Pages

Sunday, August 2, 2015

సోము-తాబేలు

అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో నివసించే దంపతులు ఇద్దరికి చాలా కాలంపాటు సంతానం కలగలేదు. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత వాళ్లకొక కొడుకు పుట్టాడు.
దంపతులు వాడికి సోము అని పేరు పెట్టి, ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. సోము ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆ బడిపిల్లలందరూ కలిసి విహారయాత్రకని గంగానదిని చూడటానికి వెళ్లారు. సోముకు అక్కడి వాతావరణం, ప్రశాంతత చాలా నచ్చాయి.
అతను అక్కడ కూర్చొని నదిలోకి
చూస్తుండగా, దూరంగా కొందరు పిల్లలు గుమికూడి ఏదో అల్లరి చేయటం మొదలెట్టారు. వెంటనే సోము అక్కడికి వెళ్లి చూశాడు. ఆ పిల్లలంతా ఒడ్డుకు వచ్చిన ఒక తాబేలును అటూ ఇటూ పీకుతూ దాంతో ఆడుకుంటున్నారు.
అది చూసిన సోముకు చాలా బాధ కలిగింది.
వాడు పిల్లలతో వాదించి, వాళ్లందరినీ అక్కడినుండి పంపించేశాడు. ఆపైన
గాయాలతో ఉన్న తాబేలును చేతనెత్తి, నదిలోకి తీసుకెళ్లి వదిలేశాడు.
ఆశ్చర్యం! నీళ్లలో పడగానే ఆ తాబేలు మాట్లాడింది. "ఓ మంచి అబ్బాయీ! నీ మేలు మరువలేనిది. ప్రమాదంలోపడ్డ నాకు, నువ్వు చేసిన మేలు చాలా గొప్పది. ఇందుకు ప్రత్యుపకారంగా నేను నీకు ఏమైనా
చేసిపెట్టాలని అనుకుంటున్నాను. అడుగు, నీకేం కావాలో!" అన్నది.
సోము తనకేం అక్కర్లేదనీ, కావాలంటే అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి, ముందుకు సాగాడు.
ఈ సంఘటన జరిగిన తర్వాత చాలాకాలానికి, సోము యుక్తవయస్సులోకి వచ్చాడు. చాలా విద్యలు నేర్చుకొని, అతను వీరుడుగా పేరుగాంచాడు.
ఇదిలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు, తన స్నేహితురాళ్లతో కలిసి స్నానానికని గంగా నదికి వెళ్లింది. నదిలో స్నానమాడుతూండగా ఆమెకిష్టమైన రత్నాల హారం జారి నదిలో పడిపోయింది. చాలా
మహిమగల ఆ హారం అంటే ఆమెకు చాలా ఇష్టం. అది పోయిందన్న బెంగతో
రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయటంలేదు.
ఎవరెంత చెప్పి చూసినా ఆమె బెంగమాత్రం తీరలేదు. ఆహారం లేక ఆమె రోజు రోజుకూ కృశించిపోవటం మొదలెట్టింది. ఆమెకు సంతోషం కలిగించటానికి పూనుకున్నారు రాజుగారు.
గజ ఈతగాళ్ళు అనేక మందిని అమితవేగంతో ప్రవహించే ఆ గంగా నదిలోకి పంపారు. కానీ ఆ
నదీవేగానికి వాళ్లందరూ కాగితపు పడవల్లా కొట్టుకపోయారు. కొందరైతే
నదిలోని ముసళ్లకు ఆహారమయిపోయారు పాపం.
ఇక చేసేదేమీలేక, తెలివిగలవారూ, సాహసవంతులైన యువకులెవరైనా ఆ
రత్నాలహారాన్ని తేగలిగితే వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లిచేయటమేకాక, అర్థ రాజ్యాన్నికూడా ఇస్తామ'ని రాజావారు
చాటింపించారు.
చాటింపును విన్న సోము ఆలోచించాడు:
ఇంతమంది గజఈతగాళ్లకు దొరకకుండా
ఆ హారం ఎటుపోతుంది?' అని. 'అది నదిలోని ఏ రాళ్ళ అడుగునో ఇరుక్కుని ఉండాలి. దాన్ని తీయటం సాధారణ మానవులకు సాధ్యం కాకపోవచ్చు. అయినా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమౌతుందని, అతను నదిలోకి దూకి,
రాళ్ళ అడుగున వెతకటం మొదలుపెట్టాడు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది-
ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో ఆతని కంటపడింది. అయితే దాన్ని చేరుకునే ప్రయత్నంలో అతను నదిలోని ఒక సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఇక తన ప్రాణాలు పోవటం తప్పదనుకున్న ఆ క్షణంలోనే
సోము నీటి పైకి తేలాడు! ఎలాగని చూస్తే, అతని సాయంపొందిన తాబేలు!
సోము కోరికను అడిగి తెలుసుకున్న తాబేలు నదిలోని బండరాళ్లను ఎత్తి మరీ ఆ రత్నాల హారాన్ని తెచ్చి సోముకు ఇచ్చింది.
హారాన్ని పొందిన సోము అక్కడి నుండి నేరుగా రాజ భవనానికి చేరుకొని, ఆ రత్నాల హారాన్ని రాకుమారికిచ్చాడు.
సంతోషించిన రాజు సోముకు తన కూతురుని
ఇవ్వడమే కాక, అర్థరాజ్యమిచ్చి గౌరవించాడు కూడా. ఆపైన సోము రాజ్యాన్ని చక్కగా పాలించి, 'దయ గల రాజు' అని పేరు తెచ్చుకున్నాడు.

మూడు రాళ్లు

ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా వృద్ధుడు. ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి, ఇలా అన్నాడు.
నాయనలారా! నేను ఎంతోకాలం జీవించను. ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని
అభివృద్ధి చేసి, ఈ ఆస్తిని సంపాదించాను. మిమ్మల్ని పెంచి పెద్దవాళ్లను
చేశాను. ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా.

అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను. మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి. సత్యమూర్తి తెలివైనవాడు. నా వ్యాపారాభివృద్ధికి
అతను ఎన్నో సలహాలిచ్చినవాడు. అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి.
అప్పుడే నాకు మనఃశాంతి కలుగుతుంది. అలా చేస్తామని నాకు మాటివ్వండి’’
అన్నాడు.
అలాగే చేస్తామని ముగ్గురు కొడుకులూ ప్రమాణం చేశారు. కొద్దిరోజుల్లోనే నారాయణ మరణించాడు. ఆ తర్వాత ముగ్గురు కొడుకులూ, తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు.
సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు. ఆతృతగా వారు ఆ పెట్టెను
తెరిచారు.
అందులో ఇంటి తాళాలు, మూడు రాళ్లు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం పైన ‘సత్యమూర్తి మాత్రమే చదవాలి’ అని రాసి ఉంది.
సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు. తర్వాత ముగ్గురి వైపు
తిరిగి, అబ్బాయిలూ! ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు.
ఏంటది?’’ అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.
ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను. ముందు ఆ మూడు రాళ్లను
పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి. మీకు ఏమైనా తోస్తే చెప్పండి’’ అని
అడిగాడు సత్యమూర్తి.
ఓస్! అదేమంత పెద్ద విషయం కాదు. మీ ముగ్గురు మూడురాళ్లను
వెనకేసుకోండి. అంటే దుబారా ఖర్చులు మాని, మరింత సంపాదించండి అని చెప్పి
ఉంటాడు. అందువలన ఎవరి ఆస్తి వారికి ఇచ్చేస్తే, మేం మరింత అభివృద్ధి
చేసుకుంటాం’’ అన్నాడు పెద్దకొడుకు.
అంతే కాదు. మూడు రాళ్లలా ఎక్కువ తక్కువ కాకుండా, మూడు వాటాలు సమానంగా
వేసుకొని జీవించండి అని చెప్పి ఉంటాడు’’ అన్నాడు రెండోవాడు .
ఇక మూడోవాడు, ఆ మూడు రాళ్లు పొయ్యికి గల మూడు రాళ్లు. అంటే మూడు రాళ్లు కలిస్తేనే కమ్మని వంట వండటం సాధ్యమవుతుంది. అలాగే
మేం ముగ్గురం కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని
చెప్పడానికే ఆ మూడు రాళ్లు పెట్టాడు’’ అని వివరించాడు.
ముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత, సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని
వారికి చూపాడు. అందులో ‘ముగ్గురు అన్నదమ్ములు కలసిమెలసి ఉండాలి. నా
కోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్నవారికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను’ అని రాసి ఉంది.
చదివారు కదా! మీ నాన్న ఉద్దేశాన్ని మూడోవాడే చక్కగా అర్థం చేసుకున్నాడు. మనసు ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి. తండ్రి ఉద్దేశం
ఎరిగిన కొడుకే అతని కోరికను నెరవేర్చగలడు. అందుకే కలసిమెలసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న మూడోవాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను’’ అని చెప్పి ఆ తాళాలు మూడోవాడికి ఇచ్చాడు సత్యమూర్తి.
ఈ తాళాలు నా ఒక్కడివి కావు. మనందరివీ అని తన అన్నలిద్దర్నీ
కలుపుకొని ముందుకు నడిచాడు మూడోవాడు.
తను చెప్పినట్లే పెట్టెలో మూడు రాళ్లు పెట్టి సులువుగా సమస్యను
పరిష్కరించినందుకు నారాయణను మనసులోనే అభినందించాడు సత్యమూర్తి.

పన్నెండు మంది శిష్యుల కథ

గురువుగారు – పరమానందయ్యగరు. వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది.. తెలివితక్కువతనానికి, మూర్ఖత్వానికి పెటింది పేరు. పేరు పరమానందయ్యగారి శిష్యులు. ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివితక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి.. అసలు
పరమానందయ్య గారి శిష్యుల గురించి కొంచం వివరంగా తెలుసుకుందాం.
****
పూర్వం దేవలోకంలో పన్నెండుమంది మునీశ్వర్లు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు. ఆ వనం ఎంతో అందంగా ఉంది. మునులు ఉద్యానవనం అందచందాలను అస్వాదిస్తూ మెల్లగా మట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు.
వీరు వెళ్తున్న బాటనానుకొని దట్టమైన పూపొదలు ఉన్నాయి. వాటి వెంకాలే
స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కలిగిన కొలను ఉంది. ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది. అప్పుడు ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా
చూస్తున్నారన్న అనుమానంతో —- మీరంతా వట్టి బుద్ధి హీనులు కండి” అని శాపం ఇచ్చింది.
వారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు మునులు – మాకే పాపమూ తెలిదు మేము నీ సౌందర్యాన్ని చూడడంలేదని అని మొరపెట్టుకొన్నారు. తాపసికి అప్సరస తొందరపాటు కోపం వచ్చి – నువ్వు ముందూ వెనుకా చూడకుండా తొందరపాటుతో మునులని శపించావు. కనుక – నువ్వూ వారితో పాటు భూలోకమొలో జన్మించు” అని ఆమెను శపించాడు.
భూలోకంలో శివభక్తుడైన మహరాజు ఉంటాడు. ఈ అప్సర అతనికి వేశ్యగా ఉంటుంది. ఆ రాజుకు అభిమానుడయిన ఓ పండితుడు మఠం కట్టుకొని నివసిస్తూ ఉంటాడు. అతను మహా పండితుడు. ఆయన వద్ద ఈ పన్నెండు
మంది మునులు తెలివితక్కువ శిష్యులుగా చేరుతారు.
రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు. ఆ మహాపండితుడే ప్రమానందయ్యగారు. వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యమూ, శిష్యులెంత తెలివితక్కువగా ప్రవర్తించినా, థం తెలివితక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల బాధలు కలిగించినా ఆ గురువుగారికి శిష్యుల మీద ఎంతమాత్రమూ కోపం వచ్చేది
కాదు.
పరమానందయ్య గారు గొప్ప పండితులు. పురాణాలు, హరి కథలు చెప్పడంలో
దిట్ట. ఆయనకు రాజాశ్రమముంది. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
*******

డబ్బుకు లోకం దాసోహం

సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు. ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు.
ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు. మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే. అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు.
ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది. ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా. మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు. కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది. ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా. ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా. ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు. మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే.
అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు. ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే. మెరుపులా తప్పుకున్నాడు రంగా. పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది. వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ. 'నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌?' అన్నాడు రాజా చిరాకు పడుతూ. 'నీ దగ్గర దాపరికమెందుకు? నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నా' అన్నాడు రంగా నిజాయితీగా.
ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు. ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా. ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి. వారితో కలిసి నడవసాగాడు. రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌. అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, 'డబ్బుకు లోకం దాసోహం' అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.

ఆభరణం ఎవరిది?తెలుసుకోవడం ఎలా ?

సిరిపురం శివాలయంలోని వటవృక్షం కింద ఓ సాధువు, తన శిష్యుడితో బస చేశాడు. రోజూ సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులకు పురాణ పఠనం చేస్తూ ప్రసంగాలు ఇవ్వసాగాడు.
ఓరోజు భక్తులందరూ వెళ్లిపోయిన తర్వాత ఆవరణను శుభ్రం చేస్తున్న శిష్యుడికి చీకట్లో ఏదో తళతళలాడుతూ కనిపించింది. దీపం వెలుగులో చూసేసరికి అదొక బంగారు హారం. శిష్యుడు దాన్ని గురువుకి చూపించాడు.
'ఎవరో భక్తురాలు పోగొట్టుకుని ఉంటుంది. రేపు అందజేద్దాం' అన్నాడు సాధువు.
'అంతమందిలో దీన్ని పోగొట్టుకున్నదెవరో తెలుసుకోవడం ఎలా స్వామీ?' అన్నాడు శిష్యుడు. సాధువు నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు ప్రసంగం పూర్తవగానే సాధువు, 'భక్తులారా! నిన్న ఇక్కడెవరో ఓ విలువైన బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్నారు. పరిశీలించి చూడగా ఆ వ్యక్తి తీవ్రమైన గ్రహదోషంతో ఉన్నట్టు నా దివ్యదృష్టికి గోచరించింది. ఆ దోషం పోవాలంటే సుమారు యాభై వేల వరహాలు ఖర్చు చేసి యాగం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి వస్తే ఆ యాగాన్ని నేనే నిర్వహించగలను' అంటూ జోలెలో దాచిన ఆభరణాన్ని పైకి తీసి చూపించాడు.
భక్తులందరూ దాన్ని చూశారు. ఇంతలో ఓ మహిళ కంగారుగా సాధువు దగ్గరకి వచ్చి, 'స్వామీ! అది నాదే. నగ సంగతలా ఉంచి నా గ్రహదోషం పోవడానికి చేసే ఆ యాగానికి ఏం కావాలో సెలవీయండి' అంది.
సాధువు ఆమెను భక్తులంతా వెళ్లిపోయే వరకూ వేచి ఉండమని చెప్పి ఆభరణాన్ని ఇచ్చేశాడు. ఆపై కాసేపు కళ్లు మూసుకుని ధ్యానించి, 'నువ్వేమీ కంగారు పడకమ్మా! నీ గ్రహస్థితి మారింది. నువ్వే యాగాలూ చేయక్కర్లేదు' అన్నాడు. ఆమె సంబరంగా వెళ్లిపోయింది.
శిష్యుడు ఆశ్చర్యంగా సాధువుని సమీపించి, 'అదేంటి స్వామీ! యాభై వేల వరహాల యాగం చేయక తప్పదని చెప్పిన గ్రహస్థితి ఒక్కసారిగా ఎలా మారిపోతుంది?' అన్నాడు.
సాధువు నవ్వి, 'బంగారం ఆశను రేకెత్తిస్తుంది నాయనా! ఇదెవరిదో చెప్పండంటే చాలా మంది నాదంటే నాదని ఎగబడేవారు. అందుకే పదివేల వరహాల ఆభరణానికి యాభై వేల యాగాన్ని అడ్డం వేశాను. ఆ నగ నిజంగా ఎవరిదో తెలుసుకోడానికే అలా చెప్పాను' అన్నాడు సాధువు నవ్వుతూ.

తాబేలు తెలివి

ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ల్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి "ఏమిటీ విడ్డూరం! తాబేలు పిల్లనగ్రోవి వాయించటం ఏమిటీ!" అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు.
పిల్లనగ్రోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్ధం కాలేదు.
వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు.
"ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను" అని అన్నాడు వేటగాడు తన భార్య, పిల్లలతో.
"చచ్చానురా" అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, "పిల్లలూ! ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను" అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు.
వేటగాడు అలా వెళ్లగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లంగ్రోవి వాయించసాగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరకి వెళ్ళారు. " మీకు నా గానం నచ్చిందా?" "నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి. మనందరం కలిసి పాడుతూ ఆడదామ" అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో.
పిల్లలు తాబేలుని బయటకి తీశారు. తాబేలు మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తుంటే, పిల్లలు ఆడసాగారు. ఇలా చాలా సేపు జరిగింది. చివరకి అలసిపోయి, చెమటతో తడిసి్పోయారు ఆ పిల్లలు. "చెమటతో తడిసిపోయాం కదా, ఇప్పుడు మనం స్నానం చేద్దాం? అని అన్నది తాబేలు తన పధకాన్ని అమలుపరుస్తూ. వెంటనే పిల్లలు ఒక బకెట్‌లో నీళ్లు తెచ్చ్హారు. "ఇవి నాకు సరిపోవు. పదండి నదిలో స్నానం చేద్దామ" అన్నది తాబేలు. ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది.
నీతి : అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దానినుంచి ఉపాయంతో బయటపడడం తెలివైన లక్షణం.

తెలివైన ఆసామి

ఒక ఊళ్లో ఒక ఆసామి వుండేవాడు. అతను ఏమి చదువుకోక పోయినా మంచి తెలివి తేటలు గల వాడు. ఒకసారి, అతనికి పది రూపాయలు అవసరమయ్యింది. దాన్ని సంపాదించడానికి అతను ఒక ఉపాయం ఆలోచించాదు.
పట్నం లో అతనికి తెలిసిన ప్లీడరు ఒకాయన ఉన్నాడు. ఆసామి ఆయన వద్దకు వెళ్లి, "ప్లీడరు గారు, మీరు చదువుకున్నవారు, తెలివి గల వారు. నేను చదువుకోని పల్లెటూరి మొద్దును. నేను తమర్ని ఒక ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పలేక పోతే ఇరవై రూపాయలు ఇవ్వాలి, మీరు నన్ను ఒక ప్రశ్న అడగండి, సమాధానం చెప్పలేక పోతే పది రూపాయలు ఇచ్చుకుంటాను. పేదవాణ్ణి కదా!"అన్నాడు.
అందుకు ప్లీడరు గారు ధైర్యంగా ఒప్పుకున్నారు.
" మూడు కాళ్లూ, రెండు ముక్కులూ గల పక్షి ఏది?" అని అడిగాడు.
ప్లీడరు సమాధనం చెప్పలేక ఓడినట్టు ఒప్పుకొని ఆసామికి ఇరవై రూపాయలు ఇచ్చి, "నేను నిన్ను ఆ ప్రశ్నే అడుగుతున్నాను. సమాధానం చెప్పు" అన్నాడు.
"ఓడిపోయాను!" అంటూ ఆసామి పది రూపాయలు ప్లీడరు గారికి ఇచ్చి, మిగిలిన పది జేబులో వేసుకొని చక్కా వెళ్లిపోయాడు.

జింక అందం

ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒక రోజు అది దాహం తీర్చుకోడానికి కాలువ దగ్గరకి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. 'ఆహా! ఎంత అందంగా ఉన్నాను. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకొంటూ... అందంగా వర్ణించుకుంటూ తన్మయత్మంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాళ్ళపై పడింది. వెంటనే దాని మొఖం దిగులుగా మారిపోయింది. 'కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా పీలగా! ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళనెందుకు ఇచ్చాడు'? అని ఎంతో దిగులుపడింది.
అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. 'ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా!' అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం, చెంగుచెంగున అంగలు వేస్తూ వేగంగా పరుగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చేవరకు అలా పరిగెడుతూనే ఉంది.
ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడి, "హమ్మయ్య! ఎంత గండం గడిచింది?" అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంది.

పుటుక్కు.. జరజర.. డుబుక్కు.. మే..!!

అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది. దానికి నాలుగు వైపులా పెంకులతో ఏటవాలు ఇంటికప్పు, మధ్యలో చావడి ఉన్నాయి. ఆ పెంకుల మీద ఆ ఇంటి యజమాని నాటిన గుమ్మడి పాదు ఒకటి అల్లుకుంటూ, ఏపుగా పెరుగుతుంటుంది. ఆ గుమ్మడి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉండటంతో దానికి బోలెడన్ని గుమ్మడికాయలు కాసాయి.
ఇక ఆ ఇంటి కప్పుల్నే తన ఇల్లుగా మార్చుకున్న ఓ ఎలుక కూడా... ఆ గుమ్మడికాయలతోపాటు కాపురం చేయసాగింది. తుంటరిదైన ఆ ఎలుక కనబడ్డ వాటినల్లా కొరికేస్తూ, చాలా సంతోషంగా జీవితం గడిపేయసాగింది. ఆ ఇల్లు తనదే అన్నట్లుగా ఈ ఎలుకగారు అక్కడికి ఎవరు వచ్చినా వారిని ఊరికే వదలిపెట్టదు.
రోజులలా గడుస్తుండగా.. ఇంటి చావడిలోకి మేత కోసం వచ్చిందొక మేకపిల్ల. ఇంతలో తుంటరిదైన మన ఎలుకగారు ఊరుకుంటారా..? వెంటనే ఒక గుమ్మడికాయని ఫుటుక్కున కొరికేసింది. దీంతో గుమ్మడికాయ జరజరా జారుతూ... డుబుక్కున గడ్డి మేస్తున్న మేకపిల్లపై పడింది. వెంటనే ఆ మేకపిల్ల మే... మే... అని అరుచుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఇదండీ... పుటుక్కు.. జరజర.. డుబుక్కు.. మే కథ. ఏదీ మీరూ ఒక్కసారి "పుటుక్కు జర జర డుబుక్కు మే" అనండి. భలే తమాషాగా ఉంది కదూ...?!

చుట్టాల సురభయ్య.. రోకలి పూజ...!!

సురభయ్యకు చుట్టాలంటే భలే ఇష్టం. ఎప్పుడూ తన ఇల్లు చుట్టాలతో కళకళలాడుతూ ఉండాలని కోరుకునేవాడు. అతడు ప్రతిరోజూ నాలుగు వీధుల కూడలిలో నిలబడి చుట్టాలను వెతికిపట్టి మరీ ఇంటికి తీసుకెళ్లేవాడు. సురభయ్య భార్య సూర్యకాంతం చాలా పిసినారి. చుట్టాల పేరుతో ఇల్లు గుల్ల కావటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు.
అదీగాక ప్రతిరోజూ వచ్చే చుట్టాలకు వండి వార్చలేక సూర్యకాంతం సురభయ్యపై విరుచుకుపడేది. కానీ సురభయ్య మాత్రం ఆమె మాట వినేవాడు కాదు. "ఆ మాత్రం చుట్టాలకు పెట్టకపోతే మన బ్రతుకెందుకు..?" అంటూ ఆమెకే సర్దిచెప్పేవాడు. సురభయ్య పద్ధతి చూసి చూసి సూర్యకాంతానికి విసుగొచ్చేది. ఎలాగైనా సరే సురభయ్య చుట్టాల పిచ్చిని వదలగొట్టాలని పథకం వేసింది.
ఒకరోజు సురభయ్య ఇద్దరు చుట్టాలను ఇంటికి తీసుకుని వచ్చాడు. వారిని కూర్చోబెట్టి.. ఉప్పూ, పప్పూ, కూరగాయలు కొనుక్కొస్తానని బజారుకు వెళ్లాడు. ఇంతలో సూర్యకాంతం రోకటి బండకు పసుపు, కుంకుమతో పూజ చేయసాగింది. చుట్టాలిద్దిరికీ అది చాలా వింతగా తోచింది. "ఎందుకు రోకలికి పూజచేస్తున్నా"ని అడిగారు.
అందుకామె చేతులు తిప్పుతూ... "ఏమి చెప్పమంటారు నాయనా... ఈయనకి ఈ మధ్య చుట్టాల పిచ్చి బాగా ముదిరిపోయింది. చుట్టాలకు రోకలిపూజ చేయడం చాలా మంచిదని ఎవరో సన్యాసి చెప్పాడట. ఇక అప్పటినుంచి రోజూ చుట్టాలను పిలుచుకు రావటం, ఈ రోకలిబండతో తరిమి తరిమి కొట్టడం చేస్తున్నాడు. మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టి, ఆయనేమో కల్లు తాగేందుకు వెళ్లాడు. వస్తూనే మీకు కూడా రోకలి పూజ ఖాయం" అని చెప్పింది.
ఈ మాటలతో చుట్టాలకు పై ప్రామాలు పైనే పోయాయి. ఒకటే పరుగు లంకించుకున్నారు. సురభయ్య సామాన్లన్నీ కొనుక్కుని ఇంటికి వచ్చాడు. "చుట్టాలేరీ..?" అని భార్యను అడిగాడు. "వాళ్లకు రోకలిబండ కావాలంట నేనెక్కడ తెచ్చిచ్చేది..?" లేదని చెప్పగానే వాళ్లు వెళ్లిపోయారని చెప్పింది సూర్యకాంతం.
"అయ్యో..! ఇవ్వలేకపోయావా అంటూ" రోకలిబండతో పరుగుతీశాడు సురభయ్య. రోకలిబండతో వస్తున్న సురభయ్యను చూసిన చుట్టాలు.. అతను తమకు రోకలిపూజ చేసేందుకు వస్తున్నాడని భావించి, భయంతో మరింతగా పరుగుతీశారు. సురభయ్య వారితోపాటు పరిగెత్తలేక ఉస్సూరంటూ ఇంటికి చేరాడు.
ఈ విషయం అంతా ఊర్లోని జనాలకు, చుట్టుప్రక్కల గ్రామాలలోని జనాలకు తెలియడంతో... ఆ రోజునుంచి సురభయ్య ఇంటికి చుట్టాలు రావడం మానుకున్నారు. తాను వేసిన పథకం బాగా కలసిరావడంతో ఆనందంతో పండుగ చేసుకోసాగింది సూర్యకాంతమ్మ.

చిలుక-ఏనుగు:-

చాలా కాలం పంజరంలో ఉన్నాక ఒక చిలుకకు విసుగొచ్చింది. చాలా కష్టాలు పడ్డతరువాత అది పంజరంలోంచి తప్పించుకొని అడవికి చేరింది. అడవిలో దొరికే తియ్యని పండ్లు తింటూ, తన ఇష్టం వచ్చినట్లు చెట్లమీద గెంతుతూ కొన్నాళ్లు ఆనందంగా గడిపింది.
ఒక పెద్దచెట్టు కింద కాళ్ళు బోర్లాచాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది ఒకనాడు. ఆ వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది.
వెంటనే చెట్టుమీదనుండి రివ్వున కిందకి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది. చిలుక వాడియైన ముక్కు
మూపురంమీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్లు
విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది.

చిలుక చెట్టుమీదకి చేరి కిలకిలా నవ్వింది. ’ఏయ్ చిలకా! నా నిద్ర ఎందుకు పాడుచేశావ్?’ అంది ఏనుగు కోపంగా. ’ఊరికే’ అంటూ చిలుక మళ్ళీ నవ్వింది. చేసేది ఏమీ లేక ఏనుగు మళ్ళీ కళ్లు మూసుకుని పడుకుంది. కొంచెం సేపటి తరువాత చిలుక మళ్ళీ రివ్వుమని కిందికొచ్చి, ఏనుగు మూపురం మీద మరోసారి పొడిచి, వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చుంది. ఏనుగు నిద్ర మరోసారి చెడింది. ఈసారి ఏనుగు ’ఏయ్ చిలకా! నీకేం పనిలేదా?’ అంటూ కోపంగా ఘీంకరించింది. కానీ చిలుక మరో రెండుమూడు సార్లు అలాగే చేసింది. దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడినుంచి లేచి బయలుదేరింది.
చిలుకకు అది ఇంకా సరదా అనిపించింది. మరోసారి ఎగిరి ఏనుగు మూపురం మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టుమీద వాలింది. ఏనుగుకి కోపం ముంచుకొచ్చింది. చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోనికి దిగి తన తలా, మూపురం తప్ప మిగిలిన శరీరమంతా నీటిలో ముంచింది.
అది చూసిన చిలుకకు మరింత ఉత్సాహమనిపించింది. అది అనుకుంది, "ఆహా! నాకన్నా వెయ్యిరెట్లు బలమైన ఏనుగుకూడా నా
దెబ్బకు భయపడిపోయి, వెళ్ళి నీళ్ళలో దాక్కున్నది చూడు" అని. ’ఊ.... ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా’ అనుకొని అది రివ్వున ఎగిరి ఏనుగు మూపురం మీద వాలి దాన్ని
పొడవబోయింది. కానీ చిలుక అలాగే చేస్తుందని ముందుగా
ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని "ఉఫ్..." మంటూ చిలుక మీదికి చిమ్మింది. ఆ నీటి తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిన చిలుక, ఇక ఎగరలేక, ఆ చెరువులో పడి గిలగిలా
కొట్టుకున్నది. దయగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి దానిని ఒడ్డుమీదికి విసిరేసింది. చిలుకకు ఇక బుద్ధి వచ్చింది. తనను
క్షమించమని అది ఏనుగును వేడుకొన్నది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి, తన దారిన తను వెళ్ళిపోయింది. చిలుకకు పెద్దంతరం, చిన్నంతరం తెలిసింది.

దెబ్బకు దెబ్బ :-

అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్లో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకి కొద్దిపాటి పొలం, కొన్ని ఆవులు ఉండేవి. పంటలో కంటే పాలలోనే త్వరితమైన రాబడి ఉండటం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న. చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకిక తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు- కొట్టంలో చోటు లేదుమరి!
తన దగ్గరున్న ఆవులన్నింటిలోకీ అణకువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తున్నాడిప్పుడు సుబ్బన్న. ఆ ఆవు చాలా మంచిది. అది ఎంత మంచిదంటే, ఏ సమయంలోనైనా పాలిచ్చేది మంచిగా. దూడను వదలాల్సిన పనికూడా లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది.
సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది. రోజూ ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కూతతో వీధిలోని వారందర్నీ నిద్రలేపేది. ప్రతి రోజూ ఆ కోడిపుంజు కూసే మూడవ కూతకు సుబ్బన్న మేలుకొని, పాలు పిండటానికి కొట్టంలోకి పోయేవాడు. సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటామె- పిసినారి పుల్లమ్మ-కు ఒక దురాలోచన వచ్చింది: ఇక ఆమె రోజూ తొలి కోడి కూతకే మేలుకోవడం మొదలెట్టింది. లేచిన వెంటనే గబగబా సుబ్బన్న దొడ్లోకి పోయేది; కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలన్నీ చకచకా పిండేసుకొని, ఇంటికి పారిపోయేది.
పాపం, మూడో కోడికూతకు మేలుకొన్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే, బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు! కారణం అర్ధంకాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు ఓ నాలుగు రోజులు. ఇక లాభం లేదని, తానే స్వయంగా కాపలా ఉండి, ఒక రాత్రంతా మేలుకుని చూశాడు-మాయమవుతున్న ఆవుపాలన్నీ ఎటు పోతున్నాయో తెలుసుకునేందుకు.
కోడి కూసిందో లేదో, ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమైంది. అది నేరుగా ఆవు దగ్గరకే వెళ్ళి, ఆత్రంగా పాలన్నీ పిండుకున్నది. ఆపైన ఆ ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది. చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థం అయ్యింది. రోజూ పాలన్నీ పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు.

ఆ రోజునే కోడిపుంజుని తమ బంధువుల ఇంటికి పట్టించి పంపాడు. చీకటి పడుతుండగా తమ వీధిలోనే ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళి, అతని గాడిదను ఒక్క రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు. సుబ్బన్నయితే పశువులకు మంచి పచ్చిగడ్డి వేస్తాడు. గాడిదకు ఆ రాత్రి పండగేమరి. అందుకనే, 'ఒక్క రాత్రేమిటి? ఎన్ని రాత్రులైనా సరే, పట్టుకు పొమ్మ'న్నాడు పుల్లన్న.
ఇక సుబ్బన్న రోజూ కొట్టం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి, దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు. దొరక్క దొరక్క పచ్చిగడ్డి దొరకడంతో కడుపుబ్బేట్టుగా తిన్నది ఆ గాడిద. చీకట్లో ఎవరైనా చూస్తే, దాన్ని ఆవే అనుకుంటారు.
అన్నీ అమర్చిన తరువాత సుబ్బన్న ఒక మూలగా చోటు చూసుకుని హాయిగా నిద్ర పోయాడు.
ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కూయలేదు.
రోజూ సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి, "అయ్యో! చాలా ఆలస్యమైందే" అన్నట్లు, గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా 'ఆవు' దగ్గరికి పోయింది. ఆత్రంలో దాని ఆకారాన్నిగానీ, పరిమాణాన్ని గానీ గమనించకుండానే, పాలను పిండేందుకు కూర్చుంది. అలా కూర్చుందో లేదో ధబీమని ఒక గట్టి తన్ను శబ్దం, ఆ వెంటనే టంగుమన్న ఇత్తడి కుండ శబ్దం, 'అయ్యో'మన్న అరుపు వెలువడ్డాయి. బెదురుకున్న గాడిద పుల్లమ్మను మళ్ళీ మళ్ళీ తన్ని ఒళ్ళు హూనం చేసేసింది!
దొంగ దొరికిపోయింది. తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ ఒక వారం రోజులపాటు సుబ్బన్న గొడ్లకు ఉచితంగా చాకిరీ చేయవలసి వచ్చింది! దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేయించుకునేందుకు చాలా డబ్బులూ ఖర్చైనాయి!