్యిందని అనిపించగానే నక్క కాస్తా లేచి, పందితో ఏదో మాట్లాడటం, పంది వెళ్ళి కాళ్లూ-చేతులూ కడుక్కోవటం, నక్క పోయి తన ఒంటికి బురద పట్టించుకోవటం - అన్నీ యథా ప్రకారం జరిగాయి. దీన్నంతా గమనించిన రైతుకు రోజూ జరుగుతున్న తతంగం అర్థమయిపోయింది.

ఆపైన రైతు నక్కను పట్టుకొని, ఎండుమిరపకాయలతో పొగబెట్టాడు. నీతి -నిజాయితీలు ఏనాటికయినా గెలుస్తాయని తెలుసుకున్న నక్క, అప్పటినుండి బుద్ధిగా మసలుకున్నది! త్వరలోనే ఆ రెండూ అప్పును తీర్చేసి, అడవిని చేరుకున్నాయి.

కోటి పనోడు

అనగా అనగా సరాపల్లె అనే మారుమూల పల్లె ఒకటి ఉండేది. ఆ పల్లెలో నులకమంచాలు అల్లే జానయ్యకు రాజా అనే కొడుకు ఉండేవాడు. రాజా తన తండ్రితోబాటు నులకమంచాలు అల్లటానికి తోడుగా వెళ్తుండేవాడు. అలా వెళ్ళినప్పుడు, తండ్రి మంచం అల్లుతుంటే వాడు మంచం కోడును ఎత్తిపట్టుకునేవాడు. అలా రాజు మంచం కోడును చకచకా ఎత్తి, కదలకుండా పట్టుకోవటంవల్ల, వాళ్ల నాన్న 'నువ్వు కోడు ఎత్తటంలో మంచి పనోనివిరా!' అని పొగిడేవాడు. అలా ఆ గ్రామంలో చాలామంది వాడిని కోటిపనోడు అని పిలవసాగారు. అందరూ అలా పిలవటం వల్ల రాజుకు కొంత గర్వం పెరిగింది. 'నా అంతటి పనోడు లేడు' అనుకునేవాడు.

తన కొడుకు గర్వాన్ని గమనించిన జానయ్య, "నాయనా రాజా! ఈ లోకంలో చాలామంది పనిమంతులు ఉన్నారు. నువ్వు లోకం తెలియక నీలో నువ్వు గర్వపడుతున్నట్లుంది. అలా కొద్దిగా బయటిదేశాలు తిరిగి వచ్చావంటే నీకంటే గొప్పవాళ్ళు కనబడతారు" అని చెప్పాడు.

దానికి రాజా "సరే, నాకంటే పనిమంతులు ఉన్నారా, వాళ్లు నిజంగా ఎంతటివాళ్ళో కనుక్కుంటాను" అని మరుసటిరోజే సద్దిమూట కట్టుకొని బయలుదేరాడు. అలా బయలుదేరిన కోటిపనోడికి కోతులమర్రి అనే గ్రామ సమీపంలో రామయ్య అనే విలుకాడు కనబడ్డాడు. తన భార్య ముగ్గు వేస్తుంటే అతను ఆమె ముక్కుపుడకలోంచి లక్ష్యానికి గురిచూసి బాణాన్ని సంధిస్తున్నాడు. కోటిపనోడు అక్కడేనిలబడి, బాణం లక్ష్యాన్ని సూటిగా ఛేదించటం చూసి, ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వాడు రామయ్యను కలుసుకొని 'మీ అంతటివాడు లేడు' అని పొగిడి, తను వచ్చిన పని చెప్పాడు.

అప్పుడు రామయ్య "చూడు, నేనేమీ కాదు. నాకంటే ఇంకా గొప్ప నేర్పరులు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికి నేనూ నీతోబాటు వస్తాను పద" అని బయలుదేరాడు.

కోటి పనోడు, రామయ్య ఇద్దరూ ఉదయాన్నే పొలాల గట్టున వనములపాడు అనే గ్రామం సమీపంలోంచి వెళ్తుండగా, ఒకతను రెండు తాటిచెట్లను రెండు చేతులతో పట్టుకొని, ఒక తాటిచెట్టుతో పళ్లు తోముకుంటూ, వీళ్లకు ఎదురయ్యాడు. వీళ్లిద్దరూ అతన్ని ఆపి తాము వచ్చిన పనిని గురించి, గొప్పవాళ్లను వెతుకున్న సంగతి గురించి అతనికి చెప్పారు.

అతను తాటి చెట్లను పక్కకు పారవేసి, తన పేరు తాటయ్య అని చెప్పి, గొప్పవాళ్లను చూసేందుకు తనూ వాళ్లతోబాటు వస్తానన్నాడు.

కోటిపనోడు, విలుకాడు, తాటయ్య ముగ్గురూ కలిసి పోతుండగా మధ్యాహ్న సమయంలో వాళ్లకొక వింతదృశ్యం కనిపించింది. కొండ ప్రాగటూరు అనే గ్రామానికి దగ్గర్లో ఒక రైతు, రెండు పులులను కాడికి కట్టుకొని, రెండు పెద్ద నల్లత్రాచుపాములను పగ్గాలుగా చేసుకొని పొలం దున్నుతూ కనబడ్డాడు. అది చూసి వీళ్ళు ముగ్గురూ అతని దగ్గరికి వెళ్ళి, తాము వచ్చిన విషయం గురించి చెప్పారు.

"నాపేరు పులికేశవ" అని చెప్పి, అతను "నాకంటే గొప్పవాళ్లు ఈ ఊరిలోనే ఉన్నారు " అని చెప్పాడు. "ఎవరు?" అని ఉత్సాహంగా అరిచారు ఈ ముగ్గురూ. "ఇంకెవరు, నా భార్యనే- కొంచెం సేపు ఆగారంటే మీరు నాభార్యను కూడా‌చూసి వెళ్లచ్చు. ఇప్పుడు ఆమె నాకోసం భోజనం తీసుకొని వస్తుంటుంది" అన్నాడు పులికేశవ.
ముగ్గురూ సరేనని పులికేశవతో కలిసి చెట్టుక్రిందకు చేరుకున్నారు. ఇంతలో పులికేశవ భార్య కావేరమ్మ పది మళ్ల అన్నాన్ని నెత్తిన పెట్టుకొని, వందలీటర్ల నీళ్ళు పట్టే బుంగనొకదాన్ని నడుముమీద పెట్టుకొని వచ్చింది. ఆమె శక్తిని చూసిన మిత్రులు ముగ్గురూ బిత్తరపోయారు.

ఆమె వాళ్ళు వచ్చిన పనిని తెలుసుకొని, వాళ్లందరికీ అన్నం పెట్టి, వాళ్లతోబాటు తన భర్త పులికేశవనుకూడా గొప్పవాళ్లను చూసివచ్చేందుకు పంపింది. అలా నలుగురూ దేశాలు పట్టుకొని వెళ్తుండగా చీకటిపడింది. వీళ్లు నలుగురూ 'ఎల్లాల' అనే గ్రామంలో పడుకుందామని వెళ్ళారు. అక్కడ ఒకతను ‌ఓ మైదానంలో నిలబడి ఎటో దీక్షగా చూస్తూ కనబడ్డాడు. అతను తనలోతాను నవ్వుకుంటుండటం చూసి- "ఇతనెవరో పిచ్చివాడిలాగా ఉన్నాడు- పాపం ఏవో కలలు కంటున్నట్లున్నాడు" అనుకున్నారు వాళ్లు ఎగతాళిగా.

అతను వాళ్ల మాటలు విని, "ఏంటయ్యా, నా గురించి తెలిసే మాట్లాడుతున్నారా, బహుశ: మీరు కంటిచూరయ్య గురించి విన్నట్లు లేదు. కంటి చూరయ్య ఎవరోకాదు, నేనే. నేనిప్పుడు పదివేలమైళ్ల దూరంలో జరుగుతున్న తోలుబొమ్మలాటను చూస్తున్నాను. ఎంతదూరంలో ఉన్న వస్తువునైనా చూడగల సత్తా నాలో ఉన్నది" అన్నాడు.
వాళ్లు నలుగురూ అతన్ని క్షమించమని అడిగి, తాము వచ్చిన పని గురించి చెప్పారు. కంటిచూరయ్య కూడ వాళ్ళతో కలిసి మరుసటిరోజు బయలుదేరాడు, గొప్పవాళ్లని చూసేందుకు.

వాళ్ళు ఐదుగురూ నడిచిపోతుంటే ఒకతను వీళ్లను దాటుకొని వేగంగా ముందుకు నడుస్తూ పోయాడు. అతను తలపైకెత్తి, సూర్యుడివైపు చూస్తూ ఎంతో వేగంగా నడుస్తున్నాడు. వీళ్ళు అతని వెంట పరుగుతీస్తూ "ఏమైంది అన్నా, ఎందుకు, అంత వేగంగా పోతున్నావు, తలపైకెత్తి సూర్యుడిని చూస్తూ పోతున్నావు ఎందుకు?" అని అడిగారు. దానికి అతను "నాపేరు "సూరయ్య". నేను రోజూ ఉదయించే సూర్యుని దగ్గరనుండి నడక మొదలుపెట్టి సాయంత్రంలోగా అస్తమించే సూర్యుడిని కలుసుకుంటుంటాను. అంతవేగంగా నడవగల శక్తిని ఆ దేవుడు నాకిచ్చాడు" అన్నాడు. వాళ్ళు అతన్ని మెచ్చుకొని, తాము వచ్చిన పని గురించి చెప్పారు.

ఆ సంగతీ ఈ సంగతీ మాట్లాడుకుంటూ వాళ్ళు నడుస్తుంటే సూరయ్య దారిలో తను విన్న సంగతినొకదాన్ని చెప్పాడు- "లంకాపురి అనే రాజ్యపు రాకుమార్తెను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. ఆ రాకుమారిని ఎవరైతే క్షేమంగా తీసుకొనివస్తారో అతనికి తన రాజ్యం ఇవ్వటంతోబాటు ఆమెను ఇచ్చి వివాహం చేస్తానని రాజుగారు దండోరా వేయించారు" అని.

కోటిపనోడు అన్నాడు- "మనందరం గొప్పవాళ్లను కలిస్తే బాగుండు అనుకుంటున్నాం- సరే. కానీ మన పరిధిలో మనం- ఈ రాకుమార్తెను కాపాడితే బాగుంటుంది కదా" అని. అందరూ సరేనని, తమ తమ శక్తి కొద్దీ తలొక పనీ చేయటం మొదలుపెట్టారు.

సూరయ్య వేగంగా నడిచి రాకుమారి ఎక్కడుందో కనుక్కున్నాడు. అతన్ని గమనిస్తూ పోయిన కంటిచూపయ్య మిగిలిన వాళ్లకు ఆ వివరాలు తెలియపరచాడు. ఆ రాక్షసుని స్థావరం ఎత్తుమీద ఉండటం వల్ల, అక్కడికి తాటయ్య, పులికేశవ వెళ్ళారు. తాటయ్య పులికేశవను పైకి ఎత్తి ఆ రాక్షసుడి కోటలోకి పంపాడు. అతని అనుచరులను హతమార్చిన పులికేశవ, కోట తలుపులు తెరిచిపెట్టాడు. ఆదారిన మిగిలినవాళ్లంతా కోటలోపలికి చేరుకున్నారు.
కోటిపనోడు విలుకాడిని ఎత్తిపట్టుకున్నాడు. అప్పుడు విలుకాడు కంటి చూపయ్య వూపించిన వైపుగా బాణం వేసి, ఒక్క బాణంతోటే రాక్షసుడిని అంతమొందించాడు.

ఆ విధంగా ఆ ఆరుగురూ రాకుమార్తెను రక్షించి, రాజుగారికి అప్పగించారు. కానీ రాజుకు ఓ సమస్య వచ్చిపడింది. తన మాటప్రకారం ఈ ఆరుగురికీ రాజ్యాన్ని మాత్రం పంచెయ్యగలడు- కానీ తన కూతుర్ని ఎవరికిచ్చి పెళ్ళి చేయాలి? ఆరుగురూ ఎవరికి వాళ్ళే తమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే రాకుమార్తె తమకు దక్కాలంటున్నారు!

రాజుగారు, మంత్రిగారూ తీవ్రంగా ఆలోచించి, ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను రాకుమారికే అప్పజెప్పారు. ఆమె, ఒక్క క్షణం ఆలోచించి, కోటిపనోడిని వరించింది!సభలోవాళ్లెవరికీ ఆమె ఇలా ఎందుకు నిర్ణయించుకున్నదీ అర్థం కాలేదు. అందరూ కారణం అడిగితే, ఆమె అన్నది: " 'ఎవరు ఎంత బలవంతులు' అన్నది ముఖ్యంకాదు- ఎవరెంత సాధన చేశారన్నదే ముఖ్యం. గొప్పవాళ్లు అందరినీ కలుసుకోవాలన్న కోరికతో మొదలెట్టి, అందరినీ ఒకచోట చేర్చి, అందరూ కలిసి పనిచేసేందుకు, సమాజ శ్రేయస్సుకు నడుం బిగించేందుకు దోహదం చేసిన 'కోటిపనోడు" గొప్పవాడు. అందుకని అతన్ని వరించాను" అని. సభికులందరూ హర్షధ్వానాలతో ఆమె నిర్ణయాన్ని అభినందించారు.

పిసినారి పాట్లు!

పంజాబ్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం బంగ. బంగలో నివసించే ప్రతి ఒక్కరికీ తెలుసు- మంగళ్దాస్ ఎంత పిసినిగొట్టో. ఒకసారి మంగళ్దాసు దుకాణంనుండి ఇంటికి తిరిగివచ్చేసరికి భార్య పుచ్చకాయ (కలింగరి కాయ)ముక్కలు తరిగి పెట్టింది. అయితే ఇంట్లో చూస్తే, దాని పై చెక్కు కనబడలేదు మంగళ్దాసుకు. దాంతో అతను ఎంత రగడ చేశాడంటే, చివరికి అతని భార్య విసిగిపోయి, తను బయట చెత్తకుప్పలో పారేసిన పుచ్చకాయ చెక్కుల్ని ఏరుకొచ్చి, వాటిని కడిగి, కూర చేసి పెట్టింది!

ఒకసారి ఆ మంగళ్దాసు పనిమీద నగరానికి వెళ్లాల్సి వచ్చింది. బస్సు ఛార్జీలు మిగుల్చుకునేందుకుగాను అతను నగరం వరకూ నడిచి పోయాడు. మధ్యలో నదిని దాటేందుకు, మరబోటులో అయితే ఎక్కువ అడుగుతారని, తాతల కాలంనాటి పాత డింగీనొకదాన్ని ఎక్కాడు.

వెళ్లటం బాగానే వెళ్ళాడు గాని, వెనక్కి వచ్చేటప్పుడు, కాలం చెల్లిన ఆ పడవకు చిల్లి పడింది. ఆ సమయానికి పడవ నది మధ్యలో ఉన్నది. దగ్గర్లో నేల అన్నది లేదు. రంధ్రంగుండా నీళ్లు బలంగా లోపలికి వస్తున్నాయి- చూస్తూండగానే డింగీ నీళ్లలో మునిగిపోనారంభించింది. మంగళ్దాసు ప్రాణాలు పోయినంత పనైంది- ఎందుకంటే అతనికి ఈత రాదు మరి. ఇక చేసేదేమీ లేక, అతను తన కుల దైవాన్ని ప్రార్థించటం మొదలు పెట్టాడు- "స్వామీ, నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కిస్తే, నీ సంతృప్తి కోసం నేను సంతర్పణ చేసి, వెయ్యిమంది బ్రాహ్మణులకు భోజనం పెడతాను" అని గొణగసాగాడు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని.

పడవ మునిగిపోయింది. మంగళ్దాసు కూడా మునిగేవాడే- కానీ ఆ సమయంలో ఎక్కడినుండి వచ్చిందో మరి- ఒక పెద్ద కొయ్య దుంగ అతని పక్కకే వచ్చి ఆగింది. మంగళ్దాసు గబుక్కున ఆ దుంగను పట్టుకున్నాడు- మెల్లగా దాని పైకి ఎక్కి కూర్చున్నాడు- భద్రంగా సర్దుకొని, చతికిలబడి కూర్చున్నాడు. దాంతో భయం కొద్దిగా తగ్గింది. ఇప్పుడు అతనికి ఊపిరి పీల్చుకునేందుకు కొంచెం సమయంకూడా దొరికింది. దాంతోటే ఆలోచనా మొదలైంది- "అయ్యో, వెయ్యి మందికి భోజనం పెడతానని నేను ఎట్లా అనగల్గాను? వెయ్యి మంది అంటే మాటలు కాదే! అయినా ఆ దేవదేవుడికి ఈ లెక్క ఏమంత పెద్దది గనక? నేను ఐదు వందల మందికి భోజనం పెట్టినా ఆయనకు సంతోషమే అవుతుందిలే, పరవాలేదు" అనుకున్నాడు.

అలా పోయి, పోయి, దుంగ ఒక పల్లపు ప్రాంతాన్ని చేరుకొని ఆగింది. మంగళ్దాసు కాళ్లకు ఒక పెద్ద బండరాయి తగిలింది. అతను దాన్ని కొంత తడిమి, చివరికి దాని పైకెక్కి నిలబడ్డాడు. దగ్గర్లోనే ఒడ్డు కనిపిస్తున్నది- ఇక ప్రమాదం తప్పినట్లే. అతని ఆలోచనలు తను భోజనం పెట్టాల్సిన ఐదువందల మంది బ్రాహ్మణుల వైపుకు మళ్ళాయి. "ఐదు వందలమందికి భోజనం పెట్టనవసరంలేదు- ఐదు వందలలో ఏమున్నది? వందమందికి పెట్టినా మా ప్రభువుకు సంతోషమే. ఆయన నిత్య సంతోషి కదా, ఏమీ పరవాలేదు." అనుకున్నాడు.

బండమీద కొంచెం సేద తీరిన తరువాత అతను మళ్ళీ దుంగపైకి ఎక్కి ప్రయాణం సాగించాడు ధైర్యంగా. అది త్వరలో ఒడ్డున ఉన్న ఇసుకను తాకింది. ప్రమాదం పూర్తిగా తప్పిపోయినట్లే. ఇక మంగళ్దాసు సంతృప్తిగా నిట్టూర్చి, ఇంకా బాగా అనిపించటంకోసం, తను భోజనం పెట్టాల్సిన బ్రాహ్మణుల సంఖ్యను ఒకటికి తగ్గించేసుకున్నాడు. " 'భగవానుడు 'పత్రం, పుష్పం, ఫలం, నీళ్ళు'-ఇవి చాలు నాకు' అనలేదా, దానిదేమున్నది?" అనుకున్నాడు ఇప్పుడు.
అయినా, భద్రంగా ఇల్లు చేరుకున్నాక ఆలోచిస్తే అతనికి అదీ భారంగానే అనిపించసాగింది- ఏమంటే "ఈ బ్రాహ్మణులు తిండి బాగా తింటారు- పెద్ద పెద్ద బొజ్జల నిండా" అని బాధ. అందుకని, అతను బాగా ఆలోచించి, ఒక బక్కపలచటి బ్రాహ్మణుడు 'రిఖీరాం' ను ఎంపిక చేసుకున్నాడు. రిఖీరాంకు కడుపు సౌఖ్యం లేదని ఊరందరికీ తెల్సు. అందుకని మంగళ్దాసు వాళ్ళింటికి పోయి, అతన్ని మరుసటి రోజు ఉదయం తన ఇంట్లో భోజనానికి రమ్మని చెప్పి చక్కా వచ్చాడు."అయితే, బ్రాహ్మణుడు తనని చూశాడంటే ఏదో‌ ఒక పేరు చెప్పి బాగా దక్షిణ వసూలు చేస్తాడు- అదే, తను గనక ఇంట్లో లేకపోతే ఊరికే నోరుమూసుకొని, భోజనం చేసి పోతాడు- అందుకని, మంగళ్దాసు మరునాడు తెల్లవారకనే భార్యకు జాగ్రత్తలు చెప్పి, ఆ బ్రాహ్మణుడికి దొరక్కుండా 'ముఖ్యమైన పని' ఏదో పెట్టుకొని, వేరే ఊరికి వెళ్ళిపోయాడు.

కానీ బ్రాహ్మణుడు రిఖీరాం చాలా తెలివైనవాడు. అతనికి మంగళ్దాసు నైజం బాగా తెలుసు. వీలైతే మంగళ్దాసు తనకు దక్షిణ కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టేయగలడు! అందుకని, తెల్లవారగానే బయలుదేరి మంగళ్దాసు ఇంటికి వెళ్ళాడు రిఖీరాం. అయినా ఆ సరికే మంగళ్దాసు వేరే ఊరికి వెళ్ళిపోయాడు! 'ఇదీ మన మంచికే' అనుకున్న రిఖీరాం మంగళ్దాసు భార్య 'పారో'తో- "తల్లీ, నేను ఒక్కడినే భోజనానికి వస్తున్నానని వంట పరిమితంగా చేస్తావేమోనని, ముందుగా హెచ్చరించి పోదామని వచ్చాను- ఈ పూజ 'సంతర్పణ'-కనుక కనీసం పది మందికి సరిపడా భోజనం తయారు చేయవలసి ఉంటుంది. లేకపోతే ప్రయోజనం సిద్ధించద్దూ?!" అన్నాడు. ఆమె ఇక ఏమీ అనలేక, సర్దుకొని, "అయ్యో! ఆ మాత్రం నాకు తెలీదా, అలాగే చేస్తానులెండి!" అని చెప్పింది.

రిఖీరాం పూజ మొదలుపెట్టి, భోజనం మొత్తాన్నీ‌దేవుడి ముందు పెట్టించి, పారోతో‌ "తల్లీ! ఒక వంద రూపాయలు దేవుని ముందు ఉంచండి" అన్నాడు. ఈ విషయాల్లో పెద్దగా అనుభవం లేని పారో, ఆయన ఎలాచెబితే అలా చేసింది. పూజ తరువాత రిఖీరాం తృప్తిగా భోజనం చేసి, దేవుని ముందున్న పూజా- ద్రవ్యాలతోబాటూ ఆ డబ్బును కూడా తీసుకొని, మిగిలిన భోజన పదార్థాలన్నిటినీ‌ మూట గట్టుకొని, ఇంటికి బయలుదేరాడు. పోయేముందు పారోకు గుర్తుచేసి తన దక్షిణ-200రూపాయలు- ఇప్పించుకున్నాడు కూడా -మరి, 'వ్రతం చెడకూడదు' కదా, అందుకని! ఆపైన అతను సంతోషంగా పాటలు పాడుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు.

ఇంటికైతే చేరుకున్నాడు గానీ, మంగళ్దాసు వెనక్కి రాగానే తన ఇంటిమీదికి దండెత్తి వస్తాడని తెలుసు రిఖీరాంకు. అందుకని, అతను తను తీసుకొచ్చిన సామాన్లనీ, డబ్బునూ భార్య చేతికిచ్చి, మంగళ్దాసు వస్తే ఏంచేయాలో చెప్పి, హాయిగా పడుకున్నాడు.

మధ్యాహ్నానికి ఇల్లు చేరుకున్నాడు మంగళ్దాసు. రాగానే భార్యను అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ ఖర్చును చూసేసరికి అతనికి గుండె ఆగినంత పనైంది. 'తను లేని సమయం చూసుకొని ఇంత మోసం చేస్తాడా' అని కోపంతో ఊగిపోయాడు. ఒక పెద్ద వెదురుకట్టెను చేత బట్టుకొని, ఆవేశంగా రిఖీరాం ఇంటికి బయలుదేరాడు.
అక్కడికి చేరుకునేసరికి, అతనికి ఏడుపులు, పెడబొబ్బలు వినబడ్డాయి. ఇంటి గడపలో కూర్చొని రిఖీరాం భార్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. "అయ్యో!‌దేవుడా! ఏం చేసేది? నా భర్త చచ్చిపోతున్నాడు నాయనో! వద్దంటున్నా వినకుండా ఆ మంగళ్దాసు ఇంటికి పోయి భోజనం చేశాడు. అందులో ఏం విషం కలిపారో, ఏమో? ఉలుకూ పలుకూ లేదు; స్పృహలో లేడు. నాయనోయ్, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాడు బాబోయ్!" అని గట్టిగా శోకాలు పెడుతున్నది ఆమె.

మంగళ్దాసుకు అంత చలికాలంలోనూ చెమటలు పోశాయి. కట్టె చేతిలోంచి జారి పడిపోయింది. ముఖం పాలిపోయింది. పెదిమలు ఎండిపోయాయి. "రిఖీరాం చచ్చిపోయాడంటే ఇక నన్ను జైల్లో పెడతారు- బహుశ: ఉరి తీస్తారేమో కూడా!" అని అతనికి చెప్పరానంత భయం వేసింది. కిటికీలోంచి లోపలికి చూస్తే మంచం మీద కదలకుండా పడి ఉన్న రిఖీరాం కనబడ్డాడు. ఆ పరిస్థితిలో రిఖీరాంని చూసే సరికి అతనికి ఇంకా బెదురు పుట్టింది. "రిఖిరాం స్పృహలో లేడు; కానీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు! అతను ఎట్టి పరిస్థితుల్లోనూ చచ్చిపోకూడదు. లేకపోతే ఇదంతా నా తలకు చుట్టుకోక మానదు" అని మంగళ్దాసు రిఖీరాం భార్య ముందుకెళ్ళి "అతనికేమీ అవ్వదు. వెంటనే ఓ టాక్సీని పిలిపించు, నగరంలో చాలా మంచి ఆసుపత్రులున్నై, మంచి ఆసుపత్రిలో చేరిస్తే ఇట్టే కుదురుకుంటాడు" అన్నాడు.

"ఆ ఆలోచన నాకు కూడా వచ్చింది. కానీ అలా చేయాలంటే కనీసం వెయ్యి రూపాయలైనా కావాల్సి ఉంటుంది. ఇంత సీరియస్ గా ఉన్న రోగిని ఏ ఆసుపత్రి వాళ్ళూ డబ్బు లేకుండా ఉచితంగా చేర్చుకోరు" అంటూనే, రిఖీరాం భార్య "అయ్యో, దేవుడో! మమ్మల్ని బికారుల్ని చేసి పోతున్నావా, స్వామీ! నేను ఇంకెన్నాళ్ళు బ్రతకాలి, ఇలా?" అని గొంతు హెచ్చించింది.

మంగళ్దాసుకు ఇక కాళ్లూ చేతులూ ఆడలేదు. మెదడు మొద్దుబారినట్లైంది. తన పిసినారితనం ప్రక్కన పెట్టి, అతను రిఖీరాం భార్యతో " చూడమ్మా! డబ్బుకు వెనకంజ వేయాల్సిన సమయం కాదిది. త్వరగా ఏదైనా చేసి నీ భర్త ప్రాణాలు కాపాడుకోవాలి. నీ కొడుకును నాతో‌పంపించావంటే, నేను ఇస్తాను- ఆ వెయ్యి రూపాయలూ! కానీ- త్వరగా పంపాలి! -వెంటనే!" అన్నాడు.

అట్లా పిసినారి మంగళ్దాసుకు మరో వెయ్యి రూపాయలు వదిలాయి!

ఒకటి రెండు రోజులయ్యేసరికి, ఈ కథ ఊరంతటికీ తెలిసిపోయింది. అందరూ మంగళ్దాసును తలచుకొని కడుపుబ్బ నవ్వుకున్నారు. బంగ పట్టణానికి వెళ్లి ఎవరైనా 'మంగళ్దాస్' అన్నారంటే చాలు- అక్కడ ఈనాటికీ నవ్వుల పువ్వులు పూస్తాయి!

శని పట్టని సేద్యం

అనగా అనగా ధర్మపురి అనే ఒక రాజ్యం ఉండేది. దాన్ని 'రాజేంద్రుడు' అనే రాజు పరిపాలించేవాడు.

ఆ రాజూ మంచివాడే, రాజ్యపు ప్రజలూ మంచివాళ్లే- కానీ ఏం లాభం? ఆ రాజ్యంలోని భూముల్లో చాలా వరకూ పనికి రాకుండా పోయాయి. తూర్పు భూములేమో చవుడువి. పడమటి భూముల్లోనేమో ఇసుక మేటలు వేసింది. దక్షిణపు భూములు సున్నారపు నేలలు. ఒక్క ఉత్తరపు భూములు మాత్రం వ్యవసాయానికి అనువుగా ఉండేవి. అందువల్ల రాజ్యంలోని ప్రజలంతా ఆ ఉత్తరపు భూముల్నే సాగు చేసేవాళ్ళు.

అసలే పరిస్థితి బాగాలేదంటే, ఆపైన రెండు సంవత్సరాలపాటు వరుసగా వానలు కురవలేదు. రాజ్యమంతటా కరువు ఏర్పడింది. రాజుగారు దిగులుతో క్రుంగిపోతున్నారు. ప్రజలు ఏంచేయాలో తెలీక పొట్టపట్టుకుని ఏ పని దొరికితే అది చేస్తున్నారు.

ఆ సమయంలో‌పొరుగు రాజ్యంనుండి ఒక కుటుంబం వలస వచ్చి, రాజు గారిని కలిసేందుకు వేచి కూర్చున్నది. మొదట భటులు వాళ్ళని లోపలికి రానివ్వలేదు గానీ, అంత:పురంలోంచే వాళ్ల దీనస్థితిని గమనించిన రాణి, వాళ్లను లోపలికి పంపమన్నది.

వాళ్లు రాజును దర్శించుకొని, "ప్రభూ! పొరుగు దేశంలో బ్రతుకు దుర్భరం అవ్వగా, అక్కడినుండి కట్టు బట్టలతో వలస వచ్చిన రైతులం మేము. మీ ధర్మ తత్పరత గురించి వినిఉన్నాం. మామీద దయ ఉంచి ఏదో కొద్దిపాటి భూమి ఇప్పించారంటే, దాన్ని సాగు చేసుకొని మా జీవితాన్ని మేం సాగించుకుంటాం" అన్నారు.

అంత దు:ఖంలోనూ రాజుగారికి నవ్వు వచ్చింది. "అయ్యో! నేనేం ఇవ్వమంటారు? మాకు అసలే వ్యవసాయానికి పనికి వచ్చే భూములు తక్కువ. అందులోనూ రెండేళ్ళుగా వానలు కురవక, పెద్ద పెద్ద రైతులే భూముల్ని బీడు పెడుతున్నారు. మీకు నేను వ్యవసాయ భూమినిచ్చే అవకాశమే లేదు" అన్నాడు వాళ్లతో.

"అలా అనకండి ప్రభూ! ఎలాంటి భూమినిచ్చినా పరవాలేదు. ఎంత చవుడు భూమైనా పరవాలేదు. మా రెక్కల కష్టంతో ఆ భూమినే వ్యవసాయానికి అనువుగా చేసుకుంటాం" అని వాళ్లు బ్రతిమిలాడారు.
"సరే, అయితే. మీకు తూర్పు వైపున ఉన్న చవుడు భూముల్లో నాలుగు ఎకరాలు ఇస్తున్నాను. అయితే ఆ భూమి వ్యవసాయానికి అస్సలు పనికిరాదు- ముందుగానే చెబుతున్నాను. ఆపైన మీ ఇష్టం" అన్నాడు రాజు, వాళ్ళకు అనుమతి పత్రం మంజూరు చేస్తూ.

వాళ్ళు ఆ మరుసటి రోజే పని మొదలు పెట్టుకున్నారు. చవుడు భూమిలోని రాళ్ళు రప్పలను ఏరివేశారు. గట్లు కట్టి, ఆ గట్లమీద చెట్లునాటి, పొలాలలోని హెచ్చు తగ్గుల్ని సమంచేసి, నేలను చదును చేశారు. కోత పడే నేలకు గట్లు కట్టి, భూసారాన్ని పరిరక్షించారు. ఎండిపోయిన చెరువులనుండి మట్టిని తీసుకొచ్చి పొలమంతటా సమంగా‌ పేర్చారు.
ఆ తరువాతి ఏడాది వానలు బాగా కురిశాయి. వాళ్ళు నాటిన చెట్లు బాగా నాటుకున్నాయి. గట్లమీద ఉన్న చెట్ల కారణంగా కావచ్చు, పొలంలో పంటకు గాలి తాకిడి తక్కువ ఉండింది. చూస్తూండగానే వారి పొలంలో ఎవ్వరికీ రానంత దిగుబడి వచ్చింది.

కొద్ది సంవత్సరాలకల్లా వాళ్ల పొలంలో నేల స్వరూపం మారిపోయింది. ఇప్పుడు అందులో చవిటి పఱ్ఱ అనేదే లేదు. ఆ నేలను చూసినవాళ్లెవ్వరూ అది ఒకప్పుడు చవిటి నేల అంటే నమ్మరు.

రాజుగారికి ఈ సంగతి తెలిసింది. ఆయన స్వయంగా వెళ్ళి, వాళ్ళు ఏం చేస్తున్నారో‌ చూశాడు. వాళ్లను ఆదర్శంగా తీసుకొని చుట్టు ప్రక్కల రైతులు ఎలా వ్యవసాయం చేస్తున్నారో చూశాక, ఆయన రాజ్యంలో ఇలా చాటించారు-
"భూమి ఊరికే పాడవ్వదు. మనమే దాన్ని పాడు చేస్తున్నాం. ఇకనుండి మీరంతా భూమిని కాపాడండి. భూసారాన్ని వృధా కానివ్వకండి. పొలాల గట్లను సరిచేసుకోండి. గట్లమీద చెట్లు నాటండి. పచ్చి ఆకుల్ని నేలమీద పరిచి, అవి నేలలో కలిసిపోయేందుకు సహకరించండి" అని. రాజ్యంలో ఉన్న రైతులందరూ ఆయన చెప్పిన ప్రకారం సేద్యం చేయటం మొదలు పెట్టారు. క్రమంగా రాజ్యంలో బీడుగా పడిఉన్న భూములన్నీ సేద్యం క్రిందికి రావటం మొదలైంది.
అది గమనించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శనిదేవుడిని పిలిచి "శనీ! ధర్మపురి రాజ్యంలో ప్రజలంతా భూమిని సంరక్షిస్తున్నారని మాకు తెలిసింది. వారి చిత్తశుద్ధిని కొంచెం పరీక్షించి రా" అని పంపారు.

శని దేవుడు రైతు మాదిరి వేషం వేసుకొని జనాల మధ్యకొచ్చి, "ఆ, ఇవన్నీ ఏం పనులు? ఏమీ ప్రయోజనం లేదు. టైం వేస్టు, శక్తి వేస్టు" అన్నాడు. కానీ కృషి ఫలితాల్ని స్వయంగా చూసిన రైతులు ఆ మాటల్ని పట్టించుకోలేదు.
చివరికి శని దేవుడు రాజుగారి దగ్గరకు పోయి- "మహారాజా! నేను శనిని. బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆజ్ఞ మేరకు మీ రాజ్య ప్రజల్ని పరీక్షించేందుకు వచ్చాను. వారిపై వారికి పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఇలాంటి రైతులు ఉండేంతవరకూ ఇక మీ రాజ్యానికి నా భయం ఉండదు" అని చెప్పి మాయమయ్యాడు.
 
తరువాత కొద్ది సంవత్సరాలకు ధర్మపురిలో‌ బీడు భూమి అన్నదే లేకుండా పోయింది. వ్యవసాయ భూమి అంతా పూర్తిగా సాగులోకి వచ్చింది.

పేను-పెసర చేను

ఒక ఊరిలో ఓ పేను ఉండేది. దానికి ఒక పెసర చేను ఉండేది. అది రోజూ పెసర చేనుకు కాపలా కాసుకుంటూ, కాలుమీద కాలు వేసుకొని తన చేనును చూసుకుంటూ, ఆనందంగా పాటలు పాడుకుంటూ ఉండేది.

ఒకనాడు రాజు వచ్చి తన సైన్యంతో‌ పెసరచేనును తొక్కించాడు. చేను నాశనం అయ్యింది. అది చూసి పేను చాలా ఏడ్చింది. రాజుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నదది.

మిగిలిన పెసరకాయల్ని కోసి, రుబ్బి, అది చాలా రుచికరమైన పెసరట్లు వేసింది. పేను ఆ పెసరట్లు తీసుకొని పోతుంటే 'ఘుమ ఘుమా' అని వాసన వస్తున్నది. ఆ వాసనకు ఓ సింహం పేను దగ్గరకు వచ్చి, "నేను నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తాను. పెసరట్లు పెట్టు" అన్నది. "సరే" అని పేను దానికి పెసరట్లు పెట్టింది.
ఆ తరువాత అవి రెండూ కలిసి పోతా ఉంటే పాము ఎదురైంది. పెసరట్ల వాసన దానికీ చాలా నచ్చిందిట. అది కూడా సింహం అడిగినట్లే అడిగింది. పేను దానికీ పెసరట్లు పెట్టింది.
అప్పుడు ఆ మూడూ కలిసి పోతాఉంటే, ఈసారి తేలు ఒకటి ఎదురైంది వాటికి. అది కూడా సాయం చేస్తానని పెసరట్లు పెట్టించుకున్నది.

అవన్నీ కలిసి పోతా ఉంటే సీతాకోకచిలుక వచ్చి వాటితో స్నేహం చేసి పెసరట్లు తినింది. అన్నీ కలిసి రాజ భవనానికి పోయాయి.

ముందర ద్వారం దగ్గర సింహం నిల్చున్నది. వెనుక ద్వారం దగ్గరికి పాము, గూట్లోకి తేలు చేరుకున్నాయి. పేను మెల్లగా రాజుగారి గడ్డంలోకి దూరి, కమ్మగా కుట్టటం మొదలెట్టింది.

హాయిగా నిద్రపోతున్న రాజుకు నిద్రాభంగం అయింది. ఎంత గోక్కున్నా దురద పోలేదు. దువ్వుకుందామని దువ్వెనకోసం గూట్లో చెయ్యి పెట్టాడు. అక్కడే కూర్చున్న తేలు చటుక్కున కుట్టింది. "అబ్బా" అని అరుస్తూ రాజు వేలిపైన గాటును చూసుకుందామని దీపం దగ్గరికి చేరుకున్నాడు. అంతలోనే సీతాకోకచిలుక రెక్కలతో దీపాన్ని ఆర్పేసింది. రాజు ముందుకు పరుగెత్తాడు- సింహం గాండ్రించింది. వెనక్కి పరుగెత్తితే పాము బుస్సుమన్నది. అప్పుడు పేను బయటికి వచ్చి నిల్చుని పకపకా నవ్వింది.

రాజు పేనుకు క్షమాపణ చెప్పుకుని, ఇక ఎప్పుడూ చిన్న ప్రాణులను హింసించనని మాట ఇచ్చాడు. సంతోషపడిన పేను, తన సైన్యంతో సహా వెనుదిరిగింది.

రాజు మూర్ఖత్వం

అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక రోజున వేటకు వెళ్లాడు. అడవిలో వెళ్తుండగా ఒక పులి అతని మీద పడి చంపాలని ప్రయత్నించింది.

అటు నుండి వస్తున్న యువకుడొకడు దాన్ని చూశాడు. అతను వెంటనే ఆ పులిపైకి దూకి, తన చురకత్తితో దాన్ని పొడిచి, చంపేసి, రాజును రక్షించాడు.

"రాజా! అడవిలో‌తిరగాలంటే మీకు కత్తిని వాడటం తెలిసి ఉండాలి. లేకపోతే ఇలాంటి క్రూరజంతువులనుండి మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. కావాలంటే నేను మీకు ఆ విద్య నేర్పగలను" అన్నాడతను రాజుతో.

కానీ రాజు దానికి ఒప్పుకోలేదు. 'ఒక సామాన్యుడినుండి ఏ విద్యనైనా నేర్చుకోవటం నాకు ఇష్టంలేదు' అన్నాడు.
ఆ మాటలకు నొచ్చుకున్న యువకుడు వెంటనే అక్కడినుండి వెళ్లిపోయాడు.

ఆ తరువాత కొన్ని రోజులకు రాజు మళ్ళీ వేటకు వెళ్ళాడు. అక్కడ ఎదురైన సింహం అతని మీద పడి చంపింది. 'చురకత్తితో యుద్ధం చేయటం ఎలాగో నేర్చుకొని ఉంటే ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు గదా, మంచి సలహాలు ఎవరు ఇచ్చినా స్వీకరించాలి' అనుకున్నాడు రాజు, చనిపోబోతూ.

స్వర్గానికి దారి!

ఒక గురువు గారికి దేశమంతటా వేలకొద్దీ శిష్యులు ఉండేవారు. ఎక్కడి కెళ్ళినా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.

ఆయన ఒక చోటి నుండి మరొక చోటికి పల్లకిలో వెళ్తుంటే, ప్రజలు బారులు తీరి నిలబడి కనక వర్షం కురిపించేవాళ్ళు. అలా ఆయన ఒక ఊరిలో నిలువక, దేశమంతా సంచరిస్తూ సంపన్నులైన శిష్యుల నుండి కానుకలు, దానాలు, స్వీకరిస్తూ ఉండేవాడు.

అయినా ఆయనకు ఎంతమంది శిష్యులు ఉండేవారంటే, ఒకసారి సందర్శించిన వారిని మళ్ళీ కలిసేందుకు ఆయనకు పన్నెండు సంవత్సరాలు పట్టేది.

ఒకసారి ఈ గురువుగారు ఒక పట్టణం దాటి వేరొక పట్టణానికి పోతుండగా మధ్య దారిలో ఒకడు గట్టిగా అరుస్తూ, దారికడ్డం నిలబడి, ఆయన్ని నిలువరించాడు. చూసేందుకు ఒట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడు గాని, అట్లా రోడ్డు మధ్యలో చేతులు చాపుకొని నిలబడి, గురువుగారు తనతో మాట్లాడేంత వరకూ పల్లకీని ముందుకు వెళ్ళనిచ్చేది లేదని మొండిపట్టు పట్టాడు.

గురువుగారికి అసహనం ఎక్కువ అయింది; కానీ వాడు తనని ఊరికే వెళ్ళనిచ్చేట్లు లేడు! అందుకని, గతిలేక, 'వాడితో ఒక నిమిషం మాట్లాడి చూద్దాం' అనుకొని, ఆయన "నీకేం కావాలి?” అని అడిగారు వాడిని, ఒకింత చికాకు పడుతూ,

వెర్రిబాగులవాడు అన్నాడు- “నేను స్వర్గానికి పోవాలి. మీరొక గొప్ప గురువుగారనీ, స్వర్గానికి వెళ్ళే దారేదో మీకు బాగా తెలుసని జనాలు చెప్పారు నాకు. ఆ మార్గం ఏదో చూపించాలి మీరు” అని.

గురువుగారు చిద్విలాసంగా నవ్వారు. “నువ్వు స్వర్గానికి ఎక్కుతావా? చాలా సులభం- అదిగో, అక్కడ నిలబడు. చేతుల్ని పైకెత్తి, స్వర్గం వైపు చాచి, నిలబడాలి - అంతే, నువ్వు స్వర్గం చేరుకుంటావు” అన్నారు.
వెర్రిబాగులవాడు సంతోషపడ్డాడు- “ఓస్ అంతేనా!“ అని. మళ్ళీవాడు తేరుకొని ఇంకొక ప్రశ్న వేసే లోగా, గురువుగారు తన పల్లకీ బోయీలను తట్టి, బయలుదేరారు. పల్లకీ ముందుకు సాగిపోయింది.
పన్నెండు సంవత్సరాల తర్వాత గానీ గురువుగారికి మళ్ళీ అటువైపుగా వచ్చేందుకు వీలు చిక్కలేదు. పల్లకీ పట్నపు పొలిమేరల్ని దాటుతుందనగా ఆయనకు మళ్ళీ ఆ మనిషి కనబడ్డాడు-

ఈసారి వాడు చేతులు ఎత్తి ఆకాశం వైపుకు చాపి, కదలకుండా నిలబడి ఉన్నాడు. వాడి జుట్టు, గడ్డం వెలిసిపోయి, అట్టలు కట్టి ఉన్నాయి. గోళ్ళు పెరిగి పోయాయి; నల్లగా వంకరలు తిరిగి ఉన్నాయి. బట్టలు చినిగి పేలికలై ఉన్నాయి. అయినా వాడికి అవేమీ పట్టనట్లు లేదు. వాడి చూపులు నిశ్చలంగా ఆకాశాన్ని చూస్తున్నై.

గురువుగారు అతని ప్రక్కగా వెళుతుండగా ఒక అద్భుతం ఆయన కంట పడింది- ఆ వెర్రిబాగుల మనిషి- నిలబడ్డవాడు నిలబడ్డట్లే పైకి లేచి, మెల్లగా ఆకాశం వైపుగా ప్రయాణం మొదలుపెట్టాడు!

గురువుగారికి ఒక్క క్షణం పాటు మతి పోయినట్లు అయింది. ఏదో, ఆ వెర్రివాడిని ఆటపట్టించేందుకు తను ఆ ఉపాయం చెప్పాడు తప్పిస్తే, వాడు పన్నెండేళ్లపాటు దీక్షగా తన సలహాను అమలు పరుస్తాడని అనుకోలేదు మరి! అంతేకాదు, తన సలహా పని చేస్తుందన్న నమ్మకం తనకే లేదు! తనకి మాత్రం స్వర్గం చూడాలని లేదూ?
మరుక్షణం ఆయన లేచి, పల్లకీలోంచి దూకి, ఆ వెర్రివాడి కాళ్ళు దొరక-పుచ్చుకున్నారు, -అలాగైనా వాడితో పాటు తాను స్వర్గాన్ని చూడొచ్చని!

స్వర్గం చూడాలంటే తనలాంటి వాళ్ళకి ఇక వేరే దారి ఏదీ లేదని ఆయనకి అర్థమయింది మరి!

రాయలవారి మామిడిపండ్లు

రాజమాత మరణశయ్య మీద పడుకొని ఉన్నది. పాపం ఆవిడకు మామిడిపండు తినాలని ఉన్నది. తన కొడుకు కృష్ణరాయలను ఆవిడ నోరు విప్పి అడిగింది కూడాను- మామిడి పండ్లు తెచ్చిపెట్టమని.

కానీ అది మామిడిపళ్లుకాసే కాలంకాదు!రాజుగారు భటుల్ని దూరప్రాంతాలకు కూడా పంపించి చూశారు- నెల-పదిహేను రోజులు వెతకగా, చివరికి ఒక్కపండు దొరికింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది-రాజమాత తన చివరి కోరిక తీరకుండానే పరమపదించింది. కోరక కోరక తన తల్లి ఓ చిన్న కోరిక కోరితే, రాజాధిరాజైన తాను ఆ కోరికను తీర్చకుండానే ఆమెను సాగ-నంపాల్సి వచ్చిందే" అని రాయలవారు క్రుంగిపోయారు. కోరికలు తీరకపోతే ఆత్మకు శాంతి ఉండదని అంతకు ముందే విని ఉన్నాడాయన. మరేంచేయాలి? తల్లి ఆత్మశాంతి కోసం తాను ఏంచేయాలో చెప్పమని రాయలవారు రాజ్యంలోని పండితబృందాన్ని కోరారు.

పండితులు ఆ సరికే లెక్క లు కట్టుకొని సిధ్దంగా ఉన్నారు: ఈ రకంగానైనా తమకు, తమ బంధు వర్గానికీ కొంత లాభం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

వాళ్లన్నారు-”మహారాజా!తమ తల్లిగారి చివరికోరిక తీరలేదు, కనుక నిజంగానే ఆవిడ ఆత్మకు శాంతి ఉండదు. కానీ మీరు గనక నూరుగురు బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు మామిడి పండును దానం చేసినట్లయితే, మీ తల్లి గారి ఆత్మకు శాంతి లభించే అవకాశం ఉన్నది" అని.

రాజుగారు తలచుకొంటే సాధ్యం కానిది ఏమున్నది? ఆయన రాజ్యంలోని కంసాలులను రావించి, వాళ్లచేత ప్రత్యేకంగా పెద్ద మామిడి పండంత సైజులో బంగారు పండ్లను చేయించారు. తల్లి ఆత్మ శాంతికోసం ఫలానా రోజున నూరుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టి, ఆపైన వాటిని దానం చేయనున్నామని రాజ్యమంతటా చాటించారు.
రామలింగడికి రాజుగారి ఈ చర్య సబబనిపించలేదు. నూరు బంగారు మామిడిపండ్లను ఎవరో కొందరు బ్రాహ్మణులకు దానం చేస్తే, తల్లిగారి ఆత్మకు శాంతి ఎందుకు లభిస్తుంది? ఈ వంకతో ప్రజాధనాన్ని సొంతం చేసుకోవాలనుకున్న బ్రాహ్మణుల్ని దండించకుండా వదలకూడదు అనుకొన్నాడు రామలింగడు.

రాజుగారి భవనానికి వెళ్లే మార్గంలోనే రామలింగడి ఇల్లు ఉన్నది. దానం కోరి వెళ్లే బ్రాహ్మణులకు కనబడేటట్లు, రామలింగడు తన ఇంటిముందు బాగా మండుతున్న బొగ్గుల కుంపటి; దానిలో ఎర్రగా కాలిన ఇనప తీగలు- పట్టుకొని నిలబడ్డాడు. “నిన్న రాత్రి రాజుగారు చెప్పారు- నా చేత వాతలు పెట్టించుకొని వచ్చిన బ్రాహ్మణులకు, ఎన్ని వాతలుంటే అన్ని బంగారు పడ్లు అధికంగా ఇస్తామని!” అని రామలింగడు చెప్తుంటే, ఆశ కొద్దీ వాళ్ళు ఎగబడి వాతలు పెట్టించుకున్నారు. కొందరైతే ఏకంగా మూడు- నాలుగు వాతలు!అయితే రాజ భవనంలో వాళ్లకు నిరాశ ఎదురు అయింది. రాయలవారు అందరికీ ఒక్కొక్క పండే ఇచ్చారు! ఓపికగా కొంతసేపు ఎదురుచూసిన బ్రాహ్మణులు చివరికి తమ తమ వాతలు చూపించి ఎక్కువ పండ్లు ఇమ్మన్నారు.

విషయం తెలుసుకున్న రాయలవారు మండిపడ్డారు- “నేను గౌరవించే బ్రాహ్మణులను ఇంతగా అవమానిచేందుకు రామలింగనికి ఏం పట్టింది?” అని. భటులు వెళ్లి తెనాలి రామలింగడిని సభకు లాక్కువచ్చారు. రాయలవారు "రామకృష్ణా! ఏంటిది?” అని అరిచారు నిప్పులు కురిపిస్తూ.

"మహాప్రభూ! మన్నించాలి. మా తల్లిగారు విపరీతమైన కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఈ మధ్యనే స్వర్గస్తురాలయ్యారు. స్థానికంగా ఉన్న వైద్యులు ఆమె బ్రతికి ఉండగానే సూచించారు- ఆమె జబ్బుకు చికిత్సగా, ఆమె కీళ్ళకు వాతలు పెట్టమని. ఆవిడా అదే కోరుకున్నది- కానీ నా మనసొప్పక, నేను ఆ పని చేయలేదు. చివరికి, తన కోరిక తీరకుండానే ఆమె కన్నుమూసింది. ప్రభువులవారు తమ తల్లి చివరి కోరికను తీర్చటం కోసం ఈ బ్రాహ్మణులకు బంగారు పండ్లు దానం చేస్తున్నారని తెలిసి, నేను కూడా మా తల్లిగారి చివరి కోరిక తీర్చాలని సంకల్పించాను. అయితే బంగారం కోసం ఎగబడ్డంత సరళంగా వాతలకోసం రాలేదు. అందుకని, దానికి ఓ చిన్న అబద్ధం జోడించానంతే- ప్రభులవారు క్షమించాలి. ఏమైనా, ఈ బ్రాహ్మణుల మహిమ వల్ల మనిద్దరి తల్లిగార్ల ఆత్మలకూ శాంతి లభించినందుకు నాకైతే చాలా తృప్తిగా ఉన్నది” అన్నాడు రామలింగడు తాపీగా.
తాత్పర్యం గ్రహించిన రాయలవారు రామలింగడిని మందలించి వదిలిపెట్టారు- ప్రజాధనాన్ని ఇలాంటి కార్యాలకు వినియోగించ కూడదని మనసులోనే నిర్ణయించుకుంటూ!

సింహం-కుందేలు

ఒక అడవిలో ఎన్నో జంతువులు కలిసి మెలిసి ఉండేవి.

వాటిలో‌ సింహానికి ఆకలి కన్నా కోపం ఎక్కువ. అది అవసరం ఉన్నా, లేకపోయినా కనబడ్డ జంతువునల్లా పట్టుకొని చంపేయటం మొదలు పెట్టింది. అలా కొన్ని రోజులు గడిచే సరికి, అడవిలో జంతువులన్నీ తగ్గిపోయాయి. అప్పుడు అవి ఒకరోజున సింహాన్ని కలిసి, "మహారాజా! మీరు ఇట్లా మమ్మల్ని లెక్కకు మించి చంపేస్తుంటే కష్టంగా ఉంది. మీరు కాస్త దయ చూపండి: ఏ జంతువునూ చంపకండి" అన్నాయి.

"మిమ్మల్నెవరినీ‌ చంపకపోతే మరి, నాకు ఆహారం ఎట్లా?" అన్నది సింహం.

"మేమే వచ్చి ఏరోజుకారోజు స్వయంగా మీకు ఆహారమౌతాం. వంతుల వారీగా రోజుకో జంతువు మీ దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా మీకు ఆహారమౌతుంది" అని మాట ఇచ్చాయి జంతువులు. "ఓహో, గతంలో‌ మా పూర్వీకునితో‌ చేసుకున్నట్లుగానే నాతోటీ ఒప్పందం చేసుకునేందుకు వచ్చాయన్నమాట, ఇవి" అనుకున్నది సింహం, పైకి "సరే" అని ఒప్పుకుంటూ.

ఆపైన అడవిలో కొంతవరకు ప్రశాంతత వచ్చింది. సింహం ఎవరినీ చంపటం లేదు. ప్రతిరోజూ ఒక జంతువు తనంతట తానే దానికి ఆహారమౌతున్నది. చివరికి ఒకనాడు ఒక కుందేలు వంతు వచ్చింది. అది సరైన సమయానికే సింహం దగ్గరకు పోయింది. "మహారాజా! మన అడవిలోకి కొత్తగా ఒక దయ్యం వచ్చింది. ఈ అడవికి తనే రాజునంటోంది. నన్ను పట్టుకోబోయింది గానీ, నేను దొరక్కుండా పరుగెత్తి వచ్చాను" అన్నది.

"ఓహో! ఇదేదోపాతకాలం కుందేలులాగా ఉన్నది. నన్ను ఇప్పుడు బావి దగ్గరకు తీసుకెళ్ళి, నా ప్రతిబింబాన్ని నాకే చూపిస్తుంది కాబోలు!" అనుకున్నది సింహం. పైకి అది "అవునా! దయ్యం వచ్చిందా, కొత్తగా?! ఏదీ, నాకు చూపించు!"అన్నది కోపం నటిస్తూ.

కుందేలు దాన్ని తీసుకుపోయింది. చెంగు చెంగున అది గంతులు వేసుకుంటూ‌పోతుంటే, దాని వెనక పరుగులు తీయలేక సింహం అలిసిపోయింది. అంతేకాక, చాలా రోజులుగా తిని కూర్చున్నదేమో, దాని ఒంట్లో క్రొవ్వు పేరుకుని, అదిప్పుడు చురుకుగా పరుగులు పెట్టలేకపోతున్నది కూడాను!

చివరికి కుందేలు ఒక బావి దగ్గరకు వచ్చి ఆగగానే దానికి ఆయాసంతో పాటు కోపం కూడా చాలానే వచ్చింది. ఆ బావికి అంచు సరిగ్గా కట్టి లేదు. వాడకం లేక, అది బాగా పాతబడిపోయి ఉన్నది. "ఓయ్! పిచ్చి కుందేలూ! నేనేమైనా పాత తరం సింహాన్ననుకుంటున్నావా, నా నీడని చూసి నేనే దయ్యం అనుకోడానికి? బావిలో కనబడేది నా ప్రతిబింబమే, ఆ సంగతి నాకు ఎప్పుడో తెలుసు. కుందేళ్లకు ఇట్లాంటి తెలివి ఉంటుందని మా అమ్మ నాకు చిన్నప్పుడే ఈ కథ చెప్పి ఉంచింది!" అన్నది సింహం పళ్ళన్నీ‌ బయటపెట్టి నవ్వుతూ.

"అయ్యో, నాకు ఆ సంగతి తెలీకనా, మహారాజా! నేను మీకు మీ ప్రతిబింబాన్నే చూపేంత సాహసం చేస్తానా? అదేమీ కాదు. నిజంగానే ఈ బావి అడుగున ఓ మూలగా నక్కి కూర్చుని ఉంటుందా దయ్యం. మీరే చూద్దురు- చూడండి- అదిగో- ఆమూలన! కనబడుతున్నదా!?" అన్నది కుందేలు బావిలోకి వంగి.

సింహం బావి అంచుకు వచ్చి, లోపలికి వంగి చూసింది. అయితే దానికి ఏమీ కనబడలేదు అక్కడ. "ఏదీ, కనబడదేం?" అన్నదది వెటకారంగా- కుందేలు తెలివిని తక్కువ అంచనా వేస్తూ. "అదిగో మహారాజా, అక్కడ- ఆ మూలన– ఇటుకల మధ్య సందు కనబడటం లేదూ, అందులో చూడండి, ఎంతలావు కోరలు పెట్టుకొని కూర్చున్నదో!" అన్నది కుందేలు, బావిలోకి చేతులు చాపి చూపిస్తూ. "ఏదీ, ఎక్కడ? నాకేమీ కనబడటం లేదేం?" అంటూ ఒక్క క్షణం పాటు ఏమారింది సింహం. అంతలో దాని వెనక్కి చేరుకున్న కుందేలు సింహం వెనక కాళ్ళు రెండూ అలవోకగా ఎత్తి దాన్ని బావిలోకి విసిరేసింది!

ఓ చిన్న కుందేలు ఇంత పని చేయగలుగుతుందని ఊహించలేదు సింహం. తీరా బావిలో పడ్డాక అది ఇంక ఏం చేస్తుంది?! జంతువులకు దుష్ట సింహం బెడద ఇంకోసారి తప్పింది!

మోసపోయిన మంత్రగత్తె!

అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక కుందేలు, ఒక పంది, ఒక కోడిపెట్ట ఉండేవి. అవ్వ తన దగ్గరున్న డబ్బునంతా వాడి, వాటిని చక్కగా పెంచి, పెద్ద చేసింది. అయితే అవి పెద్దయ్యేసరికి అవ్వ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి.

ఒక రోజున అవ్వ వాటినన్నిటినీ పిలిచి "చూడండి, నా మిత్రులారా! ఏనాడూ లేనంత లోటు ఈనాడు మనకు వచ్చి పడింది. ఇంట్లో తినేందుకు ఏమీ లేదు. అందుకని ఇక మనం అందరం కలిసి ఎంతో కొంత సంపాదించుకోవలసిందే. అడవికి వెళ్ళి మనందరం కట్టెపుల్లలు ఏరుకొద్దాం. వాటిని అమ్మితే మనందరికీ సరిపోయేన్ని డబ్బులు వస్తాయిలే!" అన్నది.

ఆరోజున అవ్వ దారి చూపెడితే అవన్నీ కలిసి అడవికి వెళ్ళాయి. దొరికినన్ని కట్టెపుల్లలు ఏరుకొచ్చి అమ్మారు అందరూ. ఆ వచ్చిన డబ్బులతో భోజనానికి కావలసిన సరుకులు కొనుక్కున్నారు.
మరుసటి రోజున అవ్వను ఇంట్లోనే ఉండమని, కుందేలు, పంది, కోడి సొంతగా అడవికి బయలుదేరాయి. అడవిలో‌ తిరుగుతూ తిరుగుతూ అవి దారి తప్పాయి. చివరికి రాత్రి చీకటిపడే సమయానికి వాటికి ఒక గుడిసె కనబడింది.
అవి మూడూ ఆ గుడిసె తలుపుతడితే, ఒక ముసలవ్వ తలుపు తీసి వాటిని లోనికి ఆహ్వానించింది. "ఓహో! మీరు అడవి చివరన ఊర్లో ఉంటారు కదూ, ముసలమ్మతోబాటూ? రండి రండి. ఈ పూటకి ఇక్కడే ఉండచ్చు. నేను మీకు భోజనం పెడతానులే, రేపు పొద్దున తెల్లవారాక ఇంటికి పోదురు గాని" అని ఆమె వాటికి భోజనం పెట్టి, పడుకునేందుకు చోటు చూపించింది.

అయితే వాటికి రాత్రి ఎంత సేపటికీ నిద్ర రాలేదు. ఏదో తెలీని భయం ఆవరించి ఉన్నది వాళ్లని. చివరికి కుందేలు అన్నది- "ఇక్కడ ఏదో సరిగ్గా లేదనిపిస్తున్నది నాకు. మనం ఇక్కడంతా కొంచెం వెతికి చూద్దామా, ఏమైనా తెలుస్తుందేమో?" అని.

అప్పుడు అవన్నీ అక్కడంతా వెతికాయి, నిశ్శబ్దంగా. ముసలమ్మ పడుకొని ఉంది. ఆమె పక్కనే టేబుల్ మీద ఓ డైరీ ఉంది- ఇవి మెల్లగా వెళ్ళి, ఆ డైరీని ఎత్తుకొచ్చి చదివాయి:

"నేను మామూలు ముసలమ్మను కాదు- మంత్రగత్తెను" అని రాసుకున్నదామె ఒకచోట.

"నా దగ్గరున్న డబ్బు, బంగారము, నగలు అన్నిటినీ తూర్పు మూలన చెట్టు క్రింద పాతి పెట్టాను" అని రాసుకున్నది ఒకచోట.
"ఈ కుందేలును, పందిని, కోడిని నేను బలి ఇచ్చేస్తాను" అని రాసుకున్నది ఇంకోచోట.

అది చదివాక కోడి చాలా భయపడి పారిపోదామన్నది. అయితే పందికి ధైర్యం ఎక్కువ. అదన్నది- "మనం వెళ్ళేముందు ఈమె దాచుకున్న బంగారం అంతా తవ్వుకు పోదాం" అని. కుందేలు ఇంకా తెలివైనది. "అది అన్నది, మనం ఈ మంత్రగత్తె దగ్గరున్న మంత్రదండాన్ని, చీపురు కట్టనీ, కత్తినీ అన్నిటినీ దాచిపెట్టేద్దాం. పారిపోవద్దు, తెల్లారాక ఆమెనుండి మర్యాదగా శలవు తీసుకొనే వెళ్దాం" అని.

"సరే" అని అవన్నీ చెట్టు మొదట్లో తవ్వి, బంగారం, నగలు అన్నీ మూటగట్టుకొని, దూరంగా ఓ పొదలో దాచిపెట్టాయి. ఆ గుంతను బాగా మూసేసి, దూరంగా వేరే ఓ గుంత తవ్వాయి. మంత్రదండాన్నీ, చీపురునూ, కత్తినీ తెచ్చి ఆ గుంతలో పెట్టి పూడ్చేశాయి. ఆపైన ఏమీ ఎరగనట్లు వచ్చి పడుకొని హాయిగా గుర్రుపెట్టాయి.

మంత్రగత్తె ఉదయాన్నే లేచేసరికి అవన్నీకూడా లేచి కూర్చుని ఆమెకు నమస్కారం పెట్టి, "అవ్వా వెళ్ళొస్తాం" అన్నాయి. మంత్రగత్తె "అయ్యో! ఇప్పుడే వెళ్తారా, కొంచెం ఆగండి, మళ్లీ భోంచేసి వెళ్దురుగాని" అంటూనే తన మంత్రదండం కోసం వెతుక్కుంటే అది దొరకలేదు. కత్తి కోసం వెతికితే అదీ దొరకలేదు!

ఆ లోపల ఇవన్నీ తొందర నటిస్తూ, "మాకేమీ ఒద్దులే అవ్వా, మా ముసలవ్వ కూడా ఎదురుచూస్తూంటుంది. వెళ్ళొస్తాం, నువ్వు మాకు ఎంత సాయంచేశావో, చాలా చాలా ధన్యవాదాలు" అని చెబుతూ హడావిడిగా బయటికి పరుగు తీశాయి.

వాటి వెంటపడి పట్టుకునేందుకు మంత్రగత్తె తన చీపురు కోసం చూసింది- కానీ అదీ దొరకలేదు ఆమెకు, పాపం!
ముగ్గురు మిత్రులూ తాము బంగారం, నగలు దాచిన మూటను ఎత్తుకొని, నవ్వుకుంటూ హాయిగా ఇల్లు చేరుకున్నాయి. దాన్నంతా అవ్వకు చూపిస్తే ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఆపైన అందరూ కలిసి హాయిగా జీవించారు.

ఆరు కాళ్ల కథ:

అనగా అనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా "కొత్త విషయాలు చెప్పండి- కొత్త విషయాలు చెప్పండి" అని వేధించేవాడాయన. ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే వాళ్ళకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను పిలిపించాడు- "మీరు కనుగొన్న క్రొత్త క్రొత్త పరికరాలను, పదార్థాలను, ప్రయోగాలను వివరించండి" అన్నాడు.

అందరూ ఎవరికి వారు తాము కనుగొన్న విషయాలను చూపి, వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి- కానీ వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు.
శాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక, రాజుగారు ఆలోచనలో పడ్డారు: "ఇవన్నీ కొత్త సంగతులు- సరే- కానీ, మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు?" అని.


అప్పుడు మంత్రి "ప్రభూ! నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు. ప్రజల మధ్యనే జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమౌతుంటాయి. మీరు కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను" అన్నాడు రాజుతో.

రాజుగారు సంతోషంగా 'సరే'అనగానే, మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు.

శాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి ఆరు కాళ్ళు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి, శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేసాడు. ఈగ కొంచెం సేపు బాధపడి, ఆపైన మళ్ళీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్ళు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది.

రాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త -"ప్రభూ! ఈ ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈ ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమ శక్తి, భూమి, గిట్టుబాటు ధర- ఈ ఆరూ రైతుకు ఆరు కాళ్ల లాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేక చతికిలబడి-పోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటంకోసం ఇలా చేయవలసి వచ్చింది- క్షమించాలి" అన్నాడు.

తన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు.

సన్మానాల పిచ్చి:

అనగా అనగా ఒక తలారి ఉండేవాడు. తలారి అంటే తెలుసుకదా, కసాయివాడు అన్నమాట. జంతువుల్ని కోసి, మాంసం అమ్ముకుని జీవించేవాడు. అతని ఇంట్లో ఒక మేక ఉండేది. ఒకసారి అది పిల్లల్ని ఈనే సమయం దగ్గరపడింది. అతని భార్య రోజూ మేకల్ని తోలుకొని అడవికి పోయేది. తలారివాడు భార్యను పిలిచి- "చూడు, దీనికి ఆడమేక పుడితే వెనక్కి తీసుకురా. అలాకాక పోతు పుడితే అక్కడే వదిలేసి రా!" అని చెప్పాడు.

ఆ రోజునే మేక పోతును ఈనింది. తలారివాడి భార్య ఆ పిల్లను అక్కడే వదిలేసి మిగిలిన మందతో ఇంటికి వెళ్ళిపోయింది. అయితే తల్లిపాలకు నోచుకోని ఆ మేకపోతు అదృష్టం బాగుందేమో, అది బ్రతికింది- ఊరికే బ్రతకటమే కాదు- అడవిలో దొరికే ఆకులూ అలములూ, గడ్డీ గాదం మేసి మేసి బాగా లావుగా, బలంగా తయారైంది. బలంతోబాటు దానికి విపరీతమైన గర్వమూ, ధైర్యమూ వచ్చినై.

అయితే దానికి కాలం మూడే సమయానికి, అది తనకు కనబడిన ఒక గుహలో దూరి నిద్రపోతున్నది. ఆ గుహ ఒక నక్కది. ఆహారంకోసం బయటికి వెళ్ళిన నక్క వెనక్కి తిరిగి వచ్చి, తన గుహలోకి ఎవరో దూరారని గుర్తించింది. గుహచుట్టూ ఒకటి రెండుసార్లు తిరిగినా దానికి తన గుహలో దూరిందెవరో అర్థం కాలేదు. అందుకని అది పెద్ద గొంతుకతో "ఎవరది, గుహలో ఉన్నది?" అని అరిచింది.

"ఎవరని అడుగుతావా, నేనురా, గువ్వ చెవ్వులవాడిని, బాడిశె గడ్డపు వాడిని, బార్సి బార్సి పొడుస్తానురోయ్! జాగ్రత్త!!" అని లోపలినుండే అరిచింది మేక.

"ఓహో! ఇది మేక! నా ఆహారం నా యింట్లోకి నడిచి వచ్చింది, ఈ రోజు నాకు పండగే!" అనుకున్న నక్క అమాంతం లోపలికి దూకి, మేకను పట్టుకొని చంపేసింది.

అయితే అది ఎంత తిన్నా, మేక మాంసం అయిపోలేదు. ఆయాసం వచ్చిన నక్కకు అప్పుడుగాని స్నేహితులు గుర్తుకు రాలేదు. "ఓయ్, రండి రండి! నేను మీకోసం మంచి మేకను చంపి పెట్టాను. రండి! వచ్చి తినండి!" అని అది ఊళ పెట్టగానే, దగ్గర్లో ఉన్న నక్కలన్నీ పరుగున వచ్చి, మేకను చూసి సంతోషంగా కేకలు పెట్టాయి.
"తినండి తినండి! మీకు ఇంత మంచి ఆహారం సంపాదించిపెట్టినందుకు నాకు మీరంతా కలిసి సన్మానం చేయండి" అన్నది నక్క గర్వంగా.

నక్కలన్నీ‌మేకను కడుపారా మెక్కి, ఒక తడకను ఎత్తుకొచ్చి, దానికి రెండువైపులా తాళ్ళు కట్టి, దానిమీద నక్కను కూర్చోబెట్టుకొని , దాని కాళ్ళకు, చేతులకు తాళ్లతో ముడులు వేసి, తడకను భుజాలమీద ఎత్తుకొని అరుచుకుంటూ ఊరేగించటం మొదలుపెట్టాయి.నక్కల గొడవకు చుట్టూ ఉన్న జంతువులన్నీ చెవులు మూసుకున్నై గానీ, సన్మానపు మత్తులో ఉన్న నక్కకు అదేదీ పట్టలేదు. నక్కల ఊరేగింపు సింహం గుహ దగ్గరకు చేరుకునే సరికి, అప్పటికే ఆకలితో చికాకుగా ఉన్న సింహం దిక్కులు పిక్కటిల్లేట్లు గర్జించింది. మరుక్షణం నక్క మిత్రులన్నీ తడకను క్రిందపడేసి తలో దిక్కుకూ పరుగులెత్తాయి. తడకకు కట్టబడి ఉన్న నక్క ఎటూ పారిపోలేక ఏడవసాగింది. దిక్కులు తెలీనట్లు పరుగెత్తుతున్న మిత్రుల కాళ్లక్రింద పడి దానికి నడుం విరిగినంత పనైంది.

చివరికి సింహం దయతలచి దాన్ని వదిలింది గానీ, లేకపోతే నక్క ప్రాణాలు ఆనాడే గాలిలో కలిసి పోయేవి!
చావు తప్పి కన్ను లొట్టబోయిన నక్కకు ఆ రోజుతో సన్మానాల పిచ్చి వదిలింది.

పాము బుద్ధి:

సోంపల్లెలో ఒక మంచి రైతు రంగయ్య ఉండేవాడు. రంగయ్య మనసు మంచిది. ఊళ్ళో వాళ్ళకు ఏ కష్టం వచ్చినా వచ్చి రంగయ్యతో చెప్పుకునేవాళ్ళు. రంగయ్య వాళ్లకు తన చేతనైన సాయం చేస్తుండేవాడు.

ఒకసారి రంగయ్య పొలం దున్నుతుంటే ఒక పాము కనబడ్డది. మామూలు రైతులైతే పాము కనబడగానే దాన్ని చంపేస్తారు- అది విషపు పురుగా, కాదా అని కూడా చూడరు. కానీ రంగయ్య ఒక క్షణం ఆగి 'అది ఏ పాము' అని చూశాడు. చూడగా అది విషపు పాము! రంగయ్య దాన్ని చంపేద్దామనుకుంటుండగా అది అన్నది- "రంగయ్యా! నేను పుట్టిందే నీ పొలంలో. ఇన్నాళ్ళూ నీ‌పొలం లోని ఎలుకల్ని తిని నీ పంటను కాపాడాను. ఇప్పుడు నేను ఇల్లు-వాకిలీ కోల్పోయి, చలికి వణుకుతూ దీనదశలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చంపుతావా? దయచూడు!" అని.
రంగయ్యకు దానిమీద జాలి కలిగింది. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి పొయ్యి దగ్గర, వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచి కాపాడాడు. దానికంటూ ఒక బుట్టను ఏర్పరచి, దాన్ని జాగ్రత్తగా సాకటం మొదలుపెట్టాడు. తను పొలానికి వెళ్ళేటప్పుడు రోజూ దాన్ని పొలానికి తీసుకెళ్ళేవాడు.

ఒకసారి ఆ పాము బుట్టలోంచి బయటికి వస్తుండగా చూసిన గ్రద్ద ఒకటి రివ్వున వాలి దాన్ని పట్టుకోబోయింది. దగ్గర్లోనే విత్తనాలు వేస్తున్న రంగయ్య తన చేతుల్లోని కొడవలిని గ్రద్దపైకి విసరకపోతే పాము పని ఆఖరయ్యేది. ఒక సారి పిల్లి ఒకటి దాన్ని పట్టుకోబోయింది. మళ్ళీ రంగయ్యే, సమయానికి పిల్లిని తరిమి, పామును రక్షించాడు. అలా చాలాసార్లు రంగయ్య దాన్ని శత్రువుల బారినుండి కాపాడాడు.

ఒక రోజున పాముకు తినేందుకు ఏవీ దొరకలేదు. ఆకలిగొని ఉన్న పాముకు గతం గుర్తొచ్చింది. రంగయ్య తనను చంపబోవటం గుర్తుకు వచ్చింది దానికి. రంగయ్య దయాగుణాన్ని మరచిన పాము, క్రోధంతో ఉడికిపోయింది. మెల్లగా రంగయ్య వెనక చేరి, కాటు వేసేందుకు పడగనెత్తింది.

గిరుక్కున వెనక్కి తిరిగిన రంగయ్య, గబుక్కున దాని తలను దొరకబుచ్చుకున్నాడు. వదిలెయ్యమని ప్రాధేయపడుతున్న పాము మాట వినకుండా ఓ కట్టెపుల్లతో దాని నోటిని తెరచి పట్టుకొన్నాడు. దాని కోరలు రెండింటినీ- ఆ కోరల వెనక ఉన్న విషపు తిత్తులతో సహా- పీకేశాడు. ఇకమీద అది ఎవరికీ హాని చెయ్యలేదు! ఆపైన దాన్ని పొలంలోనే వదిలిపెట్టేశాడు.

'చూడు, ఏం చేసినా పాము బుద్ధిమారలేదు' అనుకున్నాడు రంగయ్య, మనసులో.
'చూడు, మనిషి తన బుద్ధిని పోనిచ్చుకోలేదు' అనుకున్నది పాము, జరజరా దూరంగా పోతూ.

అధ్యయనం

పవిత్రమైన న్యాయం ఒకటుందని నమ్ముతారు యూదు మతస్తులు. వాళ్ళ గురువులను 'రబ్బీలు' అంటారు. వాళ్ళు ఆ ధర్మాన్ని అధ్యయనం చేస్తుంటారు.

ఒకసారి రోమన్ దేశీయుడొకడు వచ్చాడు- యూదుల గురువు 'గింజో' దగ్గరికి: "మీ యూదులంతా ఏదో న్యాయం గురించి చదువుతారట గదా, ఏంటది?" అని అడిగాడు.

"దాన్ని వివరించటం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా విను- శ్రద్ధగా, మనసు పెట్టి వినాలి మరి. ఇద్దరు మనుషులు ఒక ఇంటి పై కప్పు మీదికి ఎక్కి, అక్కడున్న పొగ గొట్టంలోంచి క్రిందికి జారారు. ఒకడి ముఖం మసిబారింది. రెండోవాడి ముఖానికి మసి లేదు. మరి నువ్వు చెప్పు- ఎవరు ముఖం కడుక్కున్నారు?" అన్నాడు గింజో.

"చెప్పేందుకు ఏమున్నది? శుభ్రంగా ఉన్నవాడు ముఖం కడుక్కున్నట్టు, అంతే గదా?" అన్నాడు రోమన్.
"లేదు. నువ్వు చెప్పింది తప్పు. శుభ్రంగా ఉన్నవాడు ముఖం ఎందుకు కడుక్కోవాలి? ఇద్దరూ పొగ గొట్టంలోంచి జారి వచ్చారు. వచ్చాక , ఒకడు తన స్నేహితుడి ముఖం కేసి చూశాడు: అది మసిబారి ఉన్నది. దాన్ని చూసేసరికి, వాడికి 'తన ముఖానికీ మసి ఉన్నదేమో, అనిపించింది..." "ఒహో ! అహ్హా! మీరు ధర్మశాస్త్రం ఎందుకు చదువుతారో అర్థమైంది. మీకు మంచి 'తార్కిక శక్తి' లభించాలని ! అవునా ?" అన్నాడు రోమను, ఉత్సాహంగా.

"లేదు, నీకు సరిగ్గా అర్ధం కాలేదు, వెర్రివాడిలా మాట్లాడకు . మళ్ళీ చెబుతాను, జాగ్రత్తగావిను- "ఇద్దరు వ్యక్తులు పొగగొట్టంలోంచి కిందకు జారారు. ఒకడి ముఖానికి మసి అంటి ఉన్నది. రెండో వాడి ముఖానికి లేదు. ఎవరు ముఖం కడుక్కుంటారు ?" అడిగాడు రబ్బీ గింజో.

"మీరన్నట్లు, ముఖానికి మసి అంటని వాడు ముఖం కడుక్కున్నాడు. తన స్నేహితుడి ముఖానికి మసి అంటి ఉండడం చూశాడు అతను. తన ముఖం కూడా మసిబారి ఉందనుకున్నాడు. అందుకని వెళ్ళి ముఖం కడుక్కున్నాడు- సరిగ్గా ఉంది, ఇది."

గింజో అన్నాడు- " లేదు, పిచ్చివాడా! అలాకాదు. గదిలో ఒక అద్దం ఉంది. ముఖం కడుక్కున్నవాడు ఆ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు" అని.

"ఓహో! మీ ధర్మశాస్త్ర అధ్యయనం అదన్నమాట ! వేరే విధంగా చెప్పాలంటే, 'తార్కికత'ను మీరు సమర్థిస్తారన్నమాట!" అన్నాడు రోమను.

"అయ్యో, వెర్రాయనా, నీకు ఇంకా అర్థం కాలేదు. ఇద్దరు మనుషులు ఇంటి పైకప్పును ఎక్కి, పొగ గొట్టంలోంచి క్రిందకు జారారు. ఒకడి ముఖానికి మసి అంటింది; ఇంకొకడి ముఖానికి అస్సలు ఏమీ అంటలేదు- కానీ ఇది అసాధ్యం! అట్లా ఎట్లా కుదురుతుంది? పో, ఇలాంటి పిచ్చి ఊహలతో సమయం వృధాచేయకు" అన్నాడు గింజో.
"ఓహో! అదేనన్న మాట, ధర్మం అదేనా? చాలా స్పష్టం- కనీస మాత్రంగా ఉండాల్సిన జ్ఞానం, ఇది- 'కళ్ళముందు కనబడే దాన్ని చూడాలి '-అని". అన్నాడు రోమను కొంచెం సిగ్గు పడుతూ. "అయ్యో, వెర్రివాడా, ఒకడి ముఖానికి మసి అంటి, రెండోవాడి ముఖానికి ఏమీ అంటకపోవటం అసాధ్యమెందుకు అవుతుంది? సుసాధ్యమే. చూడు, ముందుగా ఒకడు పొగగొట్టంలోంచి క్రిందికి జారుతున్నప్పుడు, దానిలోని మసి మొత్తం అతనికి అంటింది. అందుకని, వాడి తర్వాత జారిన రెండోవాడి ముఖానికి మసి అంటలేదు" అన్నాడు గింజో.

"ఇది అద్భుతంగా ఉంది. నాకు అర్థమైంది, రబ్బీ గింజో. ధర్మం అంటే 'మౌలికమైన వాస్తవాలను చేరుకోవటం' కదూ?"

"లేదు, లేదు. పిచ్చివాడిలా మాట్లాడకు- అట్లా అవ్వదు. ఎందుకంటే, పొగగొట్టంలో ఉన్న మసి మొత్తాన్నీ ఒక్కసారిగా ఎవరు ఊడ్చవేయగలరు? అది అసాధ్యం" అన్నాడు గింజో.
"మరయితే మీరు ఎడతెరపి లేకుండా చదివే ధర్మం ఏంటి? దయచేసి చెప్పండి నాకు" అన్నాడు రోమను, ప్రాధేయపడుతున్నట్లు.

"'మనం చూసే అతి చిన్న విషయాల వెనుక ఉన్న వాస్తవాల్ని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోలేము' అని తెలుసుకోవటమే ధర్మాన్ని అధ్యయనం చేయటం అంటే. 'మనం అన్నింటినీ తెలుసుకోలేము' అని తెలుసుకోవటమే ధర్మాధ్యయనం. మనం ఆ భగవంతుని ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకునేందుకు మనకు చేతనైన ప్రయత్నం చేయవచ్చు, కానీ సర్వమూ తెలిసినవాడూ, తెలుసుకోగల వాడూ ఆ భగవంతుడొక్కడే: చూడు, నిజంగానే, ఇద్దరు మనుషులు ఇంటి పై కప్పు మీదికి ఎక్కి, పొగ గొట్టంలోంచి క్రిందికి జారారు. మొదటివాడు పూర్తిగా స్వచ్ఛంగా బయటపడ్డాడు. రెండోవాడి ముఖానికే, మసి అంటింది. ముఖం ఎవ్వరూ కడుక్కోలేదు- ఎందుకంటే, చెప్పనా?- నువ్వు నన్ను అడగటం మరిచావు- ఆగదిలో ముఖం కడుక్కు-నేందుకు నీళ్లు లేవు!" చెప్పాడు గింజో తాపీగా.

చదువు-సంస్కారం:

రామయ్య నడిపించే బడిలో చాలామంది పిల్లలు చదువుకొనేవాళ్ళు. కొందరు చక్కగా చదివేవాళ్ళు; అయితే మరికొందరు చదువుల్లో బాగా వెనకబడి ఉండేవాళ్ళు. రామయ్య తనవంతుగా అందరినీ సమానంగా చూసేవాడు. సరిగా చదవని పిల్లలకు ఎలాగైనా విద్యను అందించాలని ప్రయత్నించేవాడు.

రామయ్య బడిలో చదివే సిద్ధయ్య అలా బాగా వెనకబడిన పిల్లవాడు. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు సరిగా అబ్బలేదు. అదే తరగతి పిల్లవాడు గణేశ భట్టు వాడిని పదే పదే ఎగతాళి చేసి ఆటపట్టిస్తుండేవాడు. దాంతో మనసు విరిగిపోయిన సిద్ధయ్య, ఒకసారి బడిలోంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి వచ్చిన రామయ్య అతన్ని ఆపి, కారణం అడిగాడు. "నేను చదువుకోను సార్!" అన్నాడు తప్పిస్తే, సిద్ధయ్య భట్టుపై ఎలాంటి ఫిర్యాదూ చెయ్యలేదు.

ఇక చేసేదేమీ లేక, సిద్ధయ్య తండ్రిని పిలిపించి అతనికి సిద్ధయ్యను అప్పగించాడు రామయ్య. వెళ్ళేముందు తనకు నమస్కరించిన సిద్ధయ్యతో "నీకు చదువు రాలేదని బాధ పడకు. చదువు రాకున్నా పరవాలేదు-చదివే వాళ్ళను గౌరవించు. నీ‌ మంచితనపు వన్నె తగ్గకుండా జాగ్రత్తగా కాపాడుకో" అని చెప్పాడు.

ఇంటికి వెళ్ళిన తర్వాత, సిద్ధయ్య తండ్రి పొలంలోనే సేద్యం చేయసాగాడు. రానురాను అతనికి సేద్యంలో‌ మెళకువలన్నీ బాగా అర్థమయ్యాయి. పంటల్ని మార్చి మార్చి వేసుకోవటం, నీటిని పొదుపుగా వాడటం, నేల పై పొరల్లోని సారాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవటం లాంటివి అతనికి చాలా నచ్చిన అంశాలు. అతను వాటినన్నిటినీ తన పొలంలో అమలుపరచి, బంగారం‌ పండించాడు. తన ఇంటికి అవసరమైన పంటలు అన్నింటినీ అతను స్వయంగా పండించుకొని, ఊళ్ళో వాళ్లందరిచేతా 'శభాష్' అనిపించుకున్నాడు. చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయపరంగా ఎలాంటి సందేహాలు వచ్చినా వాళ్లు సిద్ధయ్యను సంప్రతించేవాళ్ళు.

ఆ సమయంలో సిద్ధయ్య ఉండే ఊరికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన గుళ్ళో‌ ప్రవచనాలు ఇస్తున్నాడనీ, చక్కగా మాట్లాడతాడనీ విని, సిద్ధయ్య వెళ్ళి, ఆయన చెప్పే మంచి సంగతులన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత ఆయనకు పట్టువస్త్రాలు, పండ్లు ఇంకా ఏవేవో ఇద్దామనుకొని దగ్గరకు వెళ్ళేసరికి, ఆయన వేరెవరో కాదు- చిన్ననాడు బడిలో‌తనని ఆట పట్టించిన గణేశభట్టు! సిద్ధయ్య అతని పాండిత్యాన్ని మెచ్చుకుని, చక్కగా మాట్లాడి, అతనికి సన్మానం చేసి నమస్కరించేసరికి, భట్టుకు ఆశ్చర్యం వేసింది. ఊళ్ళోవాళ్ళు సిద్ధయ్యను ఎంత గౌరవిస్తున్నారో చూసిన భట్టుకు తన చిన్ననాటి ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గు వేసింది.

"నాకే చదువు వచ్చనే గర్వంతో నేను నిన్ను బడిలో చాలా అవమానించాను. నీ సంస్కారాన్నీ‌ , నీలో ఉన్న మంచితనాన్నీ గమనించని నన్ను క్షమించు సిద్ధయ్యా!" అన్నాడు అతను నీళ్ళు నిండిన కళ్ళతో.
"అలా అనకు మిత్రమా, పాండిత్యం‌ పాండిత్యమే. నీ అంతటివాడు నా మిత్రుడని చెప్పుకోవటం నాకు గర్వకారణం, కాదూ?" అన్నాడు సిద్ధయ్య, అణకువతో.
మంచితనాన్ని మించిన చదువు లేదు.

పనిముట్లు

సుబ్రమణ్యం వాళ్ళ ఇంట్లో గ్యాసు అయిపోయింది. ఇంకా పదిహేను రోజుల వరకూ రాదు. వంటకు కష్టంగా ఉంది. సుబ్రమణ్యం భార్య కమలమ్మ పల్లె మనిషి. కట్టెలపొయ్యిమీద వంట చేయటం వచ్చు ఆమెకు. అయితే ఇంట్లో కట్టెలు లేవు. అందుకని ఆమె బాగా పోరి, సుబ్రమణ్యం చేతిలో పాత గొడ్డలినికదాన్ని పెట్టి, అడవికి పంపింది- ఒక మోపెడు కట్టెలు కొట్టుకు రమ్మని.

సుబ్రమణ్యం పట్టణం మనిషి- 'పసుపు కొమ్ములెందుకు, ఒక ప్యాకెట్టు పసుపుపొడి కొనుక్కుంటే పోలేదూ?' అనుకునే రకం. అతను కట్టెలు కొడుతున్నవాళ్ళను చాలామందిని చూసి ఉన్నాడు- కానీ ఎన్నడూ స్వయంగా కట్టెలు కొట్టినవాడు కాదు. అయినా 'ఇదేమంత బ్రహ్మ విద్య?' అనుకున్నాడు. 'అంతమంది అలవోకగా కట్టెలు మోపులు మోపులు కొట్టుకొని తెచ్చుకుంటుంటే, నేను మాత్రం ఎందుకు తేలేను?' అనుకున్నాడు. "మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను చూస్తుండు" అని బీరాలు పలికి, అడవికి బయలుదేరాడు.

అడవిలో‌చక్కని ఎండుచెట్టును ఒకదాన్ని చూసుకొని, చొక్కావిప్పి, దాన్నీ, తను తెచ్చుకున్న అన్నాన్నీ ఓ చెట్టుకొమ్మకు తగిలించి, వాటంగా పెట్టి చెట్టును కొట్టటం మొదలుపెట్టాడు. కొట్టగా -కొట్టగా, చెట్టుకు గాట్లు అయితే చాలా పడ్డాయి గాని, అది ఇప్పట్లో తెగుతుందని మాత్రం‌అనిపించలేదు.

"కట్టెలు కొట్టటంలో ఏదో కిటుకు ఉంటుంది. కొంచెం సేపు కొడితే నాకు పని అలవాటైపోతుంది" అనుకున్నాడు సుబ్రమణ్యం.

అంతలో‌అటువైపుగా‌పోతున్న రంగయ్య , సుబ్రమణ్యం పాట్లు చూసి దగ్గరకు వచ్చాడు. అతను రాగానే పనిని ఆపాడు సుబ్రమణ్యం- 'తనకు పని రాదని ఎవ్వరికీ తెలియకూడదు, మరి! "పని ఎప్పటికవుతుంది,ఇలాగ? గొడ్డలి.." అని ఇంకా ఏదో చెప్పబోయాడు రంగయ్య. "పోయి నీ పని చూసుకో" అని అతన్ని వెంటనే పంపించేశాడు తప్పితే, అతను ఏమంటున్నదీ విననేలేదు సుబ్రమణ్యం.

రంగయ్య వెళ్ళిపోయాక, సుబ్రమణ్యం‌మళ్ళీ యుద్ధం మొదలు పెట్టాడు, చెట్టుతో. రకరకాలుగా గొడ్డలిని తిప్పుతూ చెట్టును కొట్టాడు. చెమటలు క్రక్కాడు.

మధ్యాహ్నం పనిని ఆపి అన్నం తిన్నాడు. ఆపైన మళ్ళీ‌కట్టెలు కొట్టాడు. బాగా అలిసిపోయాడు- కానీ ఒక పదికట్టెలు మాత్రం తయారైనై, అప్పటికి.

వేరే ఊరికి పోయిన రంగయ్య, సాయంత్రం వెనక్కి వస్తూ రంగయ్యను పలకరించాడు మళ్ళీ. "ఉదయం నుండి సాయంకాలం వరకూ కొట్టింది ఈ కాసిని కట్టెలేనా?" అన్నాడు.

"మరి? ఎంత గట్టి కట్టె అనుకున్నావు?" అన్నాడు సుబ్రమణ్యం "నేను ఈ గొడ్డలితో‌ వెయ్యి వేట్లు వేసినా కట్టె విరగలేదు- అంత గట్టి కట్టె!" అన్నాడు.

"నీ గొడ్డలి బాగా మొద్దు బారి పోయింది. దాంతో కట్టెలు కొట్టేందుకు అవుతుందా? కొంచెం పదును పెట్టుకొని ఉంటేనేమి?" అడిగాడు రంగయ్య.

"నువ్వే చూశావు గదా? ప్రొద్దుటి నుండీ నేను ఒక్క క్షణంకూడా వృధా చెయ్యకుండా కట్టెలు కొడుతూనే ఉన్నాను. గొడ్డలికి పదును పెట్టుకునేంత తీరిక ఎక్కడిది?" అన్నాడు సుబ్రమణ్యం, ఆ పది కట్టెల్నే మోపు కట్టుకుంటూ.
గొడ్డలికి పదును పెట్టుకునేందుకు ఒక ఐదు నిముషాలు వెచ్చించి ఉంటే, బహుశ: సుబ్రమణ్యం‌పని వందరెట్లు తేలికయ్యేది. వందింతలు ఎక్కువ పని జరిగేది.

మనం చదువుకునేందుకు అవసరమైన ప్రధాన పనిముట్లు- పుస్తకాలూ, పెన్నులూ, పెన్సిళ్లూ. ఉన్న డబ్బులన్నింటినీ పై పై మెరుగులపైన వెచ్చించి, "పుస్తకాలు ఇప్పుడు వద్దులే, డబ్బులు లేవు. సంవత్సరం చివర్లో ఏవైనా గైడ్లు, ప్రశ్నలు-జవాబులు చదువుకుంటే చాలులే" అనుకోకూడదు. ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడు చేస్తేనే అందం. పనిముట్లకు ముందుగానే పదును పెట్టుకోవాలి- ఏమంటారు?

గయ్యాళి అత్త

అనగా అనగా ఒక ఊళ్ళో సుబ్బమ్మ అనే ఒక గయ్యాళి అత్త ఉండేది. ప్రతి క్షణమూ ఆమె, ఆమె కొడుకు సూరి కలిసి కోడల్ని రాచి రంపాన పెడుతుండేవాళ్లు. ఆ కోడలు సీత, పాపం- ఇంటి పనంతా చేసేది; పశువుల పాకను శుభ్రం చేసేది; బావి నుండి నీళ్ళు మోసుకొచ్చేది; బట్టలు ఉతికేది. ఆ సరికి సాయంత్రం అయ్యేది. ఆలోగా సుబ్బమ్మ, సూరి ఇద్దరూ సొంతంగా వండుకొని తిని, అతుకూ బొతుకూ ఆమెకు పెట్టే వాళ్ళు. సీత తిరిగి పల్లెత్తు మాట మాట్లాడిందంటే చాలు, చీపురు దెబ్బల వర్షం కురిసేది- ఆమె మీద.

అలాంటప్పుడు సీత ఏడిస్తే సుబ్బమ్మ అమెమీద మరింతగా విరుచుకు పడేది- "నీ ఏడుపుతో మా ఇంటికి దరిద్రం తెద్దామను-కుంటున్నావా?" అని. ఆ సమయంలో సూరి గుడ్లు మిటకరించుకొని చూస్తూ ఉండేవాడు తప్పితే, తల్లిని ఏమాత్రం కాదనేవాడు కాదు.

ప్రతి సంవత్సరమూ వాళ్ల ఇంటి పెరడులో ఒక పొట్లకాయ చెట్టు పెరిగేది. పొడవాటి పొట్ల కాయలు అందంగా వ్రేలాడుతూ ఉండేవి, దానినుండి. ఆ పొట్ల కాయల్ని చూస్తే అందరికీ నోట్లో నీళ్ళు ఊరేవి. ఆ సమయం వచ్చిందంటే చాలు- పెద్ద బాన నిండుగా మధురమైన 'పొట్లకాయ తలోదా' వండేది సుబ్బమ్మ. తనూ, తన కొడుకూ తినగల్గినంత తిన్నాక, మిగిలిన కొన్ని ముక్కల్ని మాత్రం కోడలికి ఇచ్చేది. ఆ ముక్కలు సీతకు ఒక్క పంటి కిందికి కూడా వచ్చేవి కావు.

'తనకు ఇష్టమైన తలోదాను కడుపునిండా తినగలిగే రోజు ఎప్పటికి వస్తుందా,' అని సీత ఎదురు చూడని రోజే లేదు.
అలాంటి సమయంలో, ఓ సారి, బయట చెత్త పారేసేందుకు పోయిన కోడలు గాభరాగా పరుగెత్తుకొని లోపలికి కొచ్చింది- పెద్దగా అరుచుకుంటూ:

"ఏమొచ్చింది, అలా రాక్షసి మాదిరి అరుస్తున్నావు? నీకేమైనా పిచ్చిగానీ పట్టలేదు గద!" అన్నది సుబ్బమ్మ చికాకుగా.

"ఇప్పుడే నాకు రోడ్లో పెద్ద మామయ్య ఎదురయ్యాడు - పెద్దత్తకు అరోగ్యం అస్సలు బాగా లేదట! నిన్ను తక్షణం చూడాలంటున్న-దట. నీకోసమే తన ప్రాణాలు నిల్చి ఉన్నాయని చెప్పమన్నదట" అన్నది కోడలు కంగారుగా.
"అయ్యో! మా అక్క! చచ్చిపోతున్నదా! అక్కా, ఓయక్కా! ఇంత కష్టం ఎందుకు వచ్చింది, నీకు?" అని గుండెలు బాదుకుంటూ లేచి బయలు దేరింది సుబ్బమ్మ.

అయితే ఆ సమయానికి తలోదా ఉంది, పొయ్యిమీద. "ఇదిగో పొయ్యి మీద పొట్లకాయ తలోదా ఉంది - దాన్ని జాగ్రత్తగా కలిపి, సరైన సమయంలో క్రిందికి దించు. ఇంటిని బాగా చూసుకో. నేను మా అక్కను చూసేందుకు పోతున్నాను" అని అరుచుకుంటూ, బిగ్గరగా ఏడుస్తూ ఇల్లు దాటిందామె. కోడలి ఉత్సాహం అవధులు దాటింది. ఇన్నాళ్ళకు చిక్కిన అవకాశాన్ని అమె జార విడుచుకో దలచలేదు. మరుక్షణమే ఆమె ఇంకొన్ని పొట్లకాయలు కోసింది- మరింత తలోదా చేసుకున్నది. దానితో బాటూ ఇంకా చాలా రకాల వంటలు చేసింది; భర్త సూరికి గొప్పగా విందు చేసింది. సూరికి ఇదేమీ అర్థం కాలేదు గానీ, ఏమీ అనలేక ఊరుకున్నాడు.

ఆతర్వాత, తలోదాని మొత్తాన్నీ‌ ఒక పెద్ద బానలోకి పోసుకొని, చెరువునుండి నీళ్ళు తెచ్చేందుకు పోతున్నట్లు ఆ బానను నడుం మీద పెట్టుకొని, ఊళ్ళోకి పోయింది సీత.

అలా పోయిన కోడలు పిల్ల, నేరుగా ఊరి చివరన ఉన్న కాళికాదేవి గుడికి పోయింది. గర్భ గుడిలోకి దూరి, తలుపు వేసేసుకున్నది. ఆపైన ఆమె ఒక్కతే కాళీమాత విగ్రహం ముందు బైఠాయించి కూర్చొని, బానెడు తలాదానూ ఏక బిగిన- లాగించి తినేసింది!

ఆ సమయంలో గర్భగుడిలో వేరే ఎవ్వరూ లేరు గాని , కాళీమాత అయితే ఉన్నది గదా! "ఈ పిల్ల ఒక్కతే బానెడు తలాదాను ఎలా తిన్నది?" అని ఆ కాళీమాతే నివ్వెరపోయింది. సీత తలాదాను తిన్న వేగాన్నీ, ఆమె మింగిన మొత్తాన్నీ చూసి, కాళికాదేవి ఏమైనా అందామనుకున్నది. అయినా ఏమీ అనలేక , కుడిచేత్తో గట్టిగా తన నోరు నొక్కుకున్నది కాళికమ్మ.అయినా కోడలు పిల్ల ఇవేమీ ఆలోచించే స్థితిలో లేదు. 'తనకు ఎంతో ఇష్టమైన తలాదా- తనను ఇన్నేళ్ళుగా ఊరించిన తలాదా- ఇప్పటికి గదా, తనకు అందింది?' అని, ఆమె మెక్కటంలోనే మునిగింది. చివరికి, బాన ఖాళీ అయ్యేసరికి , ఆమె గట్టిగా ఓసారి త్రేన్చి, ఖాళీ బానను శుభ్రం చేసేందుకని, చెరువు దగ్గరికి పోయింది.

బానను కడుక్కొని, నీళ్లు నింపుకొని సీత వెనక్కి వచ్చేసరికి, ఇంటి వాకిలి మూసి ఉన్నది! -అత్త వెనక్కి వచ్చేసింది!
తలుపు తీసీ తీయగానే సుబ్బమ్మ కోడల్ని నానా తిట్లూ తిడుతూ, గొడ్డు ను బాదినట్లు బాదింది. సూరి ఇంటికి వచ్చాక, తల్లి కోపం అతనికీ అంటింది- అతనూ సీతకు నాలుగు వడ్డించాడు. ఆలోగా పట్టణంఅంతా ఆశ్చర్యకరమైన వార్త ఒకటి వ్యాపించింది: 'గుడిలో కాళీమాత- కుడిచేత్తో- తన నోటిని మూసుకున్నది!' అని. "ఆ తల్లికి కోపం వచ్చింది- ఇక వానలు పడవు. గ్రామంలో ఇక పిల్లలన్న వాళ్ళే పుట్టరు" అని వదంతులు వినిపించాయి. ఈ వింతను చూసేందుకు పొరుగు గ్రామాల నుండి కూడా భక్తులు, వేల సంఖ్యలో రాసాగారు. ఎవరికి వాళ్ళు ఈ సంఘటన ఫలితాల్ని ఊహించి చెప్పటం మొదలుపెట్టారు.

ఎవరిని చూసినా 'ఇది చాలా దుశ్శకునం' అనేవాళ్ళే. "గ్రామానికి ఏదో తెలీని ఆపదరానున్నది" అని అందరూ భయపడ్డారు. "ఎవరో గుడిని అపవిత్రంచేసారు. అందుకనే, కాళీమాత తన చేత్తో తనే నోరు మూసుకున్నది" అన్నారు అంతా. ఇక గ్రామమంతటా పూజలూ, పునస్కారాలూ, తంతులూ జరిగాయి. జాతరలు జరిపి, గొర్రెల్ని బలి ఇచ్చారు అమ్మవారికి. కానీ ఏం చేసినా కాళీమాత మాత్రం కరుణించలేదు. నోటి మీదినుండి చెయ్యి తీయలేదు.
చివరికి ఊరి పెద్దలు ఊరంతటా చాటింపు వేయించారు- "కాళీమాత తన చేతిని నోటి మీది నుండి తీసేసేట్లుగా చేసిన వాళ్ళకు గొప్ప బహుమతినిస్తాం' అని. అయినా కాళీమాత చేత ఆ పని చేయించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.

మాట్లాడకుండా ఈ గందరగోళం మొత్తాన్నీ గమనిస్తూ కూర్చున్న సీతకు చికాకు వేసింది. చివరికి ఆమె అత్త దగ్గరికి వెళ్ళి, "అత్తా! 'కాళీమాత చేతిని నోటిమీద నుంచి తీసేసేట్లు మనం చెయ్యగలం' అని చెప్పు, వాళ్ళకు. నాకు తెలుసు, అదెలాగో!" అన్నది.

మొదట్లో కోడలుమాటల్ని నమ్మలేదు సుబ్బమ్మ. "చూడు, ఈ వెర్రి దాన్ని! ఊళ్ళో నా పరువు తీయాలని దాని ఆలోచన కాబోలు! ఏదో తనకే మంత్రాలు వచ్చినట్లు, గొప్పగా వ్యవహరిద్దామని చూస్తూన్నట్లుంది! ఎవ్వరూ చేయలేని పనిని, ఇది ఎట్లా చేయగలదు?" అన్నది. కానీ కోడలు మళ్ళీ-మళ్ళీ అనేసరికి, ఆమె కొంచెం అనుమానంగానే, ఒప్పుకున్నది.

మరుసటి రోజున కోడలు పిల్ల తన చింత ఈనెల చీపురుకట్టను, నిండుగా ఉన్న చెత్త బుట్టను తీసుకొని, గుడికి వెళ్ళింది. అందరినీ బయటికి పంపించి,తను గర్భగుడి లోపల గొళ్ళెం పెట్టుకున్నది. ఆపైన ఆమె తన చెత్త బుట్టను విగ్రహం ముందు పెట్టి, చీపురుకట్టను కోపంగా ఊపుతూ కాళికాదేవిని బెదిరించింది- "ఏమ్మా నీకంత అసూయ? నా పొట్లకాయ తలాదాను నేను తింటే, నీకేంటి? నీ కళ్ళలో నిప్పులెందుకు పోసుకుంటావు? నీకే గనక అంత ఆశ పుట్టి ఉంటే, నన్ను అడగాల్సింది, నేను నీకూ కొంచెం పెట్టేదాన్ని కద! అంత గొప్ప తల్లివి, నీకింత కళ్ళు మంట ఎందుకు? మర్యాదగా ఇప్పటికైనా నోటి మీది నుండి ఆ చెయ్యి తీస్తావా, లేకపోతే ఈ బడితతో పూజ చెయ్యమంటావా? చెప్పు!" అని అరిచింది.

అయినా విగ్రహం ఉలకలేదు, పలకలేదు. కోపం ఆపుకోలేక, సీత విగ్రహానికి దగ్గరగా వెళ్ళి, తన చీపురుకట్టతో నాలుగు అంటించింది. మరుక్షణంలో కాళీమాత 'కుయ్యో-మొర్రో-అయ్యో' అని, నోటి మీది నుండి చెయ్యిని తీసేసింది. ఇప్పుడు విగ్రహం యధావిధిగా, పవిత్రంగా కనబడుతున్నది మళ్ళీ. కోడలు ఆమెను కొట్టటం ఆపి,"అద్దీ, అలా ఉండాలి!" అని గొణుక్కొని, తన చెత్తబుట్టను చేత బట్టుకొని, చక్కా పోయింది.

క్షణాల్లో ఊరంతటికీ కోడలు పిల్ల సీత గురించీ, ఆమె సరిదిద్దిన కాళీమాత చెయ్యి సంగతీ తెలిసిపోయింది. అందరూ గుడికివెళ్ళి చూశారు- కాళీమాత మునుపటి మాదిరే నాలుగు చేతులతో ఇంపుగా ఉండటం చూసి, అందరూ తల్లికి మ్రొక్కి, బయటకి పరుగెత్తారు. ఆపైన అందరూ సీతను దర్శించుకొని, ఆమెకూ మ్రొక్కుకున్నారు.
ఊళ్ళో జనాలంతా ఆమెను 'పతివ్రతా శిరోమణి' అని పొగిడి, 'ఆమెను చూస్తే చాలు-తమ పాపాలన్నీ పటాపంచలు అవుతున్నాయ అన్నట్లు మాట్లాడారు. ఆమెకు అనేక బహుమానాలు, చాలా డబ్బు, ఇచ్చి సత్కరించారు కూడాను.

అయితే అత్త సుబ్బమ్మకు మాత్రం, ఈ సంఘటన తర్వాత ఏదో తెలీని భయం పట్టుకున్నది. 'తన కోడలికి మాయ మంత్రాలేవోవచ్చు' అని ఆమెకు భయంవేసింది. 'తన అత్త తనను ఎంతగా పీడించిందో సీత ఏదో ఒకనాడు గుర్తు తెచ్చు కోకుండా ఉండదు! అప్పుడు ఆమె తననూ, తన కొడుకు సూరిని కూడా- వదిలిపెట్టదు' అని సుబ్బమ్మ వణికిపోయింది.

"ఆలోగానే మనం ఏదైనా చెయ్యాలి!" అనుకున్నదామె.

అదే సంగతి సూరిని అడిగితే, ఆ పిరికివాడు "నాకేమీ తెలీదు-నువ్వేచెప్పు"అనేశాడు. "అది ఇప్పుడు పడుకొని ఉన్నది. మనం దాని నోట్లో గుడ్డలు కుక్కి, చాపలో మడిచి కట్టి, దాన్ని పొలంలో గుంత దగ్గరికి ఎత్తుకు పోయి, కాల్చేద్దాం. ఆ తర్వాత నేను నీకు ఒక మంచి, కొత్త భార్యను తెచ్చి పెడతాను"అన్నది సుబ్బమ్మ గయ్యాళిగా.

"సరే! సరే! ఆపనేదో వెంటనే చేసేద్దాం" అన్నాడు- సొంత ఆలోచన లేని కొడుకు.

వెంటనే ఇద్దరూ కలిసి నిద్రపోతున్న సీత నోట్లో గుడ్డలు కుక్కి, ఆమెను చాపతో సహా చుట్ట చుట్టి, ఎత్తుకు పోయారు. వాళ్ళ పన్నాగం అర్థమై కూడా సీత కదలక, మెదలక పడుకున్నది. పొలం చేరుకోగానే చాపచుట్టను గుంతలో పెట్టి, సుబ్బమ్మ, సూరి ఇద్దరూ కట్టెలు తెచ్చేందుకని పోయారు. కోడలు అప్పటికి ధైర్యం తెచ్చుకొని, కొంచెం బిగుసుకు పోయినట్లు చేసి, అలా చాపను వదులు చేసుకొని, బయటపడింది.

ఆపైన నోట్లో కుక్కిన గుడ్డల్ని తీసేసుకొని, ఆమె అక్కడ ఉన్న కట్టె మొద్దును ఒకదాన్ని చాపలో దూర్చి పెట్టింది. తను దూరంగా నడుచుకొని పోయి, ఓ మర్రి చెట్టు కనబడితే, దాని పైకి ఎక్కి కూర్చున్నది.

అంతలో వెనక్కి వచ్చిన తల్లీ కొడుకులిద్దరూ చెత్తా, చెదారం, కట్టె పుల్లలూ అన్నీ చాప చుట్టూ పేర్చి కాల్చేశారు. కట్టెలకణుపులు వేడికి పగిలి, 'టప టప' అన్నప్పుడల్లా వాళ్ళు "అదిగో, ఎముకలు- ఎముకలుచిట్లి పోతున్నై!" అనుకున్నారు. మధ్యలో ఓసారి, ఒక పెద్ద కట్టె కాలి, 'ఫట్'మని పగలగానే, "హమ్మయ్య! ఇప్పుడు దాని కపాలం కూడా పగిలింది" అని సంబరపడి, వాళ్లిద్దరూ ఆ అర్ధరాత్రి వేళ- పడుతూ లేస్తూ- ఇంటికి పోయారు.

ఇక సీత మాత్రం చేసేదేమీలేక, ఆ రాత్రికి అక్కడే, చెట్టు కొమ్మల మాటున- ముడుచు-కొని కూర్చున్నది. అదే రోజు రాత్రి నలుగురు దొంగలు, తాము దోచుకున్న డబ్బుల్ని, ఆభరణాల్ని పంచుకునేందుకని వచ్చి, ఆ చెట్టు క్రిందే కూర్చున్నారు. వాళ్లు అక్కడ కూర్చోగానే, అల్లంత దూరాన మండుతున్న కట్టెలు కనబడ్డాయి. 'ఆ మంట దగ్గర ఎవరైనా ఉన్నారేమో' అని వాళ్లకు అనుమానం వేసింది.

సందేహ నివృత్తి కోసం, వాళ్లలో ఒకడు చెట్టు పైకి ఎక్కి, సరిగ్గా కోడలు కూర్చున్న కొమ్మమీదికే వచ్చాడు. అక్కడ ఈ స్త్రీ ఆకారాన్ని చూసి వాడు ఒక్క క్షణం బిత్తరపోయి, "ఎవరది?" అన్నాడు మెల్లగా.

కోడలుపిల్ల వెంటనే "ష్..గట్టిగా మాట్లాడకు. నేనొక దేవకన్యను. నాకు కాబోయే భర్తను వెతుక్కుంటూ ఇప్పుడే ఇక్కడికి వచ్చి వాలాను. నిన్ను చూస్తే చాలా మంచి వాడివి లాగున్నావు. నువ్వు సరేనంటే, నిన్ను పెళ్లిచేసుకొని, నువ్వు కలలో కూడా చూడని సంపదల్ని నీ వశం చేయగలను. మెల్లగా మాట్లాడు!" అన్నది వాడితో.

తాగిన మత్తులో ఉన్న ఆ దొంగకి, తనెక్కడ ఉన్నదీ అర్థం కాలేదు. 'తను స్వర్గం చేరుకొని, ఐరావతం మీద ఎక్కి కూర్చొని, ఊరేగు-తున్నట్లు' అనిపించింది వాడికి. "నువ్వు నిజమా, లేక నా భ్రాంతా?" అన్నాడు వాడు.

"పదహారణాల నిజం. కావాలంటే- ఇదిగో, ఈ వక్కాకు తిను!"అని, సీత తన రొంటికున్న సంచీలోంచి రెండు తాంబూలాలు తీసి, తనొకటి నోట్లో వేసుకుని, వాడికొకటి ఇచ్చింది. ఆపైన ఆమె వాడికి తన నాలుకను చూపించి, వాడి నాలుకను చూపించమన్నది. మైకంలో ఉన్నట్లు, వాడు తన నాలుకను చాచగానే సీత మొండిగా ముందుకు వంగి, వాడి నాలుకను అందినంతమేరకు కొరికివేసింది!


వాడు "బబ్బబ్బబ్బ!" అని అరుస్తూ, గయ్యని కేకలు పెడుతూ, బాధను భరించలేకపట్టు తప్పి, క్రింద కూర్చున్న తనవాళ్ల మీదనే పడ్డాడు. ఏదో లోకంలో‌ ఉన్న ఆ దొంగలుకూడా కంగారు పడి, తలొక దిక్కుకూ పరుగెత్తారు. నాలుక తెగిన వాడు "బబ్బబ్బబ్బ" అని అరుస్తూ వాళ్ల వెంట పరిగెత్తితే, మిగిలిన వాళ్ళకు మరింత హడలైంది. వాళ్ళు బాణాలు దూసుకు పోయినట్లు, దిక్కులు చూసుకోకుండా పరుగెత్తారు. వాడు కూడా అరుస్తూ వాళ్ల వెంబడి పరుగు తీశాడు. తెల్లవారుతుండగా కోడలు పిల్ల చెట్టు దిగి చూస్తే, ఏముంది? చెట్టు క్రింద- పెద్ద గోతం నిండుగా- డబ్బు! బంగారం! వెండి! ఆభరణాలు! ఆమె వెంటనే వాటినన్నింటినీ మూట గట్టుకొని, నేరుగా ఇంటికి పోయి, తలుపు తట్టింది- "అత్తా! ఓ అత్తా! తలుపుతియ్యి!" అంటూ.

అత్త సుబ్బమ్మకు గుండె ఆగినంత పనైంది. నోరు పిడచగట్టుకుపోయింది. ముఖం పాలిపోయింది. అయినా ధైర్యం చేసి తలుపు తీసి చూసేసరికి, తను స్వయంగా కాల్చేసిన కోడలు- ఇకిలిస్తూ నిలబడి ఉన్నది- కళ్లకెదురుగా.
మరుక్షణం అత్త భయంతో మూర్చపోయింది. కోడలే ఆమెను లోపలికి ఎత్తుకెళ్లి, ముఖం మీద నీళ్లు చిలకరించి, సేవలు చేసింది. సూరి నోరు తెరుచుకొని అక్కడే నిలబడి పోయాడు శిలావిగ్రహంలాగా. కళ్లు తెరవగానే అత్త- "నువ్వు- నువ్వు- ఎలా- ఇంకా బ్రతికే ఉన్నావా...? లేకపోతే..?" అని గొణిగింది. "మీరు నన్ను కాల్చేయగానే, యమ-దూతలు వచ్చి నన్ను యముడి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా మండుతున్నాయి- అచ్చం మన కాళీమాత కళ్లలాగానే.

నన్ను చూసీ చూడగానే ఆయన గర్జించాడు "ఈమెను వెనక్కి పంపండి. ఈమె అత్తే, అసలైన పాపి! ఆమెను లాక్కురండి ఇక్కడికి. ఇనప కాకికి ఆ దొంగ అత్త పని అప్పగించండి. అది ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. ఆ తర్వాత ఆ పాపిని కాగే నూనెలో వేయించండి" అని, పిడుగులు పడ్డట్టు, ఏమేమో అరిచాడు నీ గురించి.
నేను అప్పుడు ఆయన పాదాలపై పడి, "మా అత్తను అలా చేయకండి, దయచేసి ఆమెను క్షమించండి. నిజానికి ఆమె ఏమంత చెడ్డది కాదు. మీరు ఏ శిక్ష విధించాలన్నా, నాకు విధించండి- మా అత్తను మాత్రం ఏమీ చేయకండి" అని ప్రార్థించాను.

నా మాటలు విని ఆయన కొంచెం శాంతించాడు- ఒక చిరునవ్వు నవ్వాడు కూడా- "నువ్వు ఇక వెనక్కి తిరిగి వెళ్లు. నువ్వు చెప్పినట్లే చేస్తాములే. కానీ ఒకవేళ మీ అత్త ఇకమీదట నిన్ను ఏమైనా అన్నదనుకో, ఆమెను నేనే స్వయంగా నరకానికి లాక్కు వెళ్తాను. మా భటులు ఎల్లవేళలా ఆమెను గమనిస్తుంటారు" అన్నాడాయన.
ఆ తర్వాత ఆయనే నాకు ఈ నగలు, బంగారం, డబ్బులు అన్నీ ఇచ్చి, సాగనంపారు. జనాలు యముడి గురించి చెడుగా ఏవేవో చెబుతుంటారు గానీ, ఆయన నా పట్ల ఎంత దయతో వ్యవహరించారో చెప్పలేను" అన్నది సీత అమాయకంగా.

అత్త వణికే గుండెతో, భయం భయంగానే ఆమెను కౌగిలించుకున్నది- "అయ్యో! నువ్వు నిజంగానే మా ఇంటి దేవతవు. యమదూతల బారినుండి నన్ను కాపాడింది నువ్వే. ఇప్పటినుండీ ఈ ఇంట్లో నువ్వు ఎలా చెబితే అలా చేస్తాం. నా పాపాలేవీ మనసులో పెట్టుకోకు. క్షమించేసెయ్ నన్ను. క్షమిస్తావు గదూ, నా బంగారు తల్లీ?" అని ప్రాధేయపడింది కోడల్ని.

ఇప్పుడు కోడలు పిల్లే ఆ ఇంటికి పెద్ద. సుబ్బమ్మా, సూరీ ఆమె ఏం చెబితే అది చేస్తున్నారు. అందరూ సుఖంగా ఉన్నారు!